Solar Panels

పీఎం రూఫ్‌టాప్ సౌరవిద్యుత్తు పథకం లబ్ధిదారులు-ప్రయోజనాలు

PM Rooftop‘పీఎం-సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’ను ఈ ఏడాది ఫిబ్రవరి 13న రూ.75,000 కోట్ల నిధితో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది కోటి ఇళ్ళలో ఇంటికప్పులపై (రూఫ్ టాప్) సౌరవిద్యుత్ యూనిట్‌లను ఏర్పాటు చేయడం ద్వారా కాలుష్య రహిత ఇంధన లక్ష్యాలను అందుకోడానికి దోహదం చేస్తుంది. స్థూలంగా దీని వివరాలు తెలుసుకుందాం. 

■ వినియోగదారులు ఎలా ప్రయోజనం పొందుతారు?

జ: ఇళ్ళ పైకప్పులపై సౌర ఫలకాల (రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌) ఏర్పాటు ద్వారా ఒక ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా అవుతుంది. రూఫ్‌టాప్ సామర్థ్యం, వినియోగం పరిమాణం ఆధారంగా ఏడాదికి రూ.15,000-18,000 వరకు ఆదా అవుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బైకులు/కార్ల కోసం ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడం ద్వారా మామూలు కుటుంబాలు కూడా డబ్బు సంపాదించవచ్చు.

■ దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

జ: అన్ని కుటుంబాలు దరఖాస్తు చేసుకోవచ్చు. 3 కిలోవాట్ లేదా 3,000 వాట్ సామర్థ్యం గల రూఫ్‌టాప్ సిస్టమ్‌లకు సబ్సిడీ లభిస్తుంది. దరఖాస్తులను https:// pmsuryaghar.gov.in వెబ్ సైట్లో సమర్పించాలి. ఇంటి పైకప్పుపై ఎంత ఖాళీ ఉంటే ఎంత సామర్థ్యం గల సోలార్ యూనిట్ ను ఏర్పాటు చేసుకోవచ్చో లెక్కించేందుకు, దాని ప్రయోజనాలను తెలుసుకోడానికి కూడా ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. 

■ ఏవైనా ముందస్తు షరతులు ఉన్నాయా?

జ: గృహాలు సబ్సిడీకి అర్హత పొందేందుకు భారత్ లో తయారైన సోలార్ ప్యానెల్‌లను ఉపయోగించాలి. ప్రభుత్వం ప్రకటించిన జాబితాలోని అమ్మకందారుల ద్వారా వాటిని ఏర్పాటు చేయించుకోవాలి. ఈ జాబితా పోర్టల్ లో ఉంటుంది. ఒక కుటుంబానికి సబ్సిడీ కావాలంటే బ్యాటరీ ద్వారా విద్యుత్ ను నిల్వ చేసుకోకూడదు.

■ సబ్సిడీ పరిధిలోకి ఏమేమి వస్తాయి?

జ: 3 కిలోవాట్ వరకు సామర్థ్యం ఉన్న వ్యవస్థలకు మాత్రమే ఆర్థిక సహాయం లభిస్తుంది. 2 కి.వా. సామర్థ్యం గల యూనిట్లకు అయ్యే ఖర్చులో 60 శాతం, 2-3 కి.వా. సామర్థ్యం మధ్య ఉన్న యూనిట్లకు అదనపు ఖర్చులో 40 శాతానికి సబ్సిడీ వర్తిస్తుంది. అంటే ఒక కిలోవాట్ సామర్థ్యం గల యూనిట్లకు దాదాపు రూ.30,000, రెండు కిలోవాట్లకు రూ.60,000, 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల వ్యవస్థలకు రూ.78,000 సబ్సిడీ వస్తుంది. 

రూఫ్‌టాప్ ప్యానెల్‌లను అమర్చిన తర్వాత, ప్రభుత్వ అధికారులు అవసరమైన తనిఖీలు చేసిన తర్వాత సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.

■ వినియోగదారు ఏమైనా చెల్లించాలా?

జ: కుటుంబాలు కనీసం 40 శాతం ఖర్చును ముందుగా భరించాలి. అంటే సబ్సిడీని వర్తింపజేసిన తర్వాత మిగిలిన ఖర్చు. చిన్న ఇళ్లలో నివసిస్తున్న, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, ప్రత్యేకించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన వాటికీ ప్రాథమిక పెట్టుబడి పెట్టలేని పక్షంలో వారి కోసం పైకప్పు వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి కేంద్ర విద్యుత్ సంస్థలు సహాయపడతాయి. అటువంటి సందర్భాలలో సబ్సిడీ మొత్తం ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు వెళుతుంది. ముందస్తు పెట్టుబడిని కూడా ఈ సంస్థే పెడుతుంది. ప్రారంభ పెట్టుబడికి నిధులు సమకూర్చుకోడానికి లబ్ధిదారులు రాయితీ వడ్డీపై రుణాలను కూడా పొందవచ్చు.

■ ఇంతకు ముందు ఉన్న సౌర విద్యుత్ సబ్సిడీ పథకాలకు, దీనికి తేడా ఏమిటి?

జ: 2019లో మార్చిలో ప్రారంభించిన నివాస రూఫ్‌టాప్ సోలార్ కార్యక్రమం ఫేజ్-II కంటే ఈ కొత్త పథకం ఎక్కువ సబ్సిడీని అందిస్తుంది. అయితే, ఫిబ్రవరి 13లోపు సబ్సిడీ కోసం సమర్పించిన దరఖాస్తులకు పాత పథకం ప్రకారం ప్రభుత్వ సబ్సిడీ చెల్లిస్తుంది.

■ రూఫ్‌టాప్ యూనిట్ ధర ఎంత ఉంటుంది?

జ: రూఫ్‌టాప్ యూనిట్ సౌర ఫలకాల సంఖ్య, పరిమాణం, వాటి స్వభావం, సామర్థ్యం ప్రకారం దాని ధరను నిర్ణయిస్తారు. మౌంటింగ్ పరికరాలు, అనుబంధంగా వాడే ఎలక్ట్రానిక్ పరికరాల నాణ్యతపై కూడా ధర ఆధారపడి ఉంటుంది. ఒక కిలోవాట్ రూఫ్‌టాప్ యూనిట్ ధర రూ.72,000, 3 కిలోవాట్ యూనిట్ ధర రూ.1.6 లక్షల వరకూ ఉండవచ్చు

■ ఏ సోలార్ ప్యానెళ్ళు ఉపయోగించాలి?

జ: ఏకముఖ (మోనోఫేషియల్) లేదా ద్విముఖ (బైఫేషియల్) ప్యానెళ్లను ఎంచుకోవచ్చు. వేటిని ఎంచుకున్నా సమర్థత రేటింగ్ మొత్తం ఇంధన ఉత్పత్తిని నిర్ణయిస్తుంది. ఇదే ఇంధనంగా మార్చబడిన సూర్యకాంతి మొత్తాన్ని సూచిస్తుంది. ప్యానెళ్ల జీవితకాలం 25 సంవత్సరాలు. ఆ తర్వాత కూడా విద్యుదుత్పత్తి కొనసాగుతుంది, గాని తక్కువ స్థాయిలో జరుగుతుంది.

■ ఒక యూనిట్ కు ఎన్ని ప్యానెళ్లు అవసరమవుతాయి?

జ: చాలా 1 కిలోవాట్ వ్యవస్థలు ఒక్కొక్కటి 250-330 వాట్ల సామర్థ్యం గల 3-4 సౌర ఫలకాలను కలిగి ఉంటాయి. అధిక సామర్థ్యం గల ప్యానెళ్లు అయితే నిర్దేశిత విద్యుదుత్పత్తికి తక్కువ సంఖ్యలో ప్యానెళ్లను ఏర్పాటు చేసినా సరిపోతుంది. ఉత్పత్తి సామర్థ్యం పెరిగే కొద్దీ ప్యానెళ్ల సంఖ్య పెరుగుతుంది.

■ విద్యుత్ ఉత్పత్తిని ఎలా లెక్కిస్తారు?

జ: దీన్ని నెట్ మీటరింగ్ ద్వారా చేస్తారు. ఇది వినియోగదారులను ‘ప్రొసూమర్స్’ (అటు ఉత్పత్తిదారులు, ఇటు వినియోగదారులు)గా మారుస్తుంది. రూఫ్‌టాప్ వ్యవస్థలు ఉన్న గృహాలు మిగులు శక్తిని యుటిలిటీ గ్రిడ్‌కు అమ్ముకోవచ్చు.

■ నెట్ మీటరింగ్ ఎలా పని చేస్తుంది?

జ: సౌర విద్యుత్ ఉత్పత్తి వినియోగదారు వాడే విద్యుత్తు కంటే తక్కువగా ఉన్నప్పుడు, సాధారణ కనెక్షన్ ద్వారా గ్రిడ్ నుండి అతను విద్యుత్‌ను తీసుకుంటాడు. వినియోగదారు ఉపయోగించిన యూనిట్ల సంఖ్యకు ఛార్జీ వసూలు చేస్తారు. సౌర ఉత్పత్తి ఉత్పత్తి అతను వాడే విద్యుత్తు కంటే ఎక్కువ ఉన్నప్పుడు మిగులు విద్యుత్ గ్రిడ్ కనెక్షన్ ద్వారా పంపిణీ వ్యవస్థలోకి ప్రవహిస్తుంది.

బిల్లింగ్ సైకిల్ చివరలో ఒక గృహం సరఫరా చేసిన దాని కంటే ఎక్కువ వినియోగించుకుందా లేక గ్రిడ్‌కి నికరంగా విద్యుత్ సరఫరా చేసిందా అనే దాని ఆధారంగా అది ఉపయోగించిన విద్యుత్ కు ఛార్జి వసూలు చేయడమో లేక వినియోగదారుడు గ్రిడ్ కు ఇచ్చిన యూనిట్ల సంఖ్యకు డబ్బు చెల్లించడమో చేస్తారు. వినియోగదారుడు తన ఖాతాలో మిగులును తరువాతి బిల్లింగ్ సైకిల్‌కు బదిలీ కూడా చేసుకోవచ్చు.