Nitin Nabin Nepal

నితిన్ నబీన్‌తో నేపాల్ అధికార పార్టీ బృందం భేటీ‌‌

Nepal Team with Nitin Nabin‘బిజెపికి గురించి తెలుసుకోండి ‘ (KNOW BJP) కార్యక్రమంలో భాగంగా నేపాల్‌ అధికారపక్షమైన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం జూన్ 2న దిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ తో సమావేశమైంది. ఈ ప్రతినిథి బృందానికి ఆర్‌ఎస్‌పీ చైర్మన్ రబీ లామిచానే నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధి బృందానికి ఘనస్వాగతం పలికిన నితిన్ నబిన్… భారత్, నేపాల్ దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న చారిత్రక, సుదృఢ సంబంధాలను గుర్తుచేశారు. ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక బంధాలు, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన సంబంధాలే ఈ స్నేహానికి మూలస్తంభాలని ఆయన కొనియాడారు. ఇటువంటి పరస్పర చర్చలు ప్రజాస్వామ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా, బిజెపి – ఆర్‌ఎస్‌పీ పార్టీల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేయడానికి దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

‌‌బిజెపి ప్రస్థానం, పార్టీ నిర్మాణంపై చర్చ

సమావేశంలో నితిన్ నబీన్ బిజెపి ప్రస్థానం, సిద్ధాంతాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజల పట్ల పార్టీకి గల అంకితభావం, నిబద్ధతలను వివరించారు. జాతీయ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ ఎలా పనిచేస్తుందో ప్రతినిధి బృందానికి తెలియజేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో నిరంతరం ప్రత్యక్ష సంబంధాలను కొనసాగించడంలో బిజెపి కార్యకర్తలు పోషిస్తున్న కీలక పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ చర్చల్లో బిజెపిలో సభ్యత్వ నమోదు ప్రక్రియ, అభ్యర్థుల ఎంపిక విధానం, క్షేత్రస్థాయి కార్యకర్తలను గుర్తించి వారితో అనుసంధానమయ్యే పార్టీ యంత్రాంగం గురించి తెలుసుకోవడానికి ఆర్‌ఎస్‌పీ ప్రతినిధి బృందం ఆసక్తి కనబరిచింది. వారి ప్రశ్నలకు నబిన్ సమాధానమిస్తూ నిరంతరం ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించే కార్యక్రమాలు, బూత్ స్థాయి భాగస్వామ్యం, ప్రజాస్వామ్య ప్రక్రియలో సామాన్య పౌరుల ప్రమేయం ద్వారానే బిజెపికి సంస్థాగత బలం నిర్మితమైందని వివరించారు.

‌‌మోదీ ప్రభుత్వ సుపరిపాలన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాగుతున్న అభివృద్ధి-కేంద్రిత పరిపాలన నమూనాను నితిన్ నబిన్ ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. అభివృద్ధి, సేవ, సుపరిపాలన, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే బిజెపి ప్రజా సంబంధాల విధానంలో ప్రధానాంశాలని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో, ముఖ్యంగా ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో, ప్రజల అవగాహనను ప్రభావితం చేయడంలో, భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దడంలో పెరుగుతున్న ‘జెన్ జీ’ (యువత) పాత్ర, వారి సామర్థ్యంపై ఇరు పార్టీల నాయకులు సుదీర్ఘంగా చర్చించారు.

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, పార్లమెంట్ సభ్యులు సంజయ్ జైస్వాల్, బన్సూరి స్వరాజ్, బిజెపి విదేశీ వ్యవహారాల విభాగం ఇన్‌ఛార్జ్ డాక్టర్ విజయ్ చౌతైవాలే తదితరులు నితిన్ నబీన్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం నేపాల్ ప్రతినిధి బృందం పార్టీ ప్రధాన కార్యాలయంలోని బిజెపి మీడియా సెంటర్, సెంట్రల్ లైబ్రరీలను సందర్శించింది. సమావేశం ముగిసిన తర్వాత ప్రతినిధి బృందానికి మధ్యాహ్న విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమంలో దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మనోజ్ తివారీ, ప్రవీణ్ ఖండేల్వాల్, బన్సూరి స్వరాజ్, హర్ష్ మల్హోత్రా, రాంవీర్ సింగ్ బిధూరి తదితరులు పాల్గొన్నారు.

‘నో బిజెపి’ (Know BJP) అంటే ఏమిటి?

బిజెపి 42వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 2022 ఏప్రిల్ 6న ‘నో బిజెపి ‘ (బిజెపి గురించి తెలుసుకోండి) ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. విదేశీ ప్రతినిధులు, అంటే ఇతర దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులు, దౌత్యవేత్తలు, భారతదేశాన్ని సందర్శించే లేదా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న విదేశీ మిషన్ల అధిపతులతో పార్టీ జరిపే ద్విపక్ష చర్చలే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. “ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బిజెపి ఎదగడానికి ఎలాంటి కృషి అవసరమైంది”, అలాగే ప్రభుత్వం, పార్టీ సంస్థాగత బాధ్యతలను నిర్వర్తించడంలో పార్టీ ఎలా పనిచేస్తుందనే విషయాలను అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది.

కోవిడ్-19 మహమ్మారి ముగింపు దశలో ప్రారంభమైన ఈ విదేశీ సంప్రదింపుల కార్యక్రమాన్ని విజయ్ చౌతైవాలే నేతృత్వంలోని బిజెపి విదేశీ వ్యవహారాల విభాగం (విదేశ్ విభాగ్‌) పర్యవేక్షిస్తోంది. విదేశీ ప్రతినిధుల నుండి వచ్చే అభ్యర్థనలు, అలాగే బిజెపి స్వయంగా పంపే ఆహ్వానాలు… ఈ రెండింటినీ ఈ విభాగం సమన్వయం చేస్తుంది. సాధారణంగా ఈ సమావేశాల్లో పార్టీ సిద్ధాంతాలు, 1951 నుంచి పార్టీ సాగించిన సంస్థాగత ప్రయాణం, రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న తీరు, సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సాగే ‘అంత్యోదయ’ విధానాలపై ప్రెజెంటేషన్లు ఇస్తారు. ఈ ప్రెజెంటేషన్ల అనంతరం బిజెపి పనితీరుపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీనియర్ నేతలతో ప్రశ్నలు-సమాధానాల సెషన్ ఉంటుంది.

ఈ కార్యక్రమం కింద మొదటి సమావేశం 2022 ఏప్రిల్ 6న దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. అప్పటి బిజెపి జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె పి నడ్డా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి యూరోపియన్ యూనియన్‌తో సహా 13 దేశాల మిషన్ల (రాయబార కార్యాలయాల) అధిపతులు హాజరయ్యారు. రెండో విడత సమావేశం 2022 మే 16న, మూడో విడత జూన్ 4న జరిగాయి. నడ్డా నేతృత్వంలో 2023 పొడవునా ఇటువంటి సమావేశాలు కొనసాగాయి. అయితే, అధికారికంగా ‘నో బిజెపి’ కార్యక్రమంలో భాగం కాకపోయినప్పటికీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందం ఈ ఏడాది ఆరంభంలో బిజెపి ప్రధాన కార్యాలయాన్ని, ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. బిజెపి, సీపీసీల మధ్య పార్టీల పరస్పర సమాచార మార్పిడిని పెంపొందించుకోవడంపైనే ఈ చర్చలు ప్రధానంగా సాగినట్లు సమాచారం.

ఈ కార్యక్రమం కింద నితిన్ నబీన్ ఆధ్వర్యంలో మొదటి సమావేశం మే 26న 12 దేశాల మిషన్ల అధిపతులతో జరిగింది. ఆ తర్వాత జూన్ 2న నేపాల్‌కు చెందిన ఆర్‌ఎస్‌పి ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు. ఆయన అధ్యక్షతన జరిగిన రెండో ‘నో బిజెపి ‘ కార్యక్రమం ఇదే కావడం గమనార్హం.