ఆర్ఎస్ఎస్ పై దశాబ్దాలుగా దుష్ప్రచారాలు
ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనడంపై ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ ఆర్ఎస్ఎస్ రాజకీయ సంస్థా లేక సాంస్కృతిక సంస్థా అనే వివాదాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చింది. ఈ అంశంపై చర్చ జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇక్కడ లేనిదల్లా సమస్యను అర్థం చేసుకోవడంలో మేధోపరమైన నిజాయితీ. ఆర్ఎస్ఎస్ ప్రజల్లోకి ఎంతగా విస్తరించి ఉందో అందరికీ తెలుసు. గిరిజనులు, దళితులు, అణగారిన వర్గాల కోసం కార్యక్రమాలతో సహా జీవితంలోని దాదాపు ప్రతి అంశంపై మూడు డజన్లకు పైగా సంఘ్ అనుబంధ సంస్థలు పని చేస్తున్నాయి. అయితే ఆర్‌ఎస్‌ఎస్ స్వచ్ఛంద లేదా ప్రభుత్వేతర సంస్థ కాదు. దాని కార్యకలాపాల ఉద్దేశం పరోపకారం, దాతృత్వాలకు మించినది. సామాజిక, ఆర్థిక సాధికారతకు అవి పరిమితం కావు. హిందుత్వ భావజాలం దాని అన్ని చర్యల వెనుక ఉంది. లౌకికవాదం, ఉదారవాదం, జాతీయవాదం, బహుళ సాంస్కృతికత, హిందూ నాగరికత వంటి విడివిడి నిర్వచనాలు భారత్ నాగరికత పట్ల సమగ్ర అవగాహనను అందించలేవని ఆర్ఎస్ఎస్ విశ్వసిస్తుంది. అది ఆర్థిక లేదా రాజకీయ ప్రశ్నలను విస్మరించదు. అందువల్ల సంస్కృతికి సంఘ్ ఇచ్చే నిర్వచనం దేశ ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.
గతంలో వలస పాలనలోనే సంఘ్ పై నిషేధం గురించి పార్లమెంటులో చర్చ జరిగింది. చర్చను మొదలు పెట్టడం, ఉద్దేశపూర్వకంగా మధ్యలో వదిలివేయడం పరిపాటిగా మారింది. భారతీయ మేధావి వర్గం తనకు అనుకూలమైన కొన్ని వాస్తవాలను మాత్రమే ఉపయోగిస్తూ మన కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తోంది. సుదీర్ఘకాలంగా ఉన్న ఒక సమస్యకు వాదవివాదాలతో పరిష్కారం లభించదు. ఆర్ఎస్ఎస్ స్వభావంపై 1968 జూలై 3న జరిగిన చర్చ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అప్పటి హోం మంత్రి వై బి చవాన్, సహాయ మంత్రి విద్యా చరణ్ శుక్లా, కమ్యూనిస్టు నాయకుడు భూపేష్ గుప్తా, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన దత్తోపంత్ టెంగ్డే సహా అరడజనుకు పైగా సభ్యులు ఈ అంశంపై మాట్లాడారు. కచ్ అవార్డు (గుజరాత్‌లోని కచ్‌పై భారతదేశం, పాకిస్తాన్‌ల హక్కులపై ట్రిబ్యునల్ ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం మధ్యవర్తిత్వం) ను వ్యతిరేకిస్తూ 1968 మార్చిలో ఆర్ఎస్ఎస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానం ఈ చర్చకు కారణం. రాజకీయాలలో జోక్యం చేసుకోనని 1949 లో ప్రభుత్వానికి ఇచ్చిన మాటను సంఘ్ ఉల్లంఘించిందని ఎస్ కె వైశంపాయన్ ఈ చర్చ సందర్భంగా నిందించారు. వై బి చవాన్ ఈ తీర్మానం ‘నిజంగా ‘సంస్కృతి’ కిందకు వస్తుందా’ అని టెంగ్డేను అడిగినప్పుడు, టెంగ్డే ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నతో ఇలా బదులిచ్చారు: “జాతీయ భద్రత, జాతీయ సమగ్రతకు సంబంధించిన సమస్యలు కేవలం రాజకీయ అంశాలేనని, జాతీయవాద సంస్థలు ఈ జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమస్యలను చర్చించకూడదన్నది గౌరవ హోంమంత్రి గారి ఉద్దేశమా? ఆర్ఎస్ఎస్ జాతీయ భద్రత, జాతీయ సమగ్రత అంశాలను చర్చించినందున కేవలం ఆ కారణంగా అది రాజకీయ సంస్థ అవుతుందా?”. ఇది తాత్విక ప్రశ్న అని, తర్వాత చర్చిస్తానని హోంమంత్రి చెప్పారు. వలస పాలన కాలంలో ప్రభుత్వ ఉద్యోగులను ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించినప్పుడు, ఈ అంశంపై రెండు రోజులు (7, 8 మార్చి 1934 ) సెంట్రల్ ప్రావిన్సుల శాసన మండలిలో చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న మొత్తం 14 మంది సభ్యులు ప్రభుత్వం తన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు.
మన ప్రజాస్వామ్యంలో తరచుగా అజ్ఞానానికి పెద్దపీట వేస్తాం. రాజకీయ నాయకులు సిద్ధాంతాలను అర్థం చేసుకోవడంలో సోమరితనం ప్రదర్శిస్తారు. మేధావి వర్గం సొంత కుల వ్యవస్థతో ముక్కలై పోయి పోయింది. సైద్ధాంతిక పక్షపాతాలు ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ అవుతాయి. తమ రాజకీయ తప్పిదాలను, అవకాశవాదాన్ని కప్పిపుచ్చుకోడానికి నకిలీ లౌకికవాదులు ఆర్‌ఎస్‌ఎస్‌ను ఒక అనుకూలమైన సాధనంగా ఉపయోగించుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నేరపూరిత చర్యలకు పాల్పడిందని వాస్తవ విరుద్ధమైన, తప్పుడు ఆరోపణలు చేశారు. అందులో ఒకటి గాంధీజీ హత్య. వి డి సావర్కర్‌కు రాసిన లేఖలో నాథూరామ్ గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్ పట్ల తన తీవ్రమైన అసహ్యాన్ని వెల్లడించాడు. ఆర్ఎస్ఎస్ హిందూ యువత శక్తిని వృథా చేస్తోందని రాశాడు. “ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త స్మారక ఫలకంపై అతను స్వయంసేవక్‌గా పుట్టి, జీవించి, ఏమీ సాధించకుండా చనిపోతున్నాడు” అని ఉంటుందని ఒకప్పుడు వి డి సావర్కర్ అన్న మాటలను ఉటంకించాడు. ఆర్‌ఎస్‌ఎస్ సామాజిక సిద్ధాంతం సోషలిజాన్ని ప్రతిబింబిస్తుందని గాడ్సే వాదించాడు. సావర్కర్‌తో సహా హిందూ మహాసభ నాయకులు ఆర్‌ఎస్‌ఎస్ తమ రాజకీయ లక్ష్యాలతో మమేకం కాలేదని దానిపట్ల కినుక వహించారు. భావజాలం, వ్యూహం రెండింటిలోనూ రెండు సంస్థల మధ్య ప్రాథమిక వ్యత్యాసాలు ఉన్నాయి.
ఆవిర్భావం నుండి ఆర్ఎస్ఎస్ మెజారిటీవాదాన్ని తిరస్కరించింది. హిందువులలో జాతీయవాద స్పృహను సృష్టించడానికి సామాజిక-సాంస్కృతిక మార్గాన్ని ఎంచుకుంది. ఆర్‌ఎస్‌ఎస్ యేతర హిందుత్వ వాదులు చాలా మంది కె బి హెడ్గేవార్ ‘సంస్థ కోసం సంస్థ’ అనే సూత్రాన్ని అర్థం చేసుకోలేరు. సాంస్కృతిక స్పృహ రాజకీయాలపై నైతిక ప్రభావాన్ని చూపుతుందని ఆర్ఎస్ఎస్ విశ్వసిస్తుంది. అయినప్పటికీ, ఆర్ఎస్ఎస్ రాజకీయ పాత్రను ప్రశ్నించడం అసంబద్ధమేమీ కాదు. దాని ప్రత్యర్థులు కేవలం పాత ఆరోపణలను పునరావృతం చేయకుండా చర్చలో పాల్గోవాలని సంఘ్ ఆశిస్తోంది. బిజెపితో, దానికి ముందున్న భారతీయ జనసంఘ్ తో ఆర్‌ఎస్‌ఎస్‌కు చారిత్రక బంధం ఉంది. ఈ బంధం రెండు పార్టీల స్థాపనకు దోహదపడింది.
గాంధీజీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ అణచివేతకు గురైంది. అది ఏకాకి అయిన సమయంలో దాని సంస్థాగత బలం జనసంఘ్ ఏర్పాటుకు ఉపయోగపడింది. ఆర్ఎస్ఎస్ శిక్షణ పొందిన కార్యకర్తలు జనసంఘ్, బిజెపి రెండింటిలోనూ చురుకైన పాత్ర వహించారు. కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం ఈ రాజకీయ పార్టీలకు ఆమడ దూరంలోనే ఉండిపోయింది. సెక్యులరిజం, జాతీయవాదం, సంస్కృతిపై దాని అభిప్రాయాలపై దాడి జరిగింది. రాజకీయాల్లో బిజెపి సంఘ్ భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. గత ఏడు దశాబ్దాల పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వివిధ సిద్ధాంతాలు కలిగిన పార్టీలు బిజెపితో చేతులు కలిపి ఆర్‌ఎస్‌ఎస్‌తో వేదిక పంచుకున్నాయి. చాలా మంది నిజాయితీగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా మరికొందరు అవకాశవాదులుగా వ్యవహరించారు. 1967, 1977లో సోషలిస్టులు, కమ్యూనిస్టులు ఆర్ఎస్ఎస్ తో సన్నిహితంగా పని చేశారు. 1977లో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరడంపై నిషేధాన్ని తొలగించినప్పుడు అప్పటి జనతా పార్టీలో భాగమైన కాంగ్రెస్ ప్రస్తుత మిత్రపక్షాలు అనేకం దాన్ని వ్యతిరేకించలేదు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు సామాజిక-సాంస్కృతిక వాస్తవాలను బాగా అర్థం చేసుకుంటారు. వలస కాలం నుంచి ప్రభుత్వోద్యోగుల్లో పేరుకుపోయిన ఆధిక్య భావనను వదిలించుకుంటారు. ఇది వారిలోని నిర్లిప్తతను తొలగించి భావోద్వేగాలతో కూడిన అధికారులుగా మారుస్తుంది. ఆర్ఎస్ఎస్ విషయంలో బిజెపియేతర పార్టీల అట్టడుగు స్థాయి కార్యకర్తలు ఆయా పార్టీల నాయకత్వంతో విభేదిస్తారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు బందీలైన ఈ పార్టీలు సంఘ్ తో ఆరోగ్యవంతమైన చర్చకు స్పందించరు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని తిరస్కరించండం తప్ప మరొకటి కాదు.
డాక్టర్ రాకేష్ సిన్హా,
మాజీ ఎంపీ

