సబ్సిడీలు కిక్ స్టార్ట్ లాంటివి, మొదట్లోనే అవసరం
సబ్సిడీలు స్కూటర్ కిక్ స్టార్ట్ లాగా స్వల్ప కాలానికి మాత్రమే ఉపయోగపడుతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ అన్నారు. సబ్సిడీల కోసం ఎదురుచూసే, సబ్సిడీల ఆధారంగా నడిచే లేదా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా పోటీ నుండి రక్షణను ఆశించే ఏ పరిశ్రమ అయినా ఎప్పటికీ విజయవంతం కాదని స్పష్టం చేశారు. సొంత కాళ్లపై నిలబడి, పోటీతత్వాన్ని మెరుగుపరుచుకోవడం ద్వారా పరిశ్రమలో దీర్ఘకాలిక విజయగాథను లిఖించవచ్చని తెలిపారు. నెట్‌వర్క్ 18 టీవీ ఛానల్ నిర్వహించిన గ్రీన్ భారత్ సదస్సులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నెట్‌వర్క్ 18 గ్రూప్ ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విద్యుత్ వాహనాల రంగంలో భారత్ పురోగతి, స్వావలంబన, భారతీయ వాహన తయారీదారులకు అంతర్జాతీయ అవకాశాల గురించి మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు
పీయూష్ గోయల్: ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, పునరుత్పాదక ఇంధనం ప్రాముఖ్యత గురించి, మరింత స్థిరమైన జీవనశైలి, సురక్షితమైన భవిష్యత్తు అనే మన జాతీయ లక్ష్యాల వైపు సాగడంతో విద్యుత్ మొబిలిటీ పోషించగల పాత్ర గురించి తదుపరి తరానికి అవగాహన కల్పించడంలో సహాయపడినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మోటారు వాహనాల విషయానికి వస్తే భారతదేశం ఒక విజయగాథను రచించింది. మొత్తం విలువ వ్యవస్థ – ఆటో విడిభాగాలు, షెల్, బ్యాటరీ – విషయంలో మనదేశంలో దాదాపు మొత్తం ఆటో పర్యావరణ వ్యవస్థ చాలా బలంగా ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో మేం నిర్వహించిన ‘భారత్ మొబిలిటీ’ సదస్సును సందర్శించే అవకాశం మీకు లభించిందో లేదో నాకు తెలియదు. కాకపోతే రెండో ఎడిషన్ వచ్చే ఏడాది ఆరంభంలో, మొదటి త్రైమాసికం కంటే పెద్దదిగా, బృహత్తరంగా జరగబోతోంది. భారత్ మొబిలిటీని సందర్శించే ఏ సందర్శకుడైనా భారతదేశం సాధించిన విజయాల పట్ల గర్వపడతారు. యావత్ ప్రపంచానికి అసూయ కలిగించే ఆటోమొబైల్ పర్యావరణ వ్యవస్థతో ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు సాధించాం. విద్యుత్ వాహనాల రంగంలో మనకు సవాళ్లు ఉన్నాయనడంలో సందేహం లేదు. ముడి పదార్థం, బ్యాటరీకి అవసరమైన కీలక ధాతువులు, సెల్ తయారీకి సాంకేతికత చుట్టూ కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ విద్యుత్ వాహనం అనేది చాలా సులభంగా తయారు చేయగల వాహనం అని నేను భావిస్తున్నాను.
ఎలక్ట్రిక్ వాహనాలకు చాలా క్లిష్టమైన అంతర్దహన (ఇంటర్నల్ కంబస్ షన్) ఇంజిన్ అవసరం లేదు. మిగిలిన షెల్ (వాహనాల బయటి భాగాలు), ఇతర ప్రతి భాగం దాదాపు ఒకేలా ఉంటాయి. కాబట్టి దీనికి ఇదే ఒక పర్యావరణ వ్యవస్థ, ఇక్కడ మనం కచ్చితంగా స్వయం సమృద్ది సాధించగలం. ఈ విషయంలో భారత్ గణనీయమైన అభివృద్ధి సాధించింది. టాటా, మహీంద్రా లేదా ఓలా ఎలక్ట్రిక్ విజయగాథలను చూడండి. భారతదేశంలో విద్యుత్ మొబిలిటీని సాధించడంలో వేగవంతమైన పెరుగుదలను బట్టి చూస్తే ఇక బస్సులు, ట్రక్కులు వంటి వాణిజ్య వాహనాలలో కూడా త్వరలోనే మొత్తం విలువ వ్యవస్థ భారతదేశంలో వాస్తవ రూపం దాలుస్తుందని నేను బలంగా భావిస్తున్నాను.
ఆటోమొబైల్ విడిభాగాల ఉత్పత్తిదారుల సంఘం (ఏసీఎంఏ) నాతో అనేక సార్లు చర్చలు జరిపింది. మన విద్యుత్ వాహన పరిశ్రమల అవసరాలను తీర్చడానికి అది కృతనిశ్చయంతో ఉంది. అయితే దీనికి సబ్సిడీలు అవసరమని నేను అనుకోవడం లేదు. ఈ కార్యక్రమం చూస్తున్న వారు లేదా ఈ గదిలో ఉన్న యువత ఒక సందేశాన్ని స్పష్టంగా గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను. సబ్సిడీ మనస్తత్వం నుంచి వారు బయటకు వస్తారని నేను కోరుకుంటున్నాను. సబ్సిడీలు స్కూటర్ కిక్ స్టార్ట్ లాగా స్వల్ప కాలానికి పర్వాలేదు. పాత కాలంలో స్కూటర్ ను స్టార్ట్ ఎలా చేసేవారో మీకు గుర్తుందా? సబ్సిడీ కేవలం అటువంటి పాత్రను మాత్రమే పోషించగలదు. సబ్సిడీల కోసం ఎదురుచూసే, సబ్సిడీల ఆధారంగా నడిచే లేదా మొదట్లో కొన్ని సంవత్సరాల తర్వాత కూడా పోటీ నుండి రక్షణను ఆశించే ఏ పరిశ్రమ అయినా ఎప్పటికీ విజయవంతం కాదు. మన సొంత కాళ్లపై మనం నిలబడాలి, మన పోటీతత్వాన్ని మెరుగుపరుచుకోవాలి. తద్వారా మన పరిశ్రమలో దీర్ఘకాలిక విజయగాథను లిఖించవచ్చు.
ప్ర: వాస్తవానికి మీరు ఎల్ఈడీ లైట్ల వాడకాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించదలచుకున్నప్పుడు మీరు చేసిన పనుల్లో ఒకటి సబ్సిడీని తొలగించడం.
జ: నిజమే. అందుకే అది విజయవంతమైంది. ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఏటా రూ.9 కోట్ల సబ్సిడీ ఇస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో బల్బుకు రూ.100 ఇచ్చేది. అంటే 6 లక్షల బల్బులకు ప్రభుత్వం నుంచి రూ.100 చొప్పున అందుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉన్నందున పరిపాలనా ఖర్చుల కోసం రూ.3 కోట్లు ఖర్చు చేశారు. 2014లో దేశంలోని 120 కోట్ల మంది ప్రజలకు ఈ సబ్సిడీని అందించాలంటే ఎంతవుతుందో మీరు ఊహించుకోవచ్చు. నేను దీని గురించి ఆలోచించడం ప్రారంభించినప్పుడు, ప్రతి ఒక్కరూ తమ బల్బులను ఎల్ఈడి లైట్లుగా మార్చడానికి ముందు ఆ రూ.100 సబ్సిడీని పొందడానికి ఎదురు చూశారు. 120 కోట్ల మంది ప్రజలు ఆ ఎల్ఈడీ దీపాల ఉత్పత్తికి పెద్ద ఎత్తున డిమాండు కల్పించి తద్వారా వాటిని మరింత చౌకగా చేయడానికి బదులుగా సబ్సిడీ కోసం ఎదురు చూశారు. ఆ కారణంగా, మొత్తం అమ్మకాలు చాలా తక్కువగా ఉండేవి. దాంతో దేశంలో ఎల్ఈడీ బల్బుల భారతీయ తయారీ జరగలేదు. దిగుమతి చేసుకున్న ఉత్పత్తులు చాలా ఎక్కువ ధరకు అమ్మేవారు. మొత్తం ఎల్ఈడీ లైటింగ్ ఒక పగటికలగా ఉండేది. ఎల్ఈడీ లైటింగ్ కార్యక్రమానికి నేను సంతకం చేసిన మొదటి ఫైలు ఆ సబ్సిడీని తొలగించడం. దీని పట్ల ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ప్రతికూలమని అందరూ భావించారు, మీరు సబ్సిడీని ఉపసంహరించుకుంటే ప్రజల్లోకి ఎటువంటి ప్రతికూల సందేశం వెళుతుందో మీకు తెలుసు. కానీ భారతదేశం నలుమూలలా ఎల్ఈడీ లైట్లకు ప్రాచుర్యం కల్పించేందుకు మేం చేపట్టిన కార్యక్రమంలో ఇది అతి ముఖ్యమైన అంశం అని నేను నమ్ముతున్నాను. ఈ రోజు మనదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎల్ఈడీ లైటింగ్ ను అమలు చేసినందుకు మీరందరూ చాలా గర్వపడవచ్చు.
మనం విజయం సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆశించారు. మొత్తం ప్రపంచంలో ఇతర దేశాల కంటే వేగంగా ఎల్ఈడీ లైటింగ్ ను అమలు చేసిన దేశంగా మనం గుర్తింపు పొందాం. భారత్ పరిమాణంలో పదో వంతు కూడా లేని దేశాలు సైతం ఈ స్థాయి విజయాన్ని సాధించలేకపోయాయి. వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులో ఏటా రూ.40,000 కోట్లు ఆదా చేస్తారని అప్పట్లో అంచనా వేసిన విషయం నాకు గుర్తుంది. పాత ఎడిసన్ బల్బు దుకాణాల్లో గానీ దొరకని ఈ రోజుతో పోల్చి చూస్తే ఏటా లక్ష కోట్లు ఆదా అవుతాయని నా అనుమానం.
ప్ర: కనుక మీరు చెప్పేదేమిటంటే ద్విచక్ర వాహనాలు లేదా త్రిచక్ర వాహనాలు లేదా కార్లలో ఎలక్ట్రిక్ వాహనాలు ఆర్థికంగా లాభదాయకంగా ఉండాలి, సబ్సిడీపై ఆధారపడకుండా సొంత విజయాలతో ఆర్థికంగా ఆకర్షణీయంగా ఉండాలి. అది ఇక్కడ నీతి.
జ: లేదు, మేం వివిధ సబ్సిడీ పథకాలు, ఫేమ్ 1, ఫేమ్ 2, పీఎం ఈడ్రైవ్, ఇప్పుడు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్ఐ) కింద రూ.26,000 కోట్ల ఆటోమోటివ్ పరిశ్రమ సబ్సిడీ ద్వారా మద్దతు ఇస్తున్నాం. రూ.18,000 కోట్ల విలువైన సెల్, అధునాతన కెమిస్ట్రీ సెల్ ఉత్పత్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. కనుక మేం పర్యావరణ వ్యవస్థను బలమైన మద్దతుతో ప్రారంభించాం. కానీ ఈ సబ్సిడీల ఊతకర్రలు శాశ్వతం కాకూడదు. పరిశ్రమ స్వయం సమృద్ధి సాధించి సొంత కాళ్లపై నిలబడేట్టు చేద్దాం.
ప్ర: బ్యాటరీ తయారీ తదితరాల కోసం పీఎల్ఐ పథకాలకు పరిశ్రమ నుంచి వస్తున్న స్పందనపై సంతృప్తిగా ఉన్నారా?
జ: చాలా మంచి స్పందన వచ్చింది. ఇవి కొత్త రంగాలు, ఎవరైనా చేయగలిగినవి కాదు. కానీ స్పందన బాగుందని నమ్ముతున్నాను. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం చాలా వేగంగా జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ద్విచక్ర, త్రిచక్ర వాహన పరిశ్రమ కచ్చితంగా 100% విద్యుత్ దశకు మారుతుందని నేను చాలా నమ్మకంగా ఉన్నాను. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు, ప్యాసింజర్ వాహనాలు కూడా కొనడానికి ఆర్థికంగా లాభదాయకంగా ఉన్నాయి, ముఖ్యంగా నిర్వహణ వ్యయం దాదాపు సున్నా.
ప్ర: ఇది కచ్చితంగా మీ పరిధిలోని అంశం కాదని నాకు తెలుసు, కానీ ఎలక్ట్రిక్ బస్సులు లేదా కార్లు మాత్రమే కొనాలని ప్రభుత్వం ఆదేశించగలదా? రాష్ట్ర ప్రభుత్వాలు కాకపోయినా కనీసం కేంద్రమైనా విద్యుత్ వాహనాలను తప్పనిసరి చేస్తుందా?
జ: ప్రభుత్వం దేన్నీ తప్పనిసరి చేయకూడదని నా అభిప్రాయం. ఆర్థిక సూత్రాల ప్రకారం అంతా నడవాలి. మార్కెట్ శక్తులే సమతౌల్యాన్ని సాధించాలి. ప్రభుత్వం ఏదైనా ఆదేశిస్తే దానికి సహజంగానే ప్రతిస్పందన, వ్యతిరేకత వస్తుంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం ఆర్థికంగా తప్పనిసరి అవుతుందని నా అభిప్రాయం. మీరు ఒక కారును కొనుగోలు చేయడానికి లేదా అద్దెకు తీసుకోడానికి అయ్యే మూలధన ఖర్చులు, డీజిల్ లేదా పెట్రోల్ ఖర్చులు, మరమ్మతులు వీటితో పోలిస్తే బ్యాటరీని రీఛార్జ్ చేయడానికి, నిర్వహణ, మరమ్మతు ఖర్చులు చాలా స్వల్పం. అందువల్ల దేశం చాలా వేగంగా విద్యుత్ వాహనాల వైపు మొగ్గుతుందని నేను అనుకుంటున్నాను.