అసమానతల తగ్గింపు దిశగా ముందడుగు ‘జన్ ధన్’
ఆర్థిక అసమానతలను తగ్గించడానికి, సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజల జీవనోపాధులను మెరుగుపరిచేందుకు, వృద్ధిని ప్రేరేపించడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ఉపయోగించే కీలకమైన సాధనం ఆర్థిక సమ్మిళితత్వం (ఫైనాన్షియల్ ఇంక్లూజన్). ఆర్థిక వృద్ధిలో మరింత ఎక్కువ మంది ప్రజలను భాగస్వాములను చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2014 ఆగస్టు 28న దేశంలో బ్యాంకు వసతి లేని వారందరికీ దశలవారీగా బ్యాంకింగ్ సదుపాయం కల్పించేందుకు ‘ప్రధానమంత్రి జనధన్ యోజన’ను ప్రకటించింది. ఇది ఒక సామూహిక ఆర్థిక సమ్మిళితత్వ పథకం. ఒక గడువు లోపల దేశంలోని ప్రజలందరికీ బ్యాంకింగ్ సదుపాయం కల్పించడం దీని ఉద్దేశం. అప్పటికి బ్యాంకు ఖాతాలు లేని ఏడున్నర కోట్ల కుటుంబాలకు రెండు దశల్లో బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈనాడు దేశంలోని వయోజనుల్లో 80 శాతం మంది అధికారిక ఆర్థిక ఖాతాలను కలిగి ఉన్నారు. ఇది 2011లో 50 శాతం మాత్రమే. అంతర్జాతీయంగా చూసినా ఆర్థిక సమ్మిళితత్వాన్ని సాధించడంలో భారతదేశం అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.
గతంలో బ్యాంకు ఖాతాలను ప్రారంభించడంలో కుటుంబాలను ప్రాతిపదికగా తీసుకునేవారు. కానీ ఈ పథకం వ్యక్తులపై దృష్టి సారించిన కారణంగా బ్యాంకు ఖాతాల విషయంలో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పటివరకు బ్యాంకులు 53 కోట్ల పీఎంజేడీవై ఖాతాలను ప్రారంభించగా వాటిలో రూ.2.31 లక్షల కోట్ల నిల్వలు ఉన్నాయి. దీనికి భిన్నంగా 2015 మార్చిలో 14.7 కోట్ల ఖాతాల్లో కేవలం రూ.15,670 కోట్ల డిపాజిట్లు మాత్రమే ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు చోదక శక్తిగా వ్యవహరించాయి. మొత్తం జనధన్ ఖాతాల్లో 78 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఉన్నాయి. పీఎంజేడీవై ఖాతాల్లో సగటు నిల్వ 2015 మార్చిలో రూ.1,065 ఉండగా 2024 ఆగస్టులో రూ.4,352 ఉంది.
పీఎంజేడీవై సమాచారాన్ని విపులంగా పరిశీలిస్తే 81.2 ఖాతాలు క్రియాశీలకంగా ఉన్నాయి. మొత్తం ఖాతాల్లో 55.6 శాతం మహిళలకు చెందినవి, 66.6 శాతం గ్రామాల్లో, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. యూపీలో అత్యధిక సంఖ్యలో 9.4 కోట్ల పీఎంజేడీవై ఖాతాలు ప్రారంభం కాగా 6 కోట్ల ఖాతాలతో బీహార్ రెండవ స్థానంలో ఉంది. జన్ ధన్ ఖాతాల్లో బీమా సదుపాయం, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం, పొదుపునకు ప్రోత్సాహం వంటి సానుకూల అంశాలతో పాటు అవి సమాజంపై కూడా ప్రభావాన్ని చూపాయి. యూపీ, మహారాష్ట్ర, హరియాణాలలో నిర్వహించిన పరిశోధనలు ఇవి స్థూలంగా ఖాతాదారుల ఆర్థిక ప్రగతిపై క్రమంగా సానుకూల ప్రభావం చూపినట్లు, దొంగతనాలు తగ్గినట్లు వెల్లడైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళల్లో మొదటి నుంచి జన్ ధన్ ఖాతాల సానుకూల ప్రభావం కనిపించింది. గుజరాత్, కర్ణాటకల్లో వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇవి కాక అధ్యయనాల్లో వెల్లడైన మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే పీఎంజేడివై ఖాతాలు పెద్ద సంఖ్యలో ప్రారంభమైన రాష్ట్రాల్లో మద్యం, పొగాకు వంటి హానికర పదార్థాల వాడకం గణనీయంగా తగ్గి ప్రజల ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడ్డాయి. గత పదేళ్ళ కాలంలో ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి) ద్వారా ప్రజలకు రూ.38.49 లక్షల కోట్లు బదిలీ అయ్యాయి. దీని ఫలితంగా రూ.3.48 లక్షల కోట్ల లీకేజీల నివారణ జరిగింది. అంతేగాక జన్ ధన్ ఖాతాలు డిజిటలీకరణ, ఈ-వాణిజ్య చెల్లింపుల వ్యవస్థ విస్తృత వినియోగానికి బాటలు వేసింది.
2024 జూలై నాటికి భారత్లో ప్రపంచంలో ఎక్కడా లేనంత భారీ సంఖ్యలో 55.7 బిలియన్ (ఒక బిలియన్-వంద కోట్లు) యూపీఐ లావాదేవీలు జరిగాయి. కాగా ఆర్థిక సమ్మిళితత్వానికి అవరోధాలను తొలగించేందుకు సరఫరా-డిమాండ్ రెండు వైపుల నుంచి ప్రధానంగా తీసుకోవలసిన నాలుగు చర్యలను ప్రభుత్వం గుర్తించింది. మొదటిది, ఆర్థిక పర్యావరణానికి చోదక శక్తిగా పని చేసే వ్యవస్థలను బలోపేతం చేయాలి. ఆర్థిక సమ్మిళితత్వంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. అవసరమైన మద్దతు అందించి వ్యక్తులు, చిన్న వ్యాపారాల సామర్థ్యాన్ని పెంచాలి. అలాగే ప్రజల్లో ఆర్థిక వ్యవహారాలపై అవగాహనను పెంచి మహిళలకు కూడా సమాన భాగస్వామ్యం ఉండే ఆర్థిక సేవలను, కార్యక్రమాలను ప్రోత్సహించాలి. రెండవది, మైక్రో ఇన్సూరెన్స్, సూక్ష్మ రుణాలు వంటి ఆర్థిక ఉత్పత్తులు, సేవలు చవకైన పద్ధతిలో మరింత విస్తృతంగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి. అలా అని జన్ ధన్ ఖాతాదారులకు అత్యుత్సాహంతో రుణాలు ఇస్తే వారు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ఇటీవల భారత జాతీయ చెల్లింపుల సంస్థ (NPCI) ప్రవేశపెట్టిన యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ ఫేస్ (అప్పులకు కూడా యుపిఐ తరహా వ్యవస్థ) తరహా విప్లవాత్మకమైన మార్పును తీసుకువస్తుంది. రుణాలను తక్కువ ఖర్చుతో, వేగంగా, ఎక్కువ సంఖ్యలో పంపిణీ చేయడానికి వీలు కల్పించడం ద్వారా ఇది రుణ వితరణ ప్రక్రియను సమర్థంగా చేస్తుంది.
మూడవది, కొత్త, సంక్లిష్ట డిజిటల్ ఉత్పత్తులపై వినియోగదారుల విశ్వసనీయతను పెంపొందించేందుకు ప్రభుత్వం వినియోగదారుల రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. వినియోగదారుల రక్షణ, అదే సమయంలో కొత్త ఆవిష్కరణలకు అనువైన వాతావరణం కల్పించడం మధ్య సమతూకం పాటిస్తోంది. నాలుగవది, పీఎంజేడీవైలో చేరేవారు ఆర్థిక వ్యవస్థ గురించి పెద్దగా అవగాహన లేనివారు. వారిలో చాలా మంది ఎప్పుడో గాని ఈ ఖాతాలను ఉపయోగించరు. చాలామందికి పొదుపు చేసుకోవడానికి సరిపడనంత డబ్బు కూడా ఉండదు. మామూలు ఖాతాదారులతో పోలిస్తే వారి అవసరాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. అందువల్ల బ్యాంకులు ఖాతాదారులకు అవసరమైన ఉత్పత్తులను రూపొందించేటప్పుడు వారి జీవితాల్లోని వివిధ దశల్లో వారి అవసరాలను పరిగణనలోనికి తీసుకోవాలి. ప్రభుత్వం ఎంతో నచ్చచెప్పిన తర్వాత పీఎంజేడీవై ఖాతాదారులు అధికారిగా ఆర్థిక వ్యవస్థలో ప్రవేశించారు. సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజల ఆర్థిక సాధికారీకరణ కోసం ప్రభుత్వం ప్రస్తుతం తాను అమలు పరిచే పథకాలతో పాటు భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలను కూడా పీఎంజేడీవై ఖాతాలతో అనుసంధించేందుకు చర్యలు తీసుకుంటోంది.
సౌమ్య కాంతి ఘోష్,
16వ ఆర్థిక సంఘం సభ్యుడు

