nizam patel

సెప్టెంబర్ 17 : తెలంగాణ విమోచన దినోత్సవమే

ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, దేశ నడిబొడ్డున ఉన్న తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం నియంతృత్వం, రజాకార్ల అకృత్యాల మధ్య నలిగిపోయింది. నిజాం రాజ్యంలో వందేమాతరం అంటే నేరమైంది… భారత్ మాతా కీ జై నినాదం శిక్షార్హం అయ్యింది… భారత జాతీయ జెండా త్రివర్ణ పతాకం నిషేధమైంది.. తెలుగు భాష పరాయిదిగా మారింది… పచ్చి మతోన్మాది ఖాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ల మూక అకృత్యాలు అన్నీ ఇన్నీ కాదు… మనుషులను వరసలో నిలబెట్టి తుపాకీతో కాల్చి చంపడాలు… చెట్టుకు కట్టి సామూహికంగా ఉరితీయడాలు… మహిళలచే నగ్నంగా బతుకమ్మలు ఆడించడాలు… హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, దోపిడీలు, దొమ్మీలు… చెప్పుకుంటూ పోతే నిజాం రాజ్యంలో ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం సహా మహారాష్ట్ర, కర్నాటకలోని పలు జిల్లాలతో కూడిన హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు ససేమిరా అన్న నిజాం సొంత ఇస్లామిక్ దేశంగా ఉండాలని భావించాడు, కుదరని పక్షంలో పాకిస్తాన్ తో హైదరాబాద్ ను కలిపే ప్రయత్నం చేశాడు. నియంతృత్వాన్ని ఎదిరించిన ఇక్కడి ప్రజల వీరత్వానికి, ‘ఆపరేషన్ పోలో’ పేరిట పోలీస్ యాక్షన్ చేపట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరత్వం తోడవడంతో, భారత సైన్యం చేతిలో ఓడిన నిజాం 1948 సెప్టెంబర్ 17న లొంగిపోవడంతో తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది.

నాటి పోరాటాలకు విలువివ్వరా?

ఒక ప్రాంతానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యం లభించిన రోజంటే అది పెద్ద పండగ రోజు. కానీ తెలంగాణకు స్వాతంత్ర్యం దక్కిన 17 సెప్టెంబర్ మాత్రం ఇక్కడ ఏ ప్రత్యేకతా లేకుండా, నేటి తరానికి తెలియకుండా తొక్కిపెట్టారు. నాటి హైదరాబాద్ సంస్థానంలో భాగమై కర్నాటక, మహారాష్ట్రలో కలిసిన జిల్లాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా విముక్తి దినోత్సవాలను నిర్వహిస్తున్నాయి. అయితే సంతుష్టీకరణ రాజకీయాలకు పెద్దపీట వేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు 17 సెప్టెంబర్ ను అధికారికంగా నిర్వహించేందుకు వెనకడుగు వేశారు.

ఇక్కడి స్వాతంత్ర్య పోరాటం, నిజాంను ఎదిరించిన యోధుల త్యాగాలు, పోరాటాలు నేటి తరానికి తెలియాలన్నా.. వారిని సముచితంగా స్మరించుకోవాలన్నా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని 1998లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర శాఖ నిర్ణయించింది. సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నాటి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సీ.హెచ్. విద్యాసాగర్ రావు నేతృత్వంలో పెద్దఎత్తున పోరాటాలు చేసింది.1998 సెప్టెంబర్ 17న హైదరాబాద్ నిజాం గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాటి కేంద్ర హోం మంత్రి ఎల్.కె. అద్వానీ పాల్గొన్నారు. అది మొదలు బిజెపి అధికారిక విమోచన ఉత్సవాల కోసం పోరాటాలు కొనసాగిస్తూనే ఉంది. విద్యాసాగర్ రావు తర్వాత రాష్ట్ర అధ్యక్షులైన నల్లు ఇంద్రసేనా రెడ్డి, బండారు దత్తాత్రేయ, జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనూ అనేక ఉద్యమాలు నడిచాయి.

‘తెలంగాణ’లోనూ అదే తీరు

2014లో స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించుకోవచ్చని ప్రజలు అనుకున్నారు. కానీ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వంద్వ వైఖరి వల్ల తెలంగాణ ప్రజల ఆశలు అడియాసలే అయ్యాయి. ఉద్యమ కాలంలో 17 సెప్టెంబర్ అధికారికంగా ఎందుకు నిర్వహించరు అని నిలదీసిన కేసీఆర్ అధికారంలోకి రాగానే ఓవైసీలకు తలొగ్గి స్వరం మార్చారు. రజాకార్ల వారసులైన ఎంఐఎంకు భయపడి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వమ్ము చేశారు.

సెప్టెంబర్ 17న అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినం’ నిర్వహించాలని డా. కె. లక్ష్మణ్, బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో బిజెపి ఉద్యమాలను కొనసాగించింది. 2017లో డా. కె. లక్ష్మణ్ తెలంగాణ విమోచన యాత్ర చేపట్టి, నాటి నిజాం వ్యతిరేక పోరాటంలో కీలక ఘట్టాలకు సాక్షీభూతంగా నిలిచిన భైరాన్ పల్లి బురుజు, పరకాల అమరధామం, దారరథిని బంధించిన నిజామాబాద్ జైలు, నిర్మల్ వెయ్యి ఉరుల మర్రి, ఎర్రుపాలెం, అప్పంపల్లి సహా అనేక ప్రాంతాలను సందర్శించి, వాటిని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. 2017లో నల్గొండ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో అప్పటి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, 2018లో నిజామాబాద్ సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకున్నా అప్పుడు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న జి. కిషన్ రెడ్డి చొరవతో స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వమే సెప్టెంబర్ 17న అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ నిర్వహించాలని 2022లో నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. 2022లో తెలంగాణ తొలిసారి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, కర్నాటక మంత్రి శ్రీరాములు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అప్పటి నుండి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న అధికారిక వేడుకలు నిర్వహిస్తూ వస్తోంది. 2023లోనూ అమిత్ షా, 2024లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగరేశారు.

తప్పుదారి పట్టించే వేడుకలా?

కేంద్రమే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్వహించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, సెప్టెంబర్ 17 ప్రాధాన్యాన్ని తప్పుదారి పట్టించేలా గత ముఖ్యమంత్రి కేసీఆర్ ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా, ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’గా వేడుకలను అధికారికంగా నిర్వహించారు. పక్కదారి పట్టించే మారుపేర్లతో కాకుండా సెప్టెంబర్ 17 వేడుకలను ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గానే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నాయకత్వంలో బిజెపి పోరాటాలు కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపాలని 1998లో మొదలుపెట్టిన బిజెపి పోరాటం మధ్యలో కరోనా కారణంగా రెండేళ్లు మినహాయిస్తే 25 ఏళ్లుగా కొనసాగుతోంది. బిజెపి విమోచన ఉద్యమానికి ఇది రజతోత్సవ ఏడాది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను జరపాలి.