Revanth Reddy

రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం దూరం పెడుతుందా!

ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాకుండానే అన్ని వర్గాల ప్రజలలో అసంతృప్తిని రాజేస్తూ, ఎన్నికల హామీల గురించి ప్రజలు నిలదీసే పరిస్థితులు ఏర్పడడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలి కాంగ్రెస్ అధిష్టానానికి సైతం చికాకు కలిగిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీలో అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నా ఆయనను భుజాన వేసుకొని, ముఖ్యమంత్రిగా చేసిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సైతం ఇప్పుడు మొఖం చాటేస్తున్నట్లు వెల్లడవుతుంది. ఆయన పుట్టిన రోజున పార్టీ అగ్రనేతలు ఎవరూ శుభాకాంక్షలు తెలపకపోవడంతో ఈ విషయమై కాంగ్రెస్ వర్గాలలో నెలకొన్న గందరగోళాన్ని వెల్లడి చేస్తున్నది. ఉదయాన్నే ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. కానీ గాంధీ కుటుంబం నుండి ఎవరూ స్పందించలేదు. గాంధీ కుటుంబానికి నమ్మిన బంటుగా ముఖ్యమంత్రి పదవి పొందిన రేవంత్ కు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలలో ఎవరూ శుభాకాంక్షలు చెప్పకపోవడం విస్మయం కలిగిస్తోంది. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే, రేవంత్‌కు అండగా ఉంటూ వస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ సైతం శుభాకాంక్షలు తెలపలేదు. రేవంత్‌ను అధిష్టానం దూరం పెడుతుందన్న వార్తలకు ఇది మరింత బలం చేకూర్చింది. అంతేకాదు, ముఖ్యమంత్రి మార్పు ఇక లాంఛనమేనన్న ప్రచారం కూడా జరుగుతున్నది. రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పిన వారి పేర్లను సీఎంవో కార్యాలయం అధికారిక సోషల్‌ మీడియా గ్రూప్‌లో పోస్టు చేసింది. ఆ పేర్లలో అధిష్టానం పెద్దల పేర్లు కనిపించలేదు.

ఏడుసార్లు దిల్లీకి వెళ్లి ప్రాధేయపడినా రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్‌ దొరకలేదని, ప్రియాంక గాంధీ నామినేషన్‌ కార్యక్రమానికి వయనాడ్‌ వెళ్లినప్పటికీ అక్కడ ఆమె కూడా కనీసం పలకరించలేదని, త్వరలోనే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తారని వినిపిస్తున్న వ్యాఖ్యలకు తాజా ఘటన బలం ఇచ్చినట్టు అయిందని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. దేశంలో కాంగ్రెస్ మూడు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోగా, కర్ణాటక ప్రభుత్వం అవినీతి కుంభకోణాలతో తల్లడిల్లుతున్నది. దానితో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా, పార్టీ నడవాలన్నా నిధులు సమకూర్చే బాధ్యత అంతా రేవంత్ రెడ్డిపైననే ఉంది. అయినప్పటికీ పలకరింపులు కూడా కరువవడం విస్మయం కలుగిస్తోంది. పైగా, ఉపముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఆయనతో సంబంధం లేకుండానే దిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి వస్తున్నారు. ఆయనపై ఫిర్యాదులు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. మరోవంక, కేంద్ర ప్రభుత్వం నుండి ఆయన అవసరమైన సహకారం పొందగలుగుతున్నారు. తమది కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో కేంద్రం వివక్షత చూపుతుందని రేవంత్ గాని, ఆయన మంత్రులు గాని ఎవరూ ఇప్పటివరకు చెప్పే అవకాశం రాకపోవడం గమనార్హం. రేవంత్‌ కోరినప్పుడల్లా ప్రధాని మోదీ, జెపి నడ్డా, అమిత్‌షా వంటి కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు దొరుకుతున్నాయని పార్టీలోని కొందరు నేతలు చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రేవంత్‌కు మోదీ ఉదయం 8:30 గంటలకే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు, రేవంత్‌రెడ్డికి అధిష్ఠానం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదన్న విషయం సోషల్‌ మీడియాకెక్కి విపరీతంగా ట్రోల్‌ కావడంతో రేవంత్‌ స్వయంగా నష్టనివారణ చర్యలు చేపట్టారు. రాత్రి 10 గంటలకు తన ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. సమయం తీసుకుని మరీ తనకు వ్యక్తిగతంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు రాహుల్‌ భయ్యాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకొంటున్నట్టు రేవంత్‌ ఆ పోస్టులో పేర్కొన్నారు. తద్వారా తనకు ఫోన్  చేసిన్నట్లు సర్దుబాటు చర్యలకు పాల్పడ్డారు. సచివావాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు గాని, రుణమాఫీ సంబరాలు జరిపే బహిరంగసభకు గాని ..రేవంత్ అందించిన ఎటువంటి ఆహ్వానానికి రాహుల్ గాంధీ స్పందించడం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఏడాది పాలనా ముగిసేలోపుగానే రేవంత్ రెడ్డికి ఏదో ముప్పు ఏర్పడే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ వర్గాలలోని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నిసార్లు దిల్లీ చుట్టూ తిరిగినా తన మంత్రివర్గ విస్తరణ చేయలేక పోతున్నారు.

ప్రవీణ్