లిక్కర్ స్కాం అవినీతిని నిరూపిస్తా… దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలి: కిషన్ రెడ్డి
లిక్కర్ స్కాంలో దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కావడాన్ని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చీకటి రోజుగా ప్రకటించడం గురువింద గింజ సామెతను గుర్తు చేస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చెప్పినట్లుగా నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజేనని…. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు లిక్కర్ వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజేనంటూ చురకలంటించారు. ‘‘ఆప్ ప్రభుత్వం లిక్కర్ విషయంలో వందల కోట్ల అవినీతికి పాల్పడిందని నేను నిరూపిస్తాను… అది తప్పని కేసీఆర్ నిరూపిస్తారా..? ప్రెస్ క్లబ్, అమరవీరుల స్థూపం దగ్గరకి చర్చించడానికి కేసీఆర్ సిద్ధమా..?’’ అంటే సవాల్ విసిరారు. కవితను దృష్టిలో పెట్టుకొని దిల్లీలో లిక్కర్ కుంభకోణం దర్యాప్తు జరగలేదని, దిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల ఫిర్యాదు మేరకే లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు జరుగుతోందని అన్నారు. మార్చ్ 23న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘దిల్లీలో తీగ లాగితే తెలంగాణలో డొంక కదిలినట్లు లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పేరు బయటపడింది. దిల్లీలో కేజ్రీవాల్ లిక్కర్ పాలసీలో మార్పు చేస్తున్నపుడు .. ఆ పాలసీకి కేసీఆర్ కుమార్తె కవిత పూర్తిగా సహకరించారు. ఆ పాలసీ వెనకాల కవిత హస్తమున్నట్లు సీబీఐ గుర్తించి ఈడీకి విచారణ కోసం ఆదేశిస్తే వ్యవహారం బయటపడింది. కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐ, ఈడీ దర్యాప్తులకు ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేదని పదే పదే చెప్తున్నప్పటికి బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, మమతా బెనర్జీ లాంటి వారు బిజెపిని విమర్శిస్తున్నారు. కవిత, కేజ్రీవాల్ చేసిన అవినీతి కుంభకోణాలను విచారణ జరపకుండా విడిచిపెట్టమంటారా? అని కేసీఆర్ ను అడుగుతున్నాం. కుటుంబాలను అడ్డం పెట్టుకొని, వారసత్వ రాజకీయాలకు పాల్పడడం… అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని అక్రమంగా దోపిడీ చేయడం నిజంగా బ్లాక్ డేనే. కవితను అరెస్టు చేస్తే స్పందించని కేసీఆర్… కేజ్రీవాల్ ను అరెస్టు చేయగానే ఎందుకు స్పందించారో చెప్పాలి. దర్యాప్తు సంస్థల ముందు అందరూ ఒక్కటే అని కేసీఆర్ కు తెలియదా?
కేసీఆర్ పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ పేరుతో మద్యాన్ని ఏరులై పాలించి, తద్వారా సంక్షేమం పేరుతో ప్రజల ఓట్లు దండుకునే కార్యక్రమం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన ఓపెన్ బార్లు, బెల్ట్ షాపులను తొలగిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తొలగించడం లేదు..? బస్తీల్లో వైన్ షాపులు, ఓపెన్ బార్ల కారణంగా మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మద్యం వ్యాపారంలో వేల కోట్లు సంపాదించడమే లక్ష్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పని చేస్తున్నాయి. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు మద్యం ద్వారా రాష్ట్ర ఆదాయం రూ. 4000 కోట్లు ఉంటే.. 2023లో ఆ పార్టీ అధికారం కోల్పోయే నాటికి రూ.44 వేల కోట్లకు పెరిగింది. ఇదే లిక్కర్ బిజినెస్ మోడల్ అని ఆప్ ప్రభుత్వానికి బదిలీ చేశారు. తెలంగాణలో దోచుకున్నట్లే దిల్లీలో దోచుకోవాలని చూసిన బీఆర్ఎస్ కుటుంబసభ్యుల కుట్ర బయటపడింది. దిల్లీ లిక్కర్ వ్యాపారంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎందుకు భాగస్వామ్యం అయ్యారో సమాధానం చెప్పాలి. దర్యాప్తు సంస్థలు కేజ్రీవాల్, కవితకు అనేక సార్లు నోటీసులు ఇస్తే తప్పించుకుని తిరిగి, సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు. దిల్లీలో జరిగిన ఈ లిక్కర్ కుంభకోణానికి, బీఆర్ఎస్ పార్టీకి గాని, కేసీఆర్ కుటుంబానికి గాని ఏం సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా….? చెప్పడానికి దమ్ముందా….? కవిత అరెస్టు తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాజకీయాలకు, భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. లిక్కర్ కుంభకోణం విషయంలో మాత్రమే కవితను అరెస్టు చేశారు. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుందని కేసీఆర్ చెప్పినట్లు.. బీఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్ విధానాన్ని ఆచరించింది, కేజ్రీవాల్ అనుసరించారు.
కేజ్రీవాల్ అరెస్టుపై కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే అవినీతి, కుంభకోణాల పార్టీ. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు..? రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి నన్ను చాలెంజ్ చేశారు. అమిత్ షా అపాయింట్ మెంట్ ఇప్పించాలని.. తన దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన సాక్ష్యాదారాలు అన్నీ ఉన్నాయని… సీబీఐ దర్యాప్తులో అవినీతి నిరూపిస్తానని.. నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మరి ఇప్పుడు సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయడం లేదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు కోరినట్లుగా ఇప్పుడు సీబీఐ దర్యాప్తుకు మీరు ఆదేశిస్తే.. 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభిస్తది. మమ్మల్ని దమ్ముందా అని అడిగిన రేవంత్ రెడ్డికే ఇప్పుడు దమ్ము వచ్చింది. అధికారంలో ఉన్నది మీరే కదా..! సీబీఐ దర్యాప్తు చేయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై తక్షణమే సీబీఐ దర్యాప్తుకు ఇవ్వండి. అవినీతిని నిరూపించండి. లేకపోతే మీరు అన్నమాట మీద నిలబడండి.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100రోజులు మాటలతోనే గడిపింది. బీఆర్ఎస్ చేసిన అవినీతిని, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను మాటలతోనే సరిపెడుతున్నరు. హైదరాబాద్ చుట్టు ప్రక్కల లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా అక్రమార్కులకు అప్పజెప్పారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడెందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు జరిపించడం లేదు..? బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. సెటిల్ మెంట్ రాజకీయాలు చేస్తున్నరు. దిల్లీకి వెళ్లి ఆర్.జి ట్యాక్స్ పేరు మీద డబ్బులు ఇచ్చి రండి అని పంపిస్తున్నరు. కంపెనీలను, బిల్డర్లను, క్రాంటాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసి కాంగ్రెస్ అధిష్టానానికి పంపిస్తున్నరు. కాంగ్రెస్ కు ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలు భరిస్తున్నరు. రాహుల్ గాంధీ మనుషులు హైదరాబాద్ లో కూర్చొని ఆర్.జి ట్యాక్స్ పేరుతో వసూళ్లు చేస్తున్నరు.’’ అని అన్నారు.