Netanna

తెలంగాణలో పడకేసిన చేనేత, వస్త్ర శాఖ

సెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ వ్యతిరేకతను ఆసరా చేసుకొని కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగిన్నప్పటికీ క్రమంగా ఆ పార్టీ ప్రాబల్యం సన్నగిల్లుతున్నట్లు లోక్ సభ ఎన్నికలు స్పష్టం చేశాయి. మరోవైపు బిజెపి వేగంగా పుంజుకుంటుంది. దానితో రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ భవిష్యత్ పైన ఆ పార్టీ పెద్దలకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో కీలక మంత్రిత్వ శాఖలను అధికారులకు వదిలివేసి పట్టించుకోవడం లేదు. ఫలితంగా పరిపాలన దాదాపు స్తంభించే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణకు ముఖ్యమైన చేనేత, వస్త్ర శాఖ ఈ సందర్భంగా పూర్తిగా పడకేసింది. నేతన్నల నుంచి వస్త్రాలను సేకరించి వివిధ ప్రభుత్వ సంస్థలకు అందజేసేందుకు ఉద్దేశించిన పథకాలన్నీ నిలిచిపోయాయి. స్కూలు పిల్లల యూనిఫామ్స్‌ మినహా స్త్రాల తయారీ కోసం నేతన్నలకు ఇస్తున్న ఆర్డర్లన్నీ ఆగిపోయాయి. దీంతో అటు వస్త్ర శాఖలోని ఉద్యోగులు, ఇటు నేతన్నలకు పని లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేనేత కళలు మసకబారుతున్నాయి.

నేతన్నలకు చేతినిండా పని కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం అమలు చేసిన విద్యార్థుల యూనిఫామ్స్‌తోపాటు బతుకమ్మ చీరలు, రంజాన్‌ తోఫా, క్రిస్‌మస్‌ గిఫ్ట్‌ వంటి పథకాలు అటకెక్కుతున్నాయి. వీటితోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన వస్త్రాలు, కిందిస్థాయి ఉద్యోగుల యూనిఫామ్స్‌ కోసం బట్టలను నేతన్నల ద్వారా తయారు చేయించడం పట్ల దృష్టి సారించడం లేదు. ప్రతి ఏటా రూ.600కోట్ల వరకూ విలువైన బట్టల తయారీకి నేతన్నలకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చేది. ఫలితంగా రాష్ట్రంలోని సుమారు 35 వేల పైచిలుకు నేతన్నలకు ప్రతినెలా రూ.15,000లకు తగ్గకుండా ఆదాయం లభించేది. ముఖ్యంగా సిరిసిల్ల, వరంగల్‌ ప్రాంతాల్లోని నేతన్నలు ఎక్కువగా ప్రభుత్వం ద్వారా వచ్చే ఆర్డర్లపై ఆధారపడి వస్త్రాలు తయారు చేసేవారు. అయితే ఇప్పుడు  స్కూలు యూనిఫామ్స్‌ మినహా ఇతర ఆర్డర్లేవీ వారికి ఇవ్వలేదు. పాఠశాలలు తెరుచుకునే సమయం పూర్తికావడంతో ఇప్పుడు నేతన్నలంతా పని లేకుండా ఖాళీగా ఉన్నారు. టెక్స్‌టైల్‌ శాఖలో కార్యకలాపాలు ఏమీ లేకపోవడంతో అక్కడి ఉద్యోగులకు కూడా పని లేకుండాపోయింది. రాష్ట్రంలో వరుసగా చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతన్న ఘటనలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. కనీసం 10 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. సిరిసిల్ల, కరీంనగర్‌తో పాటు టెక్స్‌టైల్‌ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మంలోనూ ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరం. పవర్‌లూమ్స్‌, నేత పరికరాలపై 90% సబ్సిడీని ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో  పేర్కొన్న కాంగ్రెస్‌ ఆ దిశలో ఎటువంటి అడుగులు వేయడం లేదు. చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం కొత్త పథకాలు, కార్యక్రమాలు ఏవీ చేపట్టక పోయినా అంతకు ముందున్న చేనేత మిత్ర, థ్రిప్ట్‌, యార్న్‌ సబ్సిడీ, నేత పింఛన్లు, నేతన్నబీమా వంటి పథకాలను అయినా కొనసాగించే ప్రయత్నం చేయడం లేదు.

రాష్ట్రంలోని చేనేత చీరలకు దేశవ్యాప్తంగా పేరుంది. వివిధ రకాల డిజైన్లను తయారు చేయడంలో మన నేతన్నలు నైపుణ్యం సాధించారు. ముఖ్యంగా పోచంపల్లి చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక్కడ తయారయ్యే ఇక్కత్‌ ఫ్యాబ్రిక్‌తో యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ ద్వారా బెస్ట్‌ టూరిజం విలేజ్‌గా పొచంపల్లికి ఖ్యాతి దక్కింది. జరీ అంచులతో చీరల తయారీకిగాను గద్వాల చీరలకు, వినూత్న టెంపుల్‌ బార్డర్‌లతో చీరల తయారీకిగాను నారాయణపేట చీరలు, గొల్లభామ చీరలు ఎంతగానో ప్రఖ్యాతిగాంచాయి. అయితే,  ప్రభుత్వం చేనేత రంగాన్ని పూర్తిగా విస్మరించడంతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కళలు మసకబారుతున్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. కనీసం ముఖ్యమంత్రి సమీక్ష జరిపి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. తెలంగాణలో అత్యధికంగా ఉపాధి కల్పించే రంగాలలో చేనేత ఒకటని గుర్తించిన దాఖలాలు లేవు. చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం పలు పథకాలు అమలు చేస్తున్నది. వాటి ద్వారా ప్రయోజనం పొందే ప్రయత్నాలు కూడా జరగడం లేదు.

ప్రవీణ్