Indira Park dharna

రేవంత్ సర్కార్ తీరుతో విశ్రాంత ఉద్యోగుల్లో విషాదం

Nirasana Deekshaముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ మొత్తాన్ని అంధకారంగా మార్చారని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు దుయ్యబట్టారు. ఈ కాంగ్రెస్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆనందంగా జీవించాల్సిన వారి జీవితాల్లో విషాదాన్ని నింపడం దారుణమని అన్నారు. విశ్రాంత ఉద్యోగులు, ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మార్చి 2న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద కామరెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. నిరాహార దీక్షకు సంఘీభావంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ధర్నా చౌక్‌కు తరలివచ్చారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు గళమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలని నినదించారు. బకాయిల చెల్లింపులో జరుగుతున్న జాప్యం వల్ల ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఆర్థికంగా, మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని బిజెపి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని బిజెపి డిమాండ్ చేసింది. ఈ నిరాహార దీక్షలో బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల హక్కుల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా బిజెపి స్పష్టం చేసింది.

ఈ కార్యక్రమంలో ఎన్.రాంచందర్ రావు ప్రసంగిస్తూ. ”తెలంగాణలో రిటైర్మెంట్ అనంతరం ప్రశాంతంగా జీవించాల్సిన వయసులో, తమ జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న బకాయిల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది అత్యంత దారుణమైన పరిస్థితి. రిటైర్డ్ ఉద్యోగులు ఇలా అవమానాలు ఎదుర్కోవడం కాంగ్రెస్ పాలన వైఫల్యానికి నిదర్శనం. కాంగ్రెస్ పాలనలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నమోదయ్యాయి. కొందరు ఆర్థిక ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. మరికొందరు సరైన వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. రేవంత్ సర్కారు నిర్లక్ష్యం ఉద్యోగుల జీవితాలను బలి తీసుకుంటోంది.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు సహా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. దీని కారణంగా అనేక మంది విశ్రాంత ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం అత్యంత దారుణం. వాళ్ల ఓటుబ్యాంక్ తక్కువ అని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వేధిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాం. 

సమయానికి రిటైర్డ్ బెనిఫిట్స్ రావడం లేదు. ఇది కేవలం రిటైర్డ్ ఉద్యోగుల సమస్య మాత్రమే కాదు. రానున్న రోజుల్లో వేల మంది ఉద్యోగులు రిటైర్ కాబోతున్నారు. వాళ్ల పరిస్థితి ఏమవుతుందో అనే భయం అందరిలో ఉంది. హెల్త్ స్కీమ్ అమలు కావడం లేదు. మరోవైపు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రుల్లో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు వేల కోట్ల రూపాయలకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో రోగుల ప్రాణాలతో ఆడుకుంటోంది. ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం నిరాకరించే పరిస్థితి ఏర్పడింది. రూ. 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యం. ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల వద్దే ఫీజులు అడుగుతున్నాయి. ఫలితంగా చదువును మధ్యలో వదిలేసే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో వందలాది మంది విద్యార్థులు మరణించినా, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలతో ఆసుపత్రుల పాలైనా ఈ ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయింది. తెలంగాణలో విశ్వవిద్యాలయాల పరిస్థితి రోజురోజుకీ దారుణంగా తయారవుతోంది. ఒక్క కొత్త ప్రొఫెసర్ పోస్టును కూడా భర్తీ చేయని ప్రభుత్వం.. విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. అధ్యాపకులు లేరు, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా లేదు. ఇదేనా కాంగ్రెస్ చెప్పే పరిపాలన? తెలంగాణ విశ్వవిద్యాలయాల పరిస్థితిని సరిదిద్దండి. ఖాళీ పోస్టులు భర్తీ చేయండి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పర్యవేక్షించాల్సిన స్టేట్ కమిషన్‌ను వెంటనే ప్రక్షాళన చేయాలి. కాంగ్రెస్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. రైతు రుణమాఫీకి నిధులు లేవంటారు. రైతు భరోసా నిధులు రాకపోవడంతో రైతులు పంట పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నారు. రైతు భరోసా రబీ సీజన్ పూర్తయినా ఇవ్వలేదు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్‌లో ఉన్నాయి. హిల్ట్ పాలసీ పేరుతో వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారు. రేవంత్ ప్రభుత్వం 40 శాతం కమీషన్ల ప్రభుత్వంగా మారింది. అక్రమ వసూళ్లు, భూదోపిడీ, ప్రభుత్వ భూముల అమ్మకాలు జరుగుతున్నాయి.

ఈ రోజు తెలంగాణలో పరిపాలన అనేది లేదు.. గడ్డపార రాజ్యంగా మారిపోయింది. రేవంత్ రెడ్డి చేతిలో గడ్డపార, ఆయన మంత్రుల చేతుల్లో పారలు పట్టుకుని పేదల ఇండ్లను కూలగొట్టే స్థాయికి కాంగ్రెస్ పాలన దిగజారింది. పేదల మీద, ఉద్యోగుల మీద, రైతుల మీద జరుగుతున్న ఈ దారుణమైన అణచివేతకు ఇక ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది. ప్రజల హక్కులను కాలరాస్తూ, బలవంతపు కూల్చివేతలతో భయాందోళన సృష్టిస్తున్న ఈ కాంగ్రెస్ గడ్డపార రాజ్యాన్ని కూలగొట్టాల్సిందే. తెలంగాణ ప్రజలు ఇక మౌనంగా ఉండరు. నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లు.. అందరి హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఇది. రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన బిజెపి పోరాటం కొనసాగిస్తుంది. ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈ గడ్డపార ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిందే.” అని అన్నారు.

పెనం మీంచి పొయ్యిలో..: డీకే అరుణ

ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రసంగిస్తూ..”పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ఆ బకాయిలు వెంటనే చెల్లించే దిశగా నిరసన దీక్ష నిర్వహిస్తున్నాం. “పెనం మీంచి పొయ్యిలో పడినట్లు” అన్న సామెతకు అద్దం పడుతున్నట్లుగా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కోపంతో, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఉద్యోగులు కూడా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఎన్నికల ముందు ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీలు పూర్తి చేస్తామని, ఉద్యోగులకు ఫ్రెండ్లీగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటికీ డీఏలు లేవు, పీఆర్సీ లేదు. పదవీ విరమణ సమయంలో ఉద్యోగులు జీవితాంతం కోసం దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగ కుటుంబాల్లో ఈ ప్రభుత్వం తీవ్ర అశాంతిని నింపింది. వైద్య అవసరాలకు, కుటుంబ అవసరాలకు డబ్బులు లేక తీవ్ర మానసిక వేదనకు గురై ఇప్పటికే సుమారు 70 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలి. ఉద్యోగుల సమస్యలపై గొంతెత్తితే.. రాష్ట్ర ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. గతంలో మాట్లాడనివ్వలేదని విమర్శించిన నాయకులే, ఈరోజు అధికారంలోకి వచ్చాక ఎవరూ ప్రశ్నించకూడదన్న నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇది ఒక నియంతృత్వానికి ముగింపు కాదు – మరో కొత్త నియంతృత్వానికి ఆరంభం. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే రిటైర్ ఉద్యోగులకు బెనిఫిట్స్ క్లియర్ చేయాలి. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తే కమిషన్లు రావు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే వాటిని పెండింగ్‌లో పెడుతోంది. విద్యా రంగంలోనూ ఇదే పరిస్థితి. వంద పబ్లిక్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ ప్రకటనలు మాత్రమే. ప్రస్తుతం ఉన్న స్కూల్స్‌లో కనీస వసతులు లేవు, భవనాలు లేవు, ఉపాధ్యాయుల నియామకాలు లేవు. కొత్త ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితం. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 24 గంటలలో రిటైర్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి.”

కమీషన్లు రావనేనా? : ఏలేటి

బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రసంగిస్తూ.. ”తెలంగాణ రాష్ట్రంలో సుమారు 3.6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 2.8 లక్షల రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. మొత్తం 6.4 లక్షల మందికి సంబంధించిన బకాయిలు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. గ్రాట్యుటీ, కమ్యూటేషన్, పీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆరు డీఏలు ఇప్పటికీ చెల్లించని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. కోర్టుల ఒత్తిడి భయంతో ఇటీవల ఒక్క డీఏ ప్రకటించడం తప్ప, ఉద్యోగులు-రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి లేదు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ రిటైర్డ్ ఎస్సై మరణించిన వార్త కలిచివేసింది. రాష్ట్రంలో అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదనతో మృతి చెందారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారం గురించి కనీసం ఆలోచించడం లేదు. వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు, గుత్తేదారులకు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ రాష్ట్రానికి సేవ చేసిన ఉద్యోగుల బకాయిలు చెల్లించాలనే బాధ్యతను విస్మరిస్తోంది. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ మూడు డీఏలు వెంటనే క్లియర్ చేస్తామని, పీఆర్‌సీ ప్రకటిస్తామని హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా అమలు చేయలేదు.

ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపులు చేస్తే కమీషన్లు రావన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యలను పక్కన పెట్టిందని స్పష్టంగా కనిపిస్తోంది. రిటైర్డ్ ఉద్యోగులు కుటుంబాలతో ప్రశాంతంగా జీవించాల్సిన వయసులో, వైద్యం కోసం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఏర్పడింది. సిగ్గు లేకుండా తన పదవి కాపాడుకోవడం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానని అంటున్నారు. కానీ రాష్ట్రానికి సేవ చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇది కాంగ్రెస్ పాలన అసలు స్వరూపం. రాబోయే ఎన్నికల కోసం డబ్బులు జమ చేయడమే ఈ ప్రభుత్వానికి ఏకైక లక్ష్యంగా మారింది. రాష్ట్ర ప్రజల సమస్యలు, రిటైర్డ్ ఉద్యోగుల బాధలు వారికి కనిపించడం లేదు.

ఈ డబ్బుల కోసమే ధరణిని తీసేసి, భూభారతి పేరుతో వేల కోట్ల రూపాయలు వసూలు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ అక్రమాలన్నిటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాల్సిందే. ఈ అంశాలన్నింటిపై మేము తప్పకుండా చిట్టా తీస్తాం, రేపు అసెంబ్లీలో బలంగా ప్రస్తావిస్తాం. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల సాధన కోసం బిజెపి పోరాటం ఆగదు. ఈ అన్యాయాలపై ప్రజల తరఫున గళమెత్తుతూనే ఉంటాం.” అని అన్నారు.

తెలంగాణ ఉద్యమం లానే: ఈటల

మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రసంగిస్తూ.. ”ధర్నా చౌక్ వేదికగా చేపట్టిన ఈ నిరాహార దీక్షలో ఒక ప్రత్యేకత ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలోలాగానే ఇవాళ ఇక్కడ జెండా లేదు, సంఘం లేదు, పార్టీ లేదు. ఒక్కటే సంబంధం.. తెలంగాణ మట్టి బిడ్డల సంబంధం. అనేక సంఘాల్లో నాయకులుగా పనిచేసిన వాళ్లంతా “మాకు ఇవాళ జెండా అవసరం లేదు.. మా ఏకైక ఎజెండా – రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు కాపాడడమే” అని చెప్పి ఇక్కడికి వచ్చారు. 35 సంవత్సరాలు సేవ చేసిన రిటైర్డ్ ఉద్యోగులు డబ్బులు రాకపోవడంతో, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పే దుస్థితి ఈ ధర్నా చౌక్‌లో కనిపిస్తోంది. ఇది తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ చూడని బాధాకర పరిస్థితి. మాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి.. కానీ చేతలు లేవు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోంది. మా దగ్గరికి వచ్చే వారిలో రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగుల తల్లిదండ్రులు, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు రోజూ వచ్చి ఒకటే మాట అంటున్నారు .. అయ్యా.. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడం లేదని ఆవేదన వెల్లబోసుకుంటున్నారు. మాజీ మంత్రులుగా మేం చీఫ్ సెక్రటరీలకు, ఫైనాన్స్ సెక్రటరీలకు అనేకసార్లు మెసేజులు పెట్టాం, ఫోన్లు చేశాం. కానీ సమాధానం ఒక్కటే.. “మా చేతిలో ఏమీ లేదు” ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేదు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ కాలంలో ఇదే ధర్నా చౌక్‌లో పడుకుని అలిసిపోయాం. అప్పుడు అనుకున్నాం.. తెలంగాణ కోసం కదా అని. కానీ అంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి కన్నీళ్లు చూస్తామని ఎవరూ ఊహించలేదు. రిటైర్డ్ ఉద్యోగులు సచివాలయం గేట్లు ఎక్కి ఉద్యమాలు చేయకపోవచ్చు. కానీ వాళ్ల దగ్గర ఒక ఆయుధం ఉంది.. లక్షల మందిని కదిలించే ఆయుధం. దానితో ఈ ప్రభుత్వ భరతం పట్టడం ఖాయం. నేను మాజీ ఆర్థిక మంత్రిగా 2018–19లోనే చెప్పాను.. రాష్ట్రానికి అదనంగా ఖర్చు చేసే స్థోమత లేదు అని. అయినా నిరుద్యోగ భృతి, రుణమాఫీ వంటి అమలు చేయలేని హామీలు ఇచ్చారు. ఫలితం ఏమైంది? నిరుద్యోగ భృతి అమలు కాలేదు. ఏకకాలంలో రుణమాఫీ కాలేదు. ఇవాళ జీతాలు, పెన్షన్లు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ కూడా అదే జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూములు బ్రోకర్లు, భూబకాసులకు కట్టబెట్టబడుతోంది. రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు మాత్రం ఆత్మగౌరవంతో బతకలేని పరిస్థితిలో ఉన్నారు. తెలంగాణ సమాజం మౌనంగా ఉండొచ్చు. కానీ అది బలహీనత కాదు. సమయం వచ్చినప్పుడు బరిగీసి కొట్టే శక్తి తెలంగాణ ప్రజలకు ఉంది. పదవులు శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండేది ఒక్కటే- ఓటు హక్కు. ఈ పదవి ఎవరు ఇచ్చేది కాదు.. ప్రజలే ఇస్తారు. ఇది న్యాయ పోరాటం. పరిష్కారం రాకపోతే ప్రణాళికాబద్ధమైన సమరానికి సిద్ధమవుతాం.” అని అన్నారు.

అసెంబ్లీలోనూ గళమెత్తుతాం: కేవీఆర్

కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ప్రసంగిస్తూ.. ”తెలంగాణ రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగుల బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. తన అధికారాన్ని నిలుపుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వేల కోట్ల రూపాయలు సమకూర్చే ప్రయత్నాలు చేస్తూ, అదే సమయంలో లక్షలాది విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన వారి స్వంత డబ్బును ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్ల రూపాయలు జమ చేస్తానని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. కానీ అదే డబ్బును ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిల కోసం విడుదల చేయడానికి మాత్రం మనసు రావడం లేదు. అసెంబ్లీ సాక్షిగా జనవరి 5న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు రూ.13,500 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని మేమంతా ఏకగ్రీవంగా డిమాండ్ చేశాం. ఆ రోజు 20,500 మంది రిటైర్ అయితే, ఈరోజుకు ఆ సంఖ్య 23,000 దాటింది. కాంగ్రెస్ సర్కారు బకాయిలు చెల్లించకపోవడంతో అవి రూ.15,000 కోట్లకు పెరిగాయి. “కొంత మొత్తం చెల్లించాం” అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది పూర్తిగా అసత్యం. ఏ ఒక్క విశ్రాంత ఉద్యోగికైనా సంపూర్ణంగా రావాల్సిన డబ్బులు అందిన దాఖలాలు లేవు. ఇది ప్రభుత్వ అబద్ధాలకు, పరిపాలనా వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనం.

ఉద్యోగులు తమ జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ము- పింఛన్, పీఆర్‌సీ, డీఏ, లీవ్ ఎన్‌కాష్‌మెంట్, సరెండర్ లీవ్స్.. ఇవన్నీ దోచుకోవడం ఈ రాష్ట్రంలో మాత్రమే జరుగుతోంది. ఇలాంటి ప్రభుత్వం దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేదు. సంక్షేమ పథకాలన్నీ మాటలకే పరిమితమయ్యాయి. ఆడపిల్లల పెళ్లికి లక్ష రూపాయల సహాయం, తులం బంగారం అమలు కావడం లేదు. కాలేజీ అమ్మాయిలకు స్కూటీలు లేవు. యువ వికాసం పథకం కనిపించదు. మహాలక్ష్మి పథకం అమలుకే నోచుకోలేదు. పెన్షన్ల పెంపు లేదు. రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల డబ్బులు తినేసి కూడా, ప్రజల సంక్షేమానికి ఒక్క పైసా ఖర్చు పెట్టని ప్రభుత్వం ఇది. అభివృద్ధి, సంక్షేమం కాదు-రియల్ ఎస్టేట్ లావాదేవీలు, మద్యం దుకాణాలు, కమీషన్లే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏకైక ప్రాధాన్యం అయ్యాయి. బకాయిలు రాకపోవడంతో విశ్రాంత ఉద్యోగులు తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తున్నారు. వైద్య అవసరాలు, కుటుంబ ఖర్చులు, పిల్లల భవిష్యత్తు.. ఇలా ఏదీ చూసుకోలేని దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఆత్మహత్యలకు దారితీస్తే, దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.

పోలీస్ సిబ్బంది నుంచి టీచర్ల వరకు, ప్రతి ఉద్యోగి భవిష్యత్తు అనిశ్చితిలో ఉంది. రిటైర్మెంట్ దగ్గరపడుతున్న ఉద్యోగులు తీవ్ర భయాందోళనలో జీవిస్తున్నారు. మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో, విశ్రాంత ఉద్యోగుల బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు ప్రతిరోజూ వాయిదా తీర్మానాలతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ప్రజల కన్నీళ్లకు కారణమవుతోంది. ఈ కన్నీరు భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి రాజకీయ శిక్షగా మారక తప్పదు.” అని అన్నారు.

కాంగ్రెస్ కసాయి పాలన: పైడి రాకేష్ రెడ్డి

బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రసంగిస్తూ.. ”35 ఏళ్ల పాటు సేవ చేసి, రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడం కాంగ్రెస్ పాలన వైఫల్యానికి నిదర్శనం. రెండున్నర సంవత్సరాల క్రితం కాంగ్రెస్ అబద్ధపు మాటలు నమ్మి అధికారంలోకి తీసుకువచ్చారు.. ఇప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ధర్నాల వల్ల ప్రయోజనం ఉండదు. ప్రజాస్వామ్యంలో అత్యంత పదునైన ఆయుధం ధర్నా కాదు.. ఓటు. పోలింగ్ బూత్‌లో తీసుకునే నిర్ణయమే ప్రభుత్వాలను భయపెడుతుంది. కాంగ్రెస్ పాలన కసాయి పాలనగా మారింది. 60-70 ఏళ్ల వృద్ధులను కూడా వదలని కాంగ్రెస్ ప్రభుత్వం.. నేడు రిటైర్డ్ ఉద్యోగులను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోంది. రిటైర్డ్ ఉద్యోగులు చదువుకున్నవారు, సమాజంపై ప్రభావం చూపేవారు. వారు ప్రజలను చైతన్యపరచాలి. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వేస్తూ, తర్వాత ధర్నాలు చేస్తే ప్రభుత్వం తమ పాలనకు ఆమోదం ఉందని భావిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పెన్షన్లు, రేషన్ కార్డులు, రైతు సమస్యలు, ఉద్యోగ సమస్యలు.. అసెంబ్లీలో సమస్యలను లేవనెత్తేందుకు బిజెపి సిద్ధంగా ఉంది. కానీ ప్రజల నైతిక మద్దతు, బలం అవసరం. కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలంటే రాబోయే ప్రతి ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలి.” అని అన్నారు.