waqf board

వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాలకు కళ్ళెం

క్ఫ్ (సవరణ) బిల్లు, 2024ను ప్రభుత్వం ఆగస్టు 8న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలన్న ప్రతిపక్షాల డిమాండుకు కూడా అంగీకరించింది. ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే విషయంలో వక్ఫ్ బోర్డుల అధికారాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లు విస్తృతమైన మార్పులను ప్రతిపాదించింది. ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించడానికి ఒక సమగ్ర ప్రక్రియను బిల్లు నిర్దేశించింది. ఇప్పుడున్నట్టుగా వక్ఫ్ బోర్డు సర్వేయర్ కాకుండా జిల్లా మేజిస్ట్రేట్ ఆస్తిని సర్వే చేయాలనీ అందులో పేర్కొన్నారు.

ముస్లిం మహిళలకు, ముస్లిమేతరులకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల కూర్పును విస్తృతం చేయడానికి ఈ బిల్లు ప్రయత్నిస్తుంది. జాయింట్ సెక్రటరీ స్థాయి కంటే తక్కువకాని హోదా కలిగిన వ్యక్తిని వక్ఫ్ బోర్డుల పూర్తిస్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించాలని, ఆ వ్యక్తి ముస్లిం కానవసరం లేదని కూడా బిల్లు పేర్కొంది. ప్రతిపాదిత సవరణలలో అత్యంత కీలకమైనది ప్రస్తుత చట్టంలోని సెక్షన్ 40 రద్దుకు సంబంధించినది. ఈ సెక్షన్ ఒక ఆస్తి వక్ఫ్ ఆస్తా? కాదా? అని నిర్ణయించడానికి వక్ఫ్ బోర్డులకు అధికారం ఇస్తుంది. వక్ఫ్ ట్రిబ్యునల్‌ల కూర్పులో మార్పు, వాటి నిర్ణయాలకు వ్యతిరేకంగా 90 రోజుల్లో హైకోర్టులలో అప్పీళ్లకు కొత్త సవరణ బిల్లు వీలు కల్పిస్తుంది. వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాలకు పగ్గాలు వేయడానికి వక్ఫ్ చట్టం, 1995కి ఈ సవరణ తెస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యప్తంగా 8.7 లక్షల ఆస్తులపై అజమాయిషీ చేసే రాష్ట్ర వక్ఫ్ బోర్డులను నియంత్రించి వాటిలో అవినీతిని నిరోధించి పారదర్శకతను తీసుకురావడం లక్ష్యమని తెలిపింది.

వక్ఫ్ అంటే ఏమిటి? వక్ఫ్ ఆస్తులంటే ఏమిటి?

ఇస్లాం మత నియమాల ప్రకారం మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం అంకితమైన ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా పిలుస్తారు. వక్ఫ్‌గా ప్రకటించిన తర్వాత ఆస్తులపై యాజమాన్యం ‘అల్లా’కు బదిలీ అవుతుంది. దీన్ని రద్దు చేయడానికి అవకాశం లేదు. ఈ ఆస్తులను వాకీఫ్ లేదా అధికారం కలిగిన వారు నియమించిన ముతావలి నిర్వహిస్తారు. వక్ఫ్ బోర్డులు భారతదేశం అంతటా 9.4 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న 8.7 లక్షల ఆస్తులను నియంత్రిస్తాయి, వీటి విలువ రూ.1.2 లక్షల కోట్లు. రెండు షియా వక్ఫ్ బోర్డులు (ఉత్తరప్రదేశ్ & బీహార్‌లో) సహా 32 వక్ఫ్ బోర్డులు మన దేశంలో ఉన్నాయి.

వక్ఫ్ ను రద్దు చేయడం వీలుకాకపోవడం వల్ల ఎదురవుతున్న సవాళ్లు ఏమిటి?

ఒకసారి ఆస్తిని వక్ఫ్‌గా ప్రకటించిన తర్వాత అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. దీన్ని రద్దుచేయడం కుదరదు. ఇది వివిధ వివాదాలు, దావాలకు దారితీసింది. వీటిలో కొన్ని బెట్ ద్వారకలోని రెండు ద్వీపాలపై హక్కు కోరుతూ వేసిన దావా వలె కోర్టులను ఆశ్చర్యపరిచాయి. 1850ల నుండి వక్ఫ్ ఆస్తిగా క్లెయిమ్ చేస్తున్న బెంగళూరు ఈద్గా మైదానం, మొఘల్ యుగంలో హజ్ సమయంలో చారిత్రాత్మకంగా ‘సరాయ్’ (బాటసారుల విడిది)గా ఉపయోగించబడిన కారణంగా న్యాయవివాదంలో ఉన్న సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం ఇటువంటి వివాదాలకు ఉదాహరణలు. కోల్‌కతాలోని టోలీగంజ్ క్లబ్, రాయల్ కలకత్తా గోల్ఫ్ క్లబ్ వక్ఫ్ భూముల్లో ఉన్నాయి. అలాగే బెంగళూరులోని ఐటీసీ విండ్సర్ హోటల్ కూడా ఇదే వివాదంలో ఉంది. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణ కూడా సవాలుగా మారింది.

వక్ఫ్, దాని చట్టం ఎలా పరిణామం చెందాయి?

భారతదేశంలో వక్ఫ్ భావన ఢిల్లీ సుల్తానుల కాలం నాటిది. సుల్తాన్ ముయిజుద్దీన్ సామ్ ఘోర్ (ముహమ్మద్ ఘోరి) ముల్తాన్‌లోని జామా మసీదుకు గ్రామాలను అంకితం చేశాడు. ముసల్మాన్ వక్ఫ్ చట్టం, 1923, దీనిని నియంత్రించడానికి ఉద్దేశించిన మొదటి ప్రయత్నం. స్వతంత్ర భారతదేశంలో వక్ఫ్ చట్టాన్ని మొదటిసారిగా 1954లో పార్లమెంటు ఆమోదించింది. దాని స్థానంలో 1995లో కొత్త వక్ఫ్ చట్టం వక్ఫ్ బోర్డులకు మరింత అధికారాన్ని కల్పించింది. వక్ఫ్ బోర్డు అధికారాలతో పాటు వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలు, అక్రమ లీజులు, అమ్మకాలపై ఫిర్యాదులు కూడా పెరిగాయి. 2013లో చట్టాన్ని సవరించి ముస్లిం ధార్మిక అవసరాలపేరిట ఆస్తులను క్లెయిమ్ చేసుకునేందుకు వక్ఫ్ బోర్డులకు అపరిమిత అధికారాలు కల్పించారు. సవరణల వల్ల వక్ఫ్ ఆస్తుల అమ్మకం అసాధ్యమైంది. వక్ఫ్ ఆస్తిని విక్రయించే హక్కు ముతావలి (సంరక్షకుడు) లేదా వక్ఫ్ బోర్డుకు లేదు.

ఈ సంపూర్ణ అధికారాలను ఈ బిల్లు ఎలా నియంత్రిస్తోంది?

వక్ఫ్ చట్టం, 1995లోని సెక్షన్ 40, ఆస్తి వక్ఫ్ ఆస్తా? కాదా? అని నిర్ణయించే అధికారాన్ని వక్ఫ్ బోర్డులకు ఇస్తుంది. అవినీతిలో కూరుకుపోయిన వక్ఫ్ అధికార యంత్రాంగం సహాయంతో ఈ అధికారాన్ని స్వార్థ శక్తులు ఆస్తుల కబ్జాకు ఉపయోగించుకుంటున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ముతావలిల నియామకానికి సంబంధించి బోర్డులకు ఇచ్చిన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మేనేజర్ల నియామకాన్ని సవాల్ చేస్తూ కేసులు దాఖలయ్యాయి. వివాదాస్పద సెక్షన్‌ను పూర్తిగా రద్దు చేసి కలెక్టర్‌కు అధికారాలు ఇవ్వాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ముస్లిం చట్టాలను అనుసరించే దేశాలకు కూడా అలాంటి అధికారాలు కలిగిన వక్ఫ్ సంస్థ లేదు.

1923 వక్ఫ్ నిర్వచనం 2013 నాటికి ఎలా మారింది?

2013లో వక్ఫ్ నిర్వచనంలో ప్రధాన మార్పును చేశారు. గతంలో ‘ఇస్లాం ఆచరించే వ్యక్తి శాశ్వతంగా అంకితం చేసిన ఆస్తి’ అనే నిర్వచనాన్ని ‘ఏ వ్యక్తి అయినా శాశ్వతంగా అంకితం చేసిన ఆస్తి’ గా మార్చారు. ఈ సవరణ తర్వాత వక్ఫ్ ఏ వ్యక్తి  ఆస్తినయినా వక్ఫ్ బోర్డులకు అంకితం చేయడానికి తలుపులు బార్లా తెరిచినట్లు అయింది.

కేసులు, ఫిర్యాదులు ఎలా పేరుకుపోయాయి?

కొన్నేళ్లుగా వివాదాలు పెరుగుతున్నాయి. వక్ఫ్ అధికార యంత్రాంగం అసమర్థతపై విమర్శలు చెలరేగాయి. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలు, దుర్వినియోగం, యాజమాన్య వివాదాలు, రిజిస్ట్రేషన్, సర్వేలలో జాప్యం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. వక్ఫ్ వ్యవస్థలో భాగమైన ట్రిబ్యునళ్లలో 40,951 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రత్యేకంగా వక్ఫ్ అధికారులే సభ్యులుగా ఉన్న ట్రిబ్యునళ్ళు ఇచ్చే తీర్పులపై న్యాయపరమైన పర్యవేక్షణ లేకపోవడంతో సమస్య మరింత జటిలమైంది. 2013 నుంచి వక్ఫ్ చట్టంపై పలువర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముస్లిం మేధావులు, మహిళలు, బోహ్రాలు, ఓబీసీ ముస్లింల వంటి వర్గాల నుంచి దీనిపై ఫిర్యాదులు వస్తున్నాయి. అప్పీల్ ప్రక్రియలో లోపాలు కూడా పెద్ద సమస్యగా మారాయి. ఉదాహరణకు, వక్ఫ్ బోర్డు నిర్ణయంపై ట్రిబ్యునల్ కు అప్పీలు చేయాలి. కానీ ఈ అప్పీలు పరిష్కారానికి ఒక గడువు లేదు. ట్రిబ్యునల్ నిర్ణయమే అంతిమం. హైకోర్టులలో రిట్ అధికార పరిధిలో తప్ప అప్పీలుకు ఎటువంటి అవకాశం లేదు. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాలకు ట్రిబ్యునళ్ళు లేవు, వక్ఫ్ అధికారులదే అంతిమ తీర్పు. ఒకే వక్ఫ్ బోర్డు ఉన్న రాష్ట్రాల్లో, బోహ్రాలు, షియాలు, అలాగే ఓబీసీ ముస్లింలు, పస్మండాలు (ముస్లింలలో నిమ్న వర్గాల వారు) వంటి ముస్లింలలోని మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మహిళలకు, అనాథలకు వారసత్వ హక్కులను నిరాకరించడానికి ‘వక్ఫ్-అల్-ఔలాద్’ (వక్ఫ్ ఇస్తున్నట్టు ప్రకటించే పత్రం) నిబంధనను దుర్వినియోగం చేస్తున్నారని, దీన్ని కొత్త బిల్లు ద్వారా అరికట్టాలని కూడా కొందరు కోరుతున్నారు.

వక్ఫ్ వ్యవస్థపై సచార్ కమిటీ, ఇతర కమిటీలు ఏమి చెప్పాయి?

సచార్ కమిటీ 2006 నివేదిక ఇతర అంశాలతో పాటు రికార్డుల నియంత్రణ, సమర్థ నిర్వహణ, వక్ఫ్ నిర్వహణలో ముస్లిమేతర సాంకేతిక నైపుణ్యాన్ని ప్రవేశపెట్టడం, వక్ఫ్‌ను ఆర్థిక ఆడిట్ లో భాగం చేయడం వంటి సిఫార్సులు చేసింది. అదేవిధంగా వక్ఫ్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ 2008 మార్చిలో రాజ్యసభకు సమర్పించిన నివేదికలో వక్ఫ్ బోర్డుల కూర్పును మార్చాలని, రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు సీఈఓగా సీనియర్ అధికారిని నియమించాలని, వక్ఫ్ ఆస్తులను అనధికారికంగా అన్యాక్రాంతం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, ముతావలీలకు కఠిన శిక్ష విధించాలని సిఫార్సు చేసింది. అవినీతికి సంబంధించి కొన్ని సందర్భాల్లో హైకోర్టు జోక్యానికి అవకాశం కల్పించడం, వక్ఫ్ బోర్డుల కంప్యూటరీకరణ, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో షియా వర్గానికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని కూడా జేపీసీ సూచించింది.

స్థూలంగా సవరణల ఉద్దేశం ఏమిటి?

వక్ఫ్ ఆస్తుల నిర్వహణను ఆధునికీకరించడం, మహిళల హక్కులను పరిరక్షించడం, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డులలో న్యాయమైన ప్రాతినిధ్యాన్ని కల్పించడం, వ్యాజ్యాలను తగ్గించడం, రెవెన్యూ శాఖతో సమర్థమైన సమన్వయం, ట్రిబ్యునల్ నిర్ణయాలపై న్యాయపరమైన పర్యవేక్షణను ఏర్పాటు చేయడం బిల్లు లక్ష్యాలని ప్రభుత్వం పేర్కొంది.

ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏం చెబుతోంది?

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ బిల్లును మత చట్టాలలో జోక్యంగా అభివర్ణిస్తూ దీనికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తామని బెదిరించింది. కానీ సూఫీ ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా సూఫీ సజ్జదనాశిన్ కౌన్సిల్ వక్ఫ్ బోర్డులు ‘నియంతృత్వ ధోరణిలో పనిచేస్తున్నాయని ఆరోపిస్తూ ప్రభుత్వం తెచ్చిన బిల్లును గట్టిగా సమర్థించింది.