Modi

సామాజిక రంగంలో మోదీ ప్రభుత్వ విప్లవం

ప్రభుత్వం చేసే అత్యంత ముఖ్యమైన పనులు అరుదుగా మాత్రమే చర్చనీయాంశం అవుతుంటాయి. దానికి ఒక బలమైన కారణం ఉంది. శాంతిభద్రతలు, ప్రజారోగ్యం, విద్య వంటివి కేవలం గొప్పగా చెప్పుకునే అంశాలు కావు; అవి దేశానికి పునాదులు. ఇవి కేవలం ప్రభుత్వం మాత్రమే భారీ స్థాయిలో, చట్టబద్ధమైన అధికారంతో నిర్వహించగల బాధ్యతలు. మార్కెట్లు కొత్త ఆవిష్కరణలు చేయవచ్చు, పౌర సమాజం అండగా నిలబడవచ్చు, కానీ ప్రభుత్వ అధికారం, జవాబుదారీతనం లేకుండా ఏ ప్రైవేట్ సంస్థ కూడా న్యాయాన్ని, సార్వత్రిక విద్యను లేదా ముందస్తు ఆరోగ్య సంరక్షణను అందించలేదు. ఇవి కేవలం బయట వ్యక్తులకు అప్పగించే సేవలు కావు, ఇవి సామాజిక ఒప్పందంలోని  అంతర్భాగాలు.

గత కొన్నేళ్లుగా భారత్ విధాన నిర్ణయాల్లో ఈ బాధ్యత పట్ల ఒక కొత్త నిబద్ధత కనిపిస్తోంది. విమానయాన అంతరాయాల నుంచి ఉగ్రవాద దాడుల వరకు తలెత్తే సంక్షోభాలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నా  తెర వెనుక నిశ్శబ్దంగా ఒక మహాకార్యం కొనసాగుతోంది: పిల్లలను తరగతి గదుల్లో ఉంచడం, వ్యాధి ముదిరి విపత్తుగా మారకముందే గుర్తించడం,  వ్యవస్థలో పౌరులు చిక్కుకుపోకుండా, వారికి వ్యవస్థ సేవ చేసేలా చట్టాలను తిరగరాయడం జరుగుతోంది. ప్రభుత్వం తనకు ముఖ్యమైన  రంగాలైన శాంతిభద్రతల పరిరక్షణ, న్యాయస్థానాలు, పోలీసు వ్యవస్థల బలోపేతం, ఆరోగ్యం, విద్యపై పెట్టుబడి వంటి వాటిపై దృష్టి పెట్టింది. ఇది ప్రజలు ఆరోగ్యంగా, ఉత్పాదకతతో జీవించేందుకు చట్టపరమైన పునాదులను వేస్తోంది.

విద్యలో చారిత్రాత్మక మైలురాళ్లు

భారత విద్యా రంగం విద్యను అందరికీ అందించడం నుంచి  నాణ్యమైన విద్యా ఫలితాల వైపు మళ్లింది. మోదీ ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థుల నమోదును దాదాపు 98 శాతానికి తీసుకువెళ్ళి సార్వత్రికవిద్య స్థాయిని అందుకుంది. జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి) 2020 ద్వారా ‘నిపుణ్ భారత్’  మిషన్ కింద ప్రాథమిక అక్షరాస్యత, గణిత పరిజ్ఞానాన్ని వ్యవస్థీకృతం చేసింది. ఈ మార్పునకు ప్రభుత్వ పాఠశాలలే చోదకశక్తిగా మారాయి—ఇవి  దేశంలోని నిరుపేద పిల్లలకు ప్రధాన విద్యావనరుగా ఉన్నాయి. ఒకప్పుడు వెనుకబడినవిగా పరిగణించిన ఈ ప్రభుత్వ సంస్థలు, కోవిడ్ అనంతర కాలంలో ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలను సాధించాయి.

విద్యారంగంపై వార్షిక నివేదిక (ASER)  గణాంకాలు ఒక గొప్ప పురోగతిని వెల్లడించాయి. అంకగణిత నైపుణ్యాలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి; 2014 నుండి 3వ తరగతి విద్యార్థుల తీసివేతల  సామర్థ్యం దాదాపు 40 శాతం పెరిగింది. పఠన సామర్థ్యం కూడా పుంజుకుని, 3, 5వ తరగతి స్థాయిలు గతంలో ఎన్నడూ లేని రికార్డులను అధిగమించాయి. ఈ విద్యా పురోగతికి తోడుగా ఉపాధ్యాయుల హాజరు శాతం 88 శాతానికి చేరడం, 2014 నుంచి బాలికల మరుగుదొడ్ల సౌకర్యం రెట్టింపు కావడంతో పాఠశాలల్లో బాలికల సంఖ్య పెరగడం వంటివి ఈ సామాజిక విప్లవాన్ని ధృవీకరిస్తున్నాయి.

ఆరోగ్య రంగం: ఫలితాలనిస్తున్న భారీ మార్పులు

ఆరోగ్య రంగంలో కూడా ఇదే విధమైన మార్పు కనిపిస్తోంది. వ్యాధి కారణంగా ఒక కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోకుండా ఉండేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక రక్షణతో కూడిన ప్రాథమిక వైద్య సేవలను విస్తరించింది. 42 కోట్లకు పైగా ‘ఆయుష్మాన్’ కార్డులు ఇప్పుడు దాదాపు 12 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందిస్తున్నాయి. ఈ పథకం కింద ఇప్పటికి దాదాపు 11 కోట్ల ఆస్పత్రి అడ్మిషన్లు నమోదయ్యాయి. ఈ సంఖ్య కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే గతంలో తాము భరించలేని ఖరీదైన వైద్య చికిత్సను ఇప్పుడు సామాన్య కుటుంబాలు పొందగలుగుతున్నాయి. పదేళ్ళ క్రితం, కుటుంబాలు తమ ఆరోగ్య ఖర్చులలో దాదాపు మూడింట రెండు వంతులు సొంతంగా  భరించవలసి వచ్చేది. జాతీయ ఆరోగ్య గణాంకాల ప్రకారం నేడు ఆ భారం 40 శాతం కంటే తక్కువకు పడిపోయింది. దీనివల్ల ఒక అనారోగ్యం కారణంగా శ్రామిక కుటుంబాలు అప్పులపాలు కావడం లేదా పేదరికంలోకి వెళ్లడం వంటి పరిస్థితులు తగ్గాయి. అదే సమయంలో ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు’ 2018లో 17,000 నుంచి నేడు 1.82 లక్షలకు  పెరిగాయి. ఇవి 495 కోట్ల అవుట్-పేషేంట్ సేవలను, 42 కోట్ల టెలీ-కన్సల్టేషన్లను అందించాయి. దీనివల్ల ఒక గ్రామంలోని తల్లి జిల్లా ఆసుపత్రికి గంటల తరబడి ప్రయాణించాల్సిన అవసరం లేకుండానే ప్రాథమిక పరీక్షలు, చికిత్సను పొందగలుగుతోంది.

పౌరులకు సత్వర న్యాయం

భారత నేర న్యాయ వ్యవస్థలో కూడా 2024 నుంచి మూడు మౌలిక చట్టాల ద్వారా సమూలమైన మార్పు మొదలైంది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత,  భారతీయ సాక్ష్య అధినీయం.. ఈమూడు చట్టాలు కలిసి 313 గణనీయమైన మార్పులను తీసుకువచ్చాయి. ఇది వ్యవస్థ దిశను స్పష్టంగా మారుస్తోంది: అస్పష్టత నుంచి పారదర్శకతకు, జాప్యం నుంచి సమయపాలనకు, అనవసరపు ప్రక్రియల నుంచి ప్రజల వైపునకు ఈ మార్పు జరిగింది. గరిష్టంగా మూడేళ్లలోపు న్యాయం అందించాలనే లక్ష్యంతో వీటిని బిజెపి ప్రభుత్వం రూపొందించింది. ఇకపై విచారణలకు కాలపరిమితి ఉంటుంది.  వాయిదాల సంఖ్యను పరిమితం చేశారు.  తుది వాదనలు పూర్తయిన 30 నుండి 45 రోజులలోపు తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. విచారణలో ఉన్న ఖైదీలకు వారి నేరం ఒకవేళ రుజువైతే పడే గరిష్ట శిక్షా కాలంలో సగం పూర్తి చేస్తే తప్పనిసరిగా బెయిల్ ఇవ్వాలి. చేతిరాతతో కూడిన అస్పష్టత పోయి డిజిటల్ ఎఫ్ఐఆర్లు, ఎలక్ట్రానిక్ సమన్లు, అరెస్టుల సమయంలో తప్పనిసరి ఆడియో-వీడియో రికార్డింగ్‌లు అమల్లోకి వచ్చాయి. దశాబ్దాల తరబడి కాకుండా, మూడేళ్లలోనే న్యాయం జరగాలనే ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా ఈ నిబంధనలను రూపొందించారు. 

విద్య, ఆరోగ్యం, న్యాయ రంగాలలో భారత్ సాధించిన ఇటీవలి ఈ విజయాలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అదృశ్యంగా ఉండే ‘సామాజిక ఒప్పందం’ విజయవంతంగా అమలవుతున్న తీరును రుజువుచేసున్నాయి. విద్యారంగ  వ్యవస్థలు, ఆరోగ్య సేవలు, న్యాయ వ్యవస్థలపై పెట్టుబడి పెట్టే ప్రభుత్వం, దేశవృద్ధికి, భద్రతకు అవసరమైన పునాదులను బలోపేతం చేస్తుంది. ప్రభుత్వం తన ప్రధాన హామీలను భారీ స్థాయిలో నెరవేర్చినప్పుడు, దాని ఫలితాలు దీర్ఘకాలంలో రెట్టింపు అవుతాయి.

అనుజ్ గుప్తా,
బౌర్ గ్రూప్ ఏషియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్