కొలువుదీరిన మోదీ 3.0
‘‘మై… నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ…’’ అంటూ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 9న దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆహ్లాదభరిత వాతావరణంలో అట్టహాసంగా జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత దేశంలో వరసగా మూడోసారి ప్రధాని అయిన ఘనతను మోదీ సాధించారు. ప్రధాని తర్వాత 71 మంది కేంద్రమంత్రులు ప్రమాణం చేశారు. ఇందులో 30 మందికి క్యాబినెట్ హోదా దక్కింది. ఐదుగురు స్వతంత్ర హోదాలో సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు. రాత్రి 7.23 గంటలకు నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం 9.49 గంటలకు అస్సాం రాజ్యసభ సభ్యుడు పబిత్ర మార్గరీటా ప్రమాణంతో పూర్తయింది. క్యాబినెట్ మంత్రుల్లో ఇద్దరు, సహాయ మంత్రుల్లో ఐదుగురు కలిపి మొత్తం ఏడుగురు మహిళలకు అవకాశం కల్పించారు. ఏడుగురు ఎస్సీలు, ముగ్గురు ఎస్టీలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 14 మంది మంత్రులు ఇంగ్లిష్‌లో ప్రమాణం చేయగా, మిగిలినవారంతా హిందీలో చేశారు.
ఈసారి తెలంగాణ నుంచి ఇద్దరికి మంత్రిమండలిలో చోటు దక్కింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి పదవిని నిలబెట్టుకోగా, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కూ కేంద్రమంత్రిగా అవకాశం ఇచ్చారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాను క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, మనోహర్‌లాల్ ఖట్టర్‌లకు కొత్తగా చోటు దక్కింది. ఐదు మిత్ర పక్షాలకు ఒక్కో క్యాబినెట్ బెర్తు చొప్పున ఇచ్చారు. 81 మందికి అవకాశముండే కేంద్ర మంత్రివర్గంలోకి మోదీ ఒకేసారి 71 మందిని తీసుకున్నారు.
ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణం వేడుకకు ఏడు దేశాధినేతలు హాజరయ్యారు. వీరిలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవిండ్ కుమార్ జగన్నాథ్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మత్ అఫీఫ్ ఉన్నారు. ఈ దేశాలతో సంబంధాలు మరింత మెరుగుపడేందుకు వీరి రాక దోహదపడుతుందని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. మోదీ తొలిసారి ప్రధాని అయినప్పుడు సార్క్ దేశాధినేతలు హాజరయ్యారు. రెండోసారి అయినప్పుడు బిమ్స్‌టెక్ దేశాధినేతలు వచ్చారు. ఈసారి కొన్ని పొరుగుదేశాలు, హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాధినేతల్ని ఆహ్వానించారు. సమాజంలోని వివిధ వర్గాలవారిని, వందేభారత్ రైళ్లు నడిపిన లోకోపైలట్లు, సహాయ లోకోపైలట్లను, ట్రాన్స్‌జెండర్లను ఈ వేడుకకు ఆహ్వానించారు. హాజరైన సహాయ లోకోపైలట్లలో తెలుగువారైన నక్కా ప్రకాశ్ (ద.మ.రైల్వే సికింద్రాబాద్) ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న శ్రామికులు, మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల్ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతల స్వీకరణకు ముందు నరేంద్ర మోదీ దిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రీయ స్మృతిస్థల్ వద్ద నిర్మించిన సదైవ్ అటల్‌ను సందర్శించి భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీకి పుష్పాంజలి ఘటించారు. తర్వాత జాతీయ యుద్ధస్మారకం వద్దకు చేరుకొని అమరవీరులకు నివాళులర్పించారు.
పని చేసిన వారికి పదవులు: కిషన్ రెడ్డి
గంగాపురం కిషన్‌రెడ్డికి మరోసారి కేంద్రమంత్రి పదవి వరించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌కు చెందిన ఆయన మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. అవినీతి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ స్ఫూర్తితో బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృష్ణానది నుంచి గోదావరి నది వరకూ ‘తెలంగాణ పోరుయాత్ర’ నిర్వహించి 333 సమావేశాల్లో ప్రసంగించారు. మోదీ రెండో ప్రభుత్వంలో పనిచేసిన ఆయన ఇప్పుడు మూడో ప్రభుత్వంలోనూ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘బిజెపిలో పని చేసిన వారిలో తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఒకరికి మంత్రిపదవులు ఇచ్చినందుకు ప్రధానమంత్రి మోదీ, బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. కష్టపడి పనిచేసిన సాధారణ కార్యకర్తలకు పార్టీ మంత్రి పదవులు కట్టబెట్టింది. గల్లీలో పని చేసిన కార్యకర్తలను దిల్లీలో మంత్రులుగా చేసిన చరిత్ర బిజెపికు తప్ప దేశంలో మరే రాజకీయ పార్టీకి లేదు. గత పదేళ్లు ఎలా పనిచేశామో వచ్చే 5 ఏళ్లు అలాగే పనిచేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూ.చ.తప్పకుండా అమలు చేస్తాం. తెలుగురాష్ట్రాల అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తాం. నాకు ఇంతటి విజయాన్ని చేకూర్చిపెట్టిన సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఓటర్లు, కార్యకర్తలకు ధన్యవాదాలు’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తా: బండి సంజయ్
సామాన్య కార్యకర్తగా బిజెపిలో పని చేసిన బండి సంజయ్ కుమార్ ఇంతింతై అన్నట్లుగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎదిగి ఇప్పుడు కేంద్రమంత్రి అయ్యారు. ఆయన స్వస్థలం కరీంనగర్. స్థానిక శిశుమందిర్‌లో విద్యాభ్యాసం చేశారు. విద్యార్థి దశ నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో స్వయం సేవకుడిగా పని చేశారు. 2019లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు. తరువాత బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీకి తెలంగాణ వ్యాప్తంగా ఊపు తీసుకొచ్చారు. ప్రస్తుతం బిజెపిలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తూ.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలిచారు. కేంద్ర సహాయ మంత్రి పదవిని దక్కించుకున్నారు.
కేంద్ర మంత్రిగా పని చేసేందుకు వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం వినియోగిస్తానని బండి సంజయ్ చెప్పారు. ‘‘నాపై నమ్మకం ఉంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి, జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు. నాకు లభించిన మంత్రి పదవి కార్యకర్తల కృషి ఫలితమే. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకం ఉంచి రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించినందువల్లే ఈ అవకాశం లభించింది. ఎప్పటికీ వారికి రుణపడి ఉంటా. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేదొక్కటే. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలను పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుతున్నా. కేంద్ర మంత్రిగా రాష్ట్రాభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలందించేందుకు సిద్ధంగా ఉన్నా. అలాగే తెలంగాణ ప్రజలు బిజెపిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం’’ అని సంజయ్ తెలిపారు.