కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతోన్న అసంతృప్తి
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుండి రోజుకొకరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. విరామం లేకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వెంట పడుతున్నారు. ఫిరాయింపులకు పాల్పడిన వారిపై ఫిర్యాదులు స్వీకరించేందుకు అందుబాటులో ఉండకుండా స్పీకర్ తప్పించుకొంటున్నారు. చివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసినా ఆయనపై చర్యలకు స్పీకర్ ఉపక్రమించడం లేదు. ఇంత అడ్డదిడ్డంగా ఫిరాయింపులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నా, బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేసేందుకు ఎంతో తీవ్రంగా కృషి చేస్తున్నా ప్రజాక్షేత్రంలో మాత్రం మద్దతును పెంచుకోలేక పోతున్నారు. ఏడు నెలలకే ప్రజలలో రేవంత్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, చెప్పిన మాటలకు సంబంధం లేకుండా పాలన సాగుతుంది. మంత్రులు ఎవరి దారి వారిదిగా ఉండడంతో ప్రభుత్వం అసలు ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నామినేటెడ్ పోస్టులు, కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై దిల్లీ చుట్టూ ప్రదక్షిణలకే సమయం సరిపోతుంది. దాంతో పరిపాలనపై దృష్టి సారించే తీరిక ముఖ్యమంత్రికి చిక్కుతున్నట్లు కనిపించడం లేదు. గత నెల రోజులలోనే సుమారు 10 రోజులు ఆయన దిల్లీలో కనిపించారు. మంత్రులు సైతం తరచూ దిల్లీకి వెడుతూ ఒకరిపై మరొకరికి పార్టీ అధిష్టానంకు ఫిర్యాదులు చేసుకోవడంతోనే గడుపుతున్నారు.
కేసీఆర్ అవినీతిని నిగ్గు తేలుస్తానని ఎన్నికల సమయంలో ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ ప్రస్తావన చేయడం లేదు. కాళేశ్వరంలో రూ.1లక్ష కోట్ల అవినీతి సొమ్ము కక్కించి, ప్రజలకు పంచుతానని చెప్పిన ఆయన ఇప్పుడు ప్రభుత్వ దర్యాప్తు కేవలం కూలిన బ్యారేజీలకే పరిమితం అని చెబుతున్నారు. గతంలో జరిగిన నిర్మాణాలపై దర్యాప్తులు చేసుకొంటూ పోతే ఎవరూ మిగలరు అంటూ నాటి కాంట్రాక్టర్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంలోకి రాగానే కాంట్రాక్టర్లను పిలిపించి మంతనాలు జరిపి, సర్దుబాట్లు చేసుకొనే ప్రయత్నం చేయడం గమనార్హం. కొత్త ప్రభుత్వమన్న బెరుకేమీ లేకుండా అన్ని స్థాయిల్లో ‘కాంగ్రెస్ తరహా’ అవినీతి మొదలైందని, అది వికేంద్రీకృతమౌతోందనే భావన ప్రజల్లో వచ్చింది. పార్టీలో సీనియర్లను సంతృప్తి పరచి, అసంతృప్తిని చల్లార్చేందుకే రేవంత్ రెడ్డికి సమయం సరిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వ సుస్థిరతకు ప్రమాదం లేకపోయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు చూపుతున్న ఉత్సాహం కారణంగా పలు నియోజకవర్గాలలో కాంగ్రెస్ నాయకులకు, వారికి మధ్య విబేధాలు రచ్చకెక్కే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా రాజీనామాకు సిద్ధమైతే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గతంలో బీఆర్ఎస్ సైతం ఈ విధంగా ఫిరాయింపులను ప్రోత్సహించి, పార్టీలో కుమ్ములాటలకు ఆజ్యం పోయడంతో రాజకీయంగా తీవ్రమైన ప్రతికూలత ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ అనుభవాల నుండైనా రేవంత్ రెడ్డి గుణపాఠం నేర్చుకొనే ప్రయత్నం చెయ్యడం లేదు. పైగా, ఎవరైనా ఇతర పార్టీల వారు తమ పార్టీలో చేరాలంటే ముందుగా ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేయాలనీ కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. కానీ ఇప్పుడు ఈ వాదనకు తిలోదకాలిచ్చి ఫిరాయింపులకు గేట్లు తెరుస్తున్నారు.
కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఆరు మాసాలు పూర్తయిన సందర్భంలో ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ క్షేత్రస్థాయిలో జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ‘ఆరు గ్యారెంటీల’ అమలును, పరిపాలనా తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారని స్పష్టమవుతుంది. కాంగ్రెస్ శ్రేణులలోనే పాలన పట్ల సంతృప్తి వ్యక్తం కావడం లేదు. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి భయపడుతూ వాటిని వాయిదా వేసేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలే ప్రజల వద్దకు వెళ్లేందుకు భయపడుతున్నట్లు స్పష్టం అవుతుంది. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఇప్పటికీ పలు ముఖ్యమైన జిల్లాల్లో కూడా రేవంత్ రెడ్డి పర్యటనలు జరపలేక పోయారు. కేసీఆర్ మాదిరిగా హైదరాబాద్ కు పరిమితం కావడమో, దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు జరపడంతోనో సరిపోతుంది.
ప్రవీణ్

