Make In India

భారత్ దశ, దిశలను మార్చివేసిన ‘మేకిన్ ఇండియా’

Make in Indiaసెప్టెంబర్ 25న దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన మేకిన్ ఇండియా కార్యక్రమం 10వ వార్షికోత్సవాన్ని జరుపుకొంది. మేకిన్ ఇండియా కార్యక్రమం దేశ ఆర్థిక ప్రస్థానంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగ కల్పనకు దారి తీసే పెట్టుబడులను ప్రోత్సహించడంతోపాటు అనేకమంది సామాన్యులకు తాము సంపద సృష్టించగలమనే ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది. పారిశ్రామిక రంగాన్ని మేకిన్ ఇండియా పునరుత్తేజితం చేసింది. వృద్ధికి చోదక శక్తిగా మారి దేశంలో డిమాండ్ ను తీర్చడమే గాక ఎగుమతులను కూడా పెంచింది.

విధానపరమైన నిష్క్రియాపరత్వంతో చేష్టలుడిగి పోయిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాలు కుదేలై, నిరాశనిస్పృహలతో కూడిన పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధానమంత్రి మేకిన్ ఇండియాకు పిలుపునిచ్చారు. ఆ సమయంలో సర్వత్రా పరిస్థితి నిరాశజనకంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. మదుపరులలో, ప్రజల్లో విశ్వాసం అడుగంటి పోయింది. మీడియాలో వార్తల నిండా అవినీతి కుంభకోణాలే. ద్రవ్యోల్బణం మిన్నంటింది. వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరి రూపాయి తీవ్రమైన అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ గడ్డు పరిస్థితుల్లో ఎన్నో ఆశలతో భారతీయ ఓటర్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అనుకూలంగా నిర్ణయాత్మకమైన తీర్పు ఇచ్చారు. భారత్ ను అంతర్జాతీయ శక్తిగా చేయాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. భారతీయ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, భారత ఆర్థిక విజయ గాథకు వస్తూత్పత్తి రంగం కీలకం కావాలని ఆయన భావించారు. ఈ లక్ష్యాల సాధన కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానమంత్రి ‘భారత్ లో తయారీ’ (మేకిన్ ఇండియా) కార్యక్రమాన్ని ప్రకటించారు.

ఈ పదేళ్ల ప్రస్థానం అసాధారణమైనదే. అయితే ఇందుకు ప్రధానమంత్రి తీసుకున్న అనేక బహుముఖ పరివర్తనాత్మక చర్యలు తోడ్పడ్డాయి. వీటిలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), దివాలా స్మృతి, అనేక ఇతర సంస్కరణలు కూడా ఉన్నాయి. వాణిజ్య సౌలభ్యం (ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్) ను మెరుగుపరచడానికి 42 వేల అనవసరపు నిబంధనలను ప్రభుత్వం రద్దు చేసింది. చిన్నచిన్న తప్పులకు జరిమానాలు, శిక్షలు విధించే 3,700 నిబంధనలను వివిధ చట్టాల నుంచి మోదీ ప్రభుత్వం తొలగించి చిన్న వ్యాపారులలో భరోసా, ధైర్యం కల్పించింది. అధికారుల వేధింపు నుంచి వారికి రక్షణ కల్పించింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న పరివర్తనాత్మక నిర్ణయాలు, చేపట్టిన సంస్కరణల ఫలితంగా ప్రపంచ బ్యాంకు ‘వ్యాపార నిర్వహణ నివేదిక’లో భారత్ ర్యాంకింగ్ భారీగా 2014లో 142 నుంచి 2019లో 63కి మెరుగైంది. ప్రభుత్వం చేపట్టిన స్టార్టప్ ఇండియా కార్యక్రమం అనేకమంది ఉద్యోగాలు వదిలి స్టార్టప్ కంపెనీలు పెట్టి ఉద్యోగాలు సృష్టించేవారుగా మారడానికి దోహదం చేసింది. ఫలితంగా గుర్తింపు పొందిన స్టార్టప్ సంస్థల సంఖ్య ఈ ఏడాది జూన్ నాటికి 1,40,803కి చేరుకోవడంతో పాటు పెట్టుబడులు పెరిగి 15 లక్షల పైగా ఉద్యోగాల కల్పన జరిగింది. ఈ స్టార్టప్ లు దేశంలో ఆవిష్కరణల పర్యావరణానికి ఊపునిస్తూ కీలకమైన పారిశుధ్యం, అంతరిక్ష యానం వంటి రంగాలలో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలు కనుగొంటూ ఆహార వ్యర్థాలను తగ్గించడం, ఆరోగ్య రంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడం, మహిళలను సాధికారీకరించడం వంటి రంగాలలో పురోగతికి తోడ్పడుతున్నాయి.

11 పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్న మరొక అంశం. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం 20 పారిశ్రామిక స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తోంది. దేశంలో వస్తూత్పత్తి రంగ వృద్ధికి ఈ స్మార్ట్ సిటీలు వెన్నెముకగా నిలవనున్నాయి. వీటిలో 4 స్మార్ట్ సిటీలు ఇప్పటికే పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. వీటిలో అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణం పూర్తయి తయారీ పరిశ్రమల ఏర్పాట్లకు అవసరమైన అనుమతులు మంజూరయ్యాయి. వీటిలో 1.7 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. ఈ స్మార్ట్ సిటీలో 80,000 మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు ఇంకా అనేక మందికి పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి.

ఎలక్ట్రానిక్స్ వాహనాలు, జౌళి ఉత్పత్తులు, వైద్య పరికరాలు వంటి కీలక రంగాలలో ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్ఐ) ప్రకటించింది. ఈ రంగాల్లో సుస్థిర వృద్ధిని సాధించడంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేవిధంగా ఉత్పత్తి ప్రమాణాలను సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. పీఎల్ఐ పథకాల ఫలితంగా వస్తూత్పత్తి రంగంలో రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఉత్పత్తి గణనీయంగా పెరిగి రూ.11 లక్షల కోట్లకు చేరుకుంది. 8.5 లక్షలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగింది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రధానమంత్రి చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు కూడా దేశంలో వస్తువులకు, సేవలకు డిమాండ్ పెంచడంతోపాటు వస్తూత్పత్తి రంగ వృద్ధికి గణనీయంగా తోడ్పడింది. ఈనాడు భారతదేశంలో ఎక్స్ ప్రెస్ వేలు, హైవేల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. కొత్త ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్లు నిర్మితమవుతున్నాయి. కొత్త విమానయాన మార్గాలు ప్రారంభిస్తున్నారు. విమానాశ్రయాల సంఖ్య పెరుగుతోంది. వీటన్నిటి ఫలితంగా పెట్టుబడులకు భారత్ మరింత ఆకర్షణీయమైన గమ్యంగా మారుతోంది.

భారతదేశం నాలుగు ‘డి’ ప్రయోజనాలను కలిగి ఉంది. అవి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాత్మక (డిసైజివ్) నాయకత్వం, డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే జనాభాలో యువత నిష్పత్తి ఎక్కువగా ఉండటం, వారు కూడా ప్రతిభావంతులు నిపుణులైన భారతీయులు అయి ఉండడం, మూడు డిమాండ్, అంటే దేశంలోనే 144 కోట్ల మంది ప్రజల నుంచి వచ్చే డిమాండ్, నాలుగవది డెమోక్రసీ. ప్రజాస్వామ్యం మదుపుదారులకు రక్షణ, భద్రత కల్పిస్తుంది. చట్టపరిపాలన ఎటువంటి వివక్షకు, అక్రమాలకు తావు ఇవ్వదు. వస్తూత్పత్తి రంగం భారతదేశానికి తరలి వచ్చేందుకు ఒక బలమైన కారణం ఈ నాలుగు ‘డి’ ప్రయోజనాలు.

దేశీయ, అంతర్జాతీయ మదుపుదారులు తమ వ్యాపారాలను పెంచుకోవడానికి నేడు సువర్ణ అవకాశాలను కలిగి ఉన్నారు. దేశ స్టాక్ మార్కెట్లలో ఇప్పుడు ఎంతో సందడి కనిపిస్తోంది. అనేక విదేశీ ప్రతినిధి వర్గాలు భారత్ ను సందర్శిస్తున్నాయి. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి, భారతీయ వృద్ధి గాథలో భాగస్వాములు కావడానికి తహతహలాడుతున్నారు. విదేశీ ప్రభుత్వాలు, అంతర్జాతీయ కంపెనీల సీఈవోలు భారతదేశంలో వ్యాపార అవకాశాలను నిశితంగా గమనిస్తున్నారు. పలు దేశాలు భారత్ తో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి తాపత్రయపడుతున్నాయి.

ప్రపంచం నేడు భారత్ ను ఒక వస్తూత్పత్తి కేంద్రంగా చూస్తోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో గల అనుకూల వాతావరణం, పటిష్టమైన ఆర్థిక పునాదులు భారత్ పట్ల ఈ ఆసక్తికి ప్రధాన కారణం. నేడు దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. ఆర్థికవృద్ధి బలంగా ఉంది. మోదీ ప్రభుత్వం ద్రవ్య క్రమశిక్షణను నిష్టగా పాటిస్తోంది. సంఘర్షణలు, సంక్షోభాలమయంగా ఉన్న అంతర్జాతీయ వాతావరణంలో భారత్ అనుసరిస్తున్న ఆర్థిక, రాజకీయ విధానాలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. నరేంద్ర మోదీ చేపట్టిన కార్యక్రమాలు 2014లో ప్రపంచంలోని పెళుసైన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్ ను నేడు ప్రపంచంలోని మొదటి ఐదు దేశాలలో ఒకటిగా చేశాయి. వాస్తవంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలు ఈ పదేళ్ల కాలాన్ని పరివర్తనాత్మక దశాబ్దంగా మార్చి కాంగ్రెస్ పదేళ్ల పాలనలో జరిగిన నష్టాన్ని భర్తీ చేశాయి.

పీయూష్ గోయల్,
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి