ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే జమిలి ఎన్నికలు
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ (ఓఎన్ఓఇ) పై ఉన్నత స్థాయి కమిటీ మార్చి 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఉమ్మడి ఎన్నికలపై తన నివేదికను సమర్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దీని అవసరం గురించి తరచుగా మాట్లాడుతున్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను, పాలనను రెండింటినీ బలోపేతం చేయడానికి జాతీయ, రాష్ట్ర ఎన్నికలను ఒకేసారి నిర్వహించవలసిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. నిజానికి స్వాతంత్య్రం తర్వాత తొలి దశాబ్దాలలో ప్రజలు నేరుగా ప్రతినిధులను ఎన్నుకొనే లోక్ సభకు, రాష్ట్ర శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. అయితే కాలక్రమంలో, పదవీకాలం ముగియక ముందే రాజ్యాంగంలోని అధికరణం 83, 172 ప్రకారం సభలను రద్దు చేయడం (లోక్సభ, రాష్ట్ర శాసనసభలు రెండిటి విషయంలో ఇది జరిగింది), అధికరణం 356 కింద రాష్ట్రపతి పాలన విధించడం వల్ల ఎన్నికల వలయానికి అంతరాయం కలిగింది. కాలక్రమంలో రాష్ట్రాల శాసన సభలు, లోక్ సభ ఎన్నికలకు మధ్య పొంతన లేకుండా పోయింది. వరుసగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి వ్యవస్థాగతమైన ప్రయత్నాలేమీ చేయలేదు. పర్యవసానంగా ఎటువంటి స్థితికి చేరుకున్నామంటే ప్రతి సంవత్సరం అనేక రాష్ట్రాలో ఎన్నికలు జరుగుతున్నాయి. భారత ప్రజాస్వామ్యం ఒక శాశ్వత ఎన్నికల వలయంగా మారింది. ఎన్నికల కోసమే ఎన్నికలు అన్న చందంగా పరిస్థితి తయారైంది. పరిపాలన, ఆర్థిక వనరులు, మొత్తం ప్రజాస్వామ్యం పైనే ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది.
భారతదేశ పరిమాణం, పెరుగుతున్న జనాభా దృష్ట్యా రాష్ట్ర ఎన్నికలు కూడా విస్తృతమైన బట్వాడా (లాజిస్టిక్స్), భద్రతా చర్యలతో కూడుకున్న ఖరీదైన వ్యవహారం. ముఖ్యమైన వనరులు ఎన్నికల నిర్వహణ కోసం మళ్లించాల్సి వస్తోంది. ఎన్నికలను ఒకేసారి జరిపితే ఈ వనరులను సమర్థంగా ఉపయోగించుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ లో 2022లో ఎన్నికల కోసం పరిపాలనా, భద్రతా యంత్రాంగాన్ని విస్తృతంగా మోహరించాల్సి వచ్చింది. ఇప్పుడు, 2024లో అదే ప్రక్రియ ఈసారి లోక్సభ ఎన్నికలకు పునరావృత్తమవుతుంది. ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించడం కంటే పరిపాలనపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడంతోపాటు వనరులను సమర్థంగా, పొదుపుగా వినియోగించుకోవడానికి జమిలి ఎన్నికలు తోడ్పడతాయి.
జమిలి ఎన్నికలు (ఓఎన్ఓఇ) రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవారికి, స్వల్పకాలిక ప్రజాకర్షక చర్యలకు బదులుగా దీర్ఘకాలిక విధానాలపై దృష్టి సారించడానికి వెసులుబాటు కల్పిస్తాయి. ప్రజాస్వామ్య ప్రక్రియకు, నైతిక విలువలకు సంబంధించి ప్రధానమైన ముప్పులలో ఒకటి ఎన్నికల అవినీతి. ఇటీవల కాలంలో అనేక పార్టీలు ఓటర్లను అడ్డదారిలో ఆకట్టుకోడానికి ఎన్నికల సమయంలో తమ పాలన చరిత్ర గురించి చెప్పకుండా జోరుగా ఉచితాలు, ప్రజాకర్షక పథకాలను వాగ్దానం చేస్తున్నాయి. ఇప్పటికే దేశ వనరులపై మోయలేని భారం వేసి, వృద్ధి అవకాశాలను దెబ్బతీస్తున్న ఇలాంటి బాధ్యతారాహిత్య రాజకీయాలకు జమిలి ఎన్నికలు అడ్డుకట్ట వేస్తాయి.
ఓఎన్ఓఇ ఓటర్లలో ఎన్నికల అలసటను కూడా తగ్గిస్తుంది. తద్వారా ఎన్నికల ప్రక్రియలో వారి చురుకైన భాగస్వామ్యాన్ని పెంచుతుంది. దీనిఫలితంగా అధిక ఓటింగ్ శాతం నమోదవుతుంది. ప్రజాస్వామ్యం నాణ్యత అందులో జరిగే చర్చ ఔన్నత్యంపై ఆధారపడి ఉంటుంది. తరచుగా జరిగే ఎన్నికలు, మన ఎన్నికల్లో ఉండే తీవ్రమైన పోటీ స్వభావం వల్ల దురదృష్టవశాత్తూ అనేక మంది రాజకీయ నాయకులు కులం, మతం, ప్రాంతీయ వైరుధ్యాలను అడ్డం పెట్టుకుని ప్రతికూల ప్రచారానికి పాల్పడేందుకు దోహదం చేస్తాయి. భావోద్వేగ విన్నపాలు, తప్పుడు ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునే ధోరణులతో విధానాలు, పాలనకు సంబంధించిన సమస్యలు తరచుగా పక్కదారి పడుతాయి. ఉమ్మడి ఎన్నికలు విభజనలను తగ్గిస్తాయని, రాజకీయ పార్టీలు, నాయకులు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం తమ దీర్ఘకాలిక విధానం, ఎజెండాల గురించి చర్చించక తప్పని పరిస్థితి కల్పిస్తాయనడంలో సందేహంలేదు.
ఏదైనా విధాన మార్పు లేదా వ్యవస్థాగత సంస్కరణ సమాజంలోని కొన్ని వర్గాలు తమ ప్రత్యేక అధికారాలు కోల్పోయేలా చేస్తుంది. ఒకేసారి ఎన్నికల అవసరంపై అన్నిపార్టీలూ ఏకీభవించినప్పటికీ తరచుగా వచ్చే ఎన్నికల ద్వారా ప్రయోజనాలను ఆశించే పార్టీలు అందుకు బహిరంగంగా అంగీకరించడం లేదు. కాలుష్యం, వాతావరణ మార్పులు, కార్మిక చట్టాలు, వ్యవసాయ చట్టాల వంటి సంస్కరణలు వంటి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి సాహసోపేతమైన విధాన చర్యలను అమలు చేయడానికి ఉమ్మడి ఎన్నికలు ప్రభుత్వానికి వెసులుబాటు కల్పిస్తాయి. దీర్ఘకాలిక ప్రయోజనం కోసం కొన్ని తాత్కాలిక అసౌకర్యాలను భరించడంలో తప్పులేదు. విధానాలలో ఏకపక్ష ధోరణులు, స్థిరత్వ రాహిత్యం, ఎన్నికల్లో తాత్కాలిక లబ్ధికోసం అనుసరించే సామ్యవాద జనాకర్షక విధానాలు భారత దేశంలో ఆర్ధిక వృద్ధికి ప్రధాన అవరోధాలు.
‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ ప్రభుత్వంలో స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది పాలన, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచి తద్వారా మదుపుదారుల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. ఓఎన్ఓఇ వ్యతిరేకులు ఇది సమాఖ్యవాదాన్ని దెబ్బతీస్తుందని వాదిస్తారు. అయితే స్వాతంత్య్రం వచ్చిన తొలి దశాబ్దాలలో సమాఖ్యతత్వానికి ఎటువంటి నష్టం జరగకుండా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా ఉండేది. వాస్తవానికి, ఏకకాల ఎన్నికలు జాతీయ, రాష్ట్ర పార్టీలు, ప్రభుత్వాలు సన్నిహితంగా కలిసి విధాన నిర్ణయాలు తీసుకునే వీలు కల్పించడం ద్వారా మరింత సహకార ససమాఖ్య స్ఫూర్తిని ప్రోత్సహిస్తాయి. ప్రభుత్వాలన్నీ ఒకేసారి ఎన్నికవుతాయి గనుక, నిర్ణీత కాలం అధికారంలో ఉంటాయి గనుక వివిధ స్థాయిలలోని ప్రభుత్వాలు విధానాల అమలుపై మరింత సన్నిహితంగా సమన్వయంతో వ్యవహరించేందుకు వీలుకలుగుతుంది. ఇది దేశ, రాష్ట్ర సమస్యలను పరిష్కరించడానికి మరింత సమగ్ర విధాన రూపకల్పనకు దారి తీస్తుంది.
జమిలి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ సమస్యల కంటే జాతీయ సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుందనే ఆందోళనలకు కూడా అర్థం లేదు. మొదటిది, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినా లేక తక్కువ వ్యవధిలో జరిగినా జాతీయ, రాష్ట్ర, స్థానిక ఎన్నికల్లో వేర్వేరు తీర్పులు ఇవ్వడం ద్వారా భారతీయ ఓటర్లు తమ విచక్షణను, వివేకాన్ని ఎన్నో సందర్భాల్లో ప్రదర్శించారు. రెండవది, దీనివల్ల ఇంకో ప్రయోజనం కూడా ఉంటుంది. పార్టీలు జాతీయ అంశాలతో పాటు ప్రాంతీయ అంశాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. ప్రాంతీయ లేదా జాతీయమైన ఏ రాజకీయ పార్టీ అయినా జాతీయ లేదా ప్రాంతీయ సమస్యల పట్ల ఉదాసీనంగా ఉండలేనందున అవి జాతీయ, ప్రాంతీయ అంశాలు రెండింటి పట్ల సమతూకాన్ని పాటిస్తాయి.
కోవింద్ కమిటీ ముఖ్యమైన సిఫార్సులలో ఒకటి మున్సిపాలిటీలు, పంచాయితీల ఎన్నికలను లోక్ సభ, రాష్ట్ర శాసనసభల ఎన్నికలతో పాటే నిర్వహించడం, జాతీయ, రాష్ట్ర ఎన్నికలు జరిగిన 100 రోజులలోపు నిర్వహించడం. ఇది అంతిమంగా ప్రభుత్వ యంత్రాంగంలో మూడవ అంచె అయిన స్థానిక పరిపాలనను క్రమబద్దీకరించేందుకు, పునరుజ్జీవింపజేసేందుకు, సాధికారీకరించేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇది నిజంగా అట్టడుగుస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. మునుపెన్నడూ లేనివిధంగా పౌరులను సాధికారీకరిస్తుంది. ఈ నివేదిక నిస్సందేహంగా ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశంపై భవిష్యత్తులో జరిగే చర్చకు ప్రాతిపదిక అవుతుంది.
అభినవ్ ప్రకాష్
జాతీయ ఉపాధ్యక్షుడు, బిజెపి యువమోర్చా

