tgpsc

పోటీ పరీక్షల నిర్వహణలో బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ అక్రమాలు!

పోటీ పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడడంతో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చెప్పుకోదగిన విధంగా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేక పోయారు. ఆ పార్టీ అధికారం కోల్పోవడానికి నిరుద్యోగ యువతలో చెలరేగిన ఆగ్రహావేశాలు ఓ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సైతం అదేబాటలో నడుస్తుంది అనేందుకు తాజాగా హైకోర్టు గ్రూప్‌-1 పోస్టుల నియామకాలకు ఆపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఓ నిదర్శనం. ఈ పరీక్షల నిర్వహణలో అనేక అక్రమాలు జరిగాయని ఫలితాలు వెల్లడి చేశాయి. గ్రూప్‌-1 పోస్టులను కాంగ్రెస్‌ నేతలు అమ్ముకున్నారా? పోస్టుకో రేటు చొప్పున బేరం పెట్టారా? అంటూ నిరుద్యోగ జేఏసీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టాపర్లలో పలువురు కాంగ్రెస్‌ నేతల కుటుంబ సభ్యులు ఉన్నారని వారు పలు ఆధారాలను చూపుతున్నారు. గ్రూప్‌-1 జీఆర్‌ఎల్‌లో, టాపర్ల జాబితాలో అత్యధికులు కొత్తగా 2024లో దరఖాస్తుచేసిన వారేనని ఆరోపిస్తున్నారు.

 రెండు పరీక్ష కేంద్రాల నుంచే 74 మంది టాపర్లు ఉండటం, ఒకే గదిలో రాసిన వారికి, పక్క పక్క బెంచీలు, వెనుక బెంచీల్లోని వారికి అత్యధిక మార్కులు రావడం వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదని నిరుద్యోగ జేఏసీ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీబీసీఐడీ చేత విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 75 రోజుల్లో మూల్యాంకనం చేయడం, వరుస హాల్‌టికెట్‌ నంబర్లు కలిగిన 68 మందికి ఒకే మార్కులు రావడం, ఉర్దూలో పరీక్ష రాసిన 9 మందిలో ఏడుగురికి అత్యధిక మార్కులు రావడం వెనుక ఆంత్యర్యమేమిటని ప్రశ్నించారు. చివరకు ఈ ఫలితాల వివాదం న్యాయస్థానం చేరడంతో తాము ఆదేశించే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కొనసాగించేందుకు అనుమతిచ్చింది. అభ్యర్థుల డేటా నమోదుకు సంబంధించిన కంప్యూటర్‌ లాగ్‌ హిస్టరీ సమర్పించాలని సర్వీస్‌ కమిషన్‌ను ఆదేశించింది.

గ్రూప్‌-1 పరీక్ష మూల్యాంకనంలో తప్పులు జరిగాయని, దీనిపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలంటూ ఎం పరమేశ్‌ సహా 20 మంది దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు విచారణ చేపట్టారు. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై సమగ్ర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయమూర్తి టీజీపీఎస్సీకి నోటీసులు జారీచేశారు. రీకౌంటింగ్‌ దరఖాస్తు చేస్తే మార్కులు తగ్గిన అభ్యర్థిని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్లను కూడా ఆదేశించారు. పిటిషనర్లు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో, వాళ్ల హోదా, ఇతర వివరాలను నివేదించాలని పేర్కొన్నారు. ఒకవేళ తప్పుడు వివరాలతో పిటిషన్లు వేసి ఉంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పిటిషనర్లను హెచ్చరించారు. అదే సమయంలో టీజీపీఎస్సీలో అవకతకవలు జరిగాయని తేలితే కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేశారు. 

563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో రెండే రెండు పరీక్షా కేంద్రాల నుంచి ఏకంగా 71 మంది ఎంపికయ్యారు. ఇది అనేక అనుమానాలను రేకెత్తిస్తుంది. ఇక 482 మారులు వచ్చిన ఒక అభ్యర్థి ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయని రీకౌంటింగ్‌ చేయించుకుంటే అవి 422కు తగ్గిపోయాయి. గ్రూప్‌-1 మెయిన్స్ కు 21,075 మంది హాజరయ్యారు, తుది జాబితాలో ఆ సంఖ్య 21,085కు పెరిగింది, కొత్తగా పది మంది ఎకడి నుంచి వచ్చారనే ప్రశ్నకు జవాబు లేదు. దేశంలోని వివిధ ప్రభుత్వ కాలేజీల్లోని నిపుణులైన ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయిస్తామని సర్వీస్‌ కమిషన్‌ చెప్పింది, తీరా పదవీ విరమణ పొందిన వారితో చేయించింది. ప్రిలిమ్స్‌కు, మెయిన్‌కు హాల్‌ టికెట్ల నంబర్లు వేర్వేరుగా ఇవ్వడం వెనకా పలు సందేహాలున్నాయి. తొలుత 45 సెంటర్లని ప్రకటించి ఆ తర్వాత 46 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. రెండు సెంటర్లల్లో పరీక్షలు రాసిన వారిలో 71 మంది అర్హత సాధించారు. దీని వెనుక దాగిన ‘ప్రతిభ’ ఏమిటో తేలాల్సి ఉంది.

ప్రవీణ్