Nirmala Sitaraman

ప్రజలకు ఊరట, స్వావలంబన.. ఇవే ప్రధాన లక్ష్యాలు

భారీ పన్ను సంస్కరణలో భాగంగా జీఎస్టీని సమూలంగా మార్చేశామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ సవరణల వెనుక ప్రధాన ఉద్దేశం ప్రజలకు ఆర్థికంగా ఉపశమనం కల్పించడం, స్వావలంబన (ఆత్మనిర్భరత)కు ఊతమివ్వడమేనని ఆమె చెప్పారు. ఒక వాణిజ్య దినపత్రికకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలోని ప్రధానాంశాలు: 

ప్ర: భారత ఆర్థిక వ్యవస్థ జూన్ త్రైమాసికంలో బాగా పుంజుకున్నా.. అమెరికా సుంకాలు, ఇతర సవాళ్ల వల్ల ప్రతికూలత ఎదురవుతోంది. జీఎస్టీ సంస్కరణలు దీని నుంచి కొంత ఊరట ఇస్తాయా?

జ: ఈ సంస్కరణలు సుంకాల సవాళ్లను ఎదుర్కోడానికి ఉద్దేశించినవి కాదు. పరోక్షంగా సుంకాల వల్ల ప్రభావితమయ్యే వారికి ఇది కొంత మేలు చేస్తుందంతే. పన్నుల సవరణల వెనుక మా ఉద్దేశం సుంకాల సమస్యకు మాత్రమే పరిమితం కాదు. ఇది పరోక్ష పన్నుల నిర్వహణకు ఒక కొత్త తరం విధానం. గత ఆరు-ఎనిమిది నెలలుగా ఆర్థిక శాఖ, ముఖ్యంగా రెవెన్యూ విభాగం చాలా కష్టపడి పనిచేశాయి. ఈ అధికారులు అందరికీ నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. సాధారణంగా రాజకీయ నిర్ణయాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం పనిచేయదనే అభిప్రాయం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విభాగానికి చెందిన అధికారులు అద్భుతమైన వేగంతో పనిచేశారు. కేవలం ఎనిమిది నెలల కాలంలోనే, కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని రూపొందించి సెలెక్ట్ కమిటీ ఆమోదం తర్వాత పార్లమెంటులో ఆమోదింపజేశాం. అంతేకాకుండా, బడ్జెట్‌లో రూ.12 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల ఉపశమనం ఇచ్చాం. ఇప్పుడు జీఎస్టీని సమగ్రంగా మార్చాం. ఇదంతా కేవలం ఎనిమిది నెలల్లోనే జరిగింది.

ప్ర: దీనివల్ల ఎంతవరకు వినియోగం, ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని మీ అంచనా?

జ: ఇది భారత ఆర్థిక వ్యవస్థ, దాని వృద్ధి గణాంకాలపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే ఇది మన 140 కోట్ల మంది ప్రజలనూ ప్రభావితం చేస్తుంది. మీరు ఆహార అవసరాలకు లేదా ఇంటి కోసం ఏది కొనుగోలు చేసినా, లేదా వాహనం కొనుగోలు చేసినా… ప్రతి దానిపై జీఎస్టీ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇది కచ్చితంగా సానుకూల ప్రభావం చూపుతుంది.

ప్ర: రెవెన్యూ కార్యదర్శి ఈ మార్పుల వల్ల రూ.48,000 కోట్ల ఆదాయం తగ్గుతుందని చెప్పారు. అయితే, ఆ లోటును భర్తీ చేయడం సాధ్యమవుతుందన్నారు. ఈ తగ్గించిన పన్నుల వల్ల వినియోగం పెరిగి, ఆ ఆదాయం రూ.48,000 కోట్లను మించి వస్తుందని మీరు అంచనా వేస్తున్నారా? దీనిపై ఏమైనా పరిమాణాత్మక సూచికలను ఉదహరించగలరా?

జ : ఈ రూ.48,000 కోట్ల అంచనా 2023-24 సమాచారం ఆధారంగా వేసిన అంచనా. కానీ నిజమైన ప్రభావం గురించి ఇప్పుడు చెప్పలేం. సెప్టెంబరు 22 నుంచి (జీఎస్టీ 2.0 అమల్లోకి వస్తుంది) ప్రజలు బయటికి వచ్చి కొనుగోలు చేయడం మొదలుపెడితే, కోవిడ్ తర్వాత వారు ఎలాగైతే వచ్చారో అలా.. దానివల్ల ఒక కొత్త ఘట్టం మొదలవుతుంది. అప్పుడు మనం అసలు పరిస్థితిని అంచనా వేయగలం.

ప్ర: భారత్ 50 శాతం అమెరికా సుంకాలను భరించాల్సి ఉంటుందా? లేదా ఒప్పందం జరిగే అవకాశం ఏదైనా ఉందా? ఒకవేళ సుంకాలు కొనసాగితే, ఆర్థిక వ్యవస్థను దానికి ఎలా సిద్ధం చేస్తారు?

జ : ఇదెంత కాలం ఉంటుందో చెప్పడం కష్టం. చర్చలను కొనసాగించడానికి వాణిజ్య శాఖ ప్రయత్నిస్తోంది. ఈ చర్చలు పూర్తవుతాయా, ఒకవేళ పూర్తయితే సుంకాల విషయంలో ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు ఊహాజనితమైనవి. ఒక నిర్దిష్ట అంకెకు చేరుకొని, ఏదో ఒక నమూనా లేదా ప్యాకేజీలను సిద్ధం చేయడం సాధ్యం కాదు. మేం ఆ పని చేయడం లేదు.

ప్ర: అయితే ఎగుమతి రంగానికి మద్దతు ఇవ్వడంపై ఏమైనా చర్చ జరుగుతోందా? బడ్జెట్‌లో ప్రకటించిన ఎగుమతి మిషన్‌ (కార్యక్రమం) కు అదనంగా ఈ చర్యలు ఉంటాయా?

జ: ఎగుమతి మిషన్ అనేది సంస్కరణలు, తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెడుతుంది. కానీ సుంకాల వల్ల దెబ్బతిన్న రంగాలకు ఎదో ఒక రకమైన మద్దతు అందించేందుకు పథకాలు రూపొందిస్తున్నాం. దానికి రూపురేఖలు ఎలా ఉంటాయో చూడాలి. చాలా విభాగాలు దీనిపై కలిసి పనిచేస్తున్నాయి.

ప్ర: ఇది వచ్చే కొన్ని వారాల్లో ఆశించవచ్చా?

జ: అలా అనే ఆశిస్తున్నాను. ఒక గడువు పెట్టి అంచనాలను పెంచాలని అనుకోవడం లేదు.

ప్ర: అయితే ఎగుమతి రంగాల ప్యాకేజీకి ప్రాధాన్యం ఇస్తున్నారా?

జ: అవును, త్వరలో దీనితో మీ ముందుకు వస్తామని ఆశిస్తున్నాం. 

ప్ర: ఇది ముఖ్యంగా వస్త్ర రంగానికి సంబంధించినది అని చెప్పడం సమంజసమేనా?

జ: సుంకాల వల్ల ప్రభావితమైన రంగాలు వాటి మంత్రిత్వ శాఖలను సంప్రదించి ఉంటాయి. ఆయా మంత్రిత్వ శాఖలు ప్యాకేజీని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి, ఆయా రంగాల కోసం ఆ ప్యాకేజి ఉంటుంది.

ప్ర: జీఎస్టీ మార్పుల వెనుక ఉన్న ప్రధాన సూత్రాల గురించి చెబుతారా? మాంసకృత్తులు (ప్రోటీన్) ధరను కాస్త తగ్గించారు కదా?

జ : ప్రధాన సూత్రాలు ఇవే – పేదలు, మధ్యతరగతి ప్రజలు రోజువారీ ఉపయోగించే వస్తువులు, రైతులకి ముఖ్యమైన వస్తువులు, అలాగే భారత ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన వస్తువుల ధరలు తగ్గించడం. వీటిలో కొన్ని ఆత్మనిర్భరత (స్వావలంబన) సాధించడానికి కీలకమైనవి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) తమ ఉత్పత్తులకు లేదా ప్రక్రియలకు ఉపయోగించే వస్తువులు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే పన్ను రేట్లను సమీక్షించాం. ప్రాధాన్యాలకు ఇదే పునాది.

ప్ర: జీఎస్టీ కౌన్సిల్ సమావేశం చివర్లో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నందుకు మీరు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏకాభిప్రాయం మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందా?

జ : లేదు. జీఎస్టీ కౌన్సిల్ మీద నాకు ఎప్పుడూ గౌరవం ఉంది. వాదోపవాదాలు, ఆయా రాష్ట్రాల సమస్యలను గట్టిగా, అనేకసార్లు ప్రస్తావించినప్పటికీ, చివరికి అందరికీ వర్తించే ఒకదానిపై అంగీకారానికి వస్తారు. ఈసారి కూడా అదే భావన నాకు కలిగింది. రాష్ట్రాలు తమ వాదనలు బలంగా పదేపదే వినిపించాయి. అయితే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఉన్నప్పటికీ వారు చివరికి ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్ర: పరిశ్రమ నుంచి స్పందన ఎలా ఉంది? మీరు వారితో సంభాషించారా? పన్ను తగ్గింపులను వినియోగదారులకు అందించేందుకు వారు సిద్ధంగా ఉన్నారా?

జ : వారు అలా చేస్తామని స్వచ్ఛందంగా చెప్పారు. చాలా పరిశ్రమలు అలా చెప్పాయి. నేను ముందుగా చెప్పేది ప్రభుత్వ రంగ బీమా సంస్థల గురించి. వారు పన్ను తగ్గింపులను వినియోగదారులకు అందిస్తామని చెప్పారు. టాటా మోటార్స్ వారు ప్యాసింజర్ వాహనాలపై పన్ను తగ్గింపులను వినియోగదారులకు అందిస్తామని రాశారు. ఇలా కంపెనీలు మాకు నేరుగా చెప్పకపోయినా, తగ్గింపులు ఇస్తామని ప్రకటిస్తున్నాయి.

ప్ర: పరిశ్రమకు సెప్టెంబర్ 22 గడువులోగా అవసరమైన బిల్లింగ్ సర్దుబాట్లు చేసుకోవడం కష్టమవుతుందేమోనని ఆందోళన ఉంది. కొంతమంది గడువును పెంచమని కోరుతున్నారు. త్వరగా సర్దుబాటు చేసుకోవడానికి తగినంత సమయం ఉందని మీరు అనుకుంటున్నారా?

జ: దీనికి సంబంధించిన వివరణలు ఎప్పటికప్పుడు జారీ చేస్తాం. కానీ ఇది సాధ్యమే. మేం దాదాపు అన్ని రంగాలతో మాట్లాడాం. ఇది ప్రజల కోసమే కాబట్టి వారంతా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు.

ప్ర: భారత మార్కెట్ల నుంచి నిరంతరాయంగా పెట్టుబడుల నిధులు బయటకు వెళ్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయమేనా?

జ : లేదు. ఈ ధోరణి కొనసాగినా పరవాలేదు.. పెట్టుబడి వలయం ఎలా పనిచేస్తుందో మనం చూడాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చితుల దృష్ట్యా, పెట్టుబడులు ఎక్కడికి వెళ్తున్నాయో కచ్చితంగా చెప్పలేం. అవి అమెరికాకు తిరిగి వెళ్తున్నాయా? జపాన్‌కు వెళ్తున్నాయా? మనం చెప్పలేం. ఆగ్నేయాసియా దేశాలకు అందుతున్నాయా? మనకు తెలియదు. నేను ఆందోళన చెందుతున్నాను లేదా చెందడం లేదు అని చెప్పేముందు ఈ ధోరణిని గమనించి అంచనాలకు రావడం ముఖ్యం.

ప్ర: అయితే పెట్టుబడులకు గమ్యస్థానంగా భారతదేశ ఆకర్షణ తగ్గలేదని మీరు అనుకుంటున్నారా?

జ: దానికి భిన్నంగా మన సూచీలు ఇప్పుడు మెరుగయ్యాయి.

ప్ర: రూపాయి మరో కొత్త కనిష్ట స్థాయికి చేరుకుంది. అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా?

జ: ఇది డాలర్‌తో పోలిస్తే మాత్రమే. హెచ్చుతగ్గులు ఎప్పుడూ ఇబ్బందికరమైనవే. దీనివల్ల పరిశ్రమలకు లాభం జరుగుతోందా లేక నష్టం జరుగుతోందా అనేది ఆలోచించాలి. రిజర్వు బ్యాంక్ దీనిపై అవసరమైన చర్యలు తీసుకుంటోంది. 

 ప్ర: రష్యా చమురు కొనుగోలు విషయానికొస్తే దాని ప్రభావం దేశంలో చమురు ధరలపై చాలా తక్కువగా ఉంది. ఒక ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి (అమెరికా) దీని కారణంగా మనపై భారీ జరిమానా (25 శాతం అదనపు సుంకాలు) విధించినప్పుడు రష్యా చమురు కొనుగోలుపై పునరాలోచించుకోవలసిన అవసరం లేదంటారా?

జ: మీరు దీన్ని ఇంత చిన్న విషయం గా చూడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మనం ఏది కొనాలి, ఎక్కడ కొనాలి అని నిర్ణయించుకునే సార్వభౌమ హక్కు మనకు లేదా? ఒక ముఖ్యమైన భాగస్వామి (అమెరికా) మీరు ఇక్కడ కొనొద్దు, అక్కడ కొనొద్దు, ఇక్కడే కొనాలి అని చెప్తే… ఒక ముఖ్యమైన భాగస్వామిని మేం గౌరవిస్తాం, కానీ నా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమైన విషయాల్లో మనమే నిర్ణయం తీసుకోవాలి, మరొకరు మనల్ని ప్రభావితం చేయకూడదు. మన సార్వభౌమ స్వయంప్రతిపత్తిని మనం కాపాడుకోవాలా? వద్దా? అని ఆలోచించుకోవాలి.

ప్ర: ఇది చౌకగా వస్తున్న చమురే. కానీ ఇప్పుడు కొంత వ్యతిరేకత ఉంది కదా ?

జ: అది అన్యాయం. యుద్ధం, పాశ్చాత్య ఆంక్షల తర్వాత మనం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్నప్పుడు చాలా దేశాలకు అది స్పష్టంగా తెలుసు. అందుకే వారే మన నుంచి కొన్ని శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను తీసుకున్నారు. మనం స్వతంత్ర దేశంగా ఎక్కడ తప్పు చేశామో చెప్పండి. మనం చౌకగా ఉందని దిగుమతి చేసుకున్నాం. మీకు నేను దిగుమతి చేసుకుంటున్నానని తెలుసు. నా శుద్ధి చేసిన ఉత్పత్తులు మీకు, మీ భాగస్వాములకు వెళ్తున్నాయి. అలాంటప్పుడు వేరేలా చేయాలని ఇప్పుడు ఎందుకు చెప్పాలి? మనం రహస్యంగా ఏమీ చేయలేదు.

ప్ర: ఈ సమయంలో దాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందా?

జ : సమీక్ష అయినా, కాకపోయినా. మనకు సార్వభౌమ జాతీయ నిర్ణయాధికారం ముఖ్యం.

ప్ర: కొంతమంది వ్యాఖ్యాతలు భారతదేశం దీనిని 1991 పరిస్థితిగా భావించి, సంస్కరణలను మరింత వేగవంతం చేయాలని అన్నారు. జీఎస్టీ 2.0 రూపంలో ఒక పెద్ద సంస్కరణ జరిగింది. ఇంకా మరిన్ని సంస్కరణలు ఉన్నాయా?

జ: నా మంత్రిత్వ శాఖ పరిధిలో ఇది చేశాను. ఇతర మంత్రిత్వ శాఖల్లో కూడా పని జరుగుతోందని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. ప్రధాని మోదీ సంస్కరణల విషయంలో పట్టుదలగా ఉన్నారు. కోవిడ్ సమయంలో కూడా ఆయన సంస్కరణలు చేపట్టారు. కాబట్టి సంస్కరణల ఎజెండాను ఎప్పుడూ పక్కన పెట్టం.

ప్ర: కనీసం భారీ పన్ను సంస్కరణలు, మీ ఎజెండాలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇప్పుడు పూర్తయ్యాయని చెప్పవచ్చా?

జ: అవును, ఎందుకంటే వ్యవస్థ, ప్రక్రియల సంస్కరణతో కలిపి, మేం దీనిని (జీఎస్టీ) చేశాం, ఆదాయపు పన్నును కూడా చేశాం.