ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలపై జన్ ధన్ విప్లవాత్మక ప్రభావం
ఈ ఆగస్టు 28న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకం చారిత్రాత్మక విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆర్థిక సమ్మిళితత్వాన్ని పెంచడంలో, కోట్ల మందికి, ముఖ్యంగా మహిళలు, యువత, అణగారిన వర్గాలకు గౌరవప్రద జీవితాన్ని అందించడంలో ఈ కార్యక్రమం ప్రధాన పాత్ర పోషించిందని మోదీ పేర్కొన్నారు. 2014 ఆగస్టు 28న పీఎంజేడీవైని జాతీయ ఆర్థిక సమ్మిళితత్వ కార్యక్రమంగా ఎన్డీయే ప్రభుత్వం ప్రారంభించింది. గత పదేళ్ళ కాలంలో 53.13 కోట్ల జన్ ధన్ ఖాతాలు తెరిచారు వీరిలో 29.56 కోట్ల మంది మహిళా లబ్ధిదారులు ఉన్నారు. ఈ సంఖ్య యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల్లోని జనాభా కంటే అధికం. దాదాపు అమెరికా జనాభాతో సమానం.
స్వాతంత్య్ర దినోత్సవ ప్రకటన
నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో చేపట్టిన కార్యక్రమాలలో పీఎంజేడీవై ఒకటి. 2014 ఆగస్టు 15న చేసిన తన మొదటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ ఈ పథకాన్ని ప్రకటించారు. “ఈ స్వాతంత్య్ర దినోత్సవాన ఒక పథకాన్ని ప్రకటించాలన్న లక్ష్యంతో నేను వచ్చాను. దాని పేరు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన,” అని ఎర్రకోట బురుజుల నుంచి చేసిన ప్రసంగంలో ప్రధాని ప్రకటించారు. “దేశంలోని నిరుపేద పౌరులను ఈ పథకం ద్వారా బ్యాంకు ఖాతాలకు అనుసంధానించాలని అనుకుంటున్నాను. ఈ పథకం కొత్త మార్గాలను తెరుస్తుంది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద ఖాతా కలిగి ఉన్నవారికి ఒక డెబిట్ కార్డు ఇస్తారు. ఈ డెబిట్ కార్డు కింద ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు బీమా కల్పిస్తారు,” అని ఆయన వివరించారు.
2014 ఆగస్టు 28న ఈ పథకాన్ని ప్రారంభించారు. బ్యాంకులు దేశవ్యాప్తంగా 77,892 శిబిరాలను నిర్వహించి దాదాపు 1.8 కోట్ల ఖాతాలను తెరిచాయి. ఈ ఘన విజయం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కింది. “ఆర్థిక సమ్మిళితత్వ కార్యక్రమం మొదటి వారంలో అత్యధికంగా 1,80,96,130 బ్యాంకు ఖాతాలు ప్రారంభమయ్యాయి. 2014 ఆగస్టు 23 నుంచి 29 వరకు భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఈ రికార్డును సాధించింది,” అని గిన్నిస్ బుక్ లో పేర్కొన్నారు. ఆర్థిక సమ్మిళితత్వాన్ని సాధించడానికి ప్రభుత్వం చేపట్టిన కృషికి పీఎంజేడీవై గణనీయంగా దోహదం చేసింది. ఇంతకుముందు ఎన్నడూ ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు ఇందులో భాగస్వాములు కాలేదు. గతంలో కూడా ప్రభుత్వాలు ఇటువంటి కార్యక్రమాలను చేపట్టినప్పటికీ అవి ప్రజల్లోకి అంతగా చొచ్చుకు వెళ్లలేదు. ఉదాహరణకు యూపీఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి ‘నిబంధనలు లేని ( నో ఫ్రీల్స్)’ బ్యాంకు ఖాతాల కార్యక్రమం చేపట్టినా దానికి అటు ప్రభుత్వమూ అంత ప్రాధాన్యం ఇవ్వలేదు, ప్రజలూ పెద్దగా పట్టించుకోలేదు.
పీఎంజేడీవై ప్రధాన లక్ష్యం ఇంతవరకు బ్యాంకింగ్ సదుపాయాన్ని వినియోగించుకోని ప్రజలకు ప్రాథమిక పొదుపు ఖాతా సౌకర్యాన్ని కల్పించడం. ఇందులో వారు ఎటువంటి కనీస మొత్తాన్ని ఉంచనవసరం లేదు. మామూలు ఖాతాల మాదిరిగానే ఇందులో ఉన్న డబ్బులపై బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి. జన్ ధన్ ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డులు ఇస్తారు. ఈ డెబిట్ కార్డులతో పాటు వారికి లక్ష రూపాయలు ప్రమాద బీమా రక్షణ ఉంటుంది. 2018 ఆగస్టు 28 తరువాత ప్రారంభించిన జన్ ధన్ ఖాతాలకు ఈ బీమా రక్షణను రెండు లక్షల రూపాయలకు పెంచారు. అర్హులైన జన్ ధన్ ఖాతాదారులు పదివేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. జన్ ధన్ ఖాతాలు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ముద్ర పథకాలకు కూడా అర్హత కలిగి ఉంటాయి.
పథకం పురోగతి
2024 ఆగస్టు 14 నాటికి జన్ ధన్ ఖాతాల సంఖ్య 53.13 కోట్లు. ఇందులో 35.37 కోట్లు గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లోనూ, 17.76 కోట్లు పట్టణ ప్రాంతాల్లోనూ ఉన్నాయి. వీటిలో మొత్తం రూ.2,31,235.97 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. జన్ ధన్ ఖాతాల్లో సగానికి పైగా అంటే 29.56 కోట్లు మహిళల పేరిట ఉన్నాయి. జన్ ధన్ ఖాతాదారులకు 36.14 కోట్ల రూపే డెబిట్ కార్డులను జారీ చేశారు. జనధన్ ఖాతాల్లో అత్యధిక భాగం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 49.42 కోట్ల ఖాతాలు (ఆగస్టు 14 నాటికి) ఉండగా తర్వాతి స్థానంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (9.89 కోట్ల ఖాతాలు), ప్రైవేట్ రంగ బ్యాంకులు (1.64 కోట్ల ఖాతాలు), గ్రామీణ సహకార బ్యాంకులు (0.19 కోట్ల ఖాతాలు) ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధిక సంఖ్యలో జన్ ధన్ ఖాతాలు ఉత్తరప్రదేశ్ లో ప్రారంభించారు. దేశంలో కెల్లా జనాభాలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో 9.45 కోట్ల పీఎంజేడీవై ఖాతాలు ఉన్నాయి. అత్యంత తక్కువగా (9,256) లక్షద్వీప్ లో ఈ ఖాతాలు ఉన్నాయి. యూపీ కాక కోటికి పైగా పీఎంజేడీవై బ్యాంకు ఖాతాలు ఉన్న రాష్ట్రాలు 15 ఉన్నాయి. ఇవి బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, అస్సాం, ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్, గుజరాత్, ఛత్తీస్ గడ్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, హర్యానా.
జన్ ధన్ ప్రభావం
పీఎంజేడీవై పథకం ప్రభుత్వం రూపొందించిన ‘జామ్ త్రయం’ ఆధారిత కార్యక్రమంలో భాగం. జామ్ అంటే జన్ ధన్ ఖాతా, ఆధార్, మొబైల్ నెంబర్. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన దేశ ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో మొదటిది 50 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించడంతో బ్యాంకింగ్ సర్వీసులకు డిమాండ్ గణనీయంగా పెరిగి వాణిజ్య బ్యాంకులు ఇటీవల కాలంలో తమ మౌలిక సదుపాయాలను విస్తరించాయి. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు తమ శాఖలను 2013లో 1,05,992 నుంచి 2023 నాటికి 1,54,983 కు అంటే 46 శాతం పెంచాయి. మొత్తం 1.54 లక్షల శాఖల్లో 35 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనూ, 25 శాతం పాక్షిక పట్టణ ప్రాంతాల్లోనూ, 18 శాతం పట్టణ ప్రాంతాల్లోనూ, 19 శాతం మెట్రోపాలిటన్ ప్రాంతాల్లోనూ ఉన్నాయి. అలాగే ఏటీఎం యంత్రాల సంఖ్య కూడా 2014-2024 మధ్య 30 శాతం పెరిగింది. 2014లో 1,66,894 గా ఉన్న ఏటీఎంల సంఖ్య ఇప్పుడు 2,16,914 కు పెరిగింది. పాయింట్స్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాల సంఖ్య (డెబిట్, క్రెడిట్ కార్డులు వాడే సాధనాలు) గత పదేళ్ళలో 10.8 లక్షల నుంచి 89.67 లక్షలకు పెరిగింది.
మరొక పర్యవసానం ఏమిటంటే యూపీఐ వంటి చెల్లింపు సాధనాల ప్రవేశం బ్యాంకింగ్ లావాదేవీలను సులభతరం చేసింది. జన్ ధన్ యోజనను ప్రారంభించిన రెండేళ్లకు యూపీఐని ప్రారంభించారు. ‘కరెన్సీ, ఆర్థిక పరిస్థితి’పై 2024 జూన్ 29న విడుదల చేసిన తన నివేదికలో రిజర్వ్ బ్యాంకు ఇలా పేర్కొంది. “2014లో ప్రధానమంత్రి జనధన్ యోజన ప్రారంభంతో ఆర్థిక సమ్మిళితత్వ సాధన దిశలో భారత్ పయనం ఊపందుకుంది. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞాన విప్లవం బ్యాంక్ ఖాతాలను గతంలో మాదిరిగా డబ్బులు డిపాజిట్ చేయడం లేదా జమ చేయడానికి మాత్రమే పరిమితం చేయకుండా చెల్లింపుల వారధిగా కూడా ఉపయోగించడానికి విస్తరించింది. ప్రపంచ బ్యాంకు డేటాబేస్ ప్రకారం భారతదేశంలోని వయోజనుల్లో 78 శాతం మంది, అంటే 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు గలవారు 2021 నాటికి బ్యాంకు ఖాతాను కలిగి ఉన్నారు. వీరి శాతం 2014 నాటికి 53 మాత్రమే”.
మూడవది, జన్ ధన్ ఖాతాలు ప్రభుత్వ ప్రత్యక్ష నగదు బదిలీ విధానానికి మూలస్తంభంగా మారాయి. పేదలకు వేగంగా ప్రయోజనాలను అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. మరోవైపు జామ్ త్రయం అనర్హులను, నకిలీ లబ్ధిదారులను తొలగించి సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయడంలో కీలక పాత్ర వహిస్తోంది. నిజానికి ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), ఇతర పాలనా సంస్కరణ ఫలితంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం, పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ పథకాల అమలులో 2023 మార్చి వరకు రూ.3.48 లక్షల కోట్లు ఆదా అయినట్టు ‘కరెన్సీ, ఆర్థిక పరిస్థితి’పై ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
హరికిషన్ శర్మ

