మంత్రుల తొలగింపు బిల్లుతో జైళ్ళ నుంచి పాలనకు చెల్లు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో రాజ్యాంగ (130వ సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు, ఈ చర్యను కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ వంటివి తీవ్రంగా వ్యతిరేకించాయి. ఏదేమైనా, ఈ బిల్లు భారత రాజకీయాల్లో ఉన్నత ప్రమాణాలపై ఆశలను తిరిగి చిగురింపచేసింది. పదాల విషయంలో చిన్నది, సరళమైనది అయినప్పటికీ, ప్రభావం విషయంలో ఇది చారిత్రాత్మకమైనది, లోతైనది. తీవ్రమైన నేరాలకు సంబంధించి ఒక మంత్రిని అరెస్టు చేసి వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంచితే, అతను లేదా ఆమె విడుదల అయ్యే వరకు పదవి నుంచి తొలగించడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది.
అవినీతి, నేరాలు లేని రాజకీయ నాయకత్వం కోసం దేశ సమష్టి సంకల్పాన్ని, ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతను ఈ బిల్లు ప్రతిబింబిస్తుంది. తన పదవీకాలం ప్రారంభం నుండి ప్రధాని మోదీ “నా ఖావుంగా, నా ఖానే దూంగా” (నేను తినను, ఇతరులను తిననివ్వను) అనే ప్రకటనతో జవాబుదారీతనం, సమగ్రతల పట్ల తన నిబద్ధతను ప్రకటించారు. 130వ సవరణ ఆ వాగ్దానపు కొనసాగింపు. అధికారంలో ఉన్న ఏ వ్యక్తి అయినా తీవ్రమైన న్యాయ పరిశీలనను ఎదుర్కొంటున్నప్పుడు ప్రభుత్వ పదవిని కవచంగా దుర్వినియోగం చేయకూడదు. నాయకత్వం స్వచ్ఛంగా ఉండాలి, రాజీ పడకూడదు, పాలన అత్యున్నత నైతిక ప్రమాణాలను ప్రతిబింబించాలనే సూత్రాన్ని ఈ చట్టం వ్యవస్థాగతం చేస్తుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో కొత్త పాలనా సూత్రం ఏమిటంటే, ప్రభుత్వాన్ని జైలు నుండి నడపలేం. శిక్ష పడే వరకు జవాబుదారీతనాన్ని వాయిదా వేయడానికి వీల్లేదు.
పాలనలో రాజ్యాంగ నైతికత ఆవశ్యకతను నొక్కిచెప్పిన భారత రాజ్యాంగ రూపకర్తలు ఆశించిన విధంగా రాజకీయ వ్యవస్థలో రాజ్యాంగ నైతికత, ప్రజల విశ్వాసం, జవాబుదారీతనాన్ని పునరుద్ధరించే దిశలో ఈ బిల్లు ఒక ముందంజ. రాజ్యాంగ పరిషత్తు చర్చల సందర్భంగా డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ భారతదేశంలో ప్రజాస్వామ్యం కేవలం రాజ్యాంగ నిబంధనలపై మాత్రమే కాకుండా పదవిలో ఉన్నవారి నైతిక విలువలపై ఆధారపడి ఉంటుందని హెచ్చరించారు: “రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని అమలు చేసేవారు చెడ్డవారు అయితే అది కూడా చెడుగా మారుతుంది. అదేవిధంగా రాజ్యాంగం ఎంత చెడ్డదైనా, దాన్ని అమలు చేసేవారు మంచివారు అయితే అది మంచిది అవుతుంది. రాజ్యాంగం పనితీరు పూర్తిగా రాజ్యాంగ స్వభావంపై ఆధారపడి ఉండదు.” మంత్రులు గౌరవప్రదమైన వ్యక్తులుగా ఉండాలని, నిజాయితీ, ఔచిత్యానికి అత్యున్నత ప్రమాణాలను నిర్దేశించాలని గుర్తుంచుకోవాలి. వారు సాధారణ పౌరులు కాదు. వారు మన దేశం సమష్టి సంకల్పానికి ప్రాతినిధ్యం వహిస్తారు, మన విశ్వాసానికి అత్యున్నత కార్యనిర్వాహక ప్రతీకలు. ఇలాంటి మంత్రులు ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంటే ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసం కోలుకోలేని విధంగా దెబ్బతింటుంది. ప్రభుత్వాలను జైలు నుంచి నడపకుండా ఈ బిల్లు చూస్తుంది. వ్యక్తిగత సంపదకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తులకు కాక నిష్కళంకులైన నాయకులు భారత్ కు కావాలి. రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షిస్తామని మంత్రి ప్రమాణం చేస్తారు. అటువంటి మంత్రిని నిర్బంధంలో ఉంచినప్పుడు, తీవ్రమైన అభియోగాలు న్యాయవ్యవస్థ పరిశీలనలో ఉన్నాయని అర్థం. ఈ కాలంలో పదవిలో కొనసాగడం చట్టాల నుంచి వారికి వ్యక్తిగత రక్షణ, ప్రజా ప్రతినిధులుగా వారు నిర్వర్తించాల్సిన విధుల మధ్య సంఘర్షణను సృష్టిస్తుంది.
సాధారణ ప్రభుత్వ ఉద్యోగులను ఒకసారి 48 గంటలకు పైగా నిర్బంధంలో ఉంచితే విధుల నుంచి సస్పెండ్ చేస్తారు. అలాంటప్పుడు అంతకంటే ఎక్కువ అధికారం ఉన్న మంత్రులను ఎందుకు భిన్నంగా చూడాలి? జవాబుదారీతనం అంటే నిర్దోషిత్వం రుజువయ్యే వరకు పక్కకు తప్పుకోవడం. ఈ బిల్లు కేవలం ఔచిత్యానికి సంబంధించి పాటించాల్సిన క్రమశిక్షణను మాత్రమే అమలు చేస్తుంది. జవాబుదారీతనం విషయంలో బిజెపి ఎల్లప్పుడూ ఉన్నత ప్రమాణాలను నెలకొల్పింది. అధికారం కంటే నైతికతకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకులు చరిత్రలో ఎంతోమంది కనిపిస్తారు. కాంగ్రెస్ హయాంలో అమిత్ షాను లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజకీయ వేధింపులు ఎదురైనా ఒక అభియోగంపై ప్రశ్నించడానికి పిలవగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అలా చేయడం ద్వారా ఆయన ఉన్నతమైన నైతిక ప్రమాణాలను నెలకొల్పారు. అనంతరం న్యాయస్థానాలు ఆయనను నిర్దోషిగా ప్రకటించాయి. అదేవిధంగా జైన్ హవాలా కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న లాల్ కృష్ణ అద్వానీ తన నిర్దోషిత్వం రుజువయ్యే వరకు ఎంపీ పదవి నుంచి వైదొలిగారు. ‘నిర్దోషిగా నిరూపితమయ్యే వరకు నేను తిరిగి రాను’ అనే ఆయన ప్రకటన ఇప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంది. దీన్ని నేటి రాజకీయ నాయకుల వ్యవహార శైలితో పోల్చండి. జైలును రాజకీయ కార్యాలయంగా మార్చి అరవింద్ కేజ్రీవాల్ ఆరు నెలల పాటు జైలు నుంచే తన ప్రభుత్వాన్ని నడిపారు. కేజ్రీవాల్ క్యాబినెట్ లో శిక్ష అనుభవిస్తున్న మంత్రి సత్యేంద్ర జైన్ ను తొలగించాలని దాఖలైన పిటిషన్ ను విచారించిన దిల్లీ హైకోర్టు.. “మంచి వ్యక్తులే సుపరిపాలన అందిస్తారు. ఏది మంచో ఏది చెడో కోర్టు నిర్ణయించకపోయినా, మన రాజ్యాంగ విలువలను పరిరక్షించాలని, ప్రోత్సహించాలని రాజ్యాంగబద్ధంగా ఎన్నికయి పదవులు నిర్వహిస్తున్న వ్యక్తులకు గుర్తు చేస్తుంది. ముఖ్యమంత్రి ఇటువంటి రాజ్యాంగ సూత్రాల ప్రకారమే నడుచుకుంటారని ఆశిస్తాం,” అని వ్యాఖ్యానించింది.
మరో ఉదాహరణ డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ అవినీతి కేసులో కస్టడీలో ఉన్నప్పటికీ రాజీనామా చేయడానికి నిరాకరించారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలపై కోర్టు విచారణను ఎదుర్కొంటూ కూడా ఆయన పదవిలో కొనసాగడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ చర్యను సహించేది లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్ ఓకా అన్నారు. “స్వేచ్ఛ లేదా పదవి. ఈ రెండింటిలో ఒకదాన్ని ఆయన ఎంచుకోవాలి. మంత్రిగా ఈ నేరంలో ఆయన పాత్ర ఉందని మేం ఇంతకుముందు ఇచ్చిన తీర్పులో పేర్కొన్నాం. దాన్ని మేం విస్మరించగలమా? ఈ విషయంలో మౌనం వహిస్తే మేం ఏమి సంకేతాలు పంపినట్టు అవుతుంది?” అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అధికారంలో ఉన్న వ్యక్తులు అరెస్టయినప్పుడు వ్యవహరించాల్సిన తీరుపై ఒక చట్టపరమైన నియమావళి తక్షణమే అవసరమన్న వాస్తవాన్ని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. నైతికతను వ్యక్తిగత ఇష్టానికి వదిలేయకుండా రాజ్యాంగ బద్ధమైన ఆదేశంగా ఈ బిల్లు చేస్తుంది. ప్రభుత్వ పదవుల్లో ఉన్న రాజ్యాంగబద్ధ, ఎన్నికైన మంత్రుల నిర్బంధం, అరెస్టు సందర్భాల్లో వారితో ఎలా వ్యవహరించాలనే దానిపై చట్టాల్లో నిర్దిష్టమైన నిబంధనలు లేవని స్పష్టమవుతోంది. ఈ లోటును భర్తీ చేయాల్సిన ఆవశ్యకతపై సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. అందువల్ల ఈ సవరణ ఇప్పుడు అవసరం. న్యాయస్థానాలు వ్యక్తం చేసిన ఆందోళనలకు ఈ బిల్లు పరిష్కారాలు చూపిస్తుంది.
నేర రాజకీయాలు భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న తీవ్రమైన ముప్పుల్లో ఒకటి. ఈ బిల్లు వాటి నుంచి సమర్థవంతమైన రక్షణ కల్పిస్తుంది. చాలా మంది శాసనసభ్యులు అవినీతి మొదలుకొని వ్యవస్థీకృత నేరాల వరకు తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. 30 రోజుల కస్టడీ నిబంధనను ప్రవేశపెట్టడం ద్వారా, చిన్నచిన్న నేరాలపై అరెస్టులు, నిజమైన న్యాయ పరిశీలన మధ్య సమతుల్యతను సాధించడానికి ఈ బిల్లు ప్రయత్నిస్తుంది. ఒక నిందితుడు సుదీర్ఘంగా జ్యుడీషియల్ కస్టడీలో ఉండటం మామూలు విషయం కాదు. అంటే అరెస్టుకు న్యాయవ్యవస్థ బలమైన కారణాలను కనుగొందన్నమాట. అందువల్ల, ప్రజాస్వామ్య ప్రాతినిధ్యానికి భంగం కలగకుండా రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి ఈ చట్టం సహాయపడుతుంది.
ఈ బిల్లును బిజెపి ప్రభుత్వం గాలి నుంచి సృష్టించలేదు. రాజ్యాంగంలోని అధికరణం 75(1బీ), 164(1బీ) ప్రకారం ఫిరాయింపుదారులను మంత్రి పదవి నుంచి అనర్హులుగా ప్రకటిస్తారు. అధికరణం 102, 191 ప్రకారం నేర నిర్ధారణ జరిగిన ఎంపీలు/ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది. మనోజ్ నరులా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2014) కేసులో సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించింది, “… మంత్రిమండలిలో ఒక మంత్రి నిర్వహించే పాత్ర, వారు చేసే ప్రమాణం పవిత్రతల దృష్ట్యా, అలాగే ప్రజలు తనపై ఉంచిన నమ్మకం విశ్వాసాల దృష్ట్యా ఘోరమైన లేదా తీవ్రమైన క్రిమినల్ నేరాలు లేదా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరచరిత్ర కలిగిన వ్యక్తిని మంత్రిగా ప్రధాన మంత్రి ఎంపిక చేయరని న్యాయబద్ధంగా ఆశించవచ్చు. రాజ్యాంగం సూచించేది, ప్రధానమంత్రి నుంచి రాజ్యాంగం ఆశించేది ఇదే. మిగతాది ప్రధాని విజ్ఞతకే వదిలేయాలి. మేం ఎక్కువ ఏమీ చెప్పం, తక్కువ ఏమీ చెప్పలేం.” 130వ సవరణ సరిగ్గా ఇదే చేస్తుంది: ఇది అరెస్టు, శిక్ష మధ్య చట్టపరమైన శూన్యతను భర్తీ చేస్తుంది. రాజ్యాంగ ఔచిత్య సిద్ధాంతాన్ని సమర్థిస్తుంది. ఈ బిల్లు కఠినంగా ఉందని విమర్శకులు వాదిస్తున్నారు. కానీ నిశితంగా పరిశీలిస్తే దీనికి భిన్నంగా కనిపిస్తుంది. ఈ నిబంధన తాత్కాలిక తొలగింపును మాత్రమే నిర్దేశిస్తుంది. విడుదలైన తర్వాత మంత్రిని తిరిగి నియమించే అవకాశం ఉంది. నిర్దోషి అనే భావన కూడా చెక్కుచెదరకుండా ఉంది. ఈ విధంగా, ఈ బిల్లు వ్యక్తిగత హక్కులు, ప్రజా ప్రయోజనాల మధ్య సమతుల్యతను సాధిస్తుంది. వ్యక్తిగత న్యాయ పోరాటాలతో పాలన స్తంభించకుండా చూస్తుంది. ప్రజాస్వామ్యాలను కేవలం ఎన్నికల ద్వారానే కాకుండా వాటి వ్యవస్థల సమగ్రతను బట్టి నిర్ణయిస్తారు. “ముఖ్యమంత్రి జైలు నుండి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు” అనే శీర్షికలు భారతదేశ ప్రతిష్ఠను నీరుగారుస్తాయి. ఈ చట్టాన్ని అమలు చేయడం ద్వారా, భారతదేశం ఒక బలమైన సందేశాన్ని పంపుతుంది: పరిపాలన అనేది ఒక పవిత్రమైన విశ్వాసం, అంతేగాని తప్పు చేసేవారికి కవచం కాదు. ప్రజాజీవితంలో నిజాయితీకి కట్టుబడి ఉన్న దేశంగా భారతదేశ ప్రజాస్వామిక ఖ్యాతిని ఇది పెంచుతుంది. ఈ నిబంధనను రాజకీయంగా దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రత్యర్థులు వాదిస్తున్నారు. కానీ ఈ వాదనకు ఆధారం లేదు: కస్టడీ న్యాయ పరిశీలనకు లోబడి ఉంటుంది. ఒక వ్యక్తి పై చేసిన అభియోగాలకు ప్రాథమిక సాక్షాధారాలు ఉన్నాయని న్యాయస్థానాలు నమ్మనిదే దీర్ఘకాలిక కస్టడీ (30 రోజులు) ఉండదు. బిజెపి, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలకు అన్నిటికీ ఈ బిల్లు వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రధాని కార్యాలయాన్ని కూడా చట్టం పరిధిలోనే ఉంచారు. అందువల్ల కళంకిత నాయకులకు ఏ పార్టీ ఆశ్రయం ఇవ్వలేని పరిస్థితిని సృష్టిస్తుంది. అంతిమంగా, రాజకీయాలు కేవలం ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదు – ఉన్నత నైతిక ప్రమాణాలను నెలకొల్పడం. ప్రభుత్వ సర్వీసులో ఉన్న గుమస్తాను అరెస్టు చేసిన తర్వాత సస్పెండ్ చేసినప్పుడు మంత్రులకు ఎందుకు మినహాయింపు ఇవ్వాలి? ప్రభుత్వ పదవి వ్యక్తిగత ఆస్తి కాదని ఈ బిల్లు గుర్తుచేస్తుంది. అది ఒక పవిత్రమైన విశ్వాసం, ఆ విశ్వాసానికి విఘాతం కలిగించే వారు తాత్కాలికంగా అయినా సరే పక్కకు తప్పుకోవాలి.
130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏ వ్యక్తికో, పార్టీకో వ్యతిరేకం కాదు. ఇది భారత రాజకీయాలకు అద్దం పడుతుంది. స్వచ్ఛమైన పాలన, నేరాలకు రక్షణ మధ్య ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకోవాలని చెబుతుంది. రాజ్యాంగ పరిషత్ దార్శనికతను, అద్వానీ, అమిత్ షా వంటి నాయకుల ఉదాహరణలను, ఔచిత్యం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన పిలుపును ఇది గౌరవిస్తుంది. ప్రభుత్వాలను జైళ్ల నుంచి నడపడం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడకుండా చూస్తుంది. బిల్లును ప్రవేశపెడుతూ హోం మంత్రి అమిత్ షా చెప్పినట్టుగా దాని ఉద్దేశం సరళమైనది, లోతైనది: రాజకీయాల్లో నైతిక స్థాయిని పెంచడం, పరిపాలన గౌరవాన్ని పునరుద్ధరించడం.
గౌరవ్ భాటియా,
బిజెపి జాతీయ అధికార ప్రతినిధి

