Government Employees

యూపీఎస్ తో ద్రవ్య స్థిరత్వం, ఉద్యోగులకు భరోసా

దేశంలో అమల్లో ఉన్న వివిధ రకాల పెన్షన్ పథకాలను సమీకృతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ పథకాన్ని (యూపీఎస్) ప్రకటించింది. దీర్ఘకాలిక ద్రవ్య స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే దేశవ్యాప్తంగా రిటైర్ అయిన ఉద్యోగులకు రక్షణ కల్పిస్తూ వ్యవస్థను సంస్కరించాలనే ప్రధానమంత్రి అచంచలమైన నిబద్ధతకు ఈ పథకం నిదర్శనం. పాత పెన్షన్ విధానం ఆర్థికంగా మోయలేని భారం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది ఒక అప్పుల ఊబి అని, దేశ ద్రవ్య స్థిరత్వానికి పెనుముప్పు అని స్పష్టమైంది. దీనివల్ల పెన్షన్ భారం పెరిగి ప్రభుత్వ ఆదాయంలో అత్యధిక భాగం వాటికే ఖర్చయింది. దాని ఫలితంగా దేశ దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడింది. అటువంటి పరిస్థితుల్లో 2004లో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వం జాతీయ పెన్షన్ పథకం (ఎన్పీఎస్) ను ప్రవేశపెట్టింది. ఇది ఉద్యోగులు, ప్రభుత్వం ఇద్దరూ వాటాలు సమకూర్చే ఒక పకడ్బందీ పెన్షన్ పథకం. ఉద్యోగులు మౌలిక వేతనం, కరవు భత్యంలో 10 శాతాన్ని, ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని పెన్షన్ నిధికి సమకూరుస్తారు. ఈ మొత్తాన్ని వివిధ రకాల మార్కెట్ ఆధారిత ఆర్థిక సాధనాలలో పెట్టుబడిగా పెడతారు. దానిపై వచ్చే ఆదాయం పెన్షన్ మొత్తాన్ని నిర్ధారిస్తుంది. ఈ వ్యవస్థ అత్యంత అవసరమైన ద్రవ్య క్రమశిక్షణను తీసుకువచ్చి ప్రభుత్వంపై పెన్షన్ భారాన్ని తగ్గించినప్పటికీ దీనివల్ల రిటైర్ అయిన ఉద్యోగుల్లో ఒక అనిశ్చితి కూడా ఏర్పడింది. వారికి ఎంత పెన్షన్ వస్తుంది అనేది ఎన్పీఎస్ నిధులను పెట్టుబడి పెట్టిన మార్కెట్ సాధనాల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మార్కెట్లలో ఊపు తగ్గినప్పుడు రిటైర్ అయిన వారికి తక్కువ మొత్తం లభించింది. దీనివల్ల రిటైర్ అయిన ఉద్యోగులలో ఆర్థిక భద్రతపై ఆందోళన నెలకొంది. అంతేగాక ఎన్పీఎస్ రాజకీయ నాయకుల అక్రమాలకు కూడా వేదిక అయింది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు దీన్ని కూడా తమ అవినీతికి వాడుకున్నారు. మొదట కాంగ్రెస్ ను ఎన్పీఎస్ ఒక అవసరమైన, ఆర్థికంగా తెలివైన పథకంగా ప్రశంసించింది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరింత స్థిరమైన పెన్షన్ విధానాన్ని ఆమోదించారు. అయితే రాజకీయంగా పరిస్థితి తమకు ప్రతికూలంగా మారినప్పుడు కాంగ్రెస్ ఎన్పీఎస్ మౌలిక సూత్రాలను గాలికి వదిలేసింది. విధానంలో ఈ అస్థిరత ఎన్పీఎస్ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన యూపీఎస్ పాత పెన్షన్ విధానం (ఓపీఎస్), ఎన్పీఎస్ లలోని లోపాలను సరిదిద్దుతూ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి హామీ కల్పిస్తుంది. యూపీఎస్ కింద రిటైర్ అయిన ఉద్యోగులు తాము చివరగా తీసుకున్న జీతం, డిఏలో 50 శాతానికి తక్కువ కాకుండా ఓపీఎస్ లో మాదిరిగానే పెన్షన్ పొందుతారు. అయితే ఓపీఎస్ కు భిన్నంగా యూపీఎస్ లో ఎన్పీఎస్ లోని ప్రధాన అంశాలైన ఉద్యోగుల వాటా, ప్రభుత్వం వాటాలు కూడా భాగంగా ఉంటాయి. ఎన్పీఎస్ లో మాదిరిగానే ఉద్యోగులు తమ మౌలిక వేతనం, డీఏలో 10 శాతాన్ని పెన్షన్ నిధికి జమ చేయాలి. అంటే పెన్షన్ భారంలో వారు కూడా కొంత భరించాల్సి ఉంటుంది.

యూపీఎస్ లో మరొక వినూత్నమైన అంశం కూడా ఉంది. రిటైర్ అయిన ఉద్యోగులు తమ నెలవారీ జీతభత్యాలలో పదవ వంతును ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు కలిపి ఏక మొత్తంలో పొందుతారు. ఇది వారికి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుంది. ఈ అంశం ఓపీఎస్ లో లేదు. అంతేగాక యూపీఎస్ లో ద్రవ్యోల్బణ సూచి కూడా ఉంటుంది. అంటే డీఏ సవరింపులకు అనుగుణంగా పెన్షన్లు పెరుగుతాయి. దీనివల్ల ద్రవ్యోల్బణం నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు రక్షణ లభిస్తుంది. ఇది ఎన్పీఎస్ లో లేని మరొక కొత్త వెసులుబాటు. యూపీఎస్ లో నెలకు కనీసం రూ.10,000 పెన్షన్ సదుపాయం కల్పించారు. వారి సర్వీస్ తో సంబంధం లేకుండా రిటైర్ అయిన ఉద్యోగులందరూ గౌరవప్రదమైన పెన్షన్ పొందేందుకు ఈ నిబంధన చేర్చారు. ఎన్పీఎస్ లో సభ్యులైన వారు తమకు కనీస పెన్షన్ రాదని వ్యక్తం చేసిన ఆందోళన దృష్ట్యా ఈ చర్య తీసుకున్నారు. కనీస పెన్షన్ లేకపోవడంతో ఎన్పీఎస్ లో సభ్యులైన వారు చాలా ఇబ్బందులు పడ్డారు. కొత్త విధానంలో ఉదాహరణకు ఒక ప్రభుత్వ ఉద్యోగి 10 ఏళ్ల సర్వీసు తర్వాత రిటైర్ అయితే అతనికి లేదా ఆమెకు కనీసం రూ.10,000 పెన్షన్ లభిస్తుంది. వారికి ఇది ఆర్థిక భద్రత కల్పిస్తుంది. సర్వీస్ లో ఉండగా మరణిస్తే కుటుంబ పెన్షన్ యూపీఎస్ కింద పెన్షన్ మొత్తంలో 30 శాతంగా నిర్ణయిస్తారు. మరణించిన ఉద్యోగి కుటుంబానికి ఇది ఆర్థిక భరోసా ఇస్తుంది. ఎన్పీఎస్ లో ఈ సదుపాయం లేదు. అందులో కుటుంబ పెన్షన్ లెక్కించే విధానం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. చాలా తక్కువ కుటుంబ పెన్షన్ వస్తుంది.

భారత్ ఆర్థిక వాతావరణం, దేశం ముందు ఉన్న సవాళ్లను పరిగణలోనికి తీసుకుని ఎన్డీయే ప్రభుత్వం యూపీఎస్ ను రూపొందించింది. తాత్కాలిక ప్రయోజనాలను ఇచ్చే జనాకర్షక పథకాలనుగాక దీర్ఘకాలిక సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చే మోదీ నాయకత్వానికి ఇది నిదర్శనం. యూపీఎస్ వంటి ఒక విధానాన్ని రూపొందించడం వెనుక ఉన్న దూరదృష్టిని, ధైర్యాన్ని అభినందించకుండా ఉండలేం. భారతదేశ ఆర్థిక సామాజిక భద్రత వ్యవస్థను సమూలంగా మార్చి అది అందరికీ మేలు చేసే విధంగా, స్థితిస్థాపకంగా (మార్పులకు అనువైనదిగా) ఉండేటట్లు చూడాలన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ సంకల్పం యూపీఎస్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పాత పెన్షన్ వ్యవస్థలలోని మేలైన అంశాలను గుదిగుచ్చి దేశంలోని రిటైర్ అయిన ఉద్యోగులు గౌరవప్రదంగా ఆర్థిక భద్రతతో జీవించేటట్లు చూడడానికి రూపొందించిన పథకం. ఓపీఎస్, ఎన్పీఎస్ ల వల్ల ఎదురయ్యే సవాళ్లకు సమాధానంగా ఎంతో ఆలోచించి రూపొందించిన యూపీఎస్ ను అన్ని భాగస్వామ్య పక్షాలు సమర్థించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పెన్షన్ పథకమే కాదు, భారతదేశ ఆర్థిక భద్రతకు దోహదం చేసే ఒక ఆత్మవిశ్వాసంతో కూడిన ముందడుగు. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ఒక పరివర్తనాత్మక నిర్ణయంగా యూపీఎస్ ముందు తరాల స్మృతిలో నిలుస్తుంది.

హితేష్ జైన్,
ముంబై బిజెపి ఉపాధ్యక్షుడు

Tags: