BJP in Kerala

కేరళ స్థానిక ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన బిజెపి

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) భారీ విజయాన్ని నమోదు చేసింది. తిరువనంతపురం కార్పొరేషన్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించడం ద్వారా గత 45 ఏళ్లుగా కార్పొరేషన్ పై వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (LDF) ప్రాబల్యానికి తెరదించింది. కార్పొరేషన్‌లోని మొత్తం 101 వార్డులలో ఎన్డీయే 50 స్థానాలను గెలుచుకోగా, అధికార LDF 29 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) 19 స్థానాలను దక్కించుకోగా, ఇద్దరు స్వతంత్రులు విజయం సాధించారు. ఒక అభ్యర్థి మరణంతో ఒక వార్డులో పోలింగ్ రద్దయింది.

ఈ ఫలితం నగర రాజకీయాల్లో స్పష్టమైన మార్పును సూచిస్తోంది. కార్పొరేషన్ లో అధికారంలోకి రావడానికి NDA ఇప్పుడు సిద్ధంగా ఉంది. తిరువనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశి థరూర్ స్వస్థలం కావడంతో రాష్ట్ర రాజధానిలో బిజెపి సాధించిన ఈ విజయం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. త్రిపునితుర మున్సిపాలిటీని కూడా LDF నుంచి బిజెపి కైవసం చేసుకుంది. ఈ ఫలితాలు కేరళలో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బిజెపికి ఒక ప్రధాన ముందడుగుగా పరిగణించబడుతున్నాయి.

రాజధాని రాజకీయాల్లో భూకంపం 

తిరువనంతపురం కార్పొరేషన్‌ను బిజెపి గెలుచుకోవడం ఈ ఎన్నికలలో అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు. దశాబ్దాల LDF ఆధిపత్యానికి తెరపడటం పట్టణ ఓటర్ల ఆలోచనా విధానంలో వచ్చిన మార్పును స్పష్టం చేస్తోంది. ఈ ఫలితాలపై స్పందించిన ఎంపీ శశిథరూర్ కేరళ ప్రజాస్వామ్యానికి ఇది “అద్భుతమైన ఫలితాల” రోజని అభివర్ణించారు. UDF పనితీరును అభినందిస్తూనే, తిరువనంతపురంలో బిజెపి సాధించిన “చారిత్రాత్మక” విజయాన్ని ఆయన అంగీకరించారు. ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని, ప్రత్యర్థి పార్టీలకు అనుకూలంగా ఉన్నా ప్రజల తీర్పును గౌరవించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

త్రిపునితురలో LDFను వెనక్కి నెట్టిన NDA

ఎర్నాకుళం జిల్లాలోని త్రిపునితుర మున్సిపాలిటీలో 53 స్థానాలకు గాను NDA 21 స్థానాలను గెలుచుకుని స్వల్ప మెజారిటీ సాధించింది. LDF 20 స్థానాలతో రెండో స్థానంలో, UDF 12 స్థానాలతో మూడో స్థానంలో నిలిచాయి. త్రిపునితుర మున్సిపల్ కౌన్సిల్‌లో బిజెపి గెలవడం ఇదే తొలిసారి.

పాలక్కాడ్ ను నిలబెట్టుకున్న బిజెపి

పాలక్కాడ్ మున్సిపాలిటీలో NDA తన అధికారాన్ని నిలబెట్టుకుంది. బిజెపి 25 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలవగా, UDF 18, LDF 9 స్థానాలను గెలుచుకున్నాయి. కేరళలో బిజెపికి అత్యంత బలమైన మున్సిపల్ స్థావరం పాలక్కాడ్ అని ఈ ఫలితం మరోసారి నిరూపించింది. కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ 9, 11 తేదీలలో రెండు దశల్లో జరిగాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం మొత్తం 73.69 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల ఫలితాలు 2026లో జరగబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రధాని హర్షం 

ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ లో స్పందిస్తూ ఈ తీర్పును ‘అత్యంత కీలకమైనది’గా అభివర్ణించారు. ఇది బిజెపి కార్యకర్తల కృషి ఫలితమని అన్నారు. ”తిరువనంతపురంనకు ధన్యవాదాలు. తిరువనంతపురం కార్పొరేషన్ లో బిజెపి-NDAకు లభించిన తీర్పు కేరళ రాజకీయాల్లో ఒక మలుపు. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలను మా పార్టీ మాత్రమే నెరవేర్చగలదని ప్రజలు కచ్చితంగా అనుకుంటున్నారు. మా పార్టీ ఈ శక్తిమంతమైన నగరం ఎదుగుదలకు కృషి చేస్తుంది, ప్రజలకు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను (జీవన సౌలభ్యాన్ని) పెంచుతుంది” అని ఆయన ట్వీట్ చేశారు. ”ప్రజల మధ్య శ్రమించిన బిజెపి కార్యకర్తలందరి కి ఇవే నా కృతజ్ఞతలు.. ఈ రోజు కేరళలోని కార్యకర్తల తరాల కృషి, పోరాటాలను స్మరించుకునే రోజు, వారు అట్టడుగు స్థాయిలో పనిచేశారు, ఇది నేటి ఫలితాన్ని సాకారం చేసింది,” అని ఆయన అన్నారు.

కేరళ బిజెపి అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ తీర్పు ”వామపక్షాలకు ఆట ముగిసింది” అనే సందేశాన్ని ఇచ్చిందని అన్నారు. ”అభివృద్ధి చెందిన కేరళ మా లక్ష్యం. కేరళ బిజెపి స్పష్టమైన వృద్ధి పథంలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మా పనితీరు, మా ఓటు శాతాన్ని చూడండి. మేం 25 శాతం ఓట్ల వాటాను లక్ష్యంగా పెట్టుకున్నాం. కనీసం 20 శాతం దాటగలమని మేం విశ్వసిస్తున్నాం,” అని ఆయన చెప్పారు.