J.P. Nadda

విలువలు తప్పిన కాంగ్రెస్ విలువల గురించి మాట్లాడడమా?

రాజకీయ విలువలకు తూట్లు పొడిచి, హుందాతనాన్ని విస్మరించి, కనీస మర్యాద లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ పట్ల కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఎండగడుతూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె.పి. నడ్డా లేఖ రాశారు. జనసందేశ్ పాఠకుల కోసం ఆ లేఖ తెలుగు అనువాదాన్ని ప్రచురిస్తున్నాం.

గౌరవ ఖర్గే గారూ…. దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మీరు రాసిన లేఖను చదివిన తరువాత, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ప్రజలు పదేపదే తిరస్కరించిన మీ విఫల ఉత్పత్తిని మెరుగుపర్చే ప్రయత్నంలో భాగంగా లేఖలో పేర్కొన్న విషయాలు వాస్తవాలకు పూర్తి విరుద్ధంగా, సత్యదూరంగా ఉన్నాయని భావిస్తున్నాను. లేఖలో రాహుల్ గాంధీ సహా మీ నాయకుల అకృత్యాలను మీరు మర్చిపోయి ఉంటారని లేదా ఉద్దేశపూర్వకంగా విస్మరించి ఉంటారని అనిపిస్తోంది. కావున ఆ విషయాలను వివరంగా మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను.

ఖర్గే గారూ… మీ లేఖలో రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు కాబట్టి, నేను అతనితో లేఖను మొదలుపెట్టాలనుకుంటున్నాను. దేశ ప్రధానితో సహా మొత్తం ఓబీసీ వర్గాన్ని ‘దొంగలు’ అని తూలనాడిన చరిత్ర ఉన్న వ్యక్తి, దేశ ప్రధానిని అత్యంత అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తి, దేశ ప్రధానిని కర్రతో కొట్టాలన్న విషయాలపై పార్లమెంటులో వ్యాఖ్యానించిన వ్యక్తిని ఎలా వెనకేసుకొస్తున్నారు? రాహుల్ గాంధీ దురహంకార మనస్తత్వం గురించి యావత్ దేశానికి తెలుసు. మీరు రాహుల్ గాంధీని సమర్థించడానికి మీపై పని చేస్తున్న ఒత్తిడేంటి?

రాహుల్ గాంధీ తల్లి సోనియాగాంధీనే కదా ప్రధాని పట్ల ‘మౌత్ కా సౌదాగర్’ వంటి అత్యంత అసభ్యకరమైన పదాలను ప్రయోగించింది… ఖర్గే గారూ..? ఈ దురదృష్టకరమైన, సిగ్గుమాలిన వ్యాఖ్యలన్నింటినీ మీరు, మీ పార్టీ నాయకులు కీర్తించారు. అప్పుడు రాజకీయ పవిత్రత గురించి కాంగ్రెస్ ఎందుకు మర్చిపోయింది? ‘మోదీ ఇమేజ్ ను దెబ్బతీస్తా’ అని రాహుల్ గాంధీ బహిరంగంగా వ్యాఖ్యానించినప్పుడు రాజకీయ హుందాతనాన్ని విస్మరించడంలో ఎవరు బాధ్యత వహిస్తారు… ఖర్గే గారూ..? మీ విఫల ఉత్పత్తిని వెనకేసుకురావడం, కీర్తించడం వెనక మీపై ఉన్న ఒత్తిడిని నేను అర్థం చేసుకోగలను, కానీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీరు ఈ విషయాలపై కనీసం ఆత్మపరిశీలన అయినా చేసుకోవాలి.

ఖర్గే గారూ…. దేశంలోని అతి పురాతన రాజకీయ పార్టీ ‘యువరాజు’ ప్రభావంతో ఇప్పుడు ‘కాపీ అండ్ పేస్ట్’ పార్టీగా మారడం అత్యంత విచారకరం. రాజకీయ దురాశతో కొట్టుమిట్టాడుతున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ, ఒకప్పుడు తీవ్రంగా విమర్శించిన దోషాలనే ఇప్పుడు స్వీకరించడం ప్రారంభించింది, వాటినే ఇప్పుడు గర్వకారణంగా భావిస్తుంది. గత పదేళ్లలో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిపై కాంగ్రెస్ నాయకులు చేసిన దూషణలు 110కి పైగానే ఉన్నాయి, ఇందులో కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా భాగం కావడం దురదృష్టకరం. ఈ నేపథ్యంలో రాజకీయ ఔచిత్యం, హుందాతనం, క్రమశిక్షణ, మర్యాద వంటి పదాలు మీ మరియు మీ కాంగ్రెస్ డిక్షనరీ నుంచి ఎందుకు మాయమవుతున్నాయి? ఓ వైపు రాజకీయ విలువల గురించి గగ్గోలు పెడుతూనే, మరోవైపు వాటిని ఉల్లంఘించిన చరిత్ర మీ పార్టీ, మీ నాయకులదే. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?

ఖర్గే గారూ…. దేశ ప్రధాని గురించి మీ నాయకులు అనని మాటలు ఏమన్నా ఉన్నాయా? ‘నీచ్’, ‘కమీనె’, ‘నికమ్మ’, ‘మౌత్ కా సౌదాగర్’, ‘విష సర్పం’, ‘ తేలు’, ‘చెత్త’, ‘రావణుడు’, ‘భస్మాసురుడు’, ‘నాలాయక్’, ‘కుక్క చావు చస్తడు’, ‘మోదీని బొంద పెడదాం’, ‘రాక్షసుడు’, ‘దుష్టుడు’, ‘హంతకుడు’, ‘హిందూ జిన్నా’, ‘జనరల్ డయ్యర్’, ‘కంట్లో శుక్లాలున్న రోగి’, ‘జేబు దొంగ’, ‘మురికి కాలువ’, ‘నల్ల ఆంగ్లేయుడు’, ‘పిరికివాడు’, ‘ఔరంగజేబు ఆధునిక అవతారం’, ‘దుర్యోధనుడు’, ‘హిందూ’ టెర్రరిస్టు, ‘గాడిద’, ‘మగాడు కాదు’, ‘కాపాలాదారు దొంగ’, ‘తుగ్లక్’, ‘మోదీని ముక్కలు ముక్కలు నరుకుతాం’, ‘బాస్టర్డ్ మోదీ’, ‘నమ్మక ద్రోహి’, ‘నిరక్షరాస్యుడు’ ఇవన్నీ అన్నారు కదా. మోదీ గారి తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టలేదు, వారినీ అవమానించారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో మీ పార్టీ నేతలు దేశ ప్రధానిని అవమానించినంతగా మరే ప్రజా నాయకుడికీ అవమానం జరగలేదు. అంతే కాదు దేశ ప్రధానిని మీ పార్టీ నేతలు ఎంత తిట్టారో కాంగ్రెస్ పార్టీలో అంత పెద్ద పదవులు ఇచ్చారు. నేను అలాంటి ఉదాహరణలు చెప్పడం మొదలుపెడితే, దానికోసం ప్రత్యేకంగా ఒక పుస్తకమే రాయాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రకటనలు, చర్యలు దేశాన్ని అవమానించడం కాదా, రాజకీయ హుందాతనాన్ని ఉల్లంఘించడం కాదా? దాన్ని ఎలా మర్చిపోయారు… ఖర్గే గారూ..?

ఖర్గే గారూ… రాహుల్ గాంధీని చూసి కాంగ్రెస్ పార్టీ ఎందుకు గర్వపడుతోంది? భారత వ్యతిరేక, పాకిస్తాన్ అనుకూల వ్యక్తులతో చెలిమి చేయడం వల్లనా? లేదా ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం వల్లనా? లేదా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తుల మద్దతు కోరడం వల్లనా? లేదా దేశ అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని విదేశీ శక్తులను కోరడం వల్లనా? లేదా దేశంలో రిజర్వేషన్లు, కుల రాజకీయాలు చేస్తూ ఒక వర్గాన్ని మరో వర్గానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం వల్లనా? లేదా విదేశాలకు వెళ్లి రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల హక్కులను కాలరాయాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేయడం వల్లనా? లేదా జమ్ముకశ్మీర్ లో శాంతికి వ్యతిరేకంగా విషం చిమ్మడం వల్లనా? లేదా ఉగ్రవాదులను విడుదల చేసేందుకు మద్దతునివ్వడం వల్లనా..? లేదా పాక్ తో చర్చలు జరిపి ఆర్టికల్ 370 పునరుద్ధరించాలని కోరడం వల్లనా? లేదా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల కంటే హిందువులు పెద్ద ముప్పు అని అనడం వల్లనా? లేదా హిందూ సనాతన సంస్కృతిని పదేపదే అవమానించడం వల్లనా? లేదా సైనికుల శౌర్యపరాక్రమాలకు రుజువులు అడగడం వల్లనా? లేదా సైనికులను ‘బ్లడ్ బ్రోకర్స్’ అని అభివర్ణించడం వల్లనా? లేదా సిక్కు సోదరుల తలపాగా, కడాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్లనా? ఈ నేపథ్యంలో మీ లేఖ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలను బట్టబయలు చేయడం లేదా?

ఖర్గే గారూ… మీ నాయకులు- శామ్ పిట్రోడా నుంచి ఇమ్రాన్ మసూద్ వరకు, కే సురేశ్ నుంచి దిగ్విజయ్ సింగ్ వరకు, శశిథరూర్ నుంచి చిదంబరం, సుశీల్ షిండే వరకు- దేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికి చేయని పని ఏమన్నా ఉందా? ఉత్తరాదిని దక్షిణాదికి వ్యతిరేకంగా నిలబెట్టడం, ఒక సామాజికవర్గాన్ని మరో సామాజికవర్గానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం వంటివి కాంగ్రెస్ పనితనానికి గీటురాయిగా మారాయి. మీ నేతల కార్యక్రమాల్లో ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు, దేశ వ్యతిరేక శక్తులను కీర్తించడం వంటి విషయాలపై ఉత్తరం రాయాలన్న ఆలోచన ఎందుకు రాలేదు?

ఖర్గే గారూ… భారతదేశపు గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా అవమానించారంటే, కించపరిచారంటే అది కాంగ్రెస్ పార్టీయే. ఇది మీకు కూడా తెలుసు. దేశంలో ఎమర్జెన్సీ విధించింది, ట్రిపుల్ తలాక్ కు మద్దతిచ్చింది, రాజ్యాంగ సంస్థలను కించపరిచింది, బలహీనపరిచింది కాంగ్రెస్సే. ఖర్గే గారూ… మీకు బాగా తెలుసు… ఈ దేశ వనరులపై మొదటి హక్కు ఒక నిర్దిష్ట వర్గానికి ఉందని ఎవరు అన్నారో? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దళితులు, ఓబీసీలు, గిరిజనుల హక్కులను ఎలా కాలరాస్తున్నారో మీకు తెలుసు. ఖర్గే గారూ… మీ నాయకుడు రాహుల్ గాంధీ నడుపుతున్న ‘ప్రేమ దుకాణం’లో కులతత్వ విషం, శత్రుత్వ విత్తనాలు, దేశ వ్యతిరేక మసాలా దినుసులు, దేశాన్ని అపఖ్యాతి పాలు చేసే రసాయనాలు, దేశాన్ని విచ్ఛిన్నం చేసే సాధనాలు వంటి ఉత్పత్తులే అమ్ముతున్నారు. ఖర్గే గారూ… మీరు, మీ పార్టీ, మీ నాయకుడు మీ ప్రశ్నలకు సరైన సమాధానాలను పొందారని ఆశిస్తున్నాను. దేశ ప్రయోజనాల కోసం పని చేయడానికి మీకు సద్బుద్ధి, శక్తిని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.