మజ్లిస్ ఎజెండాతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్
ఎంఐఎం చేతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కీలుబొమ్మలు, మజ్లిస్ ఎజెండాతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పని చేస్తున్నాయని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కుటుంబ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ లది అవినీతి చరిత్ర అని.. వారి పాలనంతా కుంభకోణాలమయమేనని ఆరోపించారు. అవి ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తాయని, బిజెపి ఎప్పుడూ అలాంటి రాజకీయాలు చేయదని చెప్పారు. ఆ మూడు పార్టీల జెండాలు వేరైనా.. ఎజెండా ఒక్కటేనని స్పష్టం చేశారు. వారి కుటుంబాల అభివృద్ధి కోసం ఎంతటి అవినీతికైనా పాల్పడుతాయన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయేకు 400 సీట్లు దాటతాయని, అందులో, తెలంగాణ నుంచి 12కు పైగా ఉండాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయి.. కానీ, ప్రధాని మోదీపై ఎలాంటి అవినీతి మరక లేదన్నారు. మోదీని మూడోసారి ప్రధానిగా చూడాలని ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)తో దేశంలోని ఏ ఒక్కరి పౌరసత్వం పోదని స్పష్టం చేశారు. మార్చ్ 12న తెలంగాణలో పర్యటించిన అమిత్ షా హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనం, సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో బిజెపి సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాయంత్రం ఎలక్షన్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
వారికి కుటుంబ ప్రయోజనాలే ముఖ్యం
‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్.. మూడూ కుటుంబ పార్టీలే. వారసత్వ రాజకీయాలే వాటి లక్ష్యం. కాంగ్రెస్‌లో నెహ్రూ నుంచి మొదలుపెడితే ఆ కుటుంబ సభ్యులే అధికారంలో ఉంటూ వచ్చారు. పదేళ్ల కాలంలో తెలంగాణలో బీఆర్ఎస్ లో కూడా అదే తీరు కొనసాగింది. ఆ పార్టీల జెండాలు వేరైనా.. ఎజెండా ఒక్కటే. ఆ నేతలకు వారి వారసులు, కుటుంబ సభ్యుల ప్రయోజనాలే ముఖ్యం తప్ప రాష్ట్ర, దేశాభివృద్ధి వారి ఎజెండాలో ఉండదు. సీఏఏ హామీని బిజెపి ప్రభుత్వం నెరవేరుస్తోంది. దాన్ని కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ లు వ్యతిరేకిస్తున్నాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి వచ్చిన హిందు, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ సోదర సోదరీమణులకు పౌరసత్వం ఇవ్వొద్దా? వారికి దేశ పౌరసత్వం ఇచ్చి సగౌరవంగా జీవించేలా చేస్తుంటే దాన్ని కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ఎంఐఎం నేత ఒవైసీ తప్పు పడుతున్నారు. దేశంలోని మైనార్టీలకు ఒక అంశం స్పష్టంగా చెబుతున్నా. సీఏఏతో దేశంలో ఏ పౌరుడి పౌరసత్వం రద్దు కాదు. సీఏఏలో అలాంటి అవకాశమే లేదు. ఎంఐఎం చేతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కీలుబొమ్మలు. మజ్లిస్ ఎజెండాతోనే అవి పని చేస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్‌లు.. నిజాం పాలన నీడ నుంచి తెలంగాణను విముక్తి చేయగలుగుతాయా? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏం చేసింది? మజ్లిస్‌ను బుజ్జగించే క్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేను తాత్కాలిక స్పీకర్‌గా చేసింది. త్వరలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతల అవినీతి చిట్టా పంపిస్తా. దానిపై సమాధానం చెప్పిన తర్వాతే బిజెపిపై విమర్శలు చేయాలి. నేను చెప్పేది తప్పయితే రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి సమాధానం చెప్పాలి? కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, 2జీ కుంభకోణం, శారదా చిట్‌ఫండ్, ఎయిర్‌సెల్-మాక్సిస్, యాంత్రిక్స్, జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్, ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలు కుంభకోణం, బోఫోర్స్ కుంభకోణం జరగలేదా? కాంగ్రెస్ రూ.12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది. బీఆర్ఎస్ పాలన కూడా అవినీతిమయమే. రూ.4 వేల కోట్ల మియాపూర్ భూకుంభకోణం, ఓఆర్‌ఆర్ కుంభకోణం, రూ.40 వేల కోట్ల కాళేశ్వరం కుంభకోణం, మద్యం కుంభకోణం.. ఇలా చెబుతూ పోతే అనేకం ఉన్నాయి. రూ.వేల కోట్ల అవినీతికి, కుంభకోణాలకు పాల్పడే పార్టీలు దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాయా? సీఎంగా, ప్రధానిగా 23 ఏళ్ల పాలనలో నరేంద్ర మోదీపై ప్రత్యర్థులు 25 పైసల అవినీతి ఆరోపణలు కూడా చేయలేకపోయారు. అవినీతి రహిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా ఆయన పదేళ్లుగా సుస్థిర పరిపాలన అందిస్తున్నారు.
తెలంగాణ అభివృద్ధి మా లక్ష్యం
తెలంగాణ అభివృద్ధి.. ప్రజల సంక్షేమమే మా లక్ష్యం. మోదీ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చింది. రైల్వే, మెట్రో, జాతీయ రహదారులు, పెట్రోలియం, విమానయాన సంస్థలు, ప్రాజెక్టుల ద్వారా మరో రూ.5 లక్షల కోట్లను అభివృద్ధికి వెచ్చించింది. బిజెపి కార్యక్రమాలు, విజయాల సమాచారాన్ని ప్రతి ఇంటికీ సామాజిక మాధ్యమాలు చేర్చాలి. పార్టీపై తప్పుడు ప్రచారం జరిగితే ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళ్లాలి. సంపూర్ణ అభివృద్ధి సాధించిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దే క్రతువులో కార్యకర్తలంతా భాగస్వాములు కావాలి. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఒక్క హామీని నెరవేర్చలేదు. లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయలేదు. 40 లక్షల మంది విద్యార్థులకు ఉచిత విద్య, 7 లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పి నెరవేర్చలేదు. ఇక పేదరిక నిర్మూలన పేరుతో కాంగ్రెస్ కాలయాపన తప్ప.. ఆ దిశగా ఏమీ చేయలేదు. ఇచ్చిన ప్రతి హామీని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నెరవేర్చింది. ప్రతి పేదవాడికి నెలకు ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తోంది. 14 కోట్ల ఇళ్లకు రక్షిత మంచినీరు, 10 కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, 12 కోట్ల మరుగుదొడ్లు, 4 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు ఏటా ప్రతి రైతుకు రూ.ఆరు వేలు ఇస్తోంది. ఆర్టికల్ 370ని రద్దు చేశాం. ఇప్పుడు శ్రీనగర్ లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. అయోధ్యలో రామమందిరం నిర్మించాం. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశాం. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాం. పదేళ్ల కిత్రం వరకు కాంగ్రెస్ పాలనలో ప్రతిరోజు ఉగ్రవాదులు దాడులు చేసి పాకిస్థాన్‌కు వెళ్లిపోయేవారు. మోదీ ప్రభుత్వం రాగానే పరిస్థితి మార్చాం. సర్జికల్, ఎయిర్ స్ట్రైక్‌లతో పాకిస్థాన్‌లోకి వెళ్లి మరీ ఉగ్రవాదులను తుదముట్టించిన ఘనత మోదీ ప్రభుత్వానిది. జీ-20, చంద్రయాన్‌తో ప్రపంచ దేశాల్లో దేశ ప్రతిష్ఠ ఇనుమడించింది. 14 దేశాలు ఆయా దేశాల అతున్నత పౌర పురస్కారాలను మోదీకి ఇచ్చాయి. ఇది ఆయనకే కాదు.. భారతీయులందరికీ దక్కిన గౌరవం’’ అని అమిత్‌షా పేర్కొన్నారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ టాక్స్: కిషన్ రెడ్డి
‘‘తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంది. ప్రజలను దగా చేసింది. అహంకారపూరితంగా వ్యవహరించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారులు, పారిశ్రామికవేత్తల నుంచి ఆ పార్టీ రాహుల్‌గాంధీ ట్యాక్స్ వసూల్లు చేస్తోంది. రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడినట్లయ్యింది’’ అని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలు ధర్మయుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విదేశాల్లో బలవంతపు మత మార్పిడుల ఒత్తిళ్లకు గురై భారతదేశానికి వలసవచ్చిన హిందువులు, సిక్కులు, ఇతర మతాల ప్రజలకు అండగా ఉండకూడదా? హిందువులకు భారత్ కాకుంటే మరి ఏ దేశం అండగా ఉంటుందని ప్రశ్నించారు. ఏ మతానికీ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వ్యతిరేకం కాదని.. దానిపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు. హైదరాబాద్‌లోని పేద ప్రజలు మజ్లిస్ పీడ విరగడ కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో నిర్వహించిన బిజెపి సోషల్ మీడియా ఇన్‌ఛార్జుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న 17 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకునే లక్ష్యంతో ప్రతి కార్యకర్త పనిచేయాలని.. సామాజిక మాధ్యమాల ద్వారా పూర్తి సహకారం అందించాలని కోరారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ మాట తప్పిందని, ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.
బరాబర్ రాముడి పేరిట ఓట్లడుగుతాం: బండి సంజయ్
‘‘జై శ్రీరామ్ అంటుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్లు గజగజ వణుకుతున్నాయి. రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నామని ఆ పార్టీలు విమర్శిస్తున్నాయి. మేం రాముడి పేరు చెప్పి బరాబర్ ఓట్లు అడుగుతాం’’అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పష్టం చేశారు. రామమందిర నిర్మాణంలో బిజెపి కార్యకర్తలు క్రియాశీల పాత్ర పోషించడం వల్ల రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు దమ్ముంటే బాబర్ పేరు చెప్పి ఓట్లు అడగాలన్నారు.
రోహింగ్యాలను తరిమికొడతాం: కె.లక్ష్మణ్
దేశంలో అసాధ్యమనుకున్న పనులను సుసాధ్యం చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రోహింగ్యాల అండ చూసుకుని మజ్లిస్ పెత్తనం చేస్తోందని.. సీఏఏ అమలు తర్వాత వారిని తరిమికొడతామని చెప్పారు.
ఈ కార్యక్రమాల్లో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, రాష్ట్ర నేతలు ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఎంపీలు డి.అర్వింద్, రాములు, బి.బి.పాటిల్, శాసనసభాపక్షనేత మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల విడుదలైన హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, హిరో తేజ సజ్జ అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు.