CP Radhakrishnan

భారత ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌

modi with vpభారత ఉపరాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్‌ ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 9న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బరిలో దిగిన సి.పి.రాధాకృష్ణన్‌ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, విపక్ష ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. రాధాకృష్ణన్‌ విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పి.సి.మోదీ ప్రకటించారు. పార్లమెంటు ఉభయసభల్లో సీట్లు 788. రాజ్యసభలో ఆరు, లోక్‌సభలో ఒకటి ఖాళీగా ఉండటంతో 781 మందికి ఓటువేసే హక్కు లభించింది. బిజూ జనతాదళ్ (7), బీఆర్ఎస్ (4), శిరోమణి అకాళీదళ్‌ (1) పార్టీలు ఓటింగుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో 769 మంది ఎంపీలకు ఓటింగు అవకాశం దక్కింది. 767 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. చెల్లుబాటైన ఓట్లలో ఎన్డీయే అభ్యర్థికి 60.10%, ప్రతిపక్షాల అభ్యర్థికి 39.89% ఓట్లు వచ్చాయి. రాధాకృష్ణన్‌కు ఊహించిన దానికంటే 14 ఓట్లు ఎక్కువ రాగా, జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి ఆ మేరకు తగ్గాయి. దీన్నిబట్టి ప్రతిపక్షాలవైపు ఉన్నవారు ఎన్డీయే అభ్యర్థికి క్రాస్‌ ఓటింగు చేసినట్లు స్పష్టమవుతోంది. 

తన కొడుకు భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అంతటివాడు కావాలని రాధాకృష్ణన్ తల్లి జానకీ అమ్మాల్ అదేపేరు పెట్టుకుంది. ఈ గెలుపుతో ఆమె మనోభీష్టం నెరవేరినట్టయింది. ఇప్పటివరకు 14 మంది ఉపరాష్ట్రపతులుగా సేవలందించారు. రాధాకృష్ణన్‌ 15వ వ్యక్తి. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ (13.5.1952 నుంచి 13.5.1962), మహమ్మద్‌ హమీద్‌అన్సారీ (11.08.2007 నుంచి 11.08.2017)లు అత్యధికంగా పదేళ్లు చొప్పున ఈ పదవిలో కొనసాగారు. అత్యల్పకాలం వీవీగిరి (1 సంవత్సరం 355 రోజులు), ఆర్‌.వెంకటరామన్‌ (2 ఏళ్ల 327) ఉన్నారు. వీరిద్దరూ తర్వాత రాష్ట్రపతులు అయ్యారు. ఉపరాష్ట్రపతులుగా పనిచేసినవారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్‌హుస్సేన్, వి.వి.గిరి, ఆర్‌.వెంకటరామన్, శంకర్‌దయాళ్‌శర్మ, కె.ఆర్‌.నారాయణన్‌లు రాష్ట్రపతులు అయ్యారు.

1957 అక్టోబరు 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో వ్యవసాయ కుటుంబంలో రాధాకృష్ణన్‌ జన్మించారు. పదహారో ఏట నుంచి ఆర్‌ఎస్‌ఎస్, జన్‌సంఘ్‌లతో కలిసి పనిచేశారు. ప్రజాసేవకు రాజకీయాల వైపు అడుగులు వేశారు. దివంగత ప్రధానమంత్రి చంద్రశేఖర్‌ 1983లో కన్యాకుమారి నుంచి దేశవ్యాప్త పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు రాధాకృష్ణన్‌ అందులో పాలుపంచుకున్నారు. హిందుత్వ భావజాలానికి ముఖచిత్రంగా ఉన్న ‘హిందూ మున్నాని’తో కలిసి పనిచేశారు. సామాజికంగా, ఆర్థికంగా బలమైన కొంగు వెల్లాలర్‌ (గౌండర్‌) సామాజికవర్గం నుంచి వచ్చిన ఆయన బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ చేశారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని కోయంబత్తూరు స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా 1.5 లక్షల ఆధిక్యంతో విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో అక్కడినుంచే నెగ్గారు.

పార్టీ సంస్థాగత వ్యవహారాల నిర్వహణలో సి.పి. రాధాకృష్ణన్ కు మంచి పేరుంది. 1996లో తమిళనాడు బిజెపి కార్యదర్శిగా పనిచేశారు. 2004 నుంచి 2007 వరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు 93 రోజులపాటు తమిళనాడులోని నియోజకవర్గాలన్నీ చుడుతూ 19వేల కిలోమీటర్ల రథయాత్ర నిర్వహించారు. 2014లో కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయినా 3.89 లక్షల ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. 2019 ఎన్నికల్లోనూ ఓడిపోయారు. దక్షిణభారత బిజెపి నేతల్లో అత్యంత సీనియర్‌. ఆయన క్రీడాభిమాని. టేబుల్‌ టెన్నిస్‌లో కళాశాల స్థాయిలో ఛాంపియన్‌. క్రికెట్, వాలీబాల్, పరుగులోనూ ప్రావీణ్యం ఉంది. 

సి.పి.రాధాకృష్ణన్‌ వివిధ అంతర్జాతీయ వేదికలపై మనదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 2004లో ఐక్యరాజ్యసమితికి వెళ్లిన భారత పార్లమెంటరీ బృందంలో సభ్యునిగా ఉన్నారు. ఐరాస సర్వప్రతినిధి సభ 58వ సమావేశంలో ప్రసంగించారు. 2014లో తైవాన్‌కు వెళ్లిన తొలి పార్లమెంటరీ బృందంలో సభ్యుడిగా ఉన్నారు. 2020లో కేరళ బిజెపి వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమితులై 2022 వరకు పనిచేశారు. 1998 నుంచి 2004 వరకు ఎంపీగా ఉన్నప్పుడు ప్రభుత్వరంగ సంస్థల స్థాయీసంఘం, ఆర్థిక శాఖ సంప్రదింపుల సంఘాలలో సభ్యుడిగా ఉన్నారు. అమెరికా, చైనా, సింగపూర్, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌ తదితర 24 దేశాలను సందర్శించారు.

రాధాకృష్ణన్‌ 2023 ఫిబ్రవరి 12న ఝార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఝార్ఖండ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే ఆ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో పర్యటించి నేరుగా ప్రజలు, అధికారులతో మమేకమై క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని బలోపేతం చేశారు. కొన్నాళ్లు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. 2024 జులై 27 నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్‌.వెంకటరామన్‌ల తర్వాత తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించిన మూడోవ్యక్తిగా, దక్షిణాది నుంచి ఏడో వ్యక్తిగా రికార్డులకెక్కారు. పార్టీలో ‘తమిళనాడు మోదీ’గా పేరుపొందారు. ఉపరాష్ట్రపతిగా ఆయన పదవీకాలం 2030 వరకు ఉంటుంది. 

సమాజ సేవకు జీవితం అంకితం 

‘‘సి.పి.రాధాకృష్ణన్‌కు అభినందనలు. ఉపరాష్ట్రపతిగా అద్భుత పనితీరు చూపుతారన్న నమ్మకం నాకుంది. ఆయన తన యావత్తు జీవితాన్ని సమాజ సేవకు, నిరుపేదలు, నిర్లక్ష్యానికి గురైన వర్గాల సాధికారతకే అంకితమిచ్చారు.’’

-ప్రధాని నరేంద్ర మోదీ 

జాతీయవాద సైద్ధాంతికత విజయం

‘‘నా గెలుపు.. జాతీయవాద సైద్ధాంతికత విజయం. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి పాటుపడతా. ఈ ఎన్నికను సైద్ధాంతిక పోరాటంగా అవతలిపక్షం చెప్పింది. ఓటింగ్‌ పోకడను చూస్తే జాతీయవాదం గెలిచిందని స్పష్టమవుతుంది. ఇది ప్రతిఒక్క భారతీయుడి విజయం. ప్రజాస్వామ్యంలో అధికార-విపక్షాలు రెండూ ముఖ్యం. ప్రజాస్వామ్య ప్రయోజనాలను పరిగణనలో తీసుకుంటా.’’

-సి.పి.రాధాకృష్ణన్, నూతన ఉపరాష్ట్రపతి