సమాజ ప్రయోజనాలే పరమావధి
ఈ సెప్టెంబర్ 25న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి పురస్కరించుకొని సుధాకర్ రాజే సంపాదకత్వంలో వెలువడిన ‘పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ-ఒక జీవన చిత్రం’ గ్రంథం నుండి సేకరించిన కొన్ని ముఖ్యమైన భాగాలు జనసందేశ్ పాఠకుల కోసం
సంపద-ధర్మం: పేదరికమే కాదు, అవసరానికి మించిన సంపద కూడా ధర్మ విస్మరణకు దారి తీస్తుంది. ఇది మన దేశ విశిష్ట దృక్పథం. వస్తు సంపద లేదా దాని ద్వారా కలిగే ఆనందాలకు, సుఖాలకు మనుషులు బానిసలు కావడం వల్ల ఎదురయ్యే నష్టాలను పశ్చిమ దేశాల వారు ఊహించలేదు. వస్తు సంపద లేనప్పుడు దాని కోసం తపిస్తారు, అది ఎక్కువైనప్పుడు సత్యసంధత, ధర్మాలను మరిచిపోతారు. వస్తు సంపద ద్వారా కలిగే సుఖాలకు అవధులంటూ ఉండవు కనుక వాటికి అలవాటు పడిన వ్యక్తి వాటికి దాసోహమై పోతాడు. ఎంతటి సంపదను కూడబెట్టినా తృప్తి అంటూ ఉండదు. పైగా ఈ సంపద ఇచ్చే సుఖాలకు బానిసై సంపదను సృష్టించే శక్తిని కోల్పోతాడు.
స్వదేశీ-వికేంద్రీకరణ: ”స్వదేశీ”, ”వికేంద్రీకరణ” అనేవి ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశానికి అవసరమైన ఆర్థిక విధానాన్ని నిర్దేశించే రెండు పదాలు. తెలిసో తెలియకో ఇన్నేళ్ళుగా కేంద్రీకరణ, గుత్తాధిపత్యాలు రాజ్యమేలాయి. భారీ కేంద్రీకరణ ద్వారానే మెరుగైన ఆర్థిక వృద్ధి సాధించగలమనే ఒక అభిప్రాయంతో ప్రణాళికాకర్తలు దుష్ఫలితాలను కూడా పట్టించుకోకుండా ఆ విధానాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. అది మంచిది కాదని తెలిసీ మరో ప్రత్యామ్నాయం లేదని కూడా వారు కేంద్రీకృత విధానాలను కొనసాగించి ఉండొచ్చు. స్వదేశీ భావన కాలం చెల్లినదిగా, ప్రగతి నిరోధకంగా ఎగతాళికి గురైంది. ఆలోచనలలో, యాజమాన్యంలో, పెట్టుబడుల్లో, ఉత్పత్తి విధానాల్లో, సాంకేతిక పరిజ్ఞానం వగైరాల్లో, చివరికి వినియోగ ప్రమాణాలు, విధానాల్లో కూడా విదేశీ సహాయాన్ని ఉపయోగిస్తున్నాం. ఇది అభివృద్ధికి మార్గం కానేకాదు. మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోయి మరోసారి బానిసలం అవుతాం. స్వదేశీ భావనలోని సకారాత్మక కోణాన్ని దేశ ఆర్థిక పునర్నిర్మాణానికి పునాదిరాయిగా వాడుకోవాలి.
పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలపై ఆధారపడటం: విలువలు, జీవన విధానాలలో మాత్రమే కాకుండా స్థలం, కాలాలకు సంబంధించిన భిన్నత్వం కారణంగా మన ఆర్థికాబివృద్ధి పాశ్చాత్యులకు భిన్నంగా ఉండాలి. కానీ మనం మార్షల్ (అమెరికా ఆర్థిక మంత్రి)కు, కార్ల్ మార్క్స్‌లతో మనల్ని మనం ముడిపెట్టుకున్నాం. వారి ఆర్థిక సూత్రాలు మనకు శిలాశాసనాలు. అవి కొన్ని నిర్దిష్ట పరిస్థితుల ఆధారంగా పనిచేస్తాయని తెలిసిన వారు కూడా ఆ ఆర్థిక సిద్ధాంతాల చట్రం నుంచి బయటకు రాలేకపోతున్నారు. పాశ్చాత్య దేశాల అభివృద్ధి, సంపదను చూసి మనం గుడ్డిగా వారి ఉత్పత్తి విధానాలను అనుసరిస్తున్నాం. పాశ్చాత్య ఆర్థిక శాస్త్రవేత్తలు సృష్టించిన సాహిత్యంలో మనం పూర్తిగా మునిగిపోయి బయటికి రాలేకపోతున్నాం. వారి సిద్ధాంతాలలో స్థలం, కాలం, వ్యవస్థలకు అతీతమైన, సార్వజనీనమైనవి కొన్ని ఉంటే ఉండొచ్చు. కానీ వాటిని నిగ్గు తెల్చేవారు చాలా అరుదు. మన విద్యా వ్యవస్థ అటువంటి సామర్థ్యం గలవారిని సృష్టించలేదు. మన ఆర్థికవేత్తలు పాశ్చాత్య ఆర్థికశాస్త్రంలో నిపుణులైతే కావచ్చు గాని భారతీయ ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ గురించి లోతైన అవగాహన లేకపోవడం వల్ల దేశ ఆర్తిక పరిస్థితులకు సంబంధించి వారు సాధించింది ఏమీలేదు.
ఏ హక్కూ శాశ్వతం కాదు: ఆస్తి హక్కైనా, ఇతర వస్తువులకు సంబంధించిన హక్కైనా ఏ ప్రాథమిక హక్కూ శాశ్వతం కాదు. అన్ని హక్కులూ సమాజ ప్రయోజనాలకు లోబడి ఉండవలసిందే. నిజానికి వ్యక్తి తన సామాజిక బాధ్యతలను నిర్వర్తించేదుకే అతనికి ఆ హక్కులు కల్పించబడ్డాయి. సమాజాన్ని కాపాడేందుకు సైనికుడికి ఆయుధాలు ఇస్తాం. అతను ఆ బాధ్యతను నిర్వర్తించకపోతే ఆయుధాలు ధరించే హక్కును కోల్పోతాడు. అదేవిధంగా వ్యక్తి సమాజం పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకే అతనికి ఆస్తిహక్కు కల్పించబడింది. ఇదే స్ఫూర్తితో హక్కులను ఎప్పటికప్పుడు నిర్వహించి, సవరించడం అవసరం. ఆస్తిహక్కు సమాజానికి అతీతమైనది కాదు.
యాజమాన్య హక్కు: నిజానికి యాజమాన్య హక్కు అంటే ఒక వస్తువును కొన్ని నిర్దిష్ట పరిమితుల్లో, నిర్దిష్ట ప్రయోజనానికి వాడే హక్కు. ఈ హక్కులు కూడా కాలంతో పాటు మారుతుంటాయి. వ్యక్తి హక్కులు, సమాజపు హక్కుల మధ్య వైరుధ్యం గురించి మనం మాట్లాడటం లేదు. మన దృష్టిలో సమాజం అంటే రాజ్యం ఒక్కటే కాదు. వ్యక్తి, కుటుంబం, సమూహం, రాజ్యం… ఇవన్నీ సమాజానికి ప్రతిరూపాలే. వ్యక్తిలో సామాజిక భావనను పాదుకొల్పడానికి ఈ దేశంలో మనం ఉపయోగించే వ్యవస్థ ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబంలో ప్రతి వ్యక్తికీ సంపాదించే హక్కు ఉంటుంది, కానీ యాజమాన్య హక్కు కుటుంబం అంతటికీ ఉంటుంది. సంపద కుటుంబంలోని అందరి కోసం ఉపయోగించ బడుతుంది. ఈ ఉమ్మడి యాజమాన్య భావన (ట్రస్టీషిప్)నే గాంధీజీ, గురూజీ, ఇతర భారతీయ చింతనాపరులు ప్రబోధించారు.
కార్మికులకు యాజమాన్య హక్కు: ఒక కంపెనీ లాభాల్లో వాటా తీసుకోవడం తప్ప దాని కార్యకలాపాలతో ఎటువంటి ప్రమేయం లేని వాళ్ళు జాయింట్ స్టాక్ కంపెనీల్లో పెత్తనం చేయడం, రోజూ ఆ కంపెనీ యంత్రాలు నడిపి, వస్తువులను ఉత్పత్తి చేసే కార్మికులు పరాయివారుగా మిగిలిపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. ఇది సముచితం కాదు. కనుక కార్మికులకు కూడా వాటాదారులతో పాటు సంస్థలో యాజమాన్య హక్కులు, దాని నిర్వహణలో, లాభాల్లో భాగస్వామ్యం కల్పించాలి.
ఆహార హక్కు: ఈ మధ్య మనం తరచుగా వింటున్న నినాదం ‘ప్రతి ఒక్కరూ తమ ఆహారం తాము సంపాదించుకోవాలి’. మామూలుగా ఇది కమ్యూనిస్టుల నినాదమే అయినా పెట్టుబడిదారులు కూడా దీనితో పెద్దగా విభేదించరు. వారి మధ్య భిన్నాభిప్రాయం ఏదైనా ఉంటే ఎవరు సంపాదించాలి, ఎంత సంపాదించాలి అన్నదానిపైనే. పెట్టుబడి, వ్యాపార నైపుణ్యం ఉత్పత్తిలో కీలకపాత్ర వహిస్తాయని, అందువల్ల లాభాల్లో అధికవాటా తమ హక్కని పెట్టుబడిదారులు భావిస్తారు. మరోవైపు ఉత్పత్తిలో ప్రధాన పాత్ర శ్రామికులదే అని కమ్యూనిస్టులు వాదిస్తారు. అందువల్ల ఉత్పత్తిలో ప్రధాన వాటా కార్మికులకే చెందాలని వారంటారు. ఈ అభిప్రాయాలూ తప్పే. కచ్చితంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికీ ఆహారం అనేది మన నినాదం. ఆహారం జన్మహక్కు. సంపాదించే సామర్థ్యం విద్య, శిక్షణల మీద ఆధారపడి ఉంటుంది. ఏమీ సంపాదించలేని వాళ్ళు ఉండే సమాజంలో కూడా అందరికీ తిండి కావాలి. పిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్థులు, వికలాంగులు వీరందరి అవసరాలనూ సమాజం తీర్చాలి. సాధారణంగా ప్రతి సమాజం ఈ బాధ్యత నిర్వర్తిస్తుంది. ఈ బాధ్యతను నిర్వర్తించడానికి సమాజం ఎంతవరకు సిద్ధంగా ఉందన్నదానిపైనే మానవాళి సామాజిక, సాంస్కృతిక పురోగతి ఆధారపడి ఉంటుంది.
ఆర్థిక ప్రజాస్వామ్యం: ప్రతి ఒక్కరికి ఓటుహక్కు ఎలాగయితే రాజకీయ ప్రజాస్వామ్యానికి గీటురాయో ప్రతి ఒక్కరికీ పని ఆర్థిక ప్రజాస్వామ్యానికి గీటురాయి. ఈ పని హక్కు అనేది కమ్యూనిస్టు దేశాల్లో మాదిరిగా బానిస పనిలా ఉండకూడదు. పని అనేది ఒక మనిషికి జీవనోపాధి కల్పించడమే కాదు, ఎంపిక హక్కును కూడా ఇవ్వాలి. ఆ పని చేసినందుకు జాతీయాదాయంలో ఆ వ్యక్తికీ వాటా లభించకపొతే అతన్ని నిరుద్యోగిగానే పరిగణించాలి. ఈ పరిస్థితి రాకుండా కనీస వేతనం, న్యాయమైన పంపిణీ వ్యవస్థ, సామాజిక భద్రత అవసరం.

