బీసీలపై రాహుల్ దిగజారుడు రాజకీయాలు
మిస్ యూనివర్స్ పోటీల్లో బీసీల లెక్కలు తీస్తున్న రాహుల్ గాంధీ దిగజారుడుతనానికి, దివాలాకోరుతనానికి పరాకాష్ట అని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కోవా లక్ష్మణ్ విమర్శించారు. కులగణన జరగాలని అంటోన్న రాహుల్ గాంధీ బీసీల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. సమాజాన్ని విడదీయాలనే ఏకైక ఎజెండాతో కుల, మత, ప్రాంతం, భాష పేరుతో కుట్రలు చేస్తున్నారని, బీసీలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత 70 ఏండ్లలో జమ్ము కశ్మీర్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ ఎందుకు రిజర్వేషన్లు కల్పించలేకపోయిందని ప్రశ్నించారు. నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ వేర్పాటువాదానికి వంత పాడుతోందని, ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఆగస్ట్ 27న బిజెపి హైదరాబాద్ సెంట్రల్ కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో డా. లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రసంగిస్తూ ‘‘నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా బీసీల అభ్యున్నతి, సంక్షేమం కోసం కేంద్ర విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది. బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ సొంతం. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ మొదలు నేటి వరకు ఆ పార్టీది ఇదే తీరు. కాకా కాలేల్కర్, మండల్ కమిషన్ల సిఫార్సులను వ్యతిరేకించారు. కులాల పేరుతో రిజర్వేషన్లు ఇవ్వకూడదని 1952లోనే అప్పటి ప్రధాని నెహ్రూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. మండల్ కమిషన్ సిఫార్సులను వీపీ సింగ్, జనతా దళ్ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెడితే రాజీవ్ గాంధీ అడ్డంగా విభేదించారు. ఒక సామాన్యమైన, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దేశానికి మూడోసారి ప్రధానమంత్రి కావడం రాహుల్ గాంధీ సహించలేకపోతున్నారు. ప్రధానమంత్రి వేసుకునే వస్త్రాలపైనా, తినే ఆహారంపైనా దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారు.
వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 తీసుకొస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. అటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. పార్లమెంటులో ప్రిన్సిపల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీల్లో బీసీలు పట్టుమని పది మంది కూడా లేరంటూ రాహుల్ నిందలు వేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పాలనలో రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేసి, బీసీలను ఐఏఎస్ ఆఫీసర్లుగా నియమించినట్లయితే, ఇప్పుడు పార్లమెంటులో ప్రిన్సిపల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలుగా పదోన్నతులు పొందేవారు. మరి అప్పుడు ఎందుకు అమలు చేయలేదు..?
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల పట్ల వ్యవహరించిన తీరు బాధాకరం. అధికారంలో వస్తే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.. మరి అమలు ఏది..? బీసీ జనాభాకు అనుగుణంగా సీట్ల రిజర్వేషన్లు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు చేపట్టడం లేదు..? కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో బీసీలను మోసం చేస్తున్న తీరును తిప్పికొట్టి, బుద్ధి చెప్పేలా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమించాలి.
కేంద్ర ప్రభుత్వంలో 27 మంది బీసీలను మంత్రులుగా చేసిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అడ్మిషన్లలో బీసీ అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్ సదుపాయం కల్పించింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్రం రూ.20,050 కోట్లు కేటాయించింది. ప్రపంచంలో అతిపెద్ద స్కీం పీఎం విశ్వకర్మ యోజనతో 18 రకాల కులవృత్తుల వారికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. తెలంగాణలో 52 వేల మంది పూర్తిగా అర్హత పొంది పీఎం విశ్వకర్మ యోజనకు నమోదు చేసుకుని, ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు.’’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు, బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రావు, రాష్ట్ర ఓబిసి మోర్చా ప్రధాన కార్యదర్శులు నందనం దివాకర్, వెన్న ఈశ్వరప్ప, ఉపాధ్యక్షులు సంజయ్ ఘనాతే, చీర శ్రీకాంత్, గోంగూలా మహేష్, రమేశ్, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జులు, సహ ఇంచార్జులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

