తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోన్న రేవంత్
2014లో మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. గుజరాత్ తర్వాత ఆర్థికంగా పరిపుష్టి గల రాష్ట్రంగా తెలంగాణ ఉంది. హైదరాబాద్ లాంటి గొప్పనగరం తెలంగాణకు తలమానికంగా ఉంటూ వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో సగానికి పైగా హైదరాబాద్ నుండే వస్తుంది. బహుశా అటువంటి సౌలభ్యం దేశంలో మరే రాష్ట్రానికి లేదు. అయితే, పదేళ్ల కేసీఆర్ పాలనలో, గడిచిన కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారు. ఉద్యోగులకు క్రమంగా జీతభత్యాలు ఇచ్చేందుకే ప్రభుత్వాలు ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొంటున్నాయి. సంక్షేమం, అభివృద్ధికి సమతూకం పాటిస్తూ ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాల్సింది పోయి ప్రాజెక్టులను అవినీతికి ద్వారాలుగా మలచుకొని, అభివృద్ధిని గాలికి వదిలివేస్తున్న పరిస్థితులు నాడు బీఆర్ఎస్ పాలనలో, నేడు కాంగ్రెస్ పాలనలో కూడా కనిపిస్తున్నాయి.
కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చివేశారని కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. నేడు అధికారంలోకి వచ్చాక ఎన్నికల సమయంలో చేసిన 6 వాగ్దానాలను అమలు చేయమని జనం నిలదీస్తుంటే కేసీఆర్ ఖజానాను ఖాళీగా వదిలి వెళ్లడంతో సాధ్యం కావడం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల పట్ల అవగాహన లేకుండానే వాగ్దానాలు చేసి ప్రజలను మభ్య పెట్టారా? కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి సైతం అందినకాడికి అప్పులు చేస్తున్నారు. రేవంత్ సర్కారు చేస్తున్న అప్పులు, వస్తున్న ఆదాయానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. పరిమితికి మించి అప్పులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవడంలో చేతులెత్తేస్తున్నది. ఎన్నడూ లేనివిధంగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి, బడ్జెట్ అంచనాలను దాటి అందినకాడికి రుణ సమీకరణ చేస్తున్నది. పాలకుల అడ్డగోలు నిర్ణయాలు, ఏడాది కాలంలోనే రికార్డుస్థాయిలో పెరుగుతున్న అప్పులు, ఆర్థిక నిర్వహణ లోపాలు ఈ ప్రభుత్వ దివాలాకోరుతనాన్ని వెల్లడి చేస్తుంది. 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ 31 వరకు ఒక్క ఆర్బీఐ నుంచే రూ.56,026 కోట్ల రుణాలు సేకరించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చివరి త్రైమాసికంలో ఆర్బీఐ నుంచి రూ.30,000 కోట్లు తీసుకోవాలని ఇండెంట్ పెట్టింది. జనవరి నుంచి మార్చి వరకు ప్రతి మంగళవారం వేలంలో పాల్గొని నెలకు రూ.10,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రేవంత్ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాల్లో రుణ సమీకరణ వివరాలను వెల్లడించింది. అప్పు పద్దు కింద రూ.62 వేల కోట్లు చూపించింది. ఈ ఏడాది రూ.62,012 కోట్లు రుణ సమీకరణ చేయనున్నట్టు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. బహిరంగ మార్కెట్‌లో రూ.57,112 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3,900 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ.1000 కోట్లు సమీకరించనున్నట్టు పేర్కొన్నారు. కానీ, డిసెంబర్ 31 నాటికే ఒక్క ఆర్బీఐ నుంచే రూ.56,026 కోట్లు సేకరించారు. వచ్చే మూడు నెలల్లో నెలకు రూ.10 వేల కోట్ల చొప్పున మరో రూ.30 వేల కోట్ల రుణ సమీకరణకు ముందస్తు చర్యలు చేపట్టారు. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలకు అదనంగా రూ.8,897 కోట్లు అప్పు తెస్తున్నారు. అయితే, 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన రుణపరిమితి (ఎఫ్‌ఆర్‌బీఎం) రూ.49,255 కోట్లు మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి కింద మొత్తం రుణం రూ.70,909 కోట్లకు చేరుకొనే పరిస్థితి కనిపిస్తున్నది. అంటే అంచనాకు మించి అదనంగా రూ.21,654 కోట్లు రేవంత్‌రెడ్డి సర్కారు చేస్తున్నది. ఆఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం ఆయా రాష్ర్టాల జీఎస్డీపీ 3.5 శాతం వరకు రుణం తీసుకోవడానికి అనుమతి ఉన్నది. 2024-25కు తెలంగాణ జీఎస్డీపీ సుమారు రూ.16 లక్షల కోట్లుగా అంచనా వేశారు. దీని ప్రకారం రుణ పరిమితి రూ.57,112 కోట్లు. కానీ, కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు అనుసరించి ఈ పరిమితిని రూ.49,255 కోట్లకు తగ్గించింది. ఈ అదనపు రుణాలకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిందా? లేదా అనే విషయంపై రాష్ట్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇవ్వలేదు. ఏడాది కాలంలో కొత్తగా ఒక భారీ ప్రాజెక్టు చేపట్టలేదు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును పూర్తి చేసే ప్రయత్నం చేయడం లేదు. ఎన్నికల హామీలను అమలు చేయకపోగా అమలులో ఉన్న పథకాలలోనే కోతలు పెడుతున్నారు. గురుకుల పాఠశాలలో కడుపు నిండా అన్నం పెట్టలేక పోతున్నారు. విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరోవంక, ప్రభుత్వ ఆదాయంలో తరుగుదల కనిపిస్తున్నది. మొత్తం మీద ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతుంది.