Revanth Reddy

ఒంటెత్తు పోకడలతో బలహీనమవుతున్న రేవంత్ రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేకత ఆసరాగా అలవికానీ హామీలతో తెలంగాణలో అధికారంలోకి రాగలిగిన కాంగ్రెస్ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో, పాలనతో ప్రజలను ఆకట్టుకోవడంలో అడుగడుగునా విఫలమవుతూ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడల కారణంగా పార్టీలో ఎవరి దారి వారిదే అన్నట్టు మారింది. ఆయన మంత్రివర్గ సహచరులే ఆయన ధోరణి పట్ల అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. తాజాగా రుణమాఫీ ప్రకటన కోసం మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో ఇక నుండి ప్రభుత్వ విధానాలకు సంబంధించిన అంశాలను ఇద్దరు మంత్రులు మాత్రమే మీడియాకు చెబుతారు అంటూ డి. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలకు అధికారం కట్టబెట్టడం సీనియర్ మంత్రుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.

ప్రభుత్వ నిర్ణయాలకు మంత్రివర్గం ఉమ్మడి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందరూ సమాన బాధ్యులు అవుతారు. పైగా, ఇప్పటి వరకు ఒకసారి కూడా మంత్రి పదవి చేపట్టని రేవంత్ రెడ్డి మూడు నుండి ఐదు సార్లు వరకు మంత్రి పదవులు చేపట్టిన మంత్రులను పక్కన పెట్టి ఇటువంటి ప్రకటన చేయడం మంత్రులందరూ ఉత్సవ విగ్రహాలే అనే సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారని విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వంలో ఓకే ఉపముఖ్యమంత్రి ఉన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారున్నారు. ఐదుగురు ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పని చేసిన వారున్నారు. వారెవ్వరూ ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడవద్దని కట్టడి చేయడం విస్మయం కలిగిస్తోంది.

ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీలో చేరి, మంత్రి పదవి పొందిన పొంగులేటికి రేవంత్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యత, ఆయన బంధువుకే ఖమ్మం లోక్ సభ సీటు కూడా ఇవ్వడమూ ఇతర సీనియర్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. తెలంగాణలో వేగంగా బలం పుంజుకుంటున్నట్లు లోక్ సభ ఎన్నికల్లో చెప్పుకున్న కాంగ్రెస్… బిజెపితో సమానంగా 8 సీట్లను మాత్రమే గెల్చుకోగలిగింది. ఈ అంశం కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా కలవరపరుస్తోంది. కనీసం 14 లోక్ సభ సీట్లు గెలుస్తామని చెప్పిన రేవంత్ మాటలు వమ్ము కావడంతో ఆయన సామర్థ్యంపై పార్టీ అధిష్టానంలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలలో- కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలలో పార్టీ చతికలపడటం వారిని ఆందోళనకు గురిచేస్తుంది. దిద్దుబాటు చర్యలలో భాగంగానే రేవంత్ ఒంటెత్తు పోకడలను కట్టడి చేయాలనీ నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. అందుకనే లోక్ సభ ఎన్నికలు కాగానే నామినేట్ పదవులు ఇస్తామని, మంత్రివర్గ విస్తరణ జరుపుతామని రేవంత్ చెప్పినా, పేర్లను ఖరారు చేయడంలో అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు.

పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన అధిష్టానం ముఖ్యమంత్రి, మంత్రులు ‘నువ్వా-నేనా?’ అనే తరహాలో వ్యవహరిస్తుండటాన్నీ సీరియస్‌గా తీసుకుంటున్నట్టు సమాచారం. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత అన్న విధంగా కాంగ్రెస్‌ పార్టీలో పరిణామాలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. రేవంత్ కు పార్టీపై, ప్రభుత్వంపై మొన్నటి దాకా ఉన్న పట్టు సడలిపోతున్నట్లు స్పష్టం అవుతున్నది. పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటానికి సరిగ్గా ఒకరోజు ముందు 37 నామినేటెడ్‌ పోస్టులకు చైర్మన్లను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఆ మరుసటి రోజే ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటంతో కోడ్‌ ముగిశాకే నామినేటెడ్‌ పోస్టులకు ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు. ఎన్నికల కోడ్‌ ముగిసి మూడు వారాలు గడిచినప్పటికీ, నామినేటెడ్‌ పోస్టులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కాలేదు. అయితే, రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించకపోవడంతో ఈ జాబితాను అధిష్ఠానం పునఃసమీక్షిస్తున్నట్టు తెలిసింది. ప్రకటించిన నామినేటెడ్‌ పోస్టులకు ఉత్తర్వులు జారీ కాకుండా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ అడ్డుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. రేవంత్‌ రెడ్డి సిఫారసు మేరకు కాకుండా పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల ఆధారంగా నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయాలన్నది అధిష్ఠానం తాజా అభిప్రాయమన్నది ఈ వర్గాల సమాచారం. గతంలో ప్రకటించిన 37 పోస్టులతో పాటు మరో 15-20 నామినేటెడ్‌ పోస్టుల జాబితాను ఈసారి తాజాగా దీపాదాస్‌ మున్షీతో కలిసి కసరత్తు చేసినట్టు తెలిసింది. నామినేటెడ్‌ పోస్టులకు ఎంపిక బాధ్యతను రేవంత్‌ రెడ్డికి ఒక్కరికే అప్పగించకుండా తాజా జాబితాను పార్టీ పరిశీలకురాలితో కలిసి ఖరారు చేయాలని అధిష్టానం ఆదేశించినట్టు చెబుతున్నారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లలో 14 సీట్లు లక్ష్యంగా పెట్టుకొని కనీసం 12 సీట్లు సాధించాలని రేవంత్‌ రెడ్డికి అధిష్టానం లక్ష్యం విధించింది. కానీ, ఎనిమిది ఎంపీ సీట్లతోనే కాంగ్రెస్‌ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నప్పటికీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎనిమిది సీట్లకే పరిమితం కావడం పట్ల అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఆశించిన ఫలితాలు రాకపోవడానికి గల కారణాలపై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ నుంచి నివేదిక కోరగా  కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బిజెపిలు ఏకం కావడం వల్ల ఆశించిన ఫలితాలు రాలేదని, పార్టీలో లోపం లేదన్నట్లు ఆమె నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఫలితాల అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి కూడా ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించడం గమనార్హం. అయితే ఈ వాదనతో పార్టీ అధిష్టానం సంతృప్తి చెందలేదని తెలుస్తున్నది. ఇతర మార్గాల ద్వారా అధిష్టానం సేకరించిన నివేదికలో అభ్యర్థుల ఎంపికలో రేవంత్‌ రెడ్డి చేసిన తప్పిదాలు, పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఇంచార్జీలుగా వ్యవహరించిన మంత్రులకు ఎమ్మెల్యేలతో సమన్వయం లేకపోవడం వంటివి ఆశించిన ఫలితాలు రాకపోవడానికి కారణమని వెల్లడైంది. దీంతో నిజనిర్ధారణకు ఏఐసీసీ తిరిగి ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయంతో అధిష్టానం ఏకీభవించలేదనడానికి ఈ పరిణామమే నిదర్శనమని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కృష్ణ చైతన్య