దారితప్పిన తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు
అధికారంలోకి వస్తే సర్పంచులు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తదితరులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇస్తూ వచ్చారు. తీరా గెలిచాక ఆ విషయయమే మరిచిపోయారు. సర్పంచులు పదవీ బాధ్యతలు చేపట్టి 5 నెలలు గడుస్తున్నా ఇంకా వారికి జీతాలు అందకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. డిసెంబర్ 22న 2025 నాడు పదవీ బాధ్యతలు స్వీకరించిన 12,762 గ్రామ పంచాయితీల సర్పంచులకు ఒక్కొక్కరికి రూ.32,500 చొప్పున రూ.41.28 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. అలాగే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కూడా రెండు నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 62వేల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఒకటో తేదీనే జీతాలు అని చెప్పి మొత్తానికే జీతాలు ఇవ్వకపోవడం అన్యాయమని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే తమ జీతాలు చెల్లించాలని బాధిత ఉద్యోగులు కోరుతున్నారు.
రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో పడుతున్నాయి. అన్ని శాఖల హెచ్‌వోడీలు ఆయా శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, దినసరి వేతనాలు పొందే అన్ని విభాగాల సిబ్బందికి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఐఎఫ్‌ఎంఎస్) ద్వారా వివరాలు తీసుకొని ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని ఆర్థికశాఖ నుంచి ఆదేశాలు వెలువడినా కేత్రస్థాయిలో అమలుకు నోచడం లేదు. దారితప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులకు ఇవి అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంచనాలను అందుకోలేకపోయింది. ఆదాయం అంచనాల కంటే తక్కువగా నమోదైంది. రెవెన్యూ మిగులుకు బదులుగా భారీస్థాయిలో లోటు ఏర్పడింది. రోజువారీ ఖర్చుల కోసం కూడా అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత ఏడాదికి రూ.54,009.74 కోట్ల అప్పులు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఏకంగా రూ.77,762.35 కోట్లు అప్పు తెచ్చింది. అంటే 143.98 శాతం అదనంగా అప్పులు చేసింది. బడ్జెట్‌లో రూ.2.84 లక్షల కోట్ల రాబడి వస్తుందని అంచనా వేయగా, రూ.2.6 లక్షల కోట్లు మాత్రమే సమకూరింది. ఇందులో సింహభాగం అంటే రూ.77,762 కోట్లు.. అప్పులు, ఇతర రుణ బాధ్యతల ద్వారానే రావడం గమనార్హం. బడ్జెట్‌లో రూ.2,738 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని ఆశించగా, చివరకు రూ.9,235 కోట్ల రెవెన్యూ లోటుతో ఏడాది ముగిసింది. ద్రవ్యలోటు రూ.77,762 కోట్లకు చేరగా, దీనిని అప్పుల ద్వారా ప్రభుత్వం సర్దుబాటు చేసింది.
ఇక ప్రాథమిక లోటు అంచనా వేసిన రూ.34,640 కోట్ల కంటే 138.80 శాతం పెరిగి రూ.48,082 కోట్లుగా నమోదైంది. ఈ విషయాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. కాగ్ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణారాహిత్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. బడ్జెట్ అంచనాలు వేరు, వాస్తవ గణాంకాలు వేరు అన్నట్టుగా ఆర్థిక పరిస్థితి తయారైంది. ఆదాయం రాక, అప్పులు ఆగక రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆ నివేదిక స్పష్టం చేస్తున్నది. రాష్ట్ర రెవెన్యూ రాబడులు రూ.1.81 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. ఇది బడ్జెట్ అంచనా అయిన రూ.2.29 లక్షల కోట్ల కంటే రూ.38,000 కోట్లు తక్కువ. మరోవైపు, అప్పులు, ఇతర రుణాల రూపంలో వచ్చే మూలధన రాబడులు అంచనా వేసిన రూ.55,116 కోట్ల కంటే గణనీయంగా పెరిగి రూ.78,197 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో కేవలం అప్పులే రూ.77,762 కోట్లు కావడం గమనార్హం.
పన్నుల ఆదాయంలోనూ రాష్ట్రం వెనుకబడింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.21,080 కోట్లు (అంచనాల్లో 99.46%) అందినప్పటికీ, మిగిలిన మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం నిరాశపరిచింది. జీఎస్టీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్ను వంటి కీలక వనరుల ద్వారా వచ్చిన రాబడి ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 90 శాతం కంటే తకువగానే నమోదైంది. రాష్ట్ర పన్నుల ఆదాయం రూ.1.52 లక్షల కోట్లుగా నమోదైంది. ఇందులో జీఎస్టీ ద్వారా రూ.52,375 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.15,251 కోట్లు, ఎక్సైజ్‌శాఖ ద్వారా రూ. 23,359 కోట్లు సమకూరాయి. వ్యయాల విషయానికి వస్తే, మార్చి చివరి నాటికి వడ్డీ చెల్లింపులు రూ.29,679 కోట్లకు చేరాయి. పెన్షన్ల ఖర్చు కూడా అంచనా వేసిన రూ.13,109 కోట్ల కంటే 147 శాతం పెరిగి రూ.19,371 కోట్లుగా నమోదైంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల కోసం రూ.47,400 కోట్లు ఖర్చు చేశారు, ఇది అంచనా కంటే 6 శాతం ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఐదు విడతల కరువు భత్యం చెల్లించాల్సి ఉంది. మూలధన వ్యయం రూ.52,905 కోట్లకు పెరిగినప్పటికీ, తగినంత ఆదాయం పెరగకుండా చేసే అప్పులు దీర్ఘకాలంలో భారం అవుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ హామీలు, పబ్లిక్ అకౌంట్ అప్పులకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించలేదని కాగ్ నివేదికలో పేర్కొన్నారు. బడ్జెట్ వెలుపల చేసిన అప్పుల వివరాలను ప్రభుత్వం దాచిపెట్టే అవకాశం ఉన్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్‌లో ఆదాయాన్ని ఎక్కువగా అంచనా వేయడం, ఖర్చులను తక్కువగా చూపడం వల్ల తెలంగాణ ఆర్థిక స్థితి ప్రస్తుతం అప్పుల ఊబిలోకి వెళ్తున్నదని హెచ్చరిస్తున్నారు.
ప్రవీణ్

