కిషన్ రెడ్డి సంక్రాంతి వేడుకల్లో మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంక్రాంతి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి జనవరి 13న దిల్లీ 6-అశోకారోడ్డులోని నివాసంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ప్రధాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయాన్ని అనుసరించి ఘనంగా నిర్వహించిన ఈ ఉత్సవాల కోసం విచ్చేసిన మోదీకి కిషన్ రెడ్డి దంపతులు, సినీనటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తదితరులు సాదర స్వాగతం పలికారు. పల్లె సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కళాకారులు తప్పెట మోతలతో ప్రధానిని స్వాగతించారు. ఆ తర్వాత వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా తులసికోటకు మోదీ పూజలు నిర్వహించి అనంతరం భోగిమంట వెలిగించారు. గంగిరెద్దులకు ఆహారం అందించి వాటికి, వాటిని ఆడించేవారికి సంప్రదాయ వస్త్రాలు బహూకరించారు. ఈ సందర్భంగా తనకు ముకుళిత హస్తాలతో నమస్కరించిన డప్పు కళాకారుల చేతులు పట్టుకొని ప్రధాని వారికి ప్రతి నమస్కారం చేశారు. అనంతరం వేదిక వద్దకు చేరుకొని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ప్రముఖ సినీనటుడు చిరంజీవి, ప్రఖ్యాత జీర్ణకోశ వైద్య నిపుణులు డాక్టర్ నాగేశ్వరరెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలతో కలిసి జ్యోతి వెలిగించి వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పండగ ప్రాధాన్యం, అన్నదాతలతో దీనికి ఉన్న బాంధవ్యాన్ని చాటిచెప్పేలా కళాకారులు చేసిన నృత్యప్రదర్శనను తిలకించారు.
‘‘నా మంత్రివర్గ సహచరుడు కిషన్‌రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి, పొంగల్ వేడుకలకు హాజరయ్యాను. అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని చూసి ఆనందించాను. భారతదేశం అంతటా ప్రజలు సంక్రాంతి, పొంగల్‌ను ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు. ఇది మన సంస్కృతి, వ్యవసాయ సంప్రదాయంలోనూ అంతర్భాగమైన కృతజ్ఞత, సమృద్ధి, పునరుద్ధరణల వేడుక. అందరికీ ఆనందం, మంచి ఆరోగ్యంతోపాటు, రాబోయే కాలం మరింత సుసంపన్నమైన పంట చేతికి అందాలని కోరుకుంటున్నాను’’ అని ప్రధాని తన ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పంటలు చేతికొచ్చే సమయంలో వివిధ రాష్ట్రాల్లో విభిన్న పేర్లతో మకర సంక్రాంతి జరుపుకోవడం సంతోషకరమని కేంద్ర మంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
వేడుకల సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ పండగకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకత ఉందన్నారు. విభిన్న కారణాలతో వలసవెళ్లిన ప్రజలంతా సొంత గ్రామాలకు వెళ్లి పాత జ్ఞాపకాలను నెమరేసుకొనే అద్భుతమైన అవకాశాన్ని ఇది కల్పిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, గజేంద్రసింగ్ షెకావత్, జ్యోతిరాదిత్య సింధియా, బండి సంజయ్ కుమార్, పెమ్మసాని చంద్రశేఖర్, ఎల్.మురుగన్, బిజెపి ఎంపీలు డా. కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గోడం నగేశ్, జనసేన ఎంపీ బాలశౌరితోపాటు దిల్లీ కేంద్రంగా పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ గాయకులు సునీత, మంగ్లీ ఆలపించిన భక్తిగీతాలు, తెలంగాణ జానపద కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, ఆలపించిన జానపద గేయాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. దిల్లీలో ఉండే తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.