మోదీ 3.0 : భిన్నత్వంలో ఏకత్వానికి నిజమైన నిదర్శనం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికలకు ముందు తన కేబినెట్ మంత్రులను “ఆచరణాత్మకమైన, కొలవగల, స్పష్టంగా నిర్వచించిన’’ ప్రణాళికను సిద్ధం చేసి మంత్రివర్గ సమావేశంలో సమర్పించాలని కోరారు. మూడో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేయాల్సిన పనులపై అప్పటికే ఒక ప్రణాళికను రూపొందించడం మొదలుపెటినట్టు ఆయన ప్రకటించారు. అందుకు 15 లక్షల మంది నుంచి ఆయన సలహాలను స్వీకరించారు. “సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్” స్ఫూర్తితో మోదీ 3.0 ప్రభుత్వం ఏకాభిప్రాయాన్ని పెంపొందించడంలో, మరిన్ని వర్గాలను కలుపుకొని, కార్యాచరణలో ఎక్కువ క్రియాశీలంగా ఉండబోతోందని అప్పుడే అర్థమైంది. మంత్రివర్గం శాఖల ప్రకటన వెలువడగానే మోదీ 3.0లో ప్రజానుకూల విధానాలు నూతన శిఖరాలను అధిరోహిస్తాయని స్పష్టమైంది. మంత్రివర్గంలో కొత్తగా చేరిన జెపి నడ్డా తన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా 70 ఏళ్లు పైబడిన వ్యక్తులకు ఆయుష్మాన్ భారత్ వర్తింపును ప్రకటించారు. సాధారణ టీకాలను డిజిటలైజ్ చేయడానికి యు విన్ పోర్టల్ ను దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై) కింద 3 కోట్ల గ్రామీణ, పట్టణ గృహాలను నిర్మించడానికి ప్రభుత్వ సహాయాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదించింది. పిఎంఏవై కింద గత 10 సంవత్సరాలలో గృహనిర్మాణ పథకాల కింద అర్హులైన పేద కుటుంబాలకు మొత్తం 4.21 కోట్ల ఇళ్లు నిర్మించారు.
ఆయుష్మాన్ భారత్ విస్తరణ లేదా పిఎంఏవై కులం, మతం, వర్గం లేదా మతం ఆధారంగా లబ్ధిదారుల పట్ల వివక్ష చూపుతున్నాయా? ఏమాత్రం చూపడం లేదు! మరి కేంద్ర మంత్రివర్గంలో శాఖల కేటాయింపు వంటి జాతీయ ప్రయోజనాల ఇమిడి ఉన్న అంశాలలో చాలామంది వ్యాఖ్యాతలు, విశ్లేషకులు ఎప్పుడూ ఎవరు ఈ కులానికి, చెందిన వారు, ఏ మతం వారు వంటి దృష్టితో ఎందుకు చూస్తారు?
సర్వజనాభివృద్ధి
ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన 71 మంది కేంద్ర మంత్రుల్లో 10 మంది దళితులు, 27 మంది ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు), 21 మంది ‘అగ్ర’ కులాల వారు, ఐదుగురు గిరిజనులు, ఐదుగురు మతపరమైన మైనారిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏడుగురు మహిళలు మంత్రివర్గంలో ఉన్నారు. ఇందులో ఇద్దరు నిర్మలా సీతారామన్, అన్నపూర్ణా దేవి, కేబినెట్ మంత్రులు. మోదీ 3.0లో మైనారిటీ వర్గాలకు చెందిన ఐదుగురు మంత్రుల్లో హర్దీప్ సింగ్ పురి, రవ్నీత్ సింగ్ బిట్టు, జార్జ్ కురియన్, కిరెన్ రిజిజు, రాందాస్ అథవాలే ఉన్నారు. పురి, అథవాలే రాజ్యసభ సభ్యులు కాగా రిజిజు అరుణాచల్ ప్రదేశ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. బిట్టు పంజాబ్ లో ఎన్నికలలో ఓడిపోయారు. కేరళ బిజెపి ప్రధాన కార్యదర్శి కురియన్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019-2024 పదవీకాలం మాదిరిగానే ఈసారి కూడా గిరిజన వర్గాల నుంచి ఐదుగురు మంత్రులు ఉన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో పనిచేసి, ఆరుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఒడిశాకు చెందిన జుయల్ ఓరమ్ కేబినెట్ మంత్రిగా ఎదిగారు. ఆ పార్టీకి చెందిన మరో ప్రముఖ గిరిజన నేత అర్జున్ ముండా ఈసారి ఎన్నికల్లో ఓడిపోయారు. సర్బానంద సోనోవాల్, సావిత్రి ఠాకూర్, దుర్గా దాస్ ఉయికే గిరిజన వర్గాలకు చెందిన ఇతర మంత్రులు.
ప్రాంతీయ సమతౌల్యం కావచ్చు, లేదా కులం, వర్గం, మైనారిటీలు, ఇతర వర్గాల మధ్య సమతుల్యత కావచ్చు, మొదటి నుంచి బిజెపి, ముఖ్యంగా ప్రధాని మోదీ నేతృత్వంలో నవ భారత్ కోసం ఈ గుర్తింపు విభజనలను అధిగమించి కొత్త ఐక్యతను సృష్టించడానికి ముందుకు సాగుతోంది. ఉత్తర-దక్షిణ విభజన లేదు, లేదా ‘ఎగువ’- ‘దిగువ’ కులాల విభజన లేదు, మైనారిటీ-మెజారిటీ తారతమ్యాలు లేవు. ఈ వాస్తవాల దృష్ట్యా మీడియా, పౌర సమాజంలోని కొంతమంది వ్యాఖ్యాతలు ఎల్లప్పుడూ ముస్లింలనే ఎందుకు ప్రమాణంగా తీసుకుంటారో అర్థం కాదు.
ముస్లింలు ఎక్కడ?
పోలికలు ఇక్కడ ఉపయోగపడొచ్చు. లోక్‌సభ ఎన్నికలలో ఒక్కసీటు కూడా గెలవలేకపోయిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) అధ్యక్షురాలు మాయావతి మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీ “సరైన ప్రాతినిధ్యం” ఇచ్చినప్పటికీ ముస్లింలు బిఎస్పిని అర్థం చేసుకోలేకపోయారన్నారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ అత్యధికంగా 35 మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది, కానీ అది పార్టీకి ఏమాత్రం ఉపయోగపడలేదు. 2024 లోక్ సభ ఎన్నికల్లో 78 మంది ముస్లిం అభ్యర్థులు బరిలో ఉన్నారు, వారిలో 15 మంది గెలుపొందారు. వీరిలో మాజీ భారత క్రికెటర్ యూసుఫ్ పఠాన్, పశ్చిమ బెంగాల్ లోని బహరంపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ అధీర్ రంజన్ చౌదరిని ఓడించారు. “తల్లి, మాతృభూమి, మనుషులు’’ ( మా మతి మనుష్) అనే నినాదంతో ఎన్నికల ప్రచారం చేసిన మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్లో గుజరాతీ మాట్లాడే యూసుఫ్ పఠాన్, అధీర్ చౌదరి వంటి బెంగాలీ అనుభవజ్ఞుడిని ఎలా ఓడించాడో భారత ప్రజాస్వామ్య ఆరోగ్యానికి ముస్లింల భాగస్వామ్యాన్ని ఏకైక సూచికగా పరిగణించే వారు వివరించాలి.
భారత రాజ్యాంగం దాని వివిధ నిబంధనల ద్వారా(i) మతపరమైన మైనారిటీలు (ii) భాషాపరమైన మైనారిటీలు (iii) సాంస్కృతిక మైనారిటీలు, (iv) వారి సొంత లిపిని కలిగి ఉన్న మైనారిటీలను గుర్తిస్తుంది. అంతేకాకుండా ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, జొరాస్ట్రియన్లు (పార్సీలు) జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం, 1992లోని సెక్షన్ 2 (సి) ప్రకారం మైనారిటీ మతాలుగా ప్రకటించారు. మైనారిటీలు అనే పదం చాలా వైవిధ్యం కలిగినదైనప్పుడు ‘మైనారిటీ’ అనే పదాన్ని ‘ముస్లింలు’ అనే పదానికి పర్యాయపదంగా ఎలా మారుస్తారు? ఈ అంశాన్ని చారిత్రక దృక్కోణంతో పరిశీలిద్దాం. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేది కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖ. దీన్ని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నుంచి విడదీసి జనవరి 29, 2006న ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏ ఆర్ అంతులే, సల్మాన్ ఖుర్షీద్, కె రెహమాన్ ఖాన్ యుపిఎ-2లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రులయ్యారు.
2014లో మోదీ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని ఒక్కసారిగా పక్కనపెట్టకుండా నజ్మా హెప్తుల్లా, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వంటి ముస్లిం మంత్రులను కొనసాగించింది. జూలై 2022, జూన్ 2024 మధ్య మాత్రమే స్మృతి ఇరానీకి మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆమె కుటుంబ నేపథ్యం మైనారిటీలు అనే భావనలో వైవిధ్యాన్ని వెలుగులోకి తెచ్చింది. స్మృతి ఇరానీ సగం పంజాబీ, సగం మహారాష్ట్రీయ హిందూ తండ్రి, బెంగాలీ హిందూ తల్లిల కుమార్తె. ఒక పార్సీకి భార్య. మరి ఆమెను ఏ మతానికి, ఏ వర్గానికి చెందిన వారిగా పరిగణించాలి? అసలు ‘మైనారిటీలు’ అనే భావన మొత్తం సామాజిక-రాజకీయ, శాసనపరమైన భావన. జాతీయ మైనారిటీల చట్టం, 1992 దీనికి చట్టపరమైన ప్రాతిపదికను కల్పిస్తోంది. 1992 చట్టంలోని సెక్షన్ 2(సి) కింద నోటిఫై చేసిన వర్గాలకు చెందిన వారు మాత్రమే మైనారిటీ పౌరులుగా పరిగణించబడతారు.
మోదీ 3.0లో విభిన్న వర్గాల వారి మధ్య సమతూకం పాటించి ప్రాతినిధ్యం కల్పించారు. కేవలం ఒక వర్గానికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించలేదన్న కారణంగా ఈ వైవిధ్యాన్ని విస్మరించడం లేదా తక్కువ చేయడం సమంజసం కాదు. అర్థం లేని గుర్తింపు రాజకీయాలకు పాల్పడకుండా భిన్నత్వంలో ఏకత్వ భావనను నిజమైన స్ఫూర్తితో అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది.
అభిమన్యు ప్రతాప్ సింగ్

