యూరియా కొరతపై రేవంత్ ప్రభుత్వం గందరగోళం
తెలంగాణకు అవసరమైన యూరియా సరఫరా చేయడంలో కేంద్రం విఫలమైందని ఒక వంక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి ఆయన మంత్రివర్గ సహచరులు పలువురు నిత్యం విమర్శిస్తూనే ఉన్నారు. ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్న యూరియా నిల్వలను కూడా రైతులకు అమ్మే విధంగా చూడాలని, క్యూలైన్ లేకుండా చూడాలని సూచనలు చేస్తున్నారు. మరోవంక రాష్ట్రంలో అసలు యూరియా కొరత అంటూ లేదని, రైతులెవరూ యూరియా దొరకక ఇబ్బందులు పడటం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో యూరియా కోసం క్యూలైన్లలో నిల్చున్నవారెవరూ రైతులు కాదని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. నిజంగా యూరియా అవసరమున్న వాళ్లంతా తీసుకుని వెళ్తున్నారని చెప్పారు. రైతులు చేస్తున్న ఆందోళనలన్నీ రాజకీయ ప్రేరేపితమని ఆయన ఆరోపించారు. అలా అంటూనే తెలంగాణకు కేటాయించిన యూరియాను సైతం కేంద్రం సకాలంలో సరఫరా చేయలేకపోతుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవంక, దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉందని, కానీ ఒక్క తెలంగాణలోనే ఉన్నట్టు కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇలా ఉండగా, రాష్ట్రంలో కొందరు కృత్రిమ ఎరువుల కొరత సృష్టిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎరువుల కోసం చాలామంది క్యూలైన్లలో నిలబడ్డట్టు పేపర్లు, టీవీల్లో ఫొటోలు, వీడియోలు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. అందులో ఎరువులు దొరకడం లేదని, తక్కువ ఉన్నాయని భయపెట్టడంతో రైతులు తెల్లవారగానే దుకాణాలు, పీఏసీఎస్‌లు, పంచాయతీల ఎదుట బారులు తీరుతున్నారని చెప్పుకొచ్చారు. యూరియా కోసం ఆందోళనలు కేవలం కొన్ని పత్రికలు, టీవీలు సృష్టిగా మంత్రి పొన్నం ప్రభాకర్ అభివర్ణిస్తున్నారు. “బీఆర్‌ఎస్ నాయకులు కొంత మంది జమై.. యూరియా కోసం క్యూలో చెప్పులు పెట్టి.. రైతుల్లో ఆందోళన కలిగిస్తూ.. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు” అని ఆరోపించారు. సర్కారును బదనాం చేయడమే లక్ష్యంగా, ప్రత్యేక ఎజెండా పెట్టుకొని క్యూలైన్‌లో చెప్పులు పెట్టిన ఫొటోలు ప్రచురిస్తూ వార్తలు రాస్తున్నారని, ఆ దృశ్యాలు చూపుతున్నారని విమర్శలు గుప్పించారు. యూరియా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని, ఇది పూర్తిగా కేంద్ర రసాయనాల వ్యవహారాల శాఖ పరిధిలోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేని అంశంగా చెప్పే ప్రయత్నం ప్రభాకర్ చేశారు.
వాస్తవానికి బస్తా యూరియా ధర రూ. 2,650. అయితే రైతులకు మాత్రం రూ.266కే బస్తా చొప్పున అందుతుంది. ప్రతి బస్తాకు కేంద్రం రూ.2400 వరకు సబ్సిడీ భరిస్తోంది. అయితే కొందరు కాంగ్రెస్ నాయకులు యూరియాను బ్లాక్ చేసి బస్తా రూ.400 చొప్పున అమ్ముతున్నట్టు వార్తలు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. యూరియా సరఫరాపై ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు పొంతనలేని ప్రకటనలు చేస్తూ ప్రజలను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారి ధోరణులు చూస్తుంటే అసలు వాస్తవ పరిస్థితుల పట్ల వారికి అవగాహన లేదా? లేదా పట్టించుకొనే తీరిక లేదా? అనే అనుమానాలు కలుగుతున్నది. తెలంగాణకు అవసరానికి మించి యూరియాను కేంద్రం కేటాయించిందని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రామచందర్ రావు, కేంద్ర మంత్రులు స్పష్టం చేస్తున్నారు. కేటాయింపుల మేరకు యూరియాను కేంద్రం పంపలేదని అంటున్నారు గాని గత ఏడాది ఉపయోగించకుండా మిగిలిన యూరియా నిల్వల గురించి మంత్రులు ప్రస్తావించడం లేదన్నారు. ఆ యూరియాను ఏం చేశారో చెప్పడం లేదని, బ్లాక్ మార్కెట్ కు తరలించారా? అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రకటనలతో రైతులను భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కృత్రిమ కొరత సృష్టించి రైతులను వంచించే ప్రయత్నం చేస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యూరియా సరఫరా గురించి సచివాలయంలో సమీక్షలు జరపడం తప్ప ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరూ క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాస్తవ పరిస్థితులను రైతులను అడిగి తెలుసుకొనే ప్రయత్నం చేయడం లేదు. ఎరువుల సరఫరాపై నిఘా అంటున్నారే గాని తగిన పర్యవేక్షణ కనిపించడం లేదు. రైతాంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి యూరియా సరఫరాలో మరోమారు వెల్లడైంది.
ప్రవీణ్

