Swachh Bharat

పారిశుధ్యాన్ని సంస్కృతిలో భాగం చేసిన స్వచ్ఛ భారత్

Swachh Bharat ఏడాది గాంధీ జయంతి అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛభారత మిషన్ 10 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. భారతదేశంలో పారిశుధ్యాన్ని లోతైన చరిత్ర ఉంది. పురాతన సింధు నాగరికతలో మరుగుదొడ్ల నిర్మాణానికి, వ్యర్థాల నిర్వహణకు శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇంత స్వసంపన్నమైన వారసత్వం ఉన్నప్పటికీ సమగ్ర పారిశుధ్య నిర్వహణ విషయంలో భారత్ ప్రస్థానం సవాళ్లతో కూడుకొని ఉండేది. 1981 జనగణన నాటికి పల్లెల్లో కేవలం ఒక శాతం జనాభాకు మాత్రమే మరుగుదొడ్ల సౌకర్యం ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కేంద్ర గ్రామీణ పారిశుధ్య కార్యక్రమం, సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమం, నిర్మల్ భారత అభియాన్ వంటి కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాల ఫలితంగా గ్రామాల్లో మరుగుదొడ్ల సౌకర్యం 39 శాతానికి పెరిగింది. అప్పటికీ ప్రపంచంలో బహిరంగ మలవిసర్జనలో భారతదేశం వాటా దాదాపు 60 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బిఎం) ను ప్రారంభించారు. గ్రామీణ భారతాన్ని ఐదేళ్లలో బహిరంగ మలవిసర్జన రహితంగా (ఒడిఎఫ్) మార్చడం దీని లక్ష్యంగా ప్రకటించారు.

భారత్ 2019 అక్టోబర్ 2న మహాత్మా గాంధీ 150వ జయంతి నాటికి ఈ లక్ష్యాన్ని సాధించింది. ఈ ఐదు కీలక సంవత్సరాల్లో దేశంలో పారిశుద్ధ్య కవరేజీ నూటికి నూరు శాతానికి చేరుకుంది. స్వచ్ఛభారత్ మిషన్ కింద 2014 నుంచి రూ.1.4 లక్షల కోట్ల ప్రభుత్వ వ్యయంతో 11.7 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించారు. ఇది కేవలం సంపద సృష్టి కాదు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు వ్యక్తుల ప్రవర్తనలో ఒక ఆరోగ్యకరమైన మార్పును తీసుకువచ్చే ఒక జాతీయ స్థాయి ఉద్యమం. పిల్లలు, మహిళలు, పురుషులు, స్థానిక ప్రభావశీల వ్యక్తులు, పౌర సమాజం, ప్రభుత్వ యంత్రాంగం ఈ యజ్ఞంలో కలిసికట్టుగా పాల్గొన్నారు. ప్రతి మార్గంలోనూ పారిశుద్ధ్యం ప్రాముఖ్యం గురించిన సందేశం ప్రజలకు చేరింది. గ్రామస్థాయి కార్యకర్తలు (స్వచ్ఛగ్రాహిలు) క్షేత్రస్థాయిలో మార్పునకు ప్రేరణగా నిలిచారు. స్వచ్ఛభారత్ మిషన్ ఒకటవ దశ విజయవంతంగా పూర్తి అయిన తర్వాత రెండవ దశను ప్రారంభించారు. ఈ రెండవ దశలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత, మొత్తంగా గ్రామీణ పారిశుధ్యంపై దృష్టి కేంద్రీకరించడంతో పాటు బహిరంగ మలవిసర్జన తిరిగి ఎక్కడా మొదలు కాకుండా చూడటానికి ఈ దశలో ప్రాధాన్యమిచ్చారు. 2024-25 నాటికి అన్ని గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్ నమూనాలోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అంటే ఇప్పటివరకు సాధించిన విజయాలను కొనసాగించే పద్ధతులు, విధానాలు, మరింత పరిశుభ్రత ఇందులో భాగంగా ఉంటాయి.

స్వచ్ఛభారత్ తదుపరి లక్ష్యం సంపూర్ణ స్వచ్ఛత. దీనికి దేశంలోని ప్రతి పౌరుడు, సమూహం, సంస్థ, వ్యవస్థ అంకితభావంతో కృషి చేయాల్సి ఉంటుంది. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేటట్లు చూడటానికి ప్రభుత్వం చేపట్టవలసిన మౌలికమైన కార్యక్రమం పారిశుధ్యం. పారిశుధ్యంపై ఖర్చు చేసే ప్రతి ఒక్క డాలర్ కు తక్కువ అనారోగ్యాలు, ఎక్కువ ఉత్పాదకత, తక్కువ అకాల మరణాల వంటి వాటి రూపంలో 5.5 డాలర్ల ప్రతిఫలం లభిస్తుందని 2012లో నిర్వహించిన ఒక సర్వేలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ప్రజారోగ్యంపై, ప్రధానంగా శిశు మరణాల రేటుపై స్వచ్ఛభారత్ మిషన్ ప్రసరించిన ప్రభావాన్ని గురించి ప్రతిష్టాత్మక వైజ్ఞానిక పత్రిక ‘నేచర్’ ఇటీవల వివరించింది. ‘స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల నిర్మాణం-భారత్ శిశు మరణాలు’ అనే పేరుతో ఈ అధ్యయనాన్ని ‘నేచర్’ ప్రచురించింది. ఇందులో 35 భారతీయ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, 640 జిల్లాలకు సంబంధించిన శిశు మరణాలు, ఐదేళ్ల లోపు పిల్లల మరణాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించారు. 2011-2020 కు సంబంధించిన సమాచారాన్ని తీసుకున్నారు. మరుగుదొడ్ల సదుపాయం పెరిగే కొద్దీ శిశు మరణాల సంఖ్య తగ్గినట్టు వారు ఈ గణాంకాల ఆధారంగా నిర్ధారించారు.

స్వచ్ఛ భారత్ మిషన్ కింద జిల్లా స్థాయిలో మరుగుదొడ్ల సదుపాయం 10 శాతం పెరిగితే శిశు మరణాల స్థాయి 0.9 పాయింట్లు, ఐదేళ్ల లోపు పిల్లల మరణాలు 1.1 పాయింట్లు సగటున తగ్గినట్టు అధ్యయనం ఫలితాలు వెల్లడించాయి. అలాగే జిల్లా స్థాయిలో మరుగుదొడ్ల కవరేజీ 30 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే ప్రతి 1,000 సజీవ జననాలకు శిశు మరణాల రేటు 5.3 పాయింట్లు, ఐదేళ్ల లోపు పిల్లల మరణాల రేటు 6.8 పాయింట్లు తగ్గినట్టు తేలింది. స్వచ్ఛభారత్ మిషన్ కింద నిర్మించిన మరుగుదొడ్ల కారణంగా ఏడాదికి దాదాపు 60 నుంచి 70 వేల శిశు మరణాలు తగ్గినట్లుగా అధ్యయనం స్పష్టం చేసింది. అయితే స్వచ్ఛభారత్ నిర్వహించిన పరివర్తనాత్మక పాత్ర గురించి వెల్లడించే అధ్యయనం ఇది ఒక్కటే కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. 2018 నాటి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 2014-2019 మధ్య దేశంలో దాదాపు 3 లక్షల డయేరియా మరణాలను స్వచ్ఛ భారత్ మిషన్ నివారించింది. నాన్-ఓడిఎఫ్ గ్రామాలతో పోలిస్తే ఓడిఎఫ్ గ్రామాలలో పిల్లల్లో బలహీనత 37 శాతం తక్కువ నమోదు అయినట్టు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తెలియజేసింది. పారిశుధ్యం పిల్లల పోషకాహార స్థాయిని ఎలా సానుకూలంగా ప్రభావితం చేస్తుందో ఇది వెల్లడిస్తుంది. ఓడిఎఫ్ గ్రామాల్లో పిల్లల్లో అతిసార వ్యాధి దాదాపు మూడో వంతు తక్కువ ఉంది. 93 శాతం మంది మహిళలు ఇంట్లో మరుగుదొడ్డి ఉంటే తామ సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నారని 2017లో యునిసెఫ్ నిర్వహించిన ఒక అధ్యయనం తెలిపింది. స్వచ్ఛభారత్ మిషన్ మహిళల గౌరవాన్ని, రక్షణను పెంచడంలో ఎంత కీలక పాత్ర వహించిందీ దీన్నిబట్టి అర్థం అవుతుంది. ఇది గాక తగ్గిన వైద్య ఖర్చుల రూపంలో గానీ కాపాడిన ప్రాణాల రూపంలో గానీ, సమయం ఆదా రూపంలో గానీ ఓడిఎఫ్ గ్రామాల్లో కుటుంబం ఏడాదికి దాదాపు 50 వేల రూపాయలు ఆదా చేసినట్టు ఆర్థిక అధ్యయనాలు వెల్లడించాయి.

పారిశుధ్యం, ఆరోగ్యానికి మధ్య గల అవినాభావ సంబంధం దృష్ట్యా స్వచ్ఛ భారత్ మిషన్ ప్రజారోగ్యానికి విశేషంగా దోహదం చేసిందన్నది నిస్సందేహం. మరుగుదొడ్ల సౌకర్యం కారణంగా పిల్లల మరణాల రేటు బాగా తగ్గిందని, వారి ఆరోగ్యానికి భరోసా ఏర్పడిందని అనేక అధ్యయనాలు ఇటీవల కాలంలో గణాంకాలతో సహా నిరూపించాయి. జాతీయ స్థాయిలో ఈ పారిశుధ్య పరివర్తన నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను తగ్గించి తద్వారా మందులకు లొంగని సూక్ష్మ క్రిముల సమస్యను కూడా నివారిస్తుందని ఆశించవచ్చు. ఇవే సానుకూల పరిస్థితులు కొనసాగితే పిల్లల్లో ఎదుగుదల లోపించడం వంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. స్వచ్ఛభారత్ మిషన్ ఈ పార్శ్వాల గురించి కూడా భారతీయ వైద్య పరిశోధన మండలి, ఇతర విద్యాసంస్థలు నిష్పాక్షిక అధ్యయనాలు చేపట్టాలి. 

అంకితభావం, సహకారం, ప్రణాళిక, అద్భుతమైన అమలు, నిరంతర ప్రజా ఉద్యమం ద్వారా ఏదైనా సాధించవచ్చు అనడానికి స్వచ్ఛ భారత్ మిషన్ ఒక చక్కటి ఉదాహరణ. నాలుగు ‘పి’లు – పొలిటికల్ విల్ (రాజకీయ సంకల్పం), పబ్లిక్ ఫైనాన్స్ (ప్రభుత్వ నిధులు), పార్టనర్షిప్స్ (భాగస్వామ్యాలు), పబ్లిక్ పార్టిసిపేషన్ (ప్రజల బ్రాగస్వామ్యం) లతో పాటు ప్రజలను ఒప్పించడం ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి, ప్రతి ఒక్కరికి చేరడానికి ప్రధాన కారణం. దేశంలోనూ, అంతర్జాతీయంగానూ సామాజిక పరివర్తనాత్మక కార్యక్రమాల అమలుకు ఈ స్వచ్ఛభారత్ మిషన్ ఒక ఆదర్శంగా, నమూనాగా నిలుస్తుంది. 2047 నాటికి వికసిత్ (అభివృద్ధి చెందిన) భారత్ గా మారాలనుకుంటున్న భారత్ పారిశుద్ధ్యం, పరిశుభ్రతలో ప్రపంచ స్థాయి దేశంగా ఆవిర్భవించవలసిన అవసరం ఉంది. బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాల్లో ప్రజలు పాత అలవాట్లకు తిరిగి మళ్ళకుండా ఉండడం, నిర్మించిన మరుగుదొడ్ల వాడకాన్ని కొనసాగించడం, అలాగే వ్యర్థాల నిర్వహణకు సమగ్ర, అధునాతన విధానాలను కనుగొని అమలు చేయడం దీనికి ఎంతైనా అవసరం. పరిశుభ్రత అనేది ఒక ఒక సామూహిక విలువగా మారాలి. ప్రతి ఒక్కరూ దాన్ని బలంగా విశ్వసించి నిత్యజీవితంలో ఆచరించాలి. పదేళ్ల స్వచ్ఛ భారత్ మిషన్ అపూర్వమైన విజయాలను సాధించింది. పరిశుభ్రమైన పర్యావరణం, మహిళల గౌరవం, రక్షణ, జీవన సౌలభ్యం, కుటుంబాలకు డబ్బులు ఆదా, పరిశుభ్రత మన సంస్కృతిలో సంప్రదాయంలో భాగం కావడం వీటిలో కొన్ని. ‘దైవం తర్వాత అంత ముఖ్యమైనది పరిశుభ్రత’ అని మహాత్మా గాంధీ అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ విజయం జాతిపితకు మనం ఇచ్చే నిజమైన నివాళి.

వినోద్ కె పాల్,
నీతి ఆయోగ్ సభ్యుడు