యూపీలో కాంగ్రెస్, ఎస్పీ పొత్తు మూణ్ణాళ్ల ముచ్చటే
ఉత్తరప్రదేశ్ లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మిశ్రమంగా, ఆశ్చర్యకరంగా ఉన్నాయి. బహుజన్ సమాజ్ వాది పార్టీతో సహా అన్ని పార్టీలు తమ సొంత వైఖరితో ఫలితాలను విశ్లేషిస్తున్నాయి. సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీల ఫలితాలు నమ్మశక్యంగా లేవు. అసలు వారే అలాంటి ఫలితాన్ని ఆశించలేదు. గాంధీ కుటుంబం కూడా అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయడంపై ఊగిసలాడింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ‘ఇండీ’ కూటమిలో భాగంగా 17 స్థానాల్లో పోటీ చేసి కాంగ్రెస్ ఆరు స్థానాలను గెలుచుకుంది. ఇది కాంగ్రెస్ కు చాలా పెద్ద విజయం. ఎందుకంటే ఆ పార్టీకి రాష్ట్రంలో అసలు ఖాతా తెరవడంపై కూడా అనుమానం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్ పి), తృణమూల్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది.
2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ యూపీ నుంచి 21 సీట్లు గెలుచుకుంది. 1984 తర్వాత యూపీలో కాంగ్రెస్ కనబరిచిన అత్యుత్తమ పనితీరు ఇదేనని మనం మరచిపోకూడదు. 2009 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 206 సీట్లు గెలుచుకుంది. యూపీలో ఆ పార్టీ సీట్ల సంఖ్య 21. అక్కడ 2009లో 23 సీట్లు గెలుచుకున్న సమాజ్ వాదీ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ వెనుకబడి ఉంది. ఫిరోజాబాద్ లోక్‌సభ స్థానం ఫలితం కాంగ్రెస్ కు ఆశ్చర్యం కలిగించింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీకి చెందిన అఖిలేష్ యాదవ్ గెలిచారు. ఫిరోజాబాద్‌తో పాటు 2009లో కన్నౌజ్ సీటును కూడా అఖిలేష్ గెలుచుకున్నారు. కుటుంబానికి సురక్షితంగా భావించి ఫిరోజాబాద్ లోక్ సభ సీటును అఖిలేష్ ఖాళీ చేసి, తన భార్య డింపుల్ యాదవ్‌ను పోటీలో పెట్టారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు చెందిన రాజ్ బబ్బర్ దాదాపు 11 శాతం తేడాతో డింపుల్ యాదవ్‌పై విజయం సాధించారు. ఇది కాంగ్రెస్ కు భారీ విజయం. యాదవ్ కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బ. కానీ కాంగ్రెస్ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. తరువాత 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ కేవలం 28 సీట్లు మాత్రమే గెలుచుకుంది. రాహుల్ గాంధీ 2012 అసెంబ్లీ ఎన్నికలలో స్పష్టమైన వైఖరి లేకుండా తనను తాను నాయకుడిగా చూపిస్తూ పోటీ చేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుతో 114 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 7 స్థానాలకు పడిపోయింది. రెండు పార్టీల కార్యకర్తలు, ఓటర్ల మధ్య నమ్మకం లేదని, రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగలేదని తేలిపోయింది. 90వ దశకం చివరి నుంచి ఈ రెండు పార్టీల పరస్పర విశ్వాసం మృగ్యమైపోయింది.
దివంగత ములాయం సింగ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని గానీ, గాంధీ కుటుంబాన్ని గానీ నమ్మలేదు. సాక్షాత్తూ లోక్‌సభలోనే ములాయం కాంగ్రెస్ ను తన రాజకీయ శత్రువుగా ప్రకటించారు. 1998లో లోక్‌సభలో ఒక ఓటు తేడాతో వాజ్‌పేయి ప్రభుత్వం పడిపోయిన తర్వాత ప్రధానమంత్రి కావడానికి ములాయం యాదవ్ సోనియా గాంధీకి మద్దతు ఇవ్వలేదు. ఒకరి ఓట్లను మరొకరు లాగేసుకుంటారన్న భయం రెండు పార్టీల లోనూ ఉంటుంది. అందుకే వీటి మధ్య పొత్తు ఎక్కువ కాలం నిలవదు. 2024లో యూపీలో ఇండీ కూటమికి మంచి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా రెండింటిలో ఏ పార్టీ తమ భాగస్వామికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వలేదు.
అభయ్ కుమార్

