Modi

మోదీ వ్యక్తిత్వం.. భారతదేశానికి బలం

రిత్రలో సెప్టెంబరు 17వ తేదీ ప్రసిద్ధమైంది. ఈ రోజు దేశవ్యాప్తంగా చేతివృత్తులవారు, హస్తకళాకారులు విశ్వకర్మ జయంతి జరుపుకొంటారు. ఇదేరోజు హైదరాబాద్‌ సంస్థానం నిజాం క్రూరపాలన, రజాకార్ల అరాచకాల నుంచి విముక్తి పొందింది. సరిగ్గా ఈరోజే తన జీవితాన్ని దేశసేవకు, ప్రజాసేవకు అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మించారు. ఈ ఏడాది ఆయన 75వ పుట్టినరోజు కావడం మరీ విశేషం. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు ఆయనకు ఆయురారోగ్యాలను, శక్తిఉత్సాహాలను ప్రసాదించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా.

మోదీజీ వ్యక్తిత్వం మిగతా రాజకీయ నాయకులకన్నా పూర్తి భిన్నమైనదీ, విలక్షణమైనదీ అని ఆయనతో దశాబ్దాలుగా కలిసి పనిచేసిన నేను ఘంటాపథంగా చెప్పగలను. దేశ సంక్షేమమే ఊపిరిగా శ్రమించే నాయకుడాయన. దేశాభివృద్ధి, ప్రజాశ్రేయస్సు అనేవి మోదీజీ దృష్టిలో కేవలం ఆదర్శాలే కావు, మార్గదర్శక సూత్రాలు. సమ్మిళిత అభివృద్ధి సాధన కోసం సమర్థ పాలనపై నిరంతరం దృష్టి కేంద్రీకరించడం ఆయన నాయకత్వ శైలి ప్రత్యేకత. అభివృద్ధి యాత్రలో ఎవరూ వెనకబడకూడదనీ, అందరూ ప్రగతి ఫలాలను అందుకోవాలనే లక్ష్యంతో ఆయన విధానాలు రూపొందుతాయి, పక్కాగా అమలవుతాయి. పరిపాలన అనేది అధికారం చలాయించడానికి రాజదండం కాదనీ, ప్రజాసేవకు సాధనమనీ ఆయన నమ్ముతారు, ఆచరిస్తారు. 

ప్రధాని మోదీ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను చేపట్టి, ఆశించిన లక్ష్యాలను సాధించారు. ఆయా పథకాల లబ్ధిదారుల కళ్లల్లో మెరిసే సంతృప్తిని చూసినప్పుడు ప్రజాసంక్షేమం కోసం మోదీజీ కలలు సఫలమవుతున్నాయన్న భరోసా కలుగుతుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారకునిగా మోదీజీ దేశమంతటా పర్యటించి, అన్నివర్గాల కష్టాలు, ఆశలూ ఆకాంక్షలను తెలుసుకున్నారు. భారతీయ ఆత్మను, అంతశ్శక్తినీ అత్యంత సన్నిహితంగా వీక్షించారు. ఈ అనుభవం పరిపాలనపై ప్రగాఢ ముద్ర వేసింది. పేద, బలహీన వర్గాల బాగు కోసం పాటుపడాలనే తపనను రగిలించింది. ప్రచారకుడిగా గడించిన అనుభవం సంస్థాగత నిర్వహణ కళనూ నేర్పింది. బిజెపిలో సంస్థాపరంగా నవ్య సంస్కరణలు తీసుకొచ్చి, పార్టీ నిర్వహణ తీరునే మార్చేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మోదీజీ దార్శనికతను ఆచరణలో పెట్టే మహదవకాశం నాకు లభించింది. ఎంతటి సంక్లిష్ట పరిస్థితుల్లోనైనా సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు దూసుకెళ్లడం పటిష్ఠ నాయకత్వ లక్షణం. అది మోదీజీ నేతృత్వంలో పుష్కలంగా ఉంది. ఎంతటి సవాళ్లు ఎదురైనాసరే అసాధారణ ఓరిమితో, విస్పష్ట దృక్పథంతో ముందుకుసాగి అనుకున్నది సాధిస్తారాయన. 2014లో ఆయన తొలిసారి ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి దేశం దృఢసంకల్పంతో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలు అనేకం ఎదురయ్యాయి. ఆయా సమయాల్లో దేశానికి ప్రయోజనకరమైన నిర్ణయాలనే తీసుకోవడం మోదీజీ ఘనత. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ విధానం ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలలో అత్యంత కీలకమైనవి. 370వ అధికరణ రద్దు మోదీజీ రాజకీయ స్థైర్యానికి నిదర్శనం మాత్రమే కాదు, జాతి సమగ్రత, సమైక్యతల పట్ల ఆయన నిబద్ధతకు ప్రతీక. ట్రిపుల్‌ తలాఖ్‌ దురాచారం రద్దు మహిళల హక్కులను, హుందాగా జీవించే సౌకర్యాన్నీ కాపాడే సాహసిక చర్య. వీటికి ప్రతిఘటన ఎదురైనా చలించలేదు. ఎన్ని విమర్శలు, వ్యతిరేకత వచ్చినా జాతీయ ప్రయోజనాల కోసం అనివార్యమైన నిర్ణయాలను తీసుకుని అమలు చేశారు. కొవిడ్‌-19 విరుచుకుపడినప్పుడు మోదీజీ భారతీయులకు భరోసా ఇచ్చి టీకాల కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించారు. దేశీయ పరిశ్రమలు, శాస్త్రజ్ఞులు, యువజనులను స్వావలంబన సాధన దిశగా నడిపించారు. దేశానికి అవసరమైన టీకాలను సొంత గడ్డ మీదే రికార్డు సమయంలో ఉత్పత్తి చేయించి, ఉచిత టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. కొవిడ్‌ను అదుపు చేయడంలో భారత్‌ను ప్రపంచానికే ఆదర్శంగా నిలిపారు.

మోదీజీ తన నాయకత్వంలో జాతీయ భద్రతకు, ఆత్మ గౌరవానికి పట్టం కట్టారు. యురిలో ఉగ్రదాడికి సమాధానంగా సర్జికల్‌ స్ట్రైక్‌ను చేపట్టడం ద్వారా ఉగ్రవాదంపై భారత్‌ మెతక వైఖరి అవలంబించబోదని లోకానికి స్పష్టంచేశారు. పుల్వామా ఘటనకు ప్రతిగా బాలాకోట్‌పై వైమానిక దాడి నిర్వహించి భారత్‌ ఉక్కు సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా తన పౌరులపై దాడిని భారత్‌ సహించబోదనీ, రెండింతలు ప్రతీకారం తీర్చుకుంటుందని చాటిచెప్పారు. మోదీజీ అంతర్జాతీయ వేదికలపై భారత వైఖరిని దృఢంగా, ధీమాగా ప్రకటించడం భారతీయులకు గర్వకారణమవుతోంది. గతంలో వర్ధమాన దేశంగా గుర్తింపు పొందిన భారత్‌ను, ఇప్పుడు అగ్రదేశాల సరసన సగర్వంగా నిలబడుతున్న దేశంగా చూస్తున్నారు. పారిస్‌ వాతావరణ ఒప్పందం కుదిరినప్పుడు, జీ20 శిఖరాగ్ర సభ జరిగినప్పుడు, ఐక్యరాజ్య సమితిలో ప్రసంగిస్తున్నప్పుడు మోదీజీలో ఉట్టిపడిన ఆత్మవిశ్వాసం నానాటికీ పెరుగుతున్న భారతదేశ ప్రాధాన్యానికీ, పేరు ప్రతిష్ఠలకూ అద్దం పట్టింది. 

మోదీజీ సమ్మోహన శక్తి ప్రజలతో నేరుగా బంధాన్ని ఏర్పరుస్తుంది. ఆయన నిరాడంబరత ప్రజల హృదయాలను గెలుస్తుంది. ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమాలతో అన్ని వర్గాలకూ చేరువయ్యారు. దేశానికి ఆర్థికంగా, రాజకీయంగానే కాకుండా మానసికంగా, సాంస్కృతికంగా కూడా సాధికారత సమకూర్చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి ఆత్మనిర్భర్‌ భారత్‌ను సాకారం చేయాలనే దీక్షతో సాగుతున్నారు. ప్రపంచంలో మనమెవ్వరికీ తీసిపోమనే నమ్మకాన్ని ప్రతి భారతీయునిలో కలిగించారు. గత పదకొండేళ్లలో ఆయన నాయకత్వంలో భారత్‌ ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, స్వావలంబనలలో కొత్త శిఖరాలను అధిరోహించింది. ఇది అద్వితీయ, చరిత్రాత్మక విజయం. మోదీజీ దార్శనికత వర్తమానానికే పరిమితం కాకుండా ఉజ్జ్వల భవిష్యత్తును వీక్షిస్తుంది. ఇవాళ భారతదేశానికి అత్యున్నత బలం.. మోదీజీ వ్యక్తిత్వమే!

అమిత్ షా,
కేంద్ర హోం మంత్రి