సామాన్యుడికి మోదీ కానుక జీఎస్టీ తగ్గింపు
ధర్మం తప్పి దుర్మార్గంలో పయనిస్తున్న రావణాసురుడుని శ్రీరాముడు సంహరించిన సందర్భాన్ని చెడుపై మంచి సాధించిన విజయంగా మనం విజయ దశమి జరుపుకొంటున్నాం. అధర్మంగా వ్యవహరిస్తూ నరకాసురుడిని వధించి చీకట్లో మగ్గిపోయిన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన సందర్భాన్ని దీపావళిగా జరుపుకొంటున్నాం. దుర్మార్గుడైన మహిషాసురుడిని సంహరించిన దుర్గా మాతను కొలుస్తూ నవరాత్రి ఉత్సవాలు జరుపుకొంటున్నాం. ప్రజలకు మంచి జరిగిన సందర్భాన్ని పండుగ చేసుకుంటాం. దసరా, దీపావళి, నవరాత్రి ఉత్సవాలతో పాటు ఈ ఏడాది మరో పండుగ కూడా వచ్చింది. అది జీఎస్టీ తగ్గింపు పండుగ. నాలుగు స్లాబులున్న జీఎస్టీని రెండు స్లాబులకు కుదించి, దాదాపు 99 శాతం వస్తువులకు పన్ను తగ్గించడం ప్రజలకు మేలు చేసేది కాబట్టే జీఎస్టీ 2.0 సంస్కరణలను పండుగగా చెప్పుకుంటున్నాం.
ప్రజలు రోజూవారీ జీవనంలో వినియోగించే నూనె, పేస్టు, సబ్బు, షాంపూ, బేబీ డైపర్స్ వంటి వాటిపై పన్ను 18% నుంచి 5%కి తగ్గింది. మిఠాయిలు, బట్టలు, వెన్న, పన్నీర్, రెడీమేడ్ నమ్‌కీన్స్, బిస్కెట్లు ఇవన్నీ మరింత చౌక అవడం పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. థర్మామీటర్, ఆక్సిజన్, వైద్య పరీక్షలు, కళ్లద్దాల ధరలు తగ్గడం వల్ల ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చూ తగ్గుతుంది. జీవిత, వైద్య బీమాను పన్నురహితం చేయడం మరో సానుకూలాంశం. వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్ టైర్లు, బయో పెస్టిసైడ్స్, డ్రిప్ ఇరిగేషన్, కోత, విత్తన పరికరాలపై జీఎస్టీ 12% నుంచి 5 శాతానికి తగ్గడం అన్నదాతకు మరింత ఆసరా కలిగిస్తుంది. మ్యాప్స్, పుస్తకాలు, నోట్‌బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్లపై జీఎస్టీ మినహాయింపు విద్యపై పెట్టే ఖర్చును తగ్గిస్తుంది. బైక్ లు, కార్ల ధరలు తగ్గడంతో సామాన్యుడికి వాహన కల మరింత చేరువైంది. ఏసీలు, టీవీలు, మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు మరింత అందుబాటులోకి వచ్చాయి. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల ప్రజలకు ఖర్చు తగ్గింది, డబ్బులు ఆదా అయ్యాయి.
వస్తువుల ధరలు పెరగడం సర్వసాధారణం. కానీ తగ్గడం అనేది చాలా అరుదు. ప్రజలు నిత్యం వినియోగించే పాల ఉత్పత్తుల నుంచి సబ్బులు, పండ్ల రసాల వరకు, టీవీలు, ఏసీల నుంచి బైక్ లు, కార్ల వరకు, పేదలు, మధ్యతరగతి కొనుగోలు చేసే ఎన్నో ఉత్పత్తుల ధరలు తగ్గడం అనేది న భూతో అని చెప్పుకోవచ్చు. అందుకే జీఎస్టీ తగ్గింపు పండుగ అని అంటున్నారు. జీఎస్టీ తగ్గింపును ప్రజలు వేడుకగా చేసుకుంటున్నారు. దుకాణదారులు తగ్గింపు ధరలను ప్రముఖంగా ప్రదర్శిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.
ఊరంతా ఒక దారైతే, ఉలిపి కట్టది ఒక దారి అన్నట్టు తగ్గింపు ధరల పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషంగా ఉంటే.. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి రూ.7000 కోట్ల నష్టం వాటిల్లుతోందని గగ్గోలు పెడుతున్నారు. అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ధరల తగ్గుదలను వ్యతిరేకిస్తున్నదా? జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ గా కాంగ్రెస్ యువరాజు అభివర్ణిస్తే, అందుకు విరుద్ధంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆదాయం పడిపోతుందంటూ పన్నులు తగ్గింపుపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ధరలు తగ్గడం వల్ల మిగిలిన డబ్బులతో ప్రజలు మరో వస్తువు కొనుగోలు చేస్తారు. అదనంగా కొన్న వస్తువుపైనా పన్ను కడతారు. దాని ద్వారా ప్రభుత్వానికీ ఆదాయం వస్తుంది. అంతేకాదు, కొనుగోలు పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. జీఎస్టీ తగ్గింపుతో కోత పడుతున్న ఆదాయం మరో రూపంలో భర్తీ అవుతుందని చెప్పడానికి ఆర్థికవేత్త కావాల్సిన అవసరం లేదు, కొద్దిపాటి ఇంగితం ఉంటే చాలు.
కోవిడ్ నుంచి ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోని ఆర్థిక వ్యవస్థలు, వరుస యుద్ధాలతో అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు, ట్రంప్ టారిఫ్ వార్ మధ్య జీఎస్టీ స్లాబులు తగ్గించడం అనేది సాహసోపేత నిర్ణయం. ఇందులో ప్రజలకు మేలు చేకూర్చాలన్న ఆలోచన తప్పితే మరొకటి లేదు. ప్రతి బిజెపి నాయకుడు, కార్యకర్త ఈ విషయాన్ని ప్రజలకు చేరవేయాలి, అర్థం చేయించాలి, అవగాహన కల్పించాలి. అంతేకాదు, జీఎస్టీ తగ్గింపు సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశీని ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కొనుగోలు చేసే ఏదైనా ఉత్పత్తిలో భారతీయుడి చెమట ఉందంటే అది స్వదేశీ అన్నమాట. స్వదేశీ ఉత్పత్తులు కొనుగోలు చేసేలా ప్రజలను జాగృత పర్చాలి. ఒకప్పుడు ఏదైనా బయటి దేశం ఉత్పత్తి కొనుగోలు చేస్తే ‘ఇంపోర్టెడ్’ అని గర్వంగా చెప్పుకునే వాళ్లు. ‘స్వదేశీ’ అని చెప్పుకునే రోజు రావాలి. ఆ రోజు ఎంతో దూరం ఉండదని ఆశిద్దాం.

