Shivraj Singh Chowhan

ప్రతిచోటా ఎంఎస్‌పీ అవసరం అనేది అపోహే

Shivraj Singh Chowhanశివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జాతీయ వ్యవసాయ రంగ వృద్ధిరేటు 3.7 శాతం కాగా మధ్యప్రదేశ్ వృద్ధిరేటు 6.5 శాతం ఉంది. మధ్యప్రదేశ్‌లో వ్యవసాయ విప్లవం అందరి దృష్టిని ఆకర్షించింది. 65 సంవత్సరాల చౌహాన్ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిగా దేశవ్యాప్తంగా మరో వ్యవసాయ విప్లవాన్ని సృష్టించగలరా? అనేది ఇప్పుడు అందరి ముందున్న అతిపెద్ద ప్రశ్న. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న చౌహాన్ ఒక వారపత్రికకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో తన దార్శనికతను, తన ముందున్న సవాళ్లను గురించి చర్చించారు.

ప్ర: 2022 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని 2016లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక పెద్ద హామీ ఇచ్చింది. ఈ హామీ ఇంతవరకు అమలు జరగలేదు. రైతులు ఆదాయాలను రెట్టింపు చేయడం సాధ్యమేనా? దాన్ని ఎలా సాధిస్తారు? 

జ: రైతుల ఆదాయాలు పెరగలేదన్న మాట నిజం కాదు. ప్రధానమంత్రి నేతృత్వంలో గత పదేళ్ళలో వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. రైతుల ఆదాయాలను పెంచడం, దేశానికి ఆహార భద్రత కల్పించడం మా వ్యూహం ప్రధాన లక్ష్యం. మన దేశ జనాభా ఇప్పుడు 140 కోట్లు. 2014 నాటికి ఇది 160 కోట్లకు పెరుగుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుండడంతో ఆహార పదార్థాల వినియోగం కూడా పెరుగుతుంది. ఆ కోణం నుంచి చూస్తే మనం దేశ అవసరాలను తీర్చడానికి ఉత్పత్తిని మరింత పెంచాల్సి ఉంటుంది. రైతుల ఆదాయాలను పెంచే దిశగా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. అదే సమయంలో దేశ అవసరాలను కూడా తీరుస్తాం. భారత్‌ను ప్రపంచ ధాన్యాగారంగా మార్చడం ప్రధానమంత్రి దార్శనికత, నా కల కూడా. మనం మన అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేయడమే కాకుండా ప్రపంచ ఆహార అవసరాలను కూడా తీరుస్తాం. మనం ఆ దిశలో ముందుకు వెళ్తున్నాం. ఈ ఒక్క ఏడాదిలోనే మనం 40 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేశాం. మధ్యప్రదేశ్‌లో పండించే షర్బతి గోధుమలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఉత్పత్తి పెంచడం, ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, రైతులకు న్యాయమైన, గిట్టుబాటు ధరలను కల్పించడం, ప్రకృతి విపత్తుల సమయంలో వారికి సహాయం అందించడం, పంటల వైవిధ్యాన్ని, విలువ చేర్పును ప్రోత్సహించడం, సేంద్రియ, ప్రాకృతిక వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం మన వ్యూహంలో భాగంగా ఉన్నాయి. సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ఇప్పటికీ ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు నేను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు సాగుభూమి 7 లక్షల హెక్టార్లు ఉండేది. మేం దాన్ని 50 లక్షల హెక్టార్లకు పెంచాం. ప్రస్తుతం అమలు జరుగుతున్న జాతీయ నదుల అనుసంధాన కార్యక్రమం వంటి ప్రాజెక్టుల ఫలితంగా సాగుభూమి 70 లక్షల హెక్టార్లకు పెరిగే అవకాశం ఉంది. ప్రధానమంత్రి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అనేక నదుల నుంచి నర్మదాకు నీరు తరలించారు. మధ్యప్రదేశ్‌లో మేం నర్మదా నది నీటిని గంభీర్, షిప్రా, కాళి సింధు, పార్వతీ నదులకు తరలించాం. సాగు విస్తీర్ణం, వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలంటే ముందుగా కావాల్సింది నీటిపారుదల సౌకర్యం. రెండవది, విత్తనాల ఉత్పత్తి. ఇందుకోసం భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఇకార్) ఆధ్వర్యంలో ఐదు వైజ్ఞానిక ప్రయోగశాలలు విత్తనాల అభివృద్ధిలో నిమగ్నమై ఉన్నాయి. విత్తనాల అభివృద్ధికి సరైన వ్యూహం అవసరం. ప్రధానమంత్రి ఇటీవల 65 పంటలకు సంబంధించి 109 కొత్త వంగడాలను విడుదల చేశారు. ఉదాహరణకు 70 రోజుల్లో పంట చేతికి వచ్చే ఒక తృణధాన్యం (శ్రీ ధాన్యం) వంగడాన్ని మనం అభివృద్ధి చేశాం. మామూలుగా తృణధాన్యాలు పంట చేతికి రావాలంటే 110 నుంచి 120 రోజులు పడుతుంది. ఈ కొత్త వంగడం వల్ల సమయం ఆదా అయి రెండో పంట కూడా వేయవచ్చు. అలాగే మామూలు వరి వంగడాల కంటే 30 శాతం తక్కువ నీరు అవసరమయ్యే కొత్త వరి వంగడాన్ని కూడా అభివృద్ధి చేశాం. నీటి సంరక్షణ సమర్థ వినియోగం నేడు చాలా అవసరం. ఈ వరి వంగడానికి నాట్లు వేయక్కర్లేదు. గోధుమ మాదిరిగా నేరుగా విత్తవచ్చు. నారుమడిని నాట్లుగా వేయడానికి పొలాన్ని నీటితో నింపాల్సిన అవసరం ఉండదు. మనం రైతులకు అత్యంత నాణ్యమైన విత్తనాలను అందించి ఖర్చులను తగ్గించే విధానాలను ప్రచారం చేయాలి. ఉదాహరణకు ఇప్పుడు రైతులు యూరియాను చేత్తో పొలంలో చల్లుతారు. దీని వల్ల పంట మొత్తానికి అది సమానంగా అందదు. మేం ఎరువుల వినియోగాన్ని, అనవసర ఖర్చులను తగ్గించేందుకు డ్రోన్లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం. ఖర్చులు తగ్గించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక పటిష్టమైన వ్యూహాన్ని రూపొందిస్తున్నాం. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ‘మూడు రెట్లు కష్టపడి మూడింతలు వేగంతో పని చేస్తాన’ని ప్రధానమంత్రి ప్రకటించారు. మేం కూడా మూడు రెట్లు కష్టపడి మూడింతలు వేగంగా పని చేసేందుకు ఇది స్పూర్తినిస్తుంది.

ప్ర: 2014 నాటికి దేశ జనాభా 160 కోట్లకు చేరుతుందని అంటున్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచాలంటే వాటికి కనీసం మద్దతు ధర (ఎంఎస్‌పీ) చెల్లించటానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి ఎంఎస్‌పీ ఒక్కటే మార్గమా లేక ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా?

జ: మనం సమదృష్టితో కూడిన వైఖరిని అనుసరించాలి. వ్యవసాయం గిట్టుబాటు కాకపోతే రైతు ఎలా మనుగడ సాధిస్తాడు? ఏ కంపెనీ అయినా చేసే వ్యాపారంలో నష్టం వస్తే నడవదు కదా? రైతు కూడా రెండు పూటలా కడుపు నింపుకోవాలి. పిల్లల్ని చదివించుకోవడానికి, కూతుళ్లకు పెళ్లిళ్లు చేయడానికి ఇంకా ఇతర ముఖ్యమైన అవసరాలకు డబ్బు కావాలి. ఉత్పత్తి వ్యయాలను 50 శాతం లాభం చేర్చి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎంఎస్‌పీని నిర్ణయించడం పట్ల నేను గర్విస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడూ ఇది జరగలేదు. ఎంఎస్‌పీ చెల్లించడం సాధ్యం కాదని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకప్పుడు ప్రకటించింది. ఎంఎస్‌పీ అత్యవసరం. దాన్ని తప్పకుండా చెల్లించాలి. భవిష్యత్తులో రైతుల లాభాలను పెంచే మార్గాలపై మన దృష్టి సారించాలి. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడం వంటి మార్గాలను పరిశీలించాలి. 

ప్ర: వ్యవసాయ చట్టాల విషయంలో మనం చూసినట్టు రైతులు ఎంఎస్‌పీ రాజకీయాల బాధితులు అవుతున్నారా?

జ: ఉత్పత్తివ్యయాలకు 50 శాతం లాభాన్ని జోడించి కనీస మద్దతు ధరను మోదీ ప్రభుత్వం నిర్ణయించడం అన్ని విధాలా న్యాయమైనది. రైతులకు ఇది తప్పనిసరిగా చెల్లించాలి. ఇక రెండో అంశం మనం ఎప్పుడూ ఎంఎస్‌పీ మీద ఆధారపడి ఉండం. ఈరోజు అనేక గోధుమ వంగడాలు ఎంఎస్‌పీ కంటే ఎక్కువ ధర పలుకుతున్నాయి. బాస్మతి బియ్యం ధరలు ఎంఎస్‌పీ కంటే ఎక్కువే ఉన్నాయి. రైతులు ఎంఎస్‌పీ కంటే ఎక్కువ ధరలకు మార్కెట్లో తమ ఉత్పత్తులను అమ్ముతున్న ఉదాహరణలు మనకు అనేకం కనిపిస్తాయి. ప్రతి చోటా ఎంఎస్‌పీ అవసరం అన్న అపోహ ఒకటి ఉంది. మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు మాత్రమే ఎంఎస్‌పీ అవసరమవుతుంది. భవిష్యత్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పత్తి పెంచి ఖర్చులను తగ్గిస్తే సహజంగానే లాభాలు పెరుగుతాయి. మనం ఎగుమతి ప్రమాణాలకు దీటైన పంటలను పండించాలి. ఈనాడు ప్రపంచంలో వ్యవసాయ ఉత్పత్తులను అధికంగా ఎగుమతి చేసే ఐదు దేశాలలో భారత్ ఒకటి. కానీ ఇష్టం వచ్చినట్టు రసాయన ఎరువులు వాడితే మన ఉత్పత్తులపై ఇతర దేశాలు నిషేధాలు విధిస్తాయి. కనుక మనం నాణ్యమైన పంటలను పండించే విషయంలో రైతులను చైతన్య పరచాలి.

ప్ర: మీరు గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం అనే రెండు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. జనాభాలో ఎక్కువ శాతం ప్రజలకు నేరుగా లబ్ధి చేయగల బడ్జెట్ ను కూడా పర్యవేక్షిస్తారు. మీరు తీసుకురాదలుచుకున్న మార్పులేంటి?

జ: వ్యవసాయం, ఉద్యాన పంటల రంగంలో మన వృద్ధిరేటు 4.6 శాతం. ఇది మన సాగురంగం బలాన్ని వెల్లడిస్తోంది. కోవిడ్-19 సమయంలో ప్రపంచమంతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు భారతీయ ఆర్థిక వ్యవస్థ దాదాపు చెక్కు చెదరకుండా ఉంది. ఎందుకంటే మన రైతులు పొలాల్లో పని చేయడం ఆపలేదు. యావత్ ప్రపంచం భారతీయ వ్యవసాయ రంగం బలాన్ని గమనించింది. వ్యవసాయ రంగంలో వైవిధ్యీకరణపై మనకు ఒక పటిష్టమైన వ్యూహం ఉంది. బహుళ పంటలు సాగు చేసిన సంప్రదాయం మనకు ఉంది. మేం దాన్ని పునరుద్ధరిస్తున్నాం. కేవలం వరి సాగు మీద మాత్రమే ఆధారపడకుండా ఇతర పంటల వైపు పయనిస్తున్నాం. అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. 

ప్ర: కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించడం పట్ల రైతులు తరచుగా ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే అదే సమయంలో ప్రభుత్వం ధరలను కూడా అదుపు చేయాల్సి ఉంది. ఎగుమతులపై ఆంక్షలు విధించడం సరైనదేనా?

జ: మొదట మనం రైతుకు ఆదాయం వచ్చేలా చూడాలి. అతనికి గిట్టుబాటు ధర కల్పించాలి. అదే సమయంలో కోవిడ్-19 సమయంలోను, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనూ మనం ఎక్కువ గోధుమను ఎగుమతి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి. దేశ జనాభాకు సరిపడనంత ఆహారం సరఫరా చేయగలగాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు సరఫరా చేయాలి. అందువల్ల మన ప్రజల ఆహార అవసరాల నిమిత్తం ఎంత ధాన్యం అవసరమో అంచనా వేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు ఎంఎస్‌పీ ఇవ్వడం, అదే సమయంలో ప్రజలకు సరిపడినన్ని ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేటట్లు చూడటం మా ప్రాథమిక బాధ్యత.

ప్ర: మీరు సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి మాట్లాడారు. కానీ వాటిని అమలు చేయడం అనేది కష్టమైన పని. మీ రాజకీయ స్థాయి ఈ కష్టమైన కర్తవ్యాన్ని మీరు నిర్వహించగలరన్న ఆశ కలిగిస్తోంది…

జ: రైతుల సంక్షేమం పట్ల ప్రధానమంత్రి నిబద్ధత అచంచలమైనది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అనేక పథకాలను రూపొందించారు. ఉదాహరణకు సహజ వ్యవసాయాన్ని తీసుకోండి. వ్యవసాయం మరింత లాభసాటిగా మారాలంటే భూమి ఉత్పాదకతను, సారాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాల వారు కూడా పళ్ళు, కూరగాయలు, ఆహార ధాన్యాలు పండించుకోవాలంటే మనం క్రమంగా దేశాన్ని అందుకు సిద్ధం చేయాలి. అన్ని రాష్ట్రాలతో కలిసి కేంద్రం పని చేయాలి. ఎందుకంటే పంటలను పండించేది రాష్ట్రాలే. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకే ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రాల సమష్టి కృషి ఆవశ్యకం. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా భూమి గాని, అందులో శివరాజ్ సింగ్ చౌహాన్ అద్భుతాలు సృష్టించడం గాని ఏమీ ఉండదు. కనుక వివిధ రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో మేం చర్చలు జరుపుతున్నాం. వారి సమస్యలను వెలుగులోకి తెచ్చి పరిష్కరిస్తున్నాం. నాకు సంబంధించినంత వరకు ఇది ఒక పవిత్ర కర్తవ్యం. వ్యవసాయం ఇప్పుడు ఎప్పుడూ కూడా భారతీయ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. వ్యవసాయానికి ఆత్మ, ప్రాణవాయువు రైతులే. మనకు అన్నదాతలు దైవంతో సమానం. వారిని సేవించడం మాధవ సేవతో సమానం. ప్రధానమంత్రి నాకు ఈ బాధ్యతను అప్పగించడం నా అదృష్టం. నా జీవితంలో ప్రతి క్షణాన్ని వ్యవసాయాన్ని, గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించడానికి వెచ్చిస్తాను. కేవలం ఒక పదవిలో కొనసాగడంలో జీవితానికి అర్థం లేదు. కష్టపడి పని చేసి ఆ పదవి నిర్దేశించే బాధ్యతలను నెరవేర్చడమే జీవితానికి అర్థం, పరమార్థం.