skilling youth

యువశక్తికి ‘నైపుణ్యం’ మెరుగులు

skilling youthభారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద ‘నాకు 100 మంది శక్తిమంతులైన యువకులను ఇవ్వండి. నేను భారతదేశాన్ని మారుస్తాను’ అని అన్నారట. వివేకానందుని విశ్వాసంలో తప్పులేదు. చరిత్రలో అనేక సందర్భాల్లో పరిమాణాన్ని, సంఖ్యను నైపుణ్యం ఓడించింది. ఔరంగజేబ్ భారీ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్ సారథ్యంలోని అత్యంత పోరాటపటిమ గల, శిక్షణ పొందిన మరాఠాల సంఖ్య చాలా తక్కువ. కానీ నైపుణ్యం, పరిమాణం లేదా సంఖ్య కలిస్తే ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించండి. ఉదాహరణకు, శివాజీ సైన్యం దాని పరిమాణం కంటే 10 రెట్లు ఎక్కువ అనుకోండి. ప్రతి సైనికుడు అత్యంత నైపుణ్యం కాగలవాడే. అప్పుడు ప్రత్యర్థుల పరిస్థితి ఊహించుకోవచ్చు. 2024-25 బడ్జెట్ అనేది నైపుణ్యం, పరిమాణాలను మేళవించే దార్శనిక పత్రం. ఇది ఆశించే శ్రామిక శక్తికి యువత నాయకత్వం వహిస్తుంది.

‘ఆర్థిక సర్వే 2023-24’ భారతదేశ జనాభా ప్రయోజనాలను ప్రముఖంగా ప్రస్తావించింది: మధ్యస్థ వయస్సు 28. చాలా మంది యువ భారతీయులు శ్రామిక శక్తిలోకి ప్రవేశిస్తున్నారు లేదా అందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, ఒక ముఖ్యమైన సవాలు ఉంది. అది భారతీయ పట్టభద్రుల్లో కేవలం 51 శాతం మంది మాత్రమే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు కలిగివున్నారు. ప్రభుత్వం చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా ఈ శాతం 2017-18లో 34 ఉండగా ఇప్పుడు 51కి చేరుకుంది. అయితే వృత్తి శిక్షణకు ఇప్పటికీ సమాజంలో దక్కాల్సిన గౌరవం లభించడం లేదు. నైపుణ్యాభి వృద్ధి మంత్రిత్వ శాఖ 2022-23లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, అధికారిక విద్యలో విఫలమైన వారికి నైపుణ్య శిక్షణ తరచుగా చివరి ప్రయత్నంగా చూడబడుతోంది. దీనిని పరిష్కరించడానికి బడ్జెట్ ఒక సంచలనాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దేశంలోని 500 అగ్రశ్రేణి కంపెనీలతో ఇంటర్న్ షిప్ కోసం ప్రభుత్వం ఏడాదికి కోటి మంది పట్టభద్రులకు నెలకు రూ.5,000 చొప్పున చెల్లిస్తుంది. శిక్షణకు అయ్యే వ్యయాలను ఈ కంపెనీలు తమ సామాజిక బాధ్యతా నిధుల నుంచి భరిస్తాయి. పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను తగ్గించడంతోపాటు నైపుణ్యాన్ని లాభదాయకంగా, సామాజికంగా ఆమోదయోగ్యంగా మార్చడం ఈ పథకం లక్ష్యం. అటువంటి విస్తృతమైన నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా, బడ్జెట్ భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య, తయారీ కేంద్రంగా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది నైపుణ్యం, పరిమాణాల కలయిక. ఛత్రపతి శివాజీ మహారాజ్ నేతృత్వంలోని అత్యంత నైపుణ్యం కలిగిన సైనికులతో సమాన స్థాయి కలిగి ఉండటమే కాక మన యువసైన్యం కోట్ల సంఖ్యలో కూడా ఉంటుంది.

వాతావరణ మార్పుల కారణంగా సంభవించే విపత్తుల ముందు వ్యవసాయానికి సంబంధించి దేశం నిస్సహాయ స్థాయిలో ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వాతావరణ విపత్తులను తట్టుకుని నిలిచే 32 పంటల వంగడాల అభివృద్ధిని ప్రోత్సహించాలని బడ్జెట్ సంకల్పించింది. రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీఓ)లకు జాతీయ సహకార విధానం ద్వారా వాటికీ మద్దతు, నూనెగింజలు, కూరగాయల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, కోటి మంది రైతులలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, వ్యవసాయానికి డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలను కూడా బడ్జెట్ ప్రతిపాదించింది.

చిన్న పరిశ్రమలు దూకుడుగా సిబ్బందిని నియమించుకోవడానికి, తమ ఉత్పాదకతను పెంచుకోడానికి బడ్జెట్ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)కి సంబంధించి మూడు కీలకమైన కొత్త పథకాలను ప్రకటించింది. ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహకాల పథకం (పీఎల్ఐ) మాదిరిగా ప్రభుత్వం ఉద్యోగాలతో ముడిపడిన ప్రోత్సాహకాలతో ముందుకు వచ్చింది. దీని కింద మొదటిసారిగా ఉద్యోగంలో నియమితులైన వారికి రూ.15,000 వరకు ఒక నెల జీతాన్ని మూడు విడతలుగా నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తారు. అంతే కాకుండా ఏదైనా సంస్థ కొత్త వారిని నియమిస్తే వారికి యాజమాన్యం చెల్లించే పిఎఫ్ వాటాలో రూ.3,000 వరకు ప్రతి నెలా యాజమాన్యానికి ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఈ పథకాలు పరిశ్రమలను కొత్తవారిని నియమించడం, ఉత్పత్తి పెంపు, విస్తరణ వైపు దృష్టి సారించేలా ప్రోత్సహిస్తాయి.

ఇక గృహాల విషయానికి వస్తే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) కింద 3 కోట్ల ఇళ్లు, పేద, మధ్యతరగతి ప్రజల కోసం పట్టణ ప్రాంతాల్లో కోటి ఇళ్లు నిర్మించడానికి బడ్జెట్ గణనీయమైన కేటాయింపులు చేసింది. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించి బడ్జెట్ మూడు ముఖ్యమైన క్యాన్సర్ ఔషధాలను కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించి లక్షల మంది రోగులకు భారీ ఊరట కల్పించింది.

మహిళా సాధికారతకు ఒక దశాబ్దం క్రితంతో పోలిస్తే 218.8 శాతం నిధుల పెంపు ద్వారా గణనీయమైన ప్రోత్సాహాన్ని కల్పించారు. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా మహిళా వసతి గృహాల స్థాపనకు ప్రాధాన్యమిచ్చారు. గత దశాబ్దంలో గణనీయంగా వృద్ధి చెందిన మధ్యతరగతి, 1961 ఆదాయపు పన్ను చట్టం సమగ్ర సమీక్ష నుంచి ప్రయోజనం పొందుతుంది. ఆదాయం పన్ను ప్రామాణిక మినహాయింపు (స్టాండర్డ్ డిడక్షన్)ను రూ.50,000 నుంచి నుండి రూ.75,000కి పెంచి మధ్యతరగతి కుటుంబాలకు వెసులుబాటు కల్పించారు. తూర్పు రాష్ట్రాలను అభివృద్ధి చేయాలన్న ప్రధాని మోదీ సంకల్పం కొత్తదైన పూర్వోదయ పథకంలో ప్రతిబింబిస్తుంది. ఒడిశాను ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి, నలంద, రాజ్‌గిర్, బోధ్ గయా, విష్ణుపద్ ఆలయ సముదాయాలకు మరింతమంది పర్యాటకులను ఆకర్షించడానికి ఉద్దేశించిన కార్యక్రమాలు పూర్వోదయలో భాగంగా ఉన్నాయి. నైపుణ్యం, పరిమాణాలను మేళవించడంపై బడ్జెట్ దృష్టి పెట్టింది. ఉపాధికి ప్రాధాన్యం ఇవ్వడం, యువతకు నాయకత్వం వహించే అవకాశాన్ని కల్పించడం ద్వారా బడ్జెట్ వృద్ధికి బాటలు వేస్తుంది.

గజేంద్ర సింగ్ షెకావత్,
కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి