జీఎస్టీ సంస్కరణలు : సామాన్యుడికి వరం
స్వాంతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రజలకు దీపావళి కానుకగా జీఎస్టీ రేట్లు తగ్గిస్తామని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన మాటను నెరవేర్చారు. చెప్పిన దాని కన్నా ముందే రేట్లు తగ్గించి పండగ సీజన్ లో ప్రజలకు ఉత్సాహాన్నిచ్చారు. సామాన్యుడికి ప్రయోజనం చేకూర్చేలా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తూ మోదీ ప్రభుత్వం జీఎస్టీ (వస్తు-సేవల పన్ను)పై కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబులను రెండింటికి కుదించారు. 12%, 28% పన్ను స్లాబులను రద్దు చేశారు. 5%, 18% స్లాబులనే అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం 12 శాతం స్లాబులో ఉన్న వస్తువులు ఇప్పుడు 5 శాతం, జీరో పన్నులోకి వచ్చాయి. 18 శాతం స్లాబులో ఉన్నవి 12 శాతానికి తగ్గాయి. సెప్టెంబర్ 22 నుంచి ఈ సంస్కరణలు అమల్లోకి రానున్నాయి. గుట్కా, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై మినహా మిగిలిన ఉత్పత్తులపై పన్నులు మారనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సెప్టెంబర్ 3న దాదాపు పదిన్నర గంటలసేపు సుదీర్ఘంగా కొనసాగిన జీఎస్టీ పాలకమండలి 56వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పన్నులు తగ్గించడంతో తలనూనెలు, కార్న్‌ఫ్లేక్స్, టీవీలు, వ్యక్తిగత ఆరోగ్య ఉత్పతులు, జీవిత బీమా పథకాలు వంటివాటి ధరలు తగ్గే అవకాశం ఉంది. రోటీ, పరోటాలపై జీఎస్‌టీ సున్నా. ప్రాణాధార ఔషధాలపై ఎటువంటి పన్ను లేదు. హస్తకళా ఉత్పత్తులు, పాలరాయి, గ్రానైట్ దిమ్మెలపై 5 శాతమే. విద్యుత్తు వాహనాలపై 5% పన్ను కొనసాగనుంది. వ్యక్తిగత బీమా పథకాలపై జీఎస్‌టీ రద్దు చేయడం.. కోట్ల మందికి బీమాను చేరువ చేసేందుకు ఉపయోగపడనుంది. సిమెంటుపై జీఎస్‌టీ 28% నుంచి 18 శాతానికి తగ్గించడం నిర్మాణ రంగానికి ఊపునివ్వనుంది. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు-సిగరెట్లపై ప్రత్యేకంగా 40% స్లాబును ప్రతిపాదించారు. రేస్ క్లబ్బులు, లీజింగ్/ రెంటల్ సేవలు, క్యాసినోలు, జూదం, గుర్రపు పందేలు, లాటరీ, ఆన్‌లైన్ మనీ గేమింగ్‌పై 40% పన్ను పడుతుంది. దాదాపుగా వ్యక్తిగత వస్తువులన్నింటికీ పన్ను తగ్గించడం ద్వారా దేశీయ వినిమయాన్ని పెంచి.. అమెరికా సుంకాల భారం నుంచి కొంత ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ వాణిజ్యాన్ని పరుగు పెట్టించేందుకు, వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహించే దిశగా జీఎస్‌టీ మండలి నిర్ణయాలు తీసుకుంది. స్లాబుల మార్పు వల్ల రూ.48,000 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతున్నప్పటికీ ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎన్టీఏ చొరవతోనే జీఎస్టీ
జీఎస్టీ ముందు పన్ను రేట్లు ఏకరీతిగా ఉండేవి కావు. రాష్ట్రాలు ప్రవేశ పన్ను వంటి అదనపు లెవీలను విధించేవి, దీంతో పన్నుల మధ్య సమతుల్యత లోపించింది. రిటర్నులు, ఆడిట్లు, పెనాల్టీలు స్థిరంగా ఉండకపోవడంతో అనుమతుల చిక్కులు ఎక్కువగా ఉండేవి. బలహీనమైన ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ నిబంధనలు దుర్వినియోగానికి ఆస్కారం కలిగించేవి. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఎగవేతలు చోటుచేసుకునేవి. సేవా పన్నుతో కూడిన ద్వంద్వ పన్నులు, తరచుగా రేటు మార్పులు చోటుచేసుకోవడం వంటివి అనేక చిక్కులు సృష్టించాయి. 2000లో అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తొలిసారి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఆలోచనను ముందుకు తీసుకొచ్చింది. దేశంలో అప్పటి అమ్మకపు పన్ను విధానంలో సంస్కరణలను సిఫారసు చేయడానికి వాజపేయి ప్రభుత్వం 2000లో రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికార కమిటీని (EC) ఏర్పాటు చేసింది. అయితే, ఈ పన్ను సంస్కరణను తీసుకొచ్చేందుకు ఆ తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నాలు జరపలేదు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీని తీసుకొచ్చే దిశగా మరోసారి అడుగులు వేసింది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చింది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన (డిసెంబర్ 2014) 2 సంవత్సరాలలో అంటే 2016 సెప్టెంబర్ 8 నాటికి జీఎస్టీ సంబంధిత 101వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 50% పైగా రాష్ట్రాలు ఆమోదించి, మద్దతు తెలిపాయి. 2017 జూలై 1 అర్ధరాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ విప్లవాత్మక పన్నుల వ్యవస్థను ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే 17కు పైగా పన్నులు, 13 సెస్సులను జీఎస్టీ ఒకే పన్నుగా చేర్చింది. ఈ వ్యవస్థ పన్ను నిర్మాణాలను సరళతరం చేసింది. పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచింది. దేశవ్యాప్తంగా ఒకే విధమైన రేట్లను అమల్లోకి తీసుకొచ్చింది. ఏకీకృత విధానాల కారణంగా ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరింది. జీఎస్టీ కన్నా ముందు 2017లో పన్ను చెల్లింపుదారులు 66.5 లక్షలు ఉంటే 2025లో ఆ సంఖ్య 1.51 కోట్లకు పెరిగింది. ఇది ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీరణకు నిదర్శనం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.22.08 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. కేవలం నాలుగేళ్లలో రెట్టింపు, అంటే 18% పైగా వృద్ధి రేటు నమోదైంది.
ఇది కేవలం పన్ను సంస్కరణ మాత్రమే కాదు, సమైక్య భారతదేశాన్ని నిర్మించాలన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ కలను సాకారం చేయడంలో ఒక మైలురాయి. ఇది భారత్ ను ‘ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్’ నుంచి ‘ఎకనామిక్ ఇంటిగ్రేషన్’కు తీసుకెళ్లింది. భారతీయ మార్కెట్ల వైవిధ్యాన్ని ఆర్థిక పురోగతితో కలిపి ఉంచే సాధనంగా జీఎస్టీ మారింది. ఒకే పన్ను రేట్లు, విధానాలతో భారతదేశం ఒకే మార్కెట్ గా మారింది. ఆర్థిక అడ్డంకులు తొలగడం ద్వారా జాతీయ స్థాయిలో సమీకృత ఆర్థిక వ్యవస్థకు మార్గం సుగమం అయ్యింది.
రంగాల వారీగా ప్రభావం
- వ్యవసాయం – యంత్రాల ధరలు తగ్గుతాయి. బయో-పెస్టిసైడ్స్ ను ప్రోత్సహించడం వల్ల చిన్న రైతులకు మేలు చేస్తుంది. స్థిరమైన పద్ధతులను ప్రోత్సహిస్తుంది.
- ఎరువులు – ఇన్వర్టెడ్ డ్యూటీ మర్పుల వల్ల దేశీయ ఉత్పత్తి పెరుగుతుంది, దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.
- టెక్స్ టైల్స్ – మ్యాన్ మేడ్ ఫైబర్ లకు డ్యూటీ స్ట్రక్చర్ ఫిక్స్ చేయడం వల్ల సామర్థ్యం పెరుగుతుంది. ముఖ్యంగా ఎగుమతులకు దోహదపడుతుంది.
- హస్తకళలు – తక్కువ పన్నులు చేతివృత్తుల జీవనోపాధికి మద్దతు ఇస్తాయి, వారసత్వాన్ని కాపాడతాయి, గ్రామీణ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తాయి.
- ఆరోగ్యం – మందులు, వైద్య పరికరాలపై పన్నులు తగ్గడం ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యతను మెరుగుపరుస్తాయి. దేశీయ తయారీకి మద్దతు ఇస్తాయి.
- వాహనం – స్పష్టమైన వర్గీకరణ వివాదాలను తగ్గిస్తుంది. తయారీ మరియు ఎగుమతుల వృద్ధికి దోహదపడుతుంది.
- పునరుత్పాదక ఇంధనం – భారతదేశం COP లక్ష్యాలకు అనుగుణంగా ప్రోత్సాహకాలు ఉంటాయి. స్థానిక ఉత్పత్తిని పెంచుతాయి.
- బీమా – తక్కువ రేట్లు 2047 నాటికి అందరికీ ఇన్సూరెన్స్ మిషన్ కు మద్దతు ఇస్తాయి, సామాజిక భద్రతా కవరేజీని మెరుగుపరుస్తాయి.
ప్రజల జీవితాలు మెరుగుపడతాయి
సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై స్థూలంగా ఒక ప్రతిపాదనను కేంద్రం రూపొందించింది. దీనిపై జీఎస్టీ మండలి ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకం. ఆమోదించిన మార్పులతో చిరు వ్యాపారులు, రైతులు, మధ్యతరగతి, మహిళలు, యువతకు మేలు కలుగుతుంది.
– ‘ఎక్స్’లో ప్రధాని నరేంద్ర మోదీ
చారిత్రాత్మక నిర్ణయం
నరేంద్ర మోదీ ప్రభుత్వం సామాన్యులు, రైతులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువతకు నేరుగా ఆర్థిక ఊరట కలిగేలా జీఎస్టీ రేట్ల తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకం. ఇది ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ దిశగా దేశాన్ని తీసుకెళ్లే నిర్ణయం. జీఎస్టీని ప్రవేశపెట్టిన ఇతర దేశాల్లో ఆ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయినా, భారత్‌లో వన్ నేషన్-వన్ ట్యాక్స్ అమలు చేసిన తర్వాత మోదీ ప్రభుత్వం రెండుసార్లు విజయవంతంగా అధికారంలోకి రావడం విశేషం.
-ఎన్. రాంచందర్ రావు, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు

