వాక్చతురుడు.. కార్యదక్షుడు..
భారత మాజీ ఉప రాష్ట్రపతి, రాజనీతిజ్ఞుడు వెంకయ్య నాయుడికి ఆదివారంతో (జూన్ 30) 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో సుదీర్ఘ కాలం జీవించాలని కోరుకుంటున్నా. అంకిత భావం, ఆశావాదం, దృఢ చిత్తంతో ప్రజా సేవ చేస్తున్న నాయకుడి జన్మ దినాన్ని జరుపుకోవడం పండగ లాంటిదే. రాజకీయ రంగ ప్రవేశం నుంచి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించేదాకా సాగిన ఆయన రాజకీయ జీవితం.. భారత రాజకీయాల్లోని సంక్లిష్టతలను హుందాగా, సులువుగా అధిగమించడంలో ఆయనకుగల అరుదైన సామర్థ్యాన్ని మన ముందుంచుతుంది. తన వాగ్ధాటి, చతురత, ప్రగతి సంబంధిత అంశాలపై దృఢ వైఖరి వంటి సుగుణాలు పార్టీలకు అతీతంగా ఆయనకు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టాయి.
వెంకయ్య నాయుడితో నా అనుబంధం దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. మేము కలిసి పని చేసినప్పుడు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయన జీవితంలోని సార్వత్రిక అంశం ఏదైనా ఉందంటే అది ప్రజలపై ప్రేమే. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థి సంఘ రాజకీయాల ద్వారా ఆయనలోని ఆచరణాత్మకత, క్రియాశీలత వెలుగులోకి వచ్చాయి. వెంకయ్య నాయుడి అపూర్వ ప్రతిభ, వాక్పటిమ, నిర్వహణా నైపుణ్యంరీత్యా ఏ రాజకీయ పార్టీ అయినా ఆయనకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ‘దేశమే ప్రథమం’ అనే దార్శనికత నుంచి స్ఫూర్తి పొందిన ఆయన సంఘ్ పరివార్‌తో కలిసి పని చేయడానికే మొగ్గు చూపారు. ఆ విధంగా ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీలతో ఆయనకుగల అనుబంధం తర్వాతి కాలంలో జనసంఘ్, బిజెపిల బలోపేతానికి ఎంతగానో దోహదం చేసింది.
49 ఏళ్ల కిందట ఎమర్జెన్సీ విధించిన వేళ.. దానిని వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమంలో చురుకైన పాతికేళ్ల యువకుడిగా వెంకయ్య నాయుడు ముందుకు దూకారు. ఆ క్రమంలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించిన పాపానికి ప్రభుత్వం ఆయనను జైలు పాల్జేసింది. ప్రజాస్వామ్యంపై ఈ నిబద్ధత ఆయన రాజకీయ జీవితంలో పలుమార్లు రుజువైంది. మహా నేత ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బర్తరఫ్ చేసిన సందర్భంలోనూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ఆయన మరోసారి ముందు వరుసలో నిలిచారు.
వెంకయ్య నాయుడు ఎలాంటి ఆటుపోట్లనైనా అవలీలగా అధిగమించగల సమర్థుడు. ఏపీ శాసనసభ ఎన్నికల సందర్భంగా 1978లో ప్రజలు కాంగ్రెస్‌కు అఖండ విజయం కట్టబెట్టినా జనతా పార్టీ అభ్యర్థిగా ఉదయగిరి నుంచి యువ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అటుపైన ఐదేళ్లకు (1983) ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తొలి ఎన్నికల్లోనే సునామీ తరహా ఫలితాలతో రాష్ట్రాన్ని చుట్టబెట్టినా ఆయన వరుసగా రెండోసారి అదే స్థానం నుంచి బిజెపి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ఎదుగుదలకు బాటలు వేశారు.
వెంకయ్య నాయుడి ప్రసంగం విన్న వారంతా సాధారణంగా ఆయన వాక్పటిమకు పెద్దపీట వేస్తారు. అయితే ఆయన వాక్చతురుడు మాత్రమే కాదు… కార్యదక్షుడు కూడా. యువ ఎమ్మెల్యేగా శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన రోజుల నుంచీ సభా వ్యవహారాలను ఔపోసన పట్టిన ఆయనలోని నేర్చుకునే గుణం, నియోజకవర్గ ప్రజాగళం వినిపించడంలో చూపిన అంకిత భావం అపార గౌరవం సముపార్జించి పెట్టాయి. ఆయన ప్రతిభను గుర్తించిన ఎన్టీఆర్ తమ పార్టీలో చేర్చుకోవాలని ఉవ్విళ్లూరారు. కానీ తన మాతృ సిద్ధాంతాన్ని వీడబోనంటూ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామగ్రామానా పర్యటించి ప్రజలతో మమేకమవుతూ బిజెపిని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ అధ్యక్షుడయ్యారు. బిజెపి కేంద్ర నాయకత్వం 1990లలో ఆయన కృషిని గుర్తించింది. ఆ తర్వాత 1993లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆనాటి నుంచీ జాతీయ స్థాయిలో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. మా పార్టీని అధికారంలోకి తేవడంతోపాటు దేశానికి తొలి బిజెపి ప్రధానమంత్రి నాయకత్వం వహించేలా ప్రధాన కార్యదర్శి హోదాలో విశేష కృషి చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు.
వెంకయ్య నాయుడిని కేంద్ర మంత్రి మండలిలోకి తీసుకునేందుకు 2000 సంవత్సరంలో వాజ్‌పేయీ ఆసక్తి చూపారు. ఆ సందర్భంగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు తాను అత్యంత ప్రాధాన్యం ఇస్తానని ఆయన తెలిపారు. తానొక రైతు బిడ్డనని, తన బాల్యమంతా గ్రామాల్లోనే గడిచింది కాబట్టి మంత్రిగా తాను కోరుకునేది ఏదైనా ఉందంటే అది గ్రామీణాభివృద్ధేనని వివరించారు. అందుకు తగినట్లుగానే ‘ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన’ వంటి పథకానికి రూపకర్తగా ప్రధాన పాత్ర పోషించారు. 2014లో దిల్లీ వచ్చే నాటికి దాదాపు 15 సంవత్సరాలపాటు గుజరాత్ బాధ్యతలు చూసిన నేను జాతీయ రాజధానికి కొత్త వ్యక్తిని. అటువంటి సమయంలో వెంకయ్య నాయుడి సలహాలు, సూచనలు నాకెంతో ఉపయుక్తమయ్యాయి. పార్లమెంటు నియమ నిబంధనలను పాటించడంలో అధికార, విపక్షాలనే తేడా లేకుండా కచ్చితత్వం అనుసరించడం ఆయనకే చెల్లు. మా కూటమి ప్రభుత్వం 2017లో వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించింది. అయితే ఆయనకుగల మహోన్నత స్థానాన్ని భర్తీ చేయడం ఎలాగన్న సందిగ్ధంలో పడ్డాం. మరోవైపు ఉపరాష్ట్రపతి పదవికి ఆయనను మించిన ఉత్తమ అభ్యర్థి మరొకరు లేరన్న వాస్తవం కూడా మాకు తెలుసు. ఈ నేపథ్యంలో ఎంపీగా, మంత్రిగా తన పదవులకు రాజీనామా చేస్తూ ఆయనిచ్చిన ఉపన్యాసాల్లో ఒక్క అక్షరం కూడా నేను మరువలేను. ఉపరాష్ట్రపతి అయ్యాక ఆ పదవికి మరింత విలువను ఆపాదించే అనేక చర్యలు తీసుకున్నారు. యువ, మహిళా, నూతన ఎంపీలకు మాట్లాడే అవకాశం కల్పించడం ద్వారా రాజ్యసభకు అత్యుత్తమ ఛైర్‌పర్సన్‌గా నిలిచారు.
వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన తర్వాతా ప్రజా జీవితంలో చురుగ్గా ఉంటున్నారు. తనకు ఆసక్తిగల అంశాలపై, దేశవ్యాప్తంగా వివిధ పరిణామాలపై ఆయన అప్పుడప్పుడూ ఫోన్ ద్వారా నన్ను వాకబు చేస్తుంటారు. మా ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇటీవలే నేను ఆయనను కలిశాను. ఆయనెంతో సంతోషంతో నాకు, నా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి తీపి జ్ఞాపకాలతో వెంకయ్య నాయుడు 75 ఏళ్ల మైలురాయిని చేరడంపై మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. యువ కార్యకర్తలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రజా సేవాభిలాషులైన ప్రతి ఒక్కరూ ఆయన జీవితానుభవాల వెలుగులో విలువలను అందిపుచ్చుకోగలరని ఆశిస్తున్నాను. ఆయనవంటి అరుదైన నాయకులే మన దేశాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతూ ఉత్తేజమిస్తున్నారు.
నరేంద్ర మోదీ,
భారత ప్రధాని

