దిల్లీకి చేరుతున్న తెలంగాణ ఆర్ఆర్ ట్యాక్స్
తెలంగాణలో కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్
వ్యాపారుల నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తూ దిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానానికి పంపుతున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఎక్కడ పోయిందని నిలదీశారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజల్ని, మహిళలను మోసగించి, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ‘‘మహిళలను వంచించిన కాంగ్రెస్ సర్కార్ పై నారీ భేరి’’ పేరుతో బిజెపి మహిళా మోర్చా నిరసన కార్యక్రమం చేపట్టింది. జులై 9న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా తెలంగాణ ఆడబిడ్డలు కదం తొక్కారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ ‘‘కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు, మహిళకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఏ ఊరుకెళ్తే ఆ ఊరి దేవుళ్ల మీద ఒట్లు పెట్టి కాలం వెల్లదీసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేసే ఆలోచన చేయడం లేదు. డిసెంబరు 9 తర్వాత సోనియమ్మ రాజ్యం వస్తుందని, రైతుల అప్పులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుందని, కొత్తగా అప్పులు తీసుకొమ్మని పొంకనాలు మాట్లాడారు. కాంగ్రెస్ మహిళలకు ప్రతి నెలా రూ.2,000 సాయం ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినా అమలు చేయలేదు. ఇప్పటివరకు ప్రతి మహిళకు రూ.20 వేల చొప్పున బకాయి పడింది. మహిళలకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అంటూ ఇచ్చిన హామీకి అతీగతి లేదు. రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15,000 పంట పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12,000 సాయం ఇస్తామని చెప్పారు. దానికీ అతీగతి లేదు. 18 ఏండ్లు నిండిన అమ్మాయిలందరికీ ఉచితంగా స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు.
కాంగ్రెస్ కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మభ్యపెడుతోంది. రాష్ట్రంలో రెగ్యులర్ బస్సులను సగానికి పైగా తగ్గించి, నామమాత్రంగా ఉచిత బస్సు ప్రయాణం అంటూ ప్రచారం చేస్తున్నారు. మహిళలు ఉచిత బస్సులో తిరుగుతూ వారికి ఇచ్చిన హామీలు అమలైనట్లు కలలు కనండి అనేలా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తెలంగాణలోని అనేక గ్రామాల్లో అక్రమంగా వేలాది బెల్ట్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపులను తొలగిస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైంది..? గతంలో బీఆర్ఎస్ హయాంలోనూ బెల్ట్ షాపులతో వీరవిహారం చేసి, అనేక మందిని మద్యానికి బానిసలుగా మార్చి అనారోగ్యానికి గురిచేశారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలతో చాలా మంది మహిళలు భర్తలను కోల్పోయి, కుటుంబాలు ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. తెలంగాణ వచ్చి పదేళ్లు గడిచినా కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది లేదు. రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు సమస్యల్లో కూరుకుపోయారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయ్. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్డెక్కారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను దోపిడీ చేస్తోంది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడిస్తారు..? ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం ఎప్పుడిస్తారు..? రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం ఇంకెప్పుడిస్తారు..? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే వేల కోట్ల అప్పులు తెచ్చింది. రైతు రుణమాఫీ కోసం మళ్లీ అప్పుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని రూ. 7 లక్షల కోట్ల అప్పులమయంగా మార్చారు. నేడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుల మీదనే ఆధారపడ్డారు. ప్రభుత్వ భూములు, లిటిగేషన్, హౌసింగ్ బోర్డు భూములు అమ్మడం.. అప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నారు. 6 గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని సోనియాగాంధీ సంతకంతో కూడిన ఉత్తరాన్ని ప్రతి ఇంటింటికి పంపిచారు. నేడు 6 గ్యారంటీలను, హామీలను అమలు చేసే పరిస్థితిలో లేదు.
దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అనేక సంవత్సరాల పాటు కాంగ్రెస్ పరిపాలించింది. గరీబీ హఠావో అని చెప్పారు.. కాని, గరీబోళ్లను హఠాయించారు. నాడు ఇందిరా గాంధీ మహిళా ప్రధానిగా ఉన్నా మహిళలకు న్యాయం జరగలేదు. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశంపై కాంగ్రెస్ నాన్చుతూ వచ్చింది తప్ప పరిష్కారం చేయలేదు. గతంలో బీఆర్ఎస్ కూడా తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసింది. ఏ ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన ఘనుడు కేసీఆర్. 50 శాతం మహిళా జనాభా ఉన్న తెలంగాణలో కనీసం మహిళా మంత్రి లేకుండా పాలించిన చరిత్ర కేసీఆర్ ది. నరేంద్ర మోదీ ప్రభుత్వం దిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనంలో చేసిన మొట్టమొదటి చట్టం మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పన. దేశంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 210 మంది మహిళలే గెలవబోతున్నారు. అలాగే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లోనూ 40 మంది ఎమ్మెల్యేలు మహిళలు గెలవాలని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించింది. దీన్ని ఇప్పుడు మరో 5 సంవత్సరాలు పొడిగించింది. మహిళల ఆరోగ్యానికి రక్షణగా ఉండేలా ఉజ్వల యోజనతో దేశ వ్యాప్తంగా ఇంటింటికీ ఫ్రీగా గ్యాస్ కనెక్షన్లు అందించింది.’’ అని అన్నారు.
కొందరికి కొన్నే : డా. శిల్పారెడ్డి
ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 214 రోజులు పూర్తయినప్పటికీ మహిళలకు ఇంతవరకు మేలు జరిగింది లేదు. కాంగ్రెస్ పాలనతో మహిళల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ.2,000 సాయం. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 18 సంవత్సరాలు నిండిన అమ్మాయికి ఉచితంగా స్కూటీ, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, నెలకు రూ.4,000 చొప్పున పింఛను అంటూ అనేక హామీలు ఇచ్చారు, అమలు మాత్రం గాలికొదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫిరాయింపులపైనే ధ్యాస తప్పితే.. ప్రజా సమస్యల పరిష్కారంపై లేదు. అధికారంలోకి రాక ముందు అందరికీ అన్ని.. అధికారంలోకి వచ్చాక కొందరికి కొన్నే అనే ట్యాగ్ లైన్ పెట్టుకుంది. తెలంగాణలో రోజుకో చోట అమ్మాయిలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం.’’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, రాష్ట్ర కార్యదర్శులు గొట్టాల ఉమారాణి, జయశ్రీ, అధికార ప్రతినిధి రాణి రుద్రమ తదితర మహిళా నాయకులు, పెద్దఎత్తున మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

