vikasit bharat

కఠోర శ్రమతోనే వికసిత్ భారత్ సాధ్యం

నేను తిరుప్పూర్‌లో చదువుకునే రోజుల్లో మన దేశం గురించి ఎన్నో కలలు కనేవాడిని. భారత్ తన పూర్వ వైభవాన్ని ఎప్పుడు తిరిగి పొందుతుంది, ప్రపంచ వేదికపై ఒక శక్తిమంతమైన దేశంగా ఎప్పుడు ఎదుగుతుంది, మన పేద, వెనుకబడిన సోదర సోదరీమణులకు గౌరవప్రదమైన జీవితం ఎప్పుడు లభిస్తుంది అనే ప్రశ్నలు నాలో నిరంతరం తలెత్తేవి. నా టీనేజ్ రోజుల్లో నాలో మెదిలిన ఆ ఆలోచనలు ఇప్పుడు నిజమవ్వడం చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. “మేల్కొనండి, ప్రగతి పథంలో పయనించండి, గమ్యం చేరేవరకు విశ్రమించకండి” అంటూ తమిళనాడు గడ్డపై నుంచి స్వామి వివేకానంద ఇచ్చిన పిలుపు దేశభక్తిని, నిబద్ధతను పెంపొందించడానికి ఎంతో శక్తినిస్తుందని నేను తరచూ గుర్తుచేసుకుంటూ ఉంటాను. గత దశాబ్ద కాలంగా మన దేశం అపారమైన ఉత్సాహంతో, దృఢసంకల్పంతో ముందుకు సాగడం నన్ను ఎంతగానో అలరిస్తోంది. “దృఢసంకల్పంతో పనిచేసేవారు తాము అనుకున్నది కచ్చితంగా సాధిస్తారు,” అన్న తిరువళ్ళువర్ సూక్తి ఎంత నిజమో ఇప్పుడు మనం కళ్లారా చూస్తున్నాం.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలంగా వృద్ధి చెందుతోంది. ఈ కాలాన్ని నిరంతర అభివృద్ధి యుగంగా మార్చాలనే ప్రభుత్వం, ప్రజల సంకల్పమే ఈ పురోగతికి ప్రధాన కారణం. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన ఆర్థిక వృద్ధి అందరినీ కలుపుకొని సాగుతోంది. గత 12 ఏళ్లలో దాదాపు 25 కోట్ల మంది భారతీయులు తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు ఇల్లే లేని పేదల కోసం సుమారు 4 కోట్ల శాశ్వత గృహాలను నిర్మించడం జరిగింది. 12 కోట్లకు పైగా ప్రజలకు పైపుల ద్వారా తాగునీటి కనెక్షన్లు అందించాం. బహిరంగ మలవిసర్జన లేని దేశంగా మారాలని మనం ఆశించగా, కేవలం 60 నెలల వ్యవధిలోనే 60 కోట్ల మంది ప్రజలకు ఆ సౌకర్యాన్ని కల్పించాం. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ప్రతి సంవత్సరం 80 కోట్ల మందికి 5 కిలోల చొప్పున ఉచిత ఆహార ధాన్యాలను అందిస్తున్నాం.

గ్రామాల్లో వైద్య సదుపాయాలు అందక ప్రజలు పడే బాధలను నేను చిన్నప్పటి నుంచి చూశాను. అయితే నేడు అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రస్తుతం 44 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా రక్షణ ఉంది. గత ఏడాది కాలంలోనే ఈ పథకం కింద 2.5 కోట్ల మంది ఉచిత వైద్య చికిత్స పొందారు. మన రైతులు 2025లో 35.7 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి, ప్రపంచంలోనే భారత్‌ను రెండో అతిపెద్ద ఆహార ఉత్పత్తిదారుగా నిలిపారు. అలాగే రెండో అతిపెద్ద వరి ఉత్పత్తి దేశంగా కూడా భారత్ అవతరించింది. పీఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటివరకు 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయడం జరిగింది. దేశ అభివృద్ధిలో మన నారీ శక్తి సంపూర్ణంగా భాగస్వాములు కావడానికి ఇప్పుడు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. మూడు కోట్లకు పైగా మహిళలు లక్షాధికారులు (లఖ్‌పతీ దీదీలు), నమో డ్రోన్ దీదీలుగా మారారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సైన్స్ లేదా అంతరిక్ష సాంకేతికత ఇలా ప్రతి రంగంలోనూ మహిళలు ముందంజలో ఉన్నారు. సాయుధ దళాలలో మహిళలకు శాశ్వత కమిషన్ (కీలక బాధ్యతలు కలిగిన హోదా) లభిస్తోంది, వారు పోరాట పాత్రల్లో కూడా పాల్గొంటున్నారు. 

నారీ శక్తి వందన్ అధినియమ్ పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో వారి ప్రాతినిధ్యాన్ని మరింత పెంచనుంది. స్టార్టప్‌ల వైపు నవతరం ఎంతో ఉత్సాహంతో అడుగులు వేస్తుంటే, “రండి, రండి, మీరు అనుకున్నది సాధించండి; దేశమంతా ఐక్యంగా ఎదిగి వర్థిల్లనివ్వండి; రండి, ఒక గొప్ప కార్యాన్ని సాధించండి” అన్న సుబ్రహ్మణ్య భారతి మాటలు మనకు గుర్తుకు వస్తాయి. యువత కోసం 7 కొత్త ఐఐటీలు ఏర్పాటయ్యాయి. ఐఐఎంల సంఖ్య 13 నుంచి 21కి పెరిగింది. ‘ఎయిమ్స్ ‘ ఆస్పత్రుల సంఖ్య 7 నుండి మూడు రెట్లు పెరిగి 23కి చేరగా, వైద్య కళాశాలలు 387 నుంచి రెట్టింపై 823కి పెరిగాయి. వైద్య విద్యార్థుల సీట్ల సంఖ్య కూడా 51,348 నుండి 1,29,603కి పెరిగింది. మౌలిక సదుపాయాల కల్పనలోనూ మనం ప్రపంచ స్థాయి ప్రమాణాల వైపు దూసుకెళ్తున్నాం. రైల్వే నెట్‌వర్క్ దాదాపు 99 శాతం విద్యుదీకరణ పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా 164 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సరికొత్త విప్లవాన్ని తీసుకువచ్చాయి. విమానాశ్రయాల సంఖ్య 74 నుండి 163కి రెట్టింపు కాగా, ఉడాన్ పథకం ద్వారా సామాన్యుడికి కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. 

తమిళనాడుకు 2014లో దాదాపు 880 కోట్ల రూపాయలుగా ఉన్న రైల్వే బడ్జెట్ కేటాయింపులు 2026–27 నాటికి రూ.7,600 కోట్లకు పెరిగాయి. రామేశ్వరం, పంబన్ మధ్య నిర్మించిన కొత్త పంబన్ వంతెన భారతదేశపు మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ (నౌకలు వెళ్ళినప్పుడు వంతెనలో ఒక భాగాన్ని పైకి లేపవచ్చు) వంతెనగా ఆధ్యాత్మిక పర్యాటకానికి, ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. ప్రపంచ స్థాయి 4-లేన్, 8-లేన్ రహదారులు, మారుమూల గ్రామాలకు సైతం రోడ్డు అనుసంధానత ఏర్పడింది. తమిళనాడులో 2014 నుండి 4,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులను నిర్మించగా, ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు 7,200 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించాం. ‘ప్రగతి ‘ (PRAGATI) వేదిక ద్వారా ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షించడం వల్లే ఈ పరిణామాలు సాధ్యమయ్యాయి.

ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాలు, ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంతగానో లబ్ధి చేకూరుస్తున్నాయి. ఒకప్పుడు దేశంలో ‘చిట్టచివరి ‘ గ్రామాలుగా పరిగణించిన సరిహద్దు గ్రామాలు ఇప్పుడు ‘వైబ్రంట్ విలేజెస్ ‘ కార్యక్రమం ద్వారా ‘మొట్టమొదటి ‘ గ్రామాలుగా మారి అభివృద్ధి చెందుతున్నాయి. ప్రధానమంత్రి ఈశాన్య రాష్ట్రాలను దేశానికి ‘అష్టలక్ష్ములు’గా అభివర్ణించడం సంతోషం కలిగిస్తోంది. ఇటీవల నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలను సందర్శించినప్పుడు, అక్కడ రవాణా సౌకర్యాలతో పాటు మౌలిక సదుపాయాలలో అద్భుతమైన పురోగతిని చూశాను. సైన్స్, సాంకేతికత, ఆవిష్కరణ రంగాలలో దేశం సాధించిన ప్రగతి మనల్ని గర్వపడేలా చేస్తోంది. కోవిడ్ మహమ్మారి కాలంలో భారత్ సొంతంగా వ్యాక్సిన్‌లను వేగంగా అభివృద్ధి చేసి, అందరికీ ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా 100కు పైగా దేశాలకు వ్యాక్సిన్‌లను సరఫరా చేసింది. చంద్రయాన్-3 విజయవంతమైన ప్రయోగం భారత్ ను అధునాతన అంతరిక్ష అన్వేషణ యుగంలోకి తీసుకెళ్లింది. కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అంతర్జాతీయ కంపెనీలు భారతదేశాన్ని తమ ప్రధాన కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో కూడా మనం ప్రపంచంలోనే రెండో స్థానాన్ని దక్కించుకున్నాం.

దశాబ్దాలుగా మన దేశం తీవ్రవాదంతో పాటు తిరుగుబాట్లు, వామపక్ష తీవ్రవాదం సవాళ్లను ఎదుర్కొంది. దృఢమైన విధాన నిర్ణయాలు, చట్టాన్ని అమలు చేయడం ద్వారా దేశంలో శాంతి నెలకొని ఆయా ప్రాంతాలలో అభివృద్ధికి తలుపులు తెరుచుకున్నాయి. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా మార్చాలని, ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థానానికి చేర్చాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కఠోర శ్రమ కాలమే అమృత కాలం. స్వాతంత్య్ర సమరయోధుల హృదయాలలో స్వేచ్ఛ కోసం ఎలాంటి తపన ఉండేదో నేటి యువత మనస్సులో దేశ అభివృద్ధి గురించిన ఆలోచన అలాగే పెరగాలి. “నా సోదరులారా, మనమందరం కష్టపడి పని చేద్దాం; ఇది నిద్రపోయే సమయం కాదు. మన భావి భారతదేశం మనం చేసే పనిపైనే ఆధారపడి ఉంటుంది,” అన్న స్వామి వివేకానంద మాటలు మనకు స్ఫూర్తిని, దిశను నిర్దేశిస్తున్నాయి. మన కఠోర శ్రమతో వికసిత్ భారతాన్ని నిర్మించడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేద్దాం.

సి పి రాధాకృష్ణన్,
భారత ఉపరాష్ట్రపతి