Secretariat

సీఎంను వెంటాడుతున్న ‘వాస్తు దోషం’

దేళ్ల పాలనలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ‘వాస్తు దోషం’లో చిక్కుకుపోయారు. సచివాలయానికి కూడా రాని ముఖ్యమంత్రిగా ప్రసిద్ధికెక్కారు. అంతేకాదు అప్పట్లో ఉన్న సచివాలయం వాస్తు తనకు చిక్కులు తెచ్చిపెడుతుందన్న భయంతో ఏకంగా దానిని కూల్చివేశారు. వాస్తు ప్రకారం నూతన సచివాలయం నిర్మించారు. నూతన సచివాలయానికైనా ఆయన వస్తారననుకొంటే అదేమీ జరగలేదు. కీలకమైన సమావేశాలు అన్ని తన అధికార నివాసంలోనే జరుపుతూ ఉండేవారు. కేసీఆర్ పాలనలో మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిని సైతం అప్పట్లో కేసీఆర్ ను వెంటాడిన భయాలే వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నది. కేసీఆర్ నిర్మించిన సచివాలయం వాస్తు విషయమై పలు అనుమానాలకు గురవుతున్నారు. అందుకే తెలంగాణ సచివాలయంలో ప్రధాన గేట్లు, రోడ్లలో కీలక మార్పులు చేస్తున్నారు. అప్పుడు వాస్తు పిచ్చి అని కేసీఆర్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి  ఇప్పుడు సీఎంగా సచివాలయానికి పూటకో మార్పు చేస్తున్నారు. అసలు సిసలైన కాంగ్రెస్ మార్కు ‘మార్పు’  అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

మొదట్లో సచివాలయంలో ఎక్కువగా కనిపించే ఆయన ఇప్పుడు ఇంటికే పరిమితం అవుతున్నారు. తూర్పు వైపు ఉన్న బాహుబలి గేటుగా పిలిచే ప్రధాన గేటును పూర్తిగా మూసివేయాలని నిర్ణయించారు. ఈశాన్యం వైపు ఇప్పుడున్న గేటు పక్కన మరోగేటు నిర్మించనున్నారు. సుమారు రూ.3.20 కోట్లతో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయానికి ప్రస్తుతం నాలుగు వైపుల ప్రధాన గేట్లు ఉన్నాయి. తూర్పు వైపు లుంబినీ పార్క్ ఎదురుగా ఉన్న బాహుబలి గేటు నుంచి మాజీ సీఎం కేసీఆర్ రాకపోకలు జరిపేవారు. ఆ గేటు నుంచి సచివాలయం లోపల ప్రధాన ద్వారం వరకు రాకపోకలు కొంతకాలంగా నిలిపివేశారు. ఆ మార్గంలోనే తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు చుట్టూ లాన్, ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక తూర్పు గేటును శాశ్వతంగా మూసివేయనున్నారు. పశ్చిమాన మింట్ కాంపౌండ్ వైపున ఉన్న 3వ గేటును తక్కువగా కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. అటువైపు ఎలాంటి మార్పులు చేయడం లేదు. మెయిన్ రోడ్డు వైపు ఉండే సౌత్-ఈస్ట్ గేటు నుంచి సచివాలయం సిబ్బంది, సాధారణ ప్రజల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ అధికారులు ప్రస్తుతం ఈశాన్యం వైపు గేటును ఉపయోగిస్తున్నారు. ఆ గేటు పక్కనే మరో గేటు నిర్మించనున్నారు. ఒక గేటు నుంచి లోనికి వెళ్లి మరో గేటు నుంచి బయటకు వేళ్లేలా ప్రణాళిక చేశారు. ఈశాన్యం, ఆగ్నేయం గేట్లను కలుపుతూ ఒక రోడ్డు కూడా నిర్మిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, వాస్తు కారణంగా ఈ మార్పులు చేర్పులు అని చెప్పుకొంటున్నారు.

అధికారంలోకి వచ్చాక సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరుగుతూ ఉండటం, మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వక పోవడం, కనీసం రేవంత్ ను కలిసేందుకు కూడా ఇష్టపడక పోతూ ఉండడంతో ఆయనలో అభద్రతాభావం పెరుగుతున్నట్లు స్పష్టం అవుతుంది. అయితే తన పరిపాలన తీరు మార్చుకొనే ప్రయత్నం చేయకుండా ‘వాస్తు దోషాలు’ సరిదిద్దటం ద్వారా తన అధికారాన్ని సుస్థిరం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కృష్ణ చైతన్య