ఉపాధి కల్పన వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం
ఏదైనా పథకాన్ని ప్రారంభించినప్పుడు వ్యక్తులకు చేకూరే ప్రయోజనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా మొత్తం ఉపాధి కల్పన వ్యవస్థను అభివృద్ధి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గతంలో అనేక రంగాల్లో, ముఖ్యంగా సాంకేతికతలో దేశం వెనుకబడి ఉండేదన్నారు. అప్పట్లో ప్రపంచం నలుమూలల్లో తయారవుతున్న కొత్త టెక్నాలజీల కోసం భారత్ ఎదురుచూసేదని, పాశ్చాత్య దేశాల్లో కాలం చెల్లిన తర్వాత అవి మన దేశానికి వచ్చేవని గుర్తుచేశారు. ఆధునిక టెక్నాలజీని భారత్‌లో అభివృద్ధి చేయడం అసాధ్యమనే అభిప్రాయం ఉండేదని, ఇది దేశాన్ని వృద్ధి పరంగా వెనక్కు నెట్టిందని, అనేక ఉద్యోగ అవకాశాలను దూరం చేసిందని అన్నారు. గత ప్రభుత్వాల్లో స్పష్టమైన విధానాలు, ఉద్దేశాలు లేకపోవడమే ఇందుకు కారణమని విశ్లేషించారు.
అక్టోబర్ 29న దేశవ్యాప్తంగా 40 ప్రదేశాల్లో నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో వివిధ ప్రభుత్వ విభాగాలు, కార్యాలయాల్లో నూతనంగా నియమితులైన 51 వేల మంది యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో నియామక పత్రాలు అందించారు. వీరంతా రెవెన్యూ, ఉన్నత విద్యా విభాగం, హోం మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఉద్యోగాలు పొందారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగిస్తూ లక్షలాది యువతకు శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని అన్నారు. బిజెపి, ఎన్డీయే మిత్ర పక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో సైతం లక్షల సంఖ్యలో యువతకు నియామక ప్రతాలు అందజేశారని ఆయన తెలిపారు. హర్యానాలో ఏర్పాటైన నూతన ప్రభుత్వం నుంచి 26,000 మంది యువతీ యువకులు ఉద్యోగాలు పొందడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొందని అన్నారు.
దేశంలోని యువతరానికి వీలైనన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న తమ ప్రభుత్వ నిబద్ధతను ప్రధానమంత్రి మరోసారి తెలియజేశారు. ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం అనుసరించే విధానాలు, తీసుకునే నిర్ణయాలు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని ఆయన అన్నారు. గుజరాత్‌లోని వడోదరాలో రక్షణ రంగానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. విడిభాగాలు, ఇతర పరికరాలను తయారు చేయడం, బలమైన సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఎంఎస్ఎంఈలు భారీగా ప్రయోజనం పొందడంతో పాటు వేలాది మందికి ప్రత్యక్ష ఉపాధి దొరుకుతుందని అన్నారు. ఒక విమానం తయారు చేయడానికి 15,000 నుంచి 25,000 వరకు విడిభాగాలు అవసరమవుతాయని ప్రధాని తెలిపారు. ఒక భారీ పరిశ్రమ అవసరాలను తీర్చడంలో వేలాది చిన్న కర్మాగారాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని, తద్వారా భారత్ లోని ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.
సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ఉదహరిస్తూ.. గడచిన ఆరు నెలల్లో ఈ పథకానికి రెండు కోట్ల మంది వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. 9,000 మందికి పైగా విక్రేతలు ఈ పథకంతో అనుసంధానమయ్యారని, ఇప్పటి వరకూ 5 లక్షలకు పైగా గృహాలకు సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పథకం ద్వారా సమీప భవిష్యత్తులో 800 సోలార్ మోడల్ గ్రామాలను తీర్చిదిద్దేందకు ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. ఇంటి పైకప్పుపై సోలార్ పలకలను ఏర్పాటు చేయడంలో 30 వేల మంది శిక్షణ పొందారన్నారు. ఫలితంగా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం దేశవ్యాప్తంగా తయారీదారులు, విక్రేతలు, పరికరాలను బిగించేవారు, మరమత్తు చేసేవారికి ఉపాధి అవకాశాలను సృష్టించిందని ఆయన తెలిపారు.
గడచిన పదేళ్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో ఖాదీ పరిశ్రమ రూపాంతరం చెందిందని, గ్రామీణ ప్రజలపై ప్రభావం చూపిందని, ప్రస్తుతం ఖాదీ గ్రామోద్యోగ్ ద్వారా చేస్తున్న వ్యాపారం రూ.1.5 లక్షల కోట్లను దాటిందని ప్రధానమంత్రి తెలిపారు. పదేళ్ల కిందటి పరిస్థితులతో పోలిస్తే.. ప్రస్తుతం ఖాదీ విక్రయాలు 400 శాతం పెరిగాయని, ఫలితంగా కళాకారులు, చేనేత కార్మికులు, వ్యాపారులు లాభపడతారని, కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ప్రధాని వివరించారు. 10 కోట్ల మంది మహిళలు ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారని, వారికి ప్రభుత్వం అడుగడుగునా సహకారం అందిస్తోందని, మూడు కోట్ల లఖ్పతి దీదీలను తయారు చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు.
మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడం ద్వారా అంతరిక్షం, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు తదితర రంగాల్లో పాత విధానాల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. నూతన టెక్నాలజీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తీసుకురావడానికి పీఎల్ఐ పథకాన్ని ప్రారంభించామని వివరించారు. ఇది మేక్ ఇన్ ఇండియా ద్వారా ఉద్యోగాల కల్పనను వేగవంతం చేసిందని తెలిపారు. యువతకు అవకాశాలు కల్పించే దిశగా ప్రతి రంగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. గడచిన ఎనిమిది ఏళ్లలో 1.5 లక్షల అంకుర సంస్థలు దేశంలో ప్రారంభమయ్యాయని ప్రధాని తెలిపారు. అంకుర సంస్థల్లో భారత్ మూడో అతిపెద్ద వ్యవస్థగా అవతరించిందని, ఈ సంస్థలు యువతకు ఎదిగేందుకు, ఉపాధిని పొందేందుకు అవకాశం కల్పిస్తున్నాయని అన్నారు.
ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ యోజన ద్వారా భారతదేశంలోని 500 అగ్రశ్రేణి సంస్థల్లో వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్ చేసేందుకు నిబంధనలు రూపొందించామన్నారు. ప్రతి ఇంటర్న్‌కు ఏడాది పాటు నెలకు రూ.5,000 చెల్లించి, రాబోయే 5 ఏళ్లలో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభించేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన తెలిపారు. వివిధ రంగాల్లో వాస్తవ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం యువతకు లభిస్తుందని, ఇది వారి కెరీర్‌కు ప్రయోజనకరమైన అనుభవాన్ని జోడిస్తుందని ఆయన అన్నారు.
ప్రభుత్వోద్యోగాన్ని పొందడంలో పన్ను చెల్లింపుదారులు, పౌరులు పోషిస్తున్న క్రియాశీలక పాత్ర గురించి వివరించిన ప్రధానమంత్రి, వారి వల్లే ప్రభుత్వం ఉనికిలో ఉందని, వారికి సేవ చేసేందుకే విధులు నిర్వర్తిస్తున్నామని తెలిపారు. పోస్ట్ మ్యాన్ అయినా, ప్రొఫెసర్ హోదాలో పనిచేస్తున్నా దేశానికి సేవచేయడమే ప్రథమ కర్తవ్యం కావాలని పిలుపునిచ్చారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని సంకల్పించుకున్న ఈ తరుణంలో కొత్తగా నియామకాలు పొందిన వారు విధుల్లో చేరారని మోదీ వివరించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి రంగంలోనూ రాణించాలని, పూర్తి సామర్థ్యాన్ని వినియోగించాలని కోరారు. కొత్తగా నియమితులైన వారు మంచి పనితీరుతో పాటు ప్రతిభ కనబరిచేందుకు కృషి చేయాలని కోరారు.