Education

కొత్త జాతీయ విద్యావిధానంపై అసంబద్ధ విమర్శలు

1986 నాటి కాలం చెల్లిన జాతీయ విద్యా విధానం స్థానంలో కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి)ని 2020లో అమల్లోకి తెచ్చారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ సంస్కరణ 34 సంవత్సరాలు ఆలస్యమైంది. 1991లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన తర్వాత శరవేగంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని ఆధునికీకరించడంలో వరుసగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రదర్శించిన ఉదాసీనతకు ఈ జాప్యం అద్దం పడుతోంది. పాఠశాలలు, కళాశాలల నుంచి ఉత్తీర్ణులై బయటకు వచ్చిన యువతలో ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు కొరవడటం పాత వ్యవస్థలో ప్రధాన సమస్య. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది.

1990లలో లేదా 2000ల ప్రారంభంలో కళాశాలలో చేరిన తరం వారు రాబోయే దశాబ్దాలలో పరిశ్రమల తీరుతెన్నులను ఊహించి ఉండలేరు. ఇంటర్నెట్ ఆగమనం, నాలుగోతరం పరిశ్రమలు, మారుతున్న ప్రపంచ వాణిజ్య విధానాలు, దాంతో పాటు మారిన పారిశ్రామిక దృశ్యం ఉపాధి మార్కెట్‌ను నాటకీయంగా మార్చివేశాయి. ఈరోజు ఉన్న అనేక పరిశ్రమలు, వ్యాపారాలు, ఉద్యోగాలు 20 ఏళ్ళ క్రితం లేవు. ఈనాడు మనకు వివిధ విభాగాలలో లోతైన పరిజ్ఞానాన్ని మాత్రమే కాకుండా ఆధునిక ప్రపంచంలో ముందుకు సాగేందుకు అవసరమైన నైపుణ్యాలను కూడా అందించే విద్యా వ్యవస్థ కావాలి. వీటిలో సాఫ్ట్ స్కిల్స్, సాంకేతిక నైపుణ్యాలు, పరిశోధనా సామర్థ్యాలు, విశ్లేషణ, సమస్యా పరిష్కార సామర్థ్యాలు, నిశిత పరిశీలన ఉన్నాయి. వీటితో పాటు కొత్త వ్యవస్థ సాంస్కృతిక, విలువల ఆధారిత విద్య ప్రాముఖ్యాన్ని నొక్కిచెప్పి విద్యార్థులు సమాజానికి, దేశానికి అర్థవంతమైన సహకారం అందించడానికి వీలు కల్పించాలి.

ఈ సమగ్ర విధానాన్ని క్రెడిట్-ఆధారిత కోర్సుల ద్వారా ఎన్ఇపిలో భాగం చేశారు. విద్యార్థులు సంపూర్ణమైన విద్యను పొందేలా ఇది చూస్తుంది. అయితే, ఎన్ఇపి అమలు పెద్దయెత్తున చర్చకు దారితీసింది. కొంతమంది విమర్శకులు ఇది ఉన్నత విద్య సారాంశాన్ని, లక్ష్యాన్ని పలుచన చేస్తుందని, విద్యార్థులు, అధ్యాపకులపై అధికారిక నిబంధనల రూపంలో అనవసరపు భారం పడుతుందని వాదించారు. ఈ ఆందోళనలలో కొంత నిజం ఉండొచ్చు. కొందరు కొన్ని విలువైన సలహాలు కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి. కొత్త వ్యవస్థను అమలు చేయడం, విస్తారమైన విద్యా రంగాన్ని పునర్వ్యస్థీకరించడం ఒక నిరంతర ప్రక్రియ. ఈ విమర్శలలో చాలా వరకు అసందర్భమైనవి, కొన్ని మరీ అసంబద్దమైనవి.

ఎన్ఇపిలో అన్ని కోర్సులను ఫలితాల ఆధారిత అభ్యాసంగా మార్చారు. ఈ విధానంలో ప్రతి కోర్సులో నిర్దిష్ట అభ్యాస ఫలితాలు ఉంటాయి. ఈ ఫలితాలను కొలవడానికి నిర్దిష్ట పద్దతులను రూపొందించారు. ఇది విద్యార్థులకు వారి ప్రతిభ, ఆసక్తులు, కెరీర్ లక్ష్యాల ఆధారంగా వారి విద్యామార్గాన్ని అనుసరించేందుకు సౌలభ్యాన్ని అందిస్తుంది. అయితే, విద్యార్థులు మౌలిక పరిజ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు కోర్సులను ఎంచుకోవచ్చని దీని అర్థం కాదు. దిల్లీ యూనివర్శిటీ వంటి సంస్థలు విద్యార్థులు ఒక మేజర్ (ప్రధాన), ఒక మైనర్ సబ్జెక్టుతో పాటు వివిధ ఇతర రంగాలలో పరిజ్ఞానం కోసం అవసరమైన సబ్జెక్టులను ఎంపిక చేసుకునే విధంగా డిగ్రీ కోర్సులను రూపొందించాయి. ఎన్ఇపి రూపకల్పనలో సాధారణ సబ్జెక్టులు, సామర్థ్యం, నైపుణ్యం పెంపుదల కోర్సులు ఉన్నాయి. ఇవి విద్యార్థుల ఉపాధి, వ్యాపార నైపుణ్యాలకు పదునుపెడతాయి. విద్యార్థులు ఇకపై కేవలం జ్ఞానాన్ని సముపార్జించడమే కాకుండా ఆచరణాత్మకంగా దాన్ని ఉపయోగిస్తారు.

యుజిసి ఒక నమూనాను మాత్రమే సూచించగా తుది సిలబస్‌ను రూపొందించడానికి విశ్వవిద్యాలయాలకు స్వయంప్రతిపత్తి ఉంది. చాలా విమర్శలు సిలబస్ రూపకల్పన, అందులోని పాఠాలపైనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఇది విశ్వవిద్యాలయాల సమస్యే తప్ప ఎన్ఇపి వైఫల్యం కాదు. కొన్ని విశ్వవిద్యాలయాలు, ఉదాహరణకు దిల్లీ విశ్వవిద్యాలయం, ఎన్ఇపిని ఆచరణలో పెట్టడంలో అద్భుతమైన కృషి చేశాయి. ప్రభావిత పక్షాల అభిప్రాయాన్ని అనుసరించి ఎప్పటికప్పుడు నవీకరణలలు, మార్పులు చేస్తున్నాయి. దిల్లీ విశ్వవిద్యాలయం యుజిసి నిర్దేశించిన దానికంటే అధిక క్రెడిట్ పరిధిని ఏర్పాటు చేసి, విద్యార్థులు వారి విద్యావిషయక పరిజ్ఞానాన్ని మరింత పెంచుకోవడానికి అదనపు క్రెడిట్‌లను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఎన్ఇపి విద్యార్థుల విభిన్న నేపథ్యాలు, పరిస్థితులను కూడా గుర్తిస్తుంది. ఇంతకుముందు, జీవనోపాధి కోసం డిగ్రీ కోర్సును మధ్యలోనే ఆపివేసిన విద్యార్థులను డ్రాపౌట్‌లుగా చూసేవారు. ఎన్ఇపి ఇప్పుడు ఈ విద్యార్థులు కోర్సుల నుంచి నిష్క్రమించడానికి, తిరిగి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. జీవితకాల అభ్యాసాన్ని సులభతరం చేస్తుంది. అంతేకాక విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన పారిశ్రామిక అనుభవం పొందితే వారికి పూర్వ అభ్యాసన గుర్తింపు (ఆర్పిఎల్ ) ద్వారా అదనపు క్రెడిట్‌లను ఇస్తారు. తగిన మదింపు ద్వారా తర్వాత వారికి డిగ్రీలో వెయిటేజీ కూడా ఇస్తారు.

విద్యాభ్యాసం నిజజీవితంలో ఉపయోగపడేందుకు గాను అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల పాఠ్య ప్రణాళికలు, పాఠాలలో ప్రయోగాత్మక, ఆచరణాత్మక అధ్యయనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే విద్యలో అత్యున్నత ప్రమాణాలకు గాను నిరంతర మూల్యాంకనం ద్వారా క్రెడిట్లు ఇస్తారు. ఎన్ఇపి పూర్తి ఫలితాలు కనిపించడానికి మరిన్ని వనరులు అవసరమన్న మాట నిజం. అయితే దీనికి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేది దీర్ఘకాలిక ప్రక్రియ. ఏడాది, రెండేళ్ళలో అయ్యేపని కాదు. ఎన్ఇపి డిగ్రీ కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, ప్రాజెక్ట్‌లు, సామాజిక కార్యక్రమాలు కూడా భాగంగా ఉంటాయి. వాస్తవ ప్రపంచ కార్యకలాపాలు విద్యార్థులకు కీలకమైన ఆచరణాత్మక అనుభవాలను అందిస్తాయి. సామ్యవాద ప్రపంచ దృక్పథంతో మార్కెట్లను, పారిశ్రామిక అనుభవాన్ని, ఇంటర్న్‌షిప్‌లను అసహ్యించుకునే పాతతరం వ్యక్తుల నుంచే ఈ కొత్త జాతీయ విద్యావిధానం పట్ల ఎక్కువ వ్యతిరేకత వస్తున్నట్టు కనిపిస్తోంది. 

భారతదేశంలోని మెజారిటీ ప్రజలకు ఉపాధి కల్పించే విద్య కోసం పట్టుబడిన బి ఆర్ అంబేద్కర్ అభిప్రాయాలను ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. దేశ ప్రగతికి, బహుజనుల విముక్తికి పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధి అవసరమని అంబేద్కర్ గట్టిగా విశ్వసించారు. మెరుగైన మానవ వనరుల అభివృద్ధికి, బడుగు వర్గాల ఉపాధికి విద్యాసంస్థలు, పరిశ్రమలు, మార్కెట్‌ల సమన్వయంతో నిర్మించిన విద్యా వ్యవస్థ కావాలని ఆయన భావించారు. ఇంతకుముందు ఈ సలహాను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. విస్తృత సమాజం నుంచి విద్యా వ్యవస్థ దూరమై పోయింది. దీనివల్ల జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి ఎన్ఇపి ఒక అవకాశం. విస్తృత ప్రజానీకం, మార్కెట్ల అవసరాలకు విద్యారంగం స్పందించాల్సిన సమయం ఇది.

అభినవ్ ప్రకాష్,
బీజేవైఎం జాతీయ ఉపాధ్యక్షుడు