One Nation One Election

పాలన, జవాబుదారీతనాలను మెరుగుపరిచే ‘ఒక దేశం-ఒక ఎన్నిక’

One Nation One Electionథెన్స్ లో ప్రతికూల ఓటింగ్ వ్యవస్థతో ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రారంభమయ్యాయి. గ్రీకు నగర రాజ్యమైన ఏథెన్స్ లో ఎవరిని దేశం నుంచి బయటికి పంపేయాలి లేదా శిక్షించాలి అనే దానిపై అర్హులైన ఓటర్లు, ప్రధానంగా భూస్వాములు ఓటు వేసేవారు. ఈ విధానంలో మరణశిక్షకు గురైన బాధితుల్లో సోక్రటీస్ ఒకరు. పోటీతో కూడిన ఎన్నికల రాజకీయాలు అనేక శతాబ్దాల తర్వాత యూరప్ లో సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో ప్రారంభమయ్యాయి. యూరప్ వెలుపల మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థను అనుసరించిన దేశం అమెరికా. 17వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు నిరంతర సంస్కరణలు ప్రజాస్వామ్యాలను మెరుగైన పాలనా వ్యవస్థలుగా తీర్చిదిద్దాయి. 1928 లో మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించిన తర్వాతే గ్రేట్ బ్రిటన్ ఒక సంపూర్ణ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంగా అవతరించింది. అమెరికాలో 1965లో ఓటింగ్ హక్కుల చట్టం ద్వారా గాని నల్లజాతీయులకు ఓటు హక్కు రాలేదు. భారత్ ఆలస్యంగా ఈ వ్యవస్థలోకి ప్రవేశించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంచుకున్నాం. కానీ భారత్ ప్రజాస్వామ్య ప్రపంచానికి అనేక ఉన్నతమైన ప్రమాణాలను నెలకొల్పింది. బ్రిటన్, అమెరికాలకు భిన్నంగా భారత్ 1950లో తన ప్రజాస్వామ్య ప్రస్థానం ప్రారంభంలోనే దేశంలోని వయోజనులందరికీ ఓటు హక్కును కల్పించింది.

గత 75 ఏళ్ల కాలంలో భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగానే కాక అతి ప్రగతిశీలమైన, విజయవంతమైన ప్రజాస్వామ్యంగా తనను తాను నిరూపించుకుంది. 2004లో ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది. అలాగే ‘నోటా’ (అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదు అని ఓటర్లు చెప్పే) విధానాన్ని మొట్టమొదట ప్రవేశపెట్టింది కూడా భారతదేశమే. లక్షల మంది భద్రతా సిబ్బంది కోటి మందికి పైగా ఇతర సిబ్బంది భాగస్వామ్యంతో 100 కోట్ల మంది ఓటర్లు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేటట్లు చూసే భారతీయ ఓటింగ్ ప్రక్రియ ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పుడు భారత్ ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనే మరొక కీలకమైన ఎన్నికల సంస్కరణను చేపడుతోంది.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి నాలుగు ఎన్నికలు, 1952 నుంచి 1967 వరకు జరిగిన మొదటి నాలుగు ఎన్నికలు ఇదే పద్ధతిలో జరిగాయి. లోక్ సభ ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేరోజు జరిగాయి. ఈ విధానానికి మొదటిసారి 1959లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలోని కేరళలోని కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఒక కుంటి సాకుతో రద్దు చేయడంతో అంతరాయం కలిగింది. 1956లో కేరళ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొదటిసారిగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఈఎంఎస్ ప్రభుత్వం. జిబి పంత్ తో కుమ్మక్కై ఇందిరాగాంధీ ఈఎంఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని రద్దు చేయించారు. 1960, 1965లలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1965 ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయారు. దాంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. 1967లో పార్లమెంటుకు, దేశంలోని ఇతర అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినప్పుడు కేరళ అసెంబ్లీకి కూడా ఎన్నికల నిర్వహించడంతో ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ మళ్లీ గాడిలో పడినట్టు అయింది. కానీ 1969లో దీనికి రెండో తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఈ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చీలిక ఏర్పడటంతో ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. డీఎంకే, సీపీఐ, సీపీఎం వంటి పార్టీలు బయట నుంచి ఇచ్చిన మద్దతుతో ఇందిరా గాంధీ కొన్నాళ్లు అధికారంలో కొనసాగినా 1971 ప్రారంభం నాటికి ప్రభుత్వం మనుగడ సాగించలేని పరిస్థితి వచ్చింది. దాంతో పార్లమెంటును రద్దు చేసి తాజాగా ఎన్నికలు ప్రకటించారు. ఆ తర్వాతి కాలంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు విచక్షణారహితంగా రాజ్యాంగంలోని అధికరణం 356ను ప్రయోగించి రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేయడంతో ‘ఒకే దేశం ఒక ఎన్నిక’ విధానం అసాధ్యమైపోయింది. 1951 నుంచి 2015 వరకు 115 సార్లు కేంద్రం అధికరణం 356ను ప్రయోగించింది. స్థూలంగా దీనంతటి పర్యవసానం ఏమిటంటే 1967 వరకు అమలు చేస్తూ వచ్చిన ‘ఒక దేశం-ఒక ఎన్నిక’ విధానం నుంచి మనం ఇప్పుడు ‘ఒక ఏడాదిలో అనేక ఎన్నికలు’ విధానానికి చేరుకున్నాం.

ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానాన్ని అమలుపరచడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించినప్పటి నుంచి లోక్ సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధానం వల్ల ఒనగూడే ప్రయోజనాల గురించి అనేక అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కోవింద్ కమిటీ కూడా అన్ని భాగస్వామ్య పక్షాలతోనూ విస్తృతంగా చర్చలు నిర్వహించి ప్రభుత్వానికి తన సిఫార్సులను సమర్పించింది. ఈ నివేదికకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ దిశలో రాజ్యాంగానికి అవసరమైన సవరణలు చేపట్టేందుకు ఈ నివేదికను పార్లమెంటు ముందు ఉంచబోతున్నారు. ఓకే దేశం-ఓకే ఎన్నిక ప్రతిపాదనకు ప్రతిపక్షం అనేక అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. అయితే వారు ఒక విషయం మాత్రం మర్చిపోకూడదు. ఇది కొత్త ఆలోచన ఏమీ కాదు. స్వాతంత్య్రం వచ్చిన మొదటి రెండు దశాబ్దాలలో మన దేశంలో ఇది అమలు జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరించిన పక్షపాత, పార్టీ రాజకీయాల కారణంగా దానికి అంతరాయం కలిగింది. ఈ విధానం ప్రాంతీయ పార్టీలకు గాని, సమైక్య స్పూర్తికి గాని ఎటువంటి నష్టం కలిగించదు. అకాలీ దళ్, డిఎంకె, కమ్యూనిస్టు పార్టీలు వంటి అనేక ప్రాంతీయ పార్టీలు ఏకకాల ఎన్నికలు జరిగినా మొదటి రెండు దశాబ్దాల్లోనూ ఉనికిలో ఉన్నాయన్న విషయం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి.

ఒక ముఖ్యమైన కారణం వల్ల కూడా మనం ఈ ఆరోగ్యకరమైన విధానాన్ని పునరుద్ధరించాలి. ఒక ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలంలో చివరి మూడు నెలల్లోనే ఎన్నికలు కీలక పాత్ర వహిస్తాయి తప్ప అంతకు ముందు కాలమంతా పరిపాలనకే ప్రాధాన్యం ఇవ్వాలని బిజెపి సీనియర్ నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో మంత్రి అయినా ప్రమోద్ మహాజన్ అంటూ ఉండేవారు. కానీ ఈనాడు మన దేశంలో ఏదో ఒక మూల ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటే పరిపాలన తీవ్రంగా నష్టపోతోంది. అంతేకాక మానవ, ఆర్థిక వనరులపై కూడా ఒత్తిడి విపరీతంగా ఉంటోంది. కోవింద్ కమిటీ సిఫార్సులు ఈ సవాళ్లను ఎదుర్కోవటానికి అనుసరించవలసిన మార్గాలను సూచించాయి.

పార్లమెంటు ఆరోగ్యకరమైన చర్చను చేపట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రభుత్వాలకు అర్ధాంతరంగా ఆయుష్షు తీరడానికి ఒక ప్రధాన కారణం ఫిరాయింపుల వల్ల ప్రభుత్వాలు మైనారిటీలో పడిపోవడం. ఎన్నికైన సభ్యులు పార్టీ మారకుండా నిరోధించే ఒక చట్టం ద్వారా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం ఇంతకు ముందు జరిగింది. ఇందులో కొన్ని లొసుగులు ఉన్నప్పటికీ మొత్తం మీద ఎన్నికైన సభ్యులు పార్టీ మారడం ఇప్పుడు కష్టంగా మారింది. అస్థిరత్వానికి దోహదం చేసే మరొక అంశం అవిశ్వాస తీర్మానాలు. దీనికి ఒక మంచి పరిష్కారం అవిశ్వాస తీర్మానానికి బదులు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు మాత్రమే వీలు కల్పించడం. అంటే ఒక ప్రభుత్వం పట్ల అవిశ్వాసాన్ని కాక విశ్వాసాన్ని వ్యక్తం చేయడానికి మాత్రమే ఏ పార్టీ అయినా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. ఈ నిబంధన పెడితే ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేసే ముందు పార్టీలు ప్రత్యామ్నాయాన్ని నిర్మించవలసి ఉంటుంది. అది అంత సులభమైన విషయం కాదు. ఏదేమైనా ఏకకాల ఎన్నికలకు తిరిగి వస్తే పరిపాలన మెరుగుపడుతుంది, జవాబుదారీతనం పెరుగుతుంది.

రామ్ మాధవ్