పాకిస్తాన్ ఆలోచనల ప్రకారం కాంగ్రెస్ వ్యవహారం
పహల్గాం ఘటన తర్వాత యావద్భారత ప్రజలు, ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదాన్ని అంతం చేయాలని నినదిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాధ్యత మరిచి ప్రధానమంత్రిని కించపరిచేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టడాన్ని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాయాది దేశంతో యుద్ధమేఘాలు కమ్ముకున్న సమయంలో బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ అన్ని విలువలకు తిలోదకాలిచ్చి పాకిస్తాన్, ఉగ్రవాదులు మాట్లాడుతున్న భాషలో మాట్లాడుతోందన్నారు. పాకిస్తాన్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతల ఆలోచన ఒకే రకంగా ఉందని అర్థమవుతోందని తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ ‘‘పాకిస్తాన్ మంత్రులు.. భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే, దానికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటు. కాంగ్రెస్ నేతలు చేసిన ట్వీట్లను పాకిస్తాన్ రీట్వీట్ చేయడం.. వీరిద్దరి మధ్య ఉన్న అక్రమ స్నేహబంధానికి అద్దం పడుతోంది. పహల్గాం ఘటన తర్వాత భారతీయుల రక్తం ఉడుకుతోంది. పాక్‌కు దిమ్మదిరిగే సమాధానం ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ సమయంలో ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ సైన్యానికి అండగా ఉండాల్సిన బాధ్యతను మరిచిన కాంగ్రెస్ ఉగ్రవాదుల భాషలో మాట్లాడుతుండటం అత్యంత హేయమైనచర్య.
ప్రధానమంత్రి చిత్రంలో తలను తొలగించి ‘గాయబ్’అని పోస్టు చేయడం కాంగ్రెస్ లో పెరుగుతున్న అసహనానికి నిదర్శనం. కొంతకాలం క్రితం పాకిస్తాన్ అనుకూల ఉగ్రవాదులు మహాశివుని శిరస్సును ఖండించి అక్కడ వారి జెండాను ఎగురవేసిన చిత్రాన్ని విడుదల చేశారు. ఇది హిందు సమాజాన్ని, భారతీయుల ఆధ్యాత్మికత భావనను తీవ్రంగా అవమానించింది. ఇవాళ కాంగ్రెస్ కూడా అచ్చం అదే తరహాలో ప్రధానమంత్రి చిత్రాన్ని తొలగించి పోస్టు చేసింది. ఇది చూశాక కాంగ్రెస్ చెప్పినట్లు పాకిస్తాన్ నడుస్తోందా లేక పాక్ చెప్పినట్లు కాంగ్రెస్ వ్యహరిస్తోందా అన్న అనుమానం దేశ ప్రజలకు కలుగుతోంది. దేశ సమగ్రత, సమైక్యతను దెబ్బతీసేలా, దేశ ప్రధానమంత్రిని అవమానించేలా వ్యవహరించడం వారి మానసిక పరిస్థితికి అద్దం పడుతోంది.
కర్ణాటక సీఎం సిద్దరామయ్య ‘మేం పాకిస్తాన్‌తో యుద్ధానికి వ్యతిరేకం’ అని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ సహా పలువురు నాయకులు కూడా ఇలాగే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు. కేరళ కాంగ్రెస్ ట్వీట్ చేస్తూ ‘సరిహద్దుకు 200 లోమీటర్ల దూరంలో ఉన్న పహల్గాంలోకి ఉగ్రవాదులు ప్రవేశించే అవకాశం లేదు’ అని పేర్కొంది. ఇవన్నీ పాకిస్తాన్‌కు మద్దతుగా దేశ ఆత్మగౌరవాన్ని, భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తుండటం కాంగ్రెస్ దుర్మార్గపు ఆలోచనలకు పరాకాష్ట. రాహుల్ గాంధీ కూడా విదేశాలకు వెళ్లి భారతదేశపు రాజ్యాంగబద్ధ సంస్థలపై వ్యతిరేకంగా మాట్లాడతారు. దేశం పట్ల, దేశంలోని వ్యస్థల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అగౌరవ భావానికి నిదర్శనం.
ఆకాశంపై ఉమ్మేస్తారా..!
రాహుల్ గాంధీ ఉన్నట్లుండి, విదేశీ పర్యటనల పేరుతో, విశ్రాంతి తీసుకోవడానికి అని చెప్పి పదేసి రోజులపాటు ఎక్కడెక్కడకి గాయబ్ అవుతారో దేశప్రజలందరికీ తెలుసు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 25 ఏళ్లుగా సెలవు తీసుకోకుండా తన విధులను నిర్వర్తిస్తున్నారు. పండగలను సైనికులతో, సఫాయి కర్మచారులతో, కార్మిక-కర్శకులతో జరుపుకుంటున్నారు. దేశంపై ఉగ్రదాడి జరిగిందని తెలియగానే హోంమంత్రి అమిత్ షాను వెంటనే పహల్గాంకు పంపి తన విదేశీ పర్యటన నుంచి మధ్యలోనే వెనుదిరిగారు. ఇదీ ఆయన గొప్పదనం, బాధ్యతతో కూడిన అంకితభావానికి నిదర్శనం. నేడు దేశమంతా ఏకమై ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ముందుకెళ్తున్న సమయంలో ఇలాంటి దుష్కృత్యాలకు పాల్పడటం కాంగ్రెస్ పార్టీకి, పాకిస్తాన్‌కు ఏమాత్రం తేడాలేదని మరోసారి అర్థమైంది. అందుకే కాంగ్రెస్ తీరును మరోసారి తీవ్రంగా ఖండిస్తూ.. దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, దేశ ప్రజలందరి తరఫున సూచిస్తున్నాను.’’ అని కిషన్ రెడ్డి అన్నారు.