పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్న ఉజ్జ్వల యోజన
దేశవ్యాప్తంగా పేద కుటుంబాల్లోని గృహిణుల పేరిట ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లను అందించేందుకు ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన (పీఎంయూవై)ను మే 1, 2016న నరేంద్ర మోది ప్రభుత్వం ప్రారంభించింది. పేద కుటుంబాలకు స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందించడం ద్వారా, తీవ్రమైన గృహ వాయు కాలుష్యానికి కారణమయ్యే కట్టెలు, బొగ్గు, ఆవు పేడ వంటి సాంప్రదాయ వంట ఇంధనం వాడకంతో ముడిపడి ఉన్న తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను తగ్గించడం, వారి ఆరోగ్యాన్ని కాపాడటం ఈ పథకం ప్రాథమిక లక్ష్యం.
వంట ఇంధనంగా ఎల్పీజీని ఉపయోగించడం వల్ల మహిళలు కట్టెలు సేకరించే శ్రమ నుండి విముక్తి పొందుతారు. వంట చేయడానికి వెచ్చించే సమయం తగ్గుతుంది. అడవుల నిర్మూలనను నివారిస్తుంది. జూలై 1, 2024 నాటికి దేశవ్యాప్తంగా 10.33 కోట్ల పీఎంయూవై కనెక్షన్లు ఇచ్చారు. దేశంలో ఎల్పీజీ వాడకాన్ని పెంచడానికి, పీఎంయూవైని ప్రోత్సహించడానికి కేంద్రం అనేక కార్యక్రమాలను నిర్వహించింది. ఎల్‌పీజీ పంచాయితీల ద్వారా కనెక్షన్ల నమోదు, పంపిణీ చేయడానికి మేళాలు, శిబిరాలను నిర్వహించడం, హోర్డింగులు, రేడియో జింగిల్స్, ఐఈసీ వ్యాన్లు మొదలైన వాటి ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించింది. ఇతర సంప్రదాయ ఇంధనాల కంటే ఎల్పీజీని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేసింది. ఎల్పీజీని సురక్షితంగా ఉపయోగించడం వంటి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా పలు సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. వినియోగదారులు, వారి కుటుంబాల ఆధార్ నమోదు, బ్యాంకు ఖాతాలను తెరవడం, పీఎంయూవై కనెక్షన్లు పొందే ప్రక్రియను సరళతరం చేయడం, www.pmuy.gov.in లో పీఎంయూవై కనెక్షన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు, సమీప ఎల్పీజీ పంపిణీదారులు, కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ) మొదలైనవి ఏర్పాటు చేశారు. అదేవిధంగా 5 కిలోల డబుల్ బాటిల్ కనెక్షన్ (డీబీసీ), 14.2 కిలోల నుంచి 5 కిలోల గ్యాస్ కు మార్చుకునే వీలు కల్పించారు. చిరునామా రుజువు, రేషన్ కార్డుకు బదులుగా స్వీయప్రకటన ఆధారంగా కొత్త కనెక్షన్ పొందడానికి వలస కుటుంబాలకు వెసులుబాటు కలిగించారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసీలు), ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నిరంతరం కొత్త ఎల్‌పీజీ డీలర్షిప్లను ప్రారంభిస్తున్నాయి. పీఎంయూవై పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఒఎంసీలు దేశవ్యాప్తంగా 7,905 డీలర్షిప్లను ప్రారంభించాయి. వీటిలో 7,325 అంటే 93 శాతం గ్రామీణ ప్రాంతాలకు సేవలందిస్తున్నాయి (ఏప్రిల్ 1, 2016 నుంచి జూన్ 30, 2024 వరకు). ఈ ప్రయత్నాల ఫలితంగా, పీఎంయూవై లబ్ధిదారుల తలసరి వినియోగం సంవత్సరానికి 3.95 ఇంధన రీఫిల్స్ కు మెరుగుపడింది. అంతేకాకుండా, దేశంలో ఎల్పీజీ విస్తరణ ఏప్రిల్ 2016 లో 62 శాతం నుంచి ఇప్పుడు దాదాపు 100 శాతానికి చేరుకుంది. స్వతంత్ర అధ్యయనాలు, నివేదికలు పీఎంయూవై పథకం గ్రామీణ కుటుంబాల జీవితాలపై, ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, కుటుంబాలపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపినట్టు స్పష్టంచేస్తున్నాయి. ఈ పథకం వల్ల కలిగిన ప్రధాన ప్రయోజనాలు క్లుప్తంగా ఇవి:
సాంప్రదాయ వంట పద్దతుల్లో కలప, పేడ, పంట అవశేషాలు వంటి ఘన ఇంధనాలను వాడే విధానానికి స్వస్తి చెప్పి ప్రజలు ఉజ్జ్వల యోజన కింద వంట గ్యాస్ కు మారారు. పరిశుభ్రమైన ఇంధనం వాడకం ద్వారా ఇళ్లలో వాయు కాలుష్యం తగ్గుతుంది. సాధారణంగా ఇంటి పొగకు ఎక్కువగా గురయ్యే మహిళలు, పిల్లలలో ఇది మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యానికి దారితీస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని కుటుంబాలు తరచుగా సాంప్రదాయ వంట ఇంధనాలను సేకరించడానికి వారి సమయాన్ని, శక్తిలో గణనీయమైన భాగాన్ని వెచ్చిస్తారు. ఎల్‌పీజీ కనెక్షన్ల ద్వారా పేద కుటుంబాల్లోని మహిళలు వంట చేయడానికి వెచ్చించే సమయం, శ్రమ తగ్గాయి. తద్వారా వారు ఖాళీ సమయాన్ని ఆర్థిక ఉత్పాదకతను పెంపొందించడానికి, ఆదాయాలను పెంచుకోడానికి బహుళ రంగాలలో ఉపయోగించుకునే వెసులుబాటు కలిగింది.
వంట అవసరాల కోసం ఎల్‌పీజీకి మారడం సాంప్రదాయ ఇంధనాల నుంచి, కలప, ఇతర జీవ పదార్థాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఇది అడవుల నిర్మూలన, పర్యావరణ క్షీణతలను తగ్గిస్తుంది. ఇది గృహాలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా విస్తృతమైన పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలకు దోహదం చేస్తుంది.
వంట కోసం ఎల్‌పీజీ ఉపయోగించడం అగ్ని ప్రమాదాలను సైతం తగ్గిస్తుంది, ఇది మహిళలు, పిల్లల భద్రతకు చాలా ముఖ్యమైనది. సాంప్రదాయ వంట పద్ధతులు వాడటం ద్వారా సాధారణంగా జరిగే నిప్పు వల్ల కలిగే గాయాలు తగ్గుతాయి. ఇది సురక్షితమైన ఇంటి వాతావరణానికి దోహదం చేస్తుంది.

