IKP Visit

రైతులపై కాంగ్రెస్ భస్మాసుర ‘హస్తం’

IKP Visitరైతులపై కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తంగా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్​ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటూ దళారులు రైతులను దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నవంబర్ 9న యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంతో పాటు, రేవన్నపల్లిలో కిషన్‌రెడ్డి పర్యటించారు. పోచంపల్లి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బిజెపి కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. పోచంపల్లిలోని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గౌస్ కొండ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడున్న రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. 20 రోజులైనా కాంగ్రెస్‌ సర్కారు ధాన్యం కొంటలేదని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. వరి కొనుగోళ్ల విషయంలో రైతుల ఇబ్బందులను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ట్రాన్స్​పోర్టు, బస్తాలు, బస్తా సుతిల్​, హమాలి చార్జీలు ఇలా మొత్తం కేంద్రమే రాష్ట్రానికి చెల్లిస్తుంది. సివిల్​ సప్లయ్స్​ డిపార్ట్​ మెంట్​ సహా ఐకేపీ వారికి కూడా కేంద్రమే కమిషన్​ ఇస్తున్నది. రాష్ట్ర సర్కారు కొనుగోళ్ల కోసం ఒకవేళ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే దాని వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తుంది. రైతుల ధాన్యం కొనడంలో రాష్ట్ర సర్కారుకు వచ్చిన ఇబ్బంది ఏంటి..?’’ అని ప్రశ్నించారు.

ప్రోటోకాల్ ప్రకారం కేంద్రమంత్రి పర్యటనకు స్థానిక జిల్లా కలెక్టర్ హాజరు కావాలి. కానీ కలెక్టర్ గైర్హాజరయ్యారు. దీంతో కలెక్టర్ కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. జాయింట్ కలెక్టర్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక అధికారులు రాకపోవడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘‘రైతులంటే అంత చులకనా..? అంత నిర్లక్ష్యమా.. సీఎం వస్తే అందరూ పరిగెడతారు.. ఇదేనా ఈ ప్రభుత్వం రైతుకిచ్చే గౌరవం? 25 రోజులుగా రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండి మొలకలొస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సిగ్గనిపిస్తలేదా?’’ ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం ఏంటని అధికారులను నిలదీశారు. ధాన్యం దళారుల పాల్జేసుకుని నష్టపోవడమే రైతులకు దిక్కా అంటూ మందలించారు.

హామీల అమలెక్కడ?

కల్లాల సాక్షిగా రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు గురించి కేంద్రమంత్రి అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ సర్కారు ఏ ఒక్క హామీని అమలు చేయలేదని రైతులు, మహిళలు, యువకులు, రైతు కూలీలు ముక్తకంఠంతో చెప్పారు. ‘‘అమ్మ.. భారతమ్మ.. కౌలు రైతు జంగమ్మ.. మీకు రూ.2500 వచ్చాయా..? రుణమాఫీ అయ్యిందా..? కౌలు రైతులకిచ్చే రూ.12000 వచ్చాయా..?’’ అని మహిళలు, రైతులు, కౌలు రైతుల్ని మీడియా ముఖంగానే అడిగారు. మాకు ఇప్పటి వరకు రాలేదని వారు సమాధానం ఇచ్చారు.

‘‘వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ రైతులకు అనేక హామీలిచ్చింది. రైతులకు రూ.2 లక్షల చొప్పున రుణమాఫీతో పాటు రైతు భరోసా కింద రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం, కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తామన్నది. వరి ధాన్యంతో పాటు పత్తి సహా 12 పంటలపై రూ.500 బోనస్ ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు. ధాన్యంపై బోనస్ పేరుతో మోసం చేసింది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇస్తమని చెప్పింది. అధికారంలోకి వచ్చాక సన్న వడ్లకే బోనస్ ఇస్తామని సన్నాయినొక్కులు నొక్కుతున్నది. తెలంగాణ ప్రాంతంలో రైతులు అత్యధికంగా దొడ్డు వడ్లు మాత్రమే పండిస్తారు. ధాన్యం మార్కెట్ యార్డులోకి వచ్చి 2 నెలలు గడిచాక సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి నిబంధనలు పెడుతోంది. ఇక రుణమాఫీ అరకొరగానే జరిగింది. రాష్ట్రంలో 64 లక్షల రైతులు పంట రుణాలు తీసుకుంటే, 17 లక్షల రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ప్రచారంలో రైతులు రుణాలు బ్యాంకుల్లో తీసుకుంటే అప్పు కట్టొద్దని, డిసెంబరు 9న సోనియా జన్మదినం రోజున రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. 11 నెలలు గడిచినా దిక్కులేదు. 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. అమలు చేయకుండా మోసం చేశారు. మూసీ ప్రక్షాళనకు రూ.1లక్షా 50 వేల కోట్లు ఎప్పుడొస్తాయో తెలియదు.. మూసీలోకి వస్తున్న హైదరాబాద్ డ్రైనేజీని క్లీన్ చేస్తరో తెలియదు. కాని, రైతులను రెచ్చగొడుతూ మూసీకి ఇరువైపులా ఉన్న పేదల ఇండ్లను కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి యాత్ర చేస్తామని చెప్పుకుంటున్నారు. ముందు రైతుల కల్లాల్లో యాత్ర చేయండి. రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించి కల్లాలకు తీసుకొస్తే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ వరి ధాన్యం విషయంలో దిల్లీలో ధర్నా ఎందుకు చేశారో ఆయనకే తెలియదు. గత 2 నెలలుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా కనపడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ బోటు షికారు చేశారు.. కనీసం ఆయన రైతు కల్లాలకొచ్చి రైతుల ఇబ్బందులు తెలుసుకుంటే బాగుండేది. రైతు భరోసా ఇవ్వలేదు.. కౌలు రైతులు, రైతు కూలీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఒక్క కొత్త ఇల్లు కట్టలేదు కాని.. బుల్డోజర్లతో తొక్కించి మరీ ఇండ్లు కూలగొడుతానంటున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడదు. కేంద్ర ప్రభుత్వమే పైసలు చెల్లిస్తుంది. క్వింటాలు ధాన్యానికి కనీస మద్దతు ధర (రూ.2,320), మండీ హమాలీ చార్జెస్, ట్రాన్స్ పోర్టేషన్ ఛార్జీలు, ఐకేపీ సెంటర్లు, రైతు సంఘాలు, మార్కెట్ యార్డులకు కమీషన్, గోడౌన్లకు ఛార్జీలు, ప్రభుత్వ అధికారులకు ఛార్జీలు, వడ్ల బస్తాలకు, గన్నీ బ్యాగులకు.. ఇలా ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేందుకు నొప్పేంటి..? 2014లో కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేవారు. నేడు మోదీ ప్రభుత్వం రాష్ట్రం నుంచి 93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నది.

రైతులకు అండగా మోదీ

మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కోసం ఏడాదికి రూ.1,536 కోట్లు ఖర్చు చేస్తే.. నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. 2014లో 2 లక్షల 62 వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తే.. మోదీ ప్రభుత్వంలో 20 లక్షల పైగా మంది రైతుల నుంచి కొనుగోలు జరుగుతున్నది. 2014లో ఎంఎస్పీ క్వింటాలుకు రూ.1300 ఉంటే.. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఎంఎస్పీ రూ. 2320కి పెరిగింది. ధాన్యం కొనుగోలు విషయంలో మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంటే.. రైతులకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం చేతులు రావడం లేదు. రైతులంటే ఎందికింత కక్ష..? రైతుల ధాన్యం కొనుగోలు చేయకపోవడమేనా ఇందిరమ్మ పాలన అంటే..? కొనుగోలు కేంద్రాలకు అధికారులు ఎందుకు రావడం లేదు..? నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో 83 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు కల్పించి, రూ.34కే కేజీ బియ్యం కొనుగోలు చేసి పేద ప్రజలకు ఉచితంగా రేషన్ అందజేస్తుంది. రాహుల్ గాంధీకి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలోని రైతుల కల్లాలు, కొనుగోలు కేంద్రాలకు రావాలి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాతపెట్టారు. జార్ఖండ్, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ కు ఇదే గతి పడుతుంది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చే రాజ్యం బాగుపడదు. రైతులకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం చాలావరకు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కిలో వడ్లు కూడా కొనుగోలు చెయ్యలే. టార్పాలిన్లు, కాంటాలు, త్రాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లి ప్రజలు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేశామంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.’’ అని కిషన్ రెడ్డి అన్నారు.

బోనస్ ఎగ్గొట్టేందుకే జాప్యం

సన్నరకం ధాన్యానికి బోనస్‌ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకోవడానికే కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనుగోళ్లలో జాప్యం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నవంబర్ 10న పరిశీలించారు. కొనుగోలు తీరు, రైతుల ఇబ్బందులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇప్పటి వరకు కేవలం 95 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటా ధాన్యానికి రూ.2,300 మద్దతు ధర చెల్లిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్‌ అదనంగా చెల్లిస్తామని హామీ ఇచ్చిందని.. నేటికీ బోనస్‌ చెల్లింపులు జరిగిన దాఖలాలు ఎక్కడా లేవని పేర్కొన్నారు. ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని యోచిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నందుకు ప్రజా వంచనోత్సవాలు జరుపుకోవాలని ఎద్దేవా చేశారు.

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని, పత్తి కొనుగోలు కేంద్రాన్ని నవంబర్ 10న సందర్శించారు. వరి కోతలు అయ్యి ధాన్యం కల్లాల్లో పోసి నెల రోజులు గడుస్తున్న ఇంకా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి అదనపు కలెక్టర్ తో మాట్లాడి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని, రైతులకు గన్నీ బస్తాలు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ధ్యానం కల్లాల్లో పోసి నెల రోజులు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏజెన్సీలకు రైస్ మిల్లులు కేటాయించక పోవడం ఏంటని ప్రశ్నించారు. పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తికి గల మద్దతు ధర, రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పత్తిలో తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు.

నవంబర్ 9నే నల్గొండ జిల్లాలోని పలు ఐకేపీ కేంద్రాలను (ధాన్యం కొనుగోలు కేంద్రాలను) మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు, గోలి మధుసూదన్ రెడ్డి, బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తదితరులు సందర్శించారు. అక్కడున్న రైతుల బిజెపి నేతలకు తమ బాధలు చెప్పుకున్నారు. వడ్లు నెలల కొద్దీ కల్లాల్లోనే ఉన్నాయని వాపోయారు. అకాల వర్షాలతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుండడంపై బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు బిజెపి అండగా నిలుస్తుందని, బాధల్లో ఉన్న రైతులకు భరోసా కల్పించారు.